Thursday, July 12, 2012

పోగాలం దాపురిస్తే..

కేంద్ర హోంమంత్రి పలనియప్పన్ చిదంబరం గారి నెల జీతం రూ.80,000 (అలవెన్సులు+ 2G వగైరా అవినీతి సంపాదన అదనం).. అటెండర్ పార్సిగుట్ట చిన్నయ్య జీతం రూ.8,000 (నో అలవెన్స్).. పి.చిదంబరం పార్లమెంట్ క్యాంటీన్లో రూ.1 కే టీ తాగుతారు.. పి.చిన్నయ్య ఇరానీ హోటల్లో రూ.8 పెట్టి చాయ్ తాగుతాడు.. చిదంబరం రూ.2 తో సుష్టగా భోజనం చేస్తాడు.. చిన్నయ్య రూ.60 ఖర్చు చేయలేక ఇంటి నుండి సద్ది తెచ్చుకొని తింటాడు.. చిదంబరం రూ.24లకే చికెన్ బిర్యానీ లాగిస్తాడు.. చిన్నయ్య బావర్చీలో అదే బిర్యానీ తినాలంటే రూ.130 ఖర్చు.. చిదంబరం గారికి చెన్నయ్, శివగంగ ప్రాంతాల్లో అత్యాధునిక ఇళ్లు ఉండటంతో పాటు కేంద్ర మంత్రిగా ఢిల్లీలో సకల సౌకర్యాలు ఉన్న ప్రభుత్వ నివాసం ఉచితం.. ఎక్కడికి వెళ్లాలన్నా ఖర్చే లేదు.. మరి మన చిన్నయ్యకు సొంత ఇల్లు కూడా లేదు.. హైదరాబాద్ శివారులో సగం జీతం ఖర్చు పెట్టి అద్దె ఇంట్లో కాపురం చేస్తున్నాడు.. మరి మిగతా సగం జీవితంతో సంసారం నెట్టుకు రావడం ఎలాగో?..
కేంద్ర మంత్రిగా కారు చౌకగా విలాసవంతమైన జీవితం గడుపుతూ ఎర్రగా బుర్రగా నిగనిగలాడుతున్న చిదంబరం గారు జనం మినరల్ వాటర్, ఐస్ క్రీమ్ లకు ఖర్చు చేస్తూ.. బియ్యం ధర పెరిగితే నిరసనలు వ్యక్తం చేస్తున్నారని ఏడుస్తున్నాడు.. సామాన్యుడు ప్రతి రోజూ మినరల్ వాటర్, ఐస్ క్రీమ్ కొంటున్నాడా? హర్వార్డ్ యూనివర్సిటీలో చదువుకున్న ఈ మంత్రిగారు మతి తప్పి మాట్లాడి చివరకు అలా అనలేదని నాలుక కరుచుకుంటున్నాడు..
18వ శతాబ్దంలో ప్రాన్స్ దేశంలో జనం బ్రెడ్డు దొరకక అల్లాడుతుంటే కేకులు తిని బతకొచ్చు కదా అని ఆ దేశ రాణి గారు పరిహాసమాడారు.. కడుపు మండిన ప్రజలు తిరుగుబాటు చేశారు.. అదే ఫ్రెంచ్ విప్లవంగా ప్రసిద్దికెక్కింది.. కడుపు మండుతున్న చిన్నయ్య లాంటి వారు ప్రజాస్వామ్యమనే ఓటుతో తిరగడబడి యూపీఏ సర్కారును కూల్చే రోజులు దగ్గరలోనే ఉన్నాయి.. పోగాలం దాపురిస్తే పాలకులు పిచ్చి మాటలు మాట్లాడటం సహజం..

No comments:

Post a Comment