Sunday, July 22, 2012

ఈ పాపం ఎవరిది?

ఒక్కపూట భారీ వర్షానికే హైదరాబాద్ ఆహాకారాలు చేసింది.. రోడ్లు నదుల్లా మారాయి.. ఎన్నో బస్తీలు, కాలనీలు నీట మునిగాయి.. వర్షం విధ్వంసానికి 9 మంది చనిపోయారు.. 2000 సంవత్సరం తర్వాత భారీ విపత్తు ఇదే.. 420 సంవత్సరాల చరిత్ర కలిగిన భాగ్యనగరానికి ఏమిటీ దుస్థితి?.. వాన కురిస్తే భయపడాల్సిందేనా? ఈ పాపం ఎవరిది?.. ఒక్కసారి సంక్షిప్తంగా గత చరిత్రలోకి వెళదాం..

1908లో ఆరో నిజాం మహబూబ్ అలీఖాన్ పాలనలో మూసీ నదికి వరదలు వచ్చి సగం నగరం మునిగిపోయింది.. 15 వేల మంది చనిపోయారు.. ఇళ్లు కోల్పోయి ఎంతో మంది నిరాశ్రయులయ్యారు.. చలించిపోయిన నిజాం ప్రభువు హిమయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ ఆనకట్టలు కట్టి మూసి నదికి కళ్లెం వేశారు.. నదికి ఇరు వైపులా భారీ గోడలు కట్టారు.. 2000 సంవత్సరంలో హైదరాబాద్ మరోసారి భారీ వర్షాల వరదలకు అల్లాడి పోయింది.. శివారు చెరువుల గట్లు తెగి హుస్సేన్ సాగర్ ఉగ్ర రూపం దాల్చింది.. గేట్లు తెరిస్తే దిగువన ఉన్న చిక్కడపల్లి, హిమయత్ నగర్, గాంధీనగర్, ముషీరాబాద్, నల్లకుంట, అంబర్ పేట తదితర ప్రాంతాలన్నీ మునిగిపోయాయి.. ఇలాంటి సంఘటనలు మరోసారి తలెత్తరాదనే ఆలోచనతో ప్రభుత్వం కిర్లోస్కర్ కమిటీని నియమించింది.. కానీ ఆ కమిటీ చేసిన ముఖ్యమైన సిఫార్సులు అటకెక్కాయి..

చరిత్ర పుటల్లోకి వెళ్లితే హైదరాబాద్ నగరం లేక్స్ సిటీ అని తెలుస్తోంది.. నగరంలో, శివారు ప్రాంతాల్లో 500 పైగా చెరువులు, కుంటలు ఉండేవి.. దురదృష్ట వశాత్తు నేడు వాటి ఆనవాళ్లు కూడా కనిపించడంలేదు.. నేను చిన్నప్పుడు చూసిన చెరువులెన్నో ఈనాడు కనిపించకుండాపోయాయి.. పెరుగుతున్న జనాభా, నగరీకరణ చెరువులను, కుంటలను మింగేసింది.. ఒకనాడు చెరువులున్న చోట ఈరోజున పెద్ద పెద్ద కాలనీలు, బస్తీలు కనిపిస్తున్నాయి.. నాలాలను అక్రమించి ఇండ్లు కట్టుకున్నారు..వాన నీటి కాలువలు చెరువులను చేరుతాయి.. చెరువులు నిండితే ఆ నీరు నదిలోకి వదులుతారు.. మరి చెరువులే లేకపోతే వాన నీరు ఎక్కడికి పోతుంది?.. వేరే దారేది?.. ఇదే హైదరాబాద్ దుస్థితికి కారణం.. పాత చెరువులను ఎలాగూ తిరిగి తెచ్చుకోలేం.. కనీసం ఉన్న చెరువులు, కాలువలైనా భవిష్యత్తు తరాల కోసం కాపాడుకుందాం..

No comments:

Post a Comment