Thursday, July 26, 2012

ఆచార్యను మరచిపోయారా?

కార్గిల్ యుద్ధంలో అమరుడైన మేజర్ పద్మపాణి ఆచార్య మా హస్తినాపురం సెంట్రల్ నివాసి అని చెప్పుకోవడం నేనెంతో గర్వంగా భావిస్తాను.. 1999లో కార్గిల్ యుద్దంలో పద్మపాణి శత్రు సైనికులతో హోరాహోరీ పోరాడి ప్రాణాలు కోల్పోయాడనే వార్త వినగానే మా కాలనీ వాసులు చలించి పోయారు.. రాజకీయ నాయకులు, చుట్టు పక్కల కాలనీల ప్రజలు హస్తినాపురం తరలివచ్చి ఆచార్య అంతిమ యాత్రలో పాల్గొన్నారు.. మా కాలనీ అంతా మేజర్ ఆచార్య అమర్ హై, భారత్ మాతాకీ జై, పాకిస్తాన్ ముర్దాబాద్ నినాదాలతో నిండిపోయింది.. ప్రజందరి మదిలో దేశ భక్తిని స్పష్టంగా చూశాను..
కాల చక్రంలో 13 ఏళ్లు గడచిపోయాయి.. కార్గిల్ విజయ్ దివస్ రోజున మా కాలనీలో పద్మపాణి ఆచార్యను తలచుకునే వారు ఎవరైనా ఉన్నారా అని ఆసక్తిగా గమనించాను.. కానీ ఎవరికీ ఈ విషయమే పట్టనట్లు కనిపించింది.. పద్మపాణి ఆచార్య అంటే ఎవరు అని కొందరు పాఠశాల విద్యార్థులను ప్రశ్నించా?.. ఏమో తెలియదని చెప్పారు.. ఇందులో వారి తప్పేమీ లేదు.. మరి వారి తల్లి దండ్రులకైనా ఆచార్య గుర్తున్నారో లేదో తెలియదు.. జనం ఆచార్యను మరచిపోయినట్లున్నారు.. హస్తినాపురం సెంట్రల్ కాలనీలో పద్మపాణి ఆచార్యకు నివాళిగా ఆయన పేరు పెట్టిన రోడ్డు ఫలకం, మెమోరియల్ హాలు మాత్రం మౌనంగా పలకరిస్తున్నాయి.. ఇక పద్మపాణి ఆచార్య శిలా విగ్రహం పెట్టాలనే ఆలోచనను కాలనీ వాసులు ఏనాడో మరచిపోయారు..

No comments:

Post a Comment