Thursday, August 30, 2012

దాడి గారి విజ్ఞత

కసబ్ ను కాదు సీఎంను ఉరి తీయాలంటున్నారు టీడీపీ సీనియర్ నేత దాడి వీరభద్రరావు.. అంటే ముంబయ్ మారణ హోమానికి కారకుడైన కసబ్ కు బదులుగా కిరణ్ కుమార్ రెడ్డిని ఉరి తీయాలంటున్నారన్న మాట.. రాజకీయాల్లో విలువలు, హుందాతనం ఏ విధంగా దిగజారిపోతున్నాయో చెప్పేందుకు శాసస మండలి విపక్ష నేత, మాజీ మంత్రి దాడి చేసిన ఈ వ్యాఖ్యలే ఉదాహరణ.. ఫీజు రీఎంబర్స్ విషయంలో విఫలమైన నేరానికి ఏకంగా ముఖ్యమంత్రిని ఉరి తీయాలంటున్న వీరభద్రరావు విజ్ఞత మనకు ఇక్కడ ప్రస్తుతానికి అనవసరం.. కానీ కబస్ ను ఉరి తీయొద్దనే అధికారం దాడిగారికి ఎక్కడిది? ఆయన ఏమైనా పాకిస్తాన్ ప్రభుత్వ ప్రతినిధా?

Wednesday, August 29, 2012

తెలుగు అంకెలు నేర్చుకుందామా?

దేశంలో హిందీ తర్వాత అత్యధికులు మాట్లాడే భాష తెలుగు అని గర్వంగా చెబుకుంటాం.. తెలుగు భాష గురించి గొప్పలకు పోతాం.. కానీ మనం మాటల్లో, రాతల్లో మనం వాడుతున్నది అరకొర తెలుగే.. తెలుగు భాషకు ఎన్ని అక్షరాలు ఉన్నాయి? అనే ప్రశ్న వేస్తే పండితులు సైతం స్పష్టమైన సమాధానం చెప్పలేరు.. ఉన్న 56 అక్షరాల్లో కొన్నింటి వాడుక ఏనాడో కనుమరుగైంది.. ఋ, ౠ, ఌ, ౡ, ఱ, అఁ, ౘ, ౙ తదితర అక్షరాలను ఏనాడో మరచిపోయాం.. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే తెలుగు భాషలో అంకెలు ఉన్నాయన్న విషయం నేటి తరంలో చాలా మందికి తెలియదు.. తెలిసిన వారు కూడా ఎందుకులే గందర గోళం ఆంగ్ల అంకెలు (ఇండో అరబిక్) వాడటమే మంచిదని సమర్థిస్తుంటారు? ఇలాంటి వారిని నేను ప్రశ్నిస్తున్నది ఒకటే.. 56 తెలుగు అక్షరాలు నేర్చుకున్నప్పుడు, పది తెలుగంకెలు నేరుచుకొని వాడితే తప్పేమిటి?.. నిజానికి 0,3 తప్పిస్తే నేర్చు కోవాల్సింది ఎనిమిది అంకెలే.. వాడుతూ పోతే అందరికీ తెలుగు అంకెలు అలవాటైపోతాయి.. ఈ ప్రయత్నాన్ని మన పత్రికలు ఎందుకు చేయకూడదు?.. పత్రికలకు అంత తీరిక లేకపోతే మనమే ప్రారంభిద్దాం.. ఒకరిని చూసి మరొకరు నేర్చుకొని అయినా తెలుగు అంకెలను వాడకంలోకి తెస్తారు.. ఇక మొదలు పెడదామా?.. ‘౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౦’

సరైన శిక్ష

ముంబయ్ మారణ హోమంలో పాల్గొన్ని పట్టుబడ్డ అజ్మల్ కసబ్ కు సుప్రీం కోర్టు ఉరిశిక్షను ఖరారు చేయడం దేశ ప్రజలందరికీ ఊరట కల్గించే విషయం.. 2008 నవంబర్ 26న జరిగిన ఈ సంఘటనలో 166 మంది భారతీయులు, విదేశీయులు ప్రాణాలు కోల్పోయారు.. భారత దేశంపై దాడికి దిగిన ఈ పాకిస్తానీకి ఈ శిక్షకూడా తక్కువే. ఇప్పటికే కసబ్ రక్షణ కోసం, తిండి తిప్పల కోసం 25 కోట్ల రూపాయలకు పైగా ఖర్చైపోయాయి.. ఇదంతా భారతీయులు కష్టార్జితంతో కట్టిన పన్నుల సొమ్ము.. ప్రభుత్వం తక్షణం ఇతగాన్ని ఉరి తీయాలి.. లేకపోతే అఫ్జల్ గురు తరహాలో రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకొని మరి కొన్నేళ్లు భారతీయ జైళ్లలో ఆతిధ్య స్వీకరిస్తాడు.. పార్లమెంట్ పై దాడి కేసులో నిందితుడైన అఫ్జల్ గురుకు ఉరి శిక్ష పడ్డా క్షమాభిక్ష పేరిట ఆడుతున్న నాటకాలు తెలిసిందే.. కొన్ని సంస్థలు ఉరి శిక్షను రద్దు చేయాలనే ముసుగులో ఇలాంటి రక్తం రుచి మరిగిన నరహంతకులను కాపాడే ప్రయత్నం చేయడం దురదృష్టకరం.. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి ద్రోహులను ఇంటి అల్లుళ్ల మాదిరిగా మేపుతోంది..

వేపపై పగ ఎందుకు?

వేపను వైద్య చికిత్సలో వాడకుండా ఆగ్నేయాసియా దేశాల సంఘం (ఏసియాన్) నిషేదం విధించడం హాస్యాస్పదంగా ఉంది.. వేప మొక్క సంరక్షణ సాకుతో వాడకూడని జాబితాలో చేర్చే ప్రయత్నం చేస్తోంది.. సింగపూర్లో జరిగిన ఏసియాన్ సాంప్రదాయ ఔషదాలు, ఆరోగ్య అనుబంధ ఆహారాల కార్యచరణ సమితి ఈ నిర్ణయం తీసుకుంది.. భారతీయ ఆయుర్వేద వైద్యంలో వేపకు ఉన్న స్థానం తెలిసిందే.. దురద, మంట, గాయాలు, ఆటలమ్మ, కామెర్ల వ్యాధుల నివారణలో వేపను అద్భుత ఔషదంగా వేలాది సంవత్సరాలుగా మన దేశంలో వాడుతున్నారు..హృద్రోగ వ్యాదులు, మధుమేహం, క్యాన్సర్ తదితర ప్రాణాంతక వ్యాధు చికిత్సకు సైతం వేప ఉపయోగపడగలదని పరిశోధనలు చెబుతున్నాయి.. కొన్ని దేశాలు వేపపై పేటెంట్ హక్కు పొందాలని ప్రయత్నించి భంగపడ్డాయి.. భారతీయ సాంప్రదాయ ఔషదాల ఎగుమతిని దెబ్బతీయడమే ఏసియాన్ లక్ష్యంగా కనిపిస్తోంది.. ఎన్నో ఔషద గుణాలు ఉన్న వేపపై ఇంత ఏసియాన్ ఇంత కుట్ర పూరిత నిర్ణయం తీసుకున్నా భారత ప్రభుత్వం నోరుమెదపలేదు..

Saturday, August 25, 2012

టీటీడీపై రాజకీయ పెత్తనమేలా?

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు కొత్త ఛైర్మన్ ఎవరు అనే ఊహాగానాలు మొదలయ్యాయి.. ఈ పదవిని తిరిగి దక్కించుకోవడానికి ప్రస్తుత ఛైర్మన్తో పాటు పా ఛైర్మన్లు సైతం పోటీ పడుతున్నారు.. వీరంతా రాజకీయ నాయకులే.. ఓ బడా కాంట్రాక్టర్ తన సతీమణి పేరు ప్రతిపాదిస్తే, మరో మద్యం వ్యాపారి తన కోసం పావులు కదుపుతున్నాడు.. మరీ సిగ్గు చేటైన విషయం ఏమిటంటే ఓ సంచలన మహిళతో మసాజ్ చేయించుకున్న బడా వ్యాపారికి కూడా ఛైర్మన్ పదవి కావాలట?.. హిందువులు అత్యంత పవిత్రంగా భావించే వేంకటేశ్వర స్వామి ఆలయంపై పెత్తనం కోసం వీరంతా చేస్తున్న ప్రయత్నాలు వెగటు కలిగిస్తున్నాయి.. ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడాల్సిన చోట ఏమిటీ గోల?.. రాజకీయాలకు తావులేకుండా ఆధ్యాత్మిక వేత్తలకు, పీఠాధిపతులకు ఎందుకు ఛైర్మన్ పదవి ఇవ్వకూడదు.. అసలు హిందూ మతంపై ప్రభుత్వ పెత్తనం ఎందుకు?.. అన్యమతస్తుల ప్రార్థనాలయాల విషయంలో ప్రభుత్వం ఇలాగే జోక్యం చేసుకుంటుందా? ఈ విషయంలో భక్తులే ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరం ఉంది..

Friday, August 24, 2012

ఆంధ్ర కేసరినే మరచిన పాలకులు

ఆయన ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి.. అంతకు ముందు మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేశారు.. ప్రఖ్యాత స్వాతంత్ర్య సమరయోధుడు.. మద్రాసులో సమైన్ కమిషన్ కు వ్యతిరేకంగా జరిగిన ర్యాలీలో కాల్చరా కాల్చు అని బ్రిటిష్ పోలీసులకు తన చాతిని చూపించిన ధీరుడు.. ఆంధ్ర కేసరిగా ఈ జాతి గౌరవించింది.. దురదృష్టవశాత్తు టంగుటూరి ప్రకాశం పంతులు సోకాల్డ్ గాంధీ పాలక వంశస్తుడు కాదు.. అదే ఆయన చేసి పాపం.. అందుకే కాంగ్రెస్ పాలకులు ఆయన్ని మరచిపోయారు.. ఆంధ్ర కేసరి జన్మదినం రోజున అంధ్రప్రదేశ్ శాసన సభ ఎదుట ఉన్న ప్రకాశం విగ్రహానికి ఏ ఒక్క నాయకుడు నివాళి అర్పించన పాపాన పోలేదు.. సీఎంగారు పదవి కాపాడుకునే ఆరాటంలో ఢిల్లీకి పరుగెడితే, పీసీసీ అధ్యక్షుల వారు అప్పటికే ఢిల్లీలో అధినాయకుల భజన సంకీర్తనావళీలో బిజీగా ఉన్నారు.. నేటి పాలకుల మాదిరిగా పంతులు గారు అవినీతికి పాల్పడి కోటాను కోట్ల ఆస్తులు కూడ బెట్టుకోలేదు.. కడు పేద కుటుంబంలో జన్మించి, న్యాయవాదిగా ఆర్జించిన ఆస్తులన్నీ సమాజ సేవలో కరిగించేశారు.. చివరకు పేదరికంతోనే మరణించారు.. ఇలాంటి మహనీయున్ని మన పాలకులు ఎంత చక్కగా గుర్తు పెట్టుకున్నారో చూశారు కదా?

Thursday, August 23, 2012

అంధ ప్రదేశ్

ముందు చూపులేని కిరణ్ కుమార్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అంధకారం చేస్తోంది.. ప్రభుతవం కనీస అవసరమైన విద్యుత్తు ఇవ్వలేక చేతులు ఎత్తేయడం దారుణం.. ప్రజలు మణులు, మాణిక్యాలు కోరడం లేదు.. వ్యవసాయానికి, పరిశ్రమలకు, గృహావసరాలకు తగినంత విద్యుత్తు కావాలంటున్నారు.. కరెంటు లేకపోతే రైతు పంటలు ఎలా పండిస్తాడు? పారిశ్రామికాభివృద్ది ఎలా సాధ్యం అనే ఇంగితమైనా మన సర్కారుకు లేకపోవడం దారుణం.. విద్యుత్ కోత కారణంగా పరిశ్రమలు పని చేయక ఎంతో మంది కార్మికులకు జీతాలు అందడం లేదు.. కేంద్రంలో ఉన్నది పరాయి ప్రభుత్వం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వమే.. ఇంత మంది ఎంపీలు ఉండి ఏం చేస్తున్నారు? సొంత పైరవీలు తప్ప రాష్ట్రానికి అవసరమైన ఒక్కపనైనా చేశారా? కనీసం గ్యాస్, బొగ్గు తెచ్చుకోవడం చేత కాకున్నా, రాష్ట్ర తక్షణావసరాల కోసం బయటి నుండి విద్యుత్తు కూడా కొనలేని అసమర్థ పాలకులు ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే.. అటు ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వానికి శవాలపై పేలాలు ఏరుకునే చందంగా పని చేస్తున్నాయి.. ప్రభుత్వంతో ఉన్నవారు నిద్ర పోతుంటే, అప్రమత్తం చేయాల్సిన పార్టీలు దొంగలు పడ్డ ఆర్నెళ్లకు ఇప్పడే విషయం తెలిసినట్లు మొరిగేస్తున్నాయి.. రాజకీయ పార్టీలన్నీ కలిసి అంధ్ర ప్రదేశ్ ను అంధ ప్రదేశ్ మార్చేసాయి..

కోల్ గేట్ స్కామ్ మరకలు కాల్గేట్ పేస్టుతో తోమినా పోవు..

తానే తప్పు చేయలేదని ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ఎంత భుకాయించినా దేశ ప్రజలు ఇప్పుడు ఏమాత్రం నమ్మరు.. గతంలో జరిగిన 2జీ, కామన్వెల్త్, ఆదర్శ్ కుంభకోణాల్లో బకరాలు బలయ్యాయి.. ఇప్పడు ప్రధానే పెద్ద బకరా.. ఎందు కంటే బొగ్గు గనుల శాఖ ఆయన కిందే ఉంది.. 1.86 లక్షల కోట్ల బొగ్గు కుంభకోణం డీఎంకే రాజావారి 1.76 లక్షల కోట్ల కన్నా పెద్దది..
ఇంత కాలం ప్రధాని ఓ ధృతరాష్ట్రుడు, అసమర్థుడు, సోనియా గాంధీ చేతిలో కీలుబొమ్మ అని నమ్ముతూ వచ్చాం.. యూపీఏ ప్రభుత్వంలో కుంభకోణాలతో ప్రమేయం లేకుండా సచ్ఛీలత అనే ముసుగులో దాక్కొంటూ వస్తున్న మన్మోహన్ బట్టలపై ఇప్పుడు కడిగినా పోని బొగ్గు మరకలు అంటాయి.. స్వయాన రాజ్యాంగ బద్దత ఉన్న కాగ్ నివేదిక ఈ కుంభకోణాన్ని నిర్ధారించినా, అసలేమీ జరగనట్లు కాలరెగిరేసుకోవడం కాంగీ రేసు పాలకులకే చెల్లింది.. ప్రతిష్ట దిగజారిన ప్రధాని నైతిక బాధ్యత వహించి రాజీనామా చేస్తే హుందాగా ఉండేది.. కానీ హుందాతనం లేని ఈ కీలుబొమ్మ తాళం చెవి అమ్మోరి చేతిలో ఉంది.. కోల్ గేట్ స్కామ్ మరకలు కాల్గేట్ పేస్టుతో తోమినా పోవు..

Monday, August 20, 2012

میرے عزیز مسلم دوستوں کو رمضان مبارک باد

Saturday, August 18, 2012

Friday, August 17, 2012

స్వదేశంలో అనాధలు..

మీ ఇంటిలో అక్రమంగా తిష్టవేసిన పొరుగూరి వాడు మిమ్మల్ని వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తే ఎలా ఉంటుంది?.. పక్కింటివాడు సైతం తిష్టేసినోడికి అండగా నిలిస్తే?.. ఇదేమీ పట్టించుకోని సర్పంచు సంయమనం పాటించాలంటూ సన్నాయి నొక్కలు నొక్కితే మీ పరిస్థతి ఏమిటి?.. దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైన ఓ సమస్యను ఈ కోణంలో ఆలోచించి చూడండి? ఎవరిది న్యాయం? ఎవరిది అన్యాయం?

విదేశీ చొరబాట్ల సమస్య మన దేశంలొ వివిధ ప్రాంతాల్లో పని చేసుకొని బతుకుతున్న అస్సాం, ఇతర ఈశాన్య రాష్ట్రాల అమాయక పౌరులకు సైతం శాపంగా మారింది.. కొందరు దుండగుల బెదిరింపుల ఫలితంగా ఏ పాపం తెలియని ఈ స్వదేశీ పౌరులు భయపడిపోతున్నారు.. బెంగళూరు, హైదరాబాద్ నుండి ఇప్పటికే వేలాది మంది అస్సాం, ఈశాన్య రాష్ట్రాల వారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పారిపోతున్నారు.. కేంద్రం, కర్ణాటక-ఆంధ్ర ప్రభుత్వాలు ఆలస్యంగా నిద్ర లేచి భయపడొద్దు, రక్షణ కల్పిస్తామంటూ హిత వచనాలు పలుకుతున్నాయి..
అస్సాంలో దశాబ్దాలుగా చొరబడుతూ వచ్చిన వారికి, స్థానికులకు పెద్ద ఎత్తున్న ఘర్షణలు జరుగుతున్నాయి.. ఇది విదేశీయులకు, స్వదేశీయులకు జరుగుతున్న పోరని మెడకాయ మీద తలకాయ ఉన్న ప్రతి ఒక్కరూ చెప్పగలరు?.. దురదృష్టవశాత్తు ఈ సమస్యకు మతం రంగు పులిమేశారు.. ఇందుకు కారణం దేశాన్ని, ఆ రాష్ట్రాన్ని ఏలుతున్న పార్టీ ఓటు బ్యాంకుపై మోజుతో మొదటి నుండీ ఈ సమస్యను పట్టించుకోలేదు.. ఇప్పడు వ్యవహారం ముదిరిపాకాన పడింది.. భారత ప్రభుత్వం, అస్సాం ప్రభుత్వం ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో తెలియక గుడ్లు తేలేస్తున్నాయి.. పాముకు పాలు పోసి పెంచితే కాటేయకుండా ఉంటుందా?.. రోగం ముదిరాక ఏ మందు వేసినా ఫలితం ఏముంటుంది?

Thursday, August 16, 2012

ధర్మో రక్షతి రక్షిత: అన్నారు మన పెద్దలు.. అంటే ధర్మాన్ని రక్షిస్తే అది మిమ్మల్ని కాపాడుతుందని అర్థం.. కానీ అధికారంలో ఉన్నవారు రాచ ధర్మాన్ని విస్మరిస్తే.. అది తప్పని సరిగా వారికి ప్రతికూలంగా మారుతుంది.. అధర్మానికి పాల్పడితే (ధర్మ భక్షణ) అది వారినే మింగేస్తుంది..

Wednesday, August 15, 2012

భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఈ సమయానికి 65 సంవత్సరాల 23,742 రోజుల 5,69,817 గంటల 3,41,89,042 నిమిషాలు పూర్తయింది..

దేశ స్వాతంత్ర్యం కోసం తమ జీవితాలను త్యాగం చేసిన మహనీయుల స్నూర్తిగా మనమంతా పని చేద్దాం.. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజా స్వామ్యమైన భారత్ అన్ని రంగాల్లోనూ అగ్రరాజ్యంగా రూపొందాలని కోరుకుందాం.. ఇందు కోసం కష్టించి పని చేద్దాం..

Tuesday, August 14, 2012

విశాద దినం..

దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని మువ్వన్నెల జెండా గురేస్తాం.. కానీ చరిత్రలో దారుణమైన విశాద సంఘటనను మరచిపోతున్నాం.. అదే దేశ విభజన.. తెల్లవారితే స్వాతంత్ర్యం అనగా 1947 ఆగస్టు 14 నాడు దేశం మూడు ముక్కలైంది.. తూర్పు, పశ్చిమ ముక్కలు పాకిస్తాన్ గా ఆవిర్భవించాయి.. ప్రధాన భూభాగం ఇండియాగా మిగిలిపోయింది.. కాంగ్రెస్, ముస్లిం లీగ్ నాయకులు సంబరాలు చేసుకున్నారు.. కానీ ఈ పాపంతో ఏ మాత్రం సంబంధం లేని మూడో వంతు భారతీయులు రాత్రికి రాత్రే పరాయి వారయ్యారు.. సరిహద్దులకు రెండు వైపులా దారుణమైన ఊచకోత జరిగింది.. ఎందరో నిర్భాగ్యులు మాన ప్రాణాలు కోల్పోయారు.. లక్షలాది మంది ప్రజలు కట్టు బట్టలతో వలస వచ్చారు.. చరిత్రలో ఎంతో విశాద దినం అది.. ఇప్పడు చెప్పండి ఇది సంబరాలు జరుపుకునే దినమా?
1857కు ముందు నుండీ మన దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో వీరులు ప్రాణ త్యాగం చేశారు.. భగత్ సింగ్, చంద్రశేఖర ఆజాద్ లాంటి విప్లవ వీరులు ప్రాణాలు బలిపెట్టారు.. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజ్ ఏర్పాటు చేసి దేశం వెలుపలి నుండి పోరాడారు.. వీరంతా కోరుకున్న దేశ విభజన కాదు.. నాటి కాంగ్రెస్ నాయకులు తమ జీవిత చరమాంకంలో అయినా అధికారం అనుభవించాలనే తాపత్రయంతో దేశ విభజనకు అంగీకరించారు.. అమాయక ప్రజల రక్త తర్పణంతో జవహర్ లాల్ నెహ్రూ, మహ్మద్ అలీ జిన్నాలకు అధికారం పంచుకున్నారు.. స్వాతంత్ర్యాన్ని ఆస్వాదించడంలో ఎలాంటి తప్పు లేదు.. కానీ అలాంటి సమయంలో దేశ విభజన తాలూకు విశాద గాయాలనూ తడుముకుందాం.. చరిత్ర నుండి గుణపాఠం నేర్చుకుందాం..
జై హింద్..

Monday, August 13, 2012

దయనీయ స్థితి

122 కోట్ల ప్రజలున్న మనది.. ప్రపంచ జనాభాలో రెండో స్థానం మన దేశానిదే.. కానీ క్రీడల్లో మాత్రం దయనీయ స్థితిలో ఉన్నాం.. లండన్ ఒలింపిక్స్ లో 2 రజత, 4 కాంస్య పతకాలు వెరసి 6 సాధించి మురిసిపోతున్నాం.. మన పొరుగు దేశం 38 స్వర్ణ, 27 రజత, 22 కాంస్య పతకాలు (మొత్తం 87) సాధించింది.. ఒక్కడ చైనా, ఎక్కడ ఇండియా.. మన కన్నా చిన్న దేశాలెన్నో అద్భుత ఫలితాలు సాధించాయి.. ఒలింపిక్స్ లో అవినీతి పోటీలు ఉంటే మన నేతలు కచ్చితంగా గోల్డ్ మెడల్ పొందే వారని కొందరు మిత్రులు హాస్యమాడుతున్నారు..
  క్రీడల్లో సైతం రాజకీయాలు నడిచే మన దేశంలో క్రీడాభివృద్ధిని నానాటికీ తీసికట్టుగా తయారవుతోంది.. క్రికెట్ తప్ప వేరే క్రీడలు తెలియని జనాలు మన దేశంలో పెద్ద సంఖ్యలోనే ఉన్నారని చెబితే ఆశ్చర్యం కలగకమానదు.. ఒకప్పుడు హాకీలో ప్రపం విజేతగా నిలిచిన మన దేశం దశాబ్ధాల క్రితమే ఆ హోదా కోల్పోయింది.. విచిత్రమై విషయం ఏమిటంటే నిన్న మొన్నటి దాకా హాకీ మన జాతీయ క్రీడ అనే భ్రమల్లో ఉన్నాం.. సమాచార హక్కు చట్టం ఓ బాలిక రాసిన లేఖకు సమాధానంగా, అసలు మనకు జాతీయ ఆటే లేదని పీఎంవో చావు కబురు చల్లగా చెప్పింది.. జాతీయ క్రీడా విధానమే లేని మన దేశానికి జాతీయ క్రీడ లేదన్నమాట..  క్రీడల్లో రాజకీయ నాయకుల జోక్యం తగ్గే వరకూ మన దేశ దుస్థితి ఇలాగే కొనసాగక తప్పదు..
లండన్ ఒలింపిక్స్ లో విజయాలు సాధించిన మన దేశ ఆటగాళ్లకు శుభాభివందనాలు..

Saturday, August 11, 2012

మన జాతీయ పానీయం

కాశ్మీరు నుండి తమిళనాడు దాకా, అరుణాచల్ నుండి గుజరాత్ వరకూ.. భిన్న ప్రాంతాలు, మతాలు, భాషలు, కులాలు, తెగలు ఉన్న దేశం మనది.. ఆచారాలు, ఆహార్యాలు, వేశ భాషలు, రుచులు, అభిరుచులు వేరు కావచ్చు.. కానీ భారతీయులందరినీ కలిపేది ఒక్కటే.. అదే ఛాయ్.. టీ అనండి లేదా తేనీరనండి.. ఈస్టిండియా కంపెనీ వాడు మన దేశ ప్రజలకు అలవాటు చేస్తే చేసుండొచ్చు గాక.. పొద్దున లేచింది మొదలు రాత్రి నిద్ర పోయే దాకా కనీసం ఒక్క కప్పు ఛాయ్ తగని వాడు భారతీయుడే కాదని నా అభిప్రాయం (కాఫీ ప్రియులారా క్షమించండి).. పక్కా హైదరాబాదీనైన నేను రోజుకు మూడు కప్పులైనా తాగలేకుండా ఉండలేను.. పురాణాల్లో మన దేవతలు, మునులు తాగిన సోమరసం పక్కా టీ అయ్యుంటుందని నా అభిప్రాయం.. ఇంటికి వచ్చిన అతిధులకు కచ్చితంగా తేనీరు ఆఫర్ చేయడం భారతీయ సాంప్రదాయంగా మారింది.. పేద, ధనిక తారతమ్యాలతో సంబంధం లేకుండా 99 శాతం మంది దేశ ప్రజలు తాగే తేనీటికి జాతీయ పానీయంగా ప్రకటించాలని ప్రతిపాదించినందుకు పార్లమెంటరీ స్థాయీ సంఘానికి ధన్యవాదాలు.. జాతీయ ఆహారం ఏమిటని మాత్రం అడగకండి.. మళ్లీ మనలో మనకు విబేధాలు రావచ్చు.. అయితే బిస్కట్ విషయంలో ఎవరికీ అభ్యంతరం ఉండకపోవచ్చు..(మనలో మాట మన హైదరాబాదీలు దేశంలోనే అత్యధిక స్థాయిలో మద్యం సేవిస్తారట.. టీకి ఎక్కడ పోటీగా వస్తారోనని భయంగా ఉంది..)

Friday, August 10, 2012

అంగడి సరుకు..

పదేళ్ల తర్వాత పరిస్థితిని ఇప్పుడే ఊహించి చెబుతున్నా.. పంజాగుట్ట సెంటర్ సమీపంలో అత్తెసరు మార్కులతో పాసైన ఓ ఇంజనీరింగ్ విద్యార్థి పంచర్లు వెస్తుంటే, మరొకడు కారు ఇంజన్ రిపేర్ చేస్తుంటాడు.. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో ఓ మెడికల్ విద్యార్థి ఆర్ఎంపీ డాక్టర్ తరహా నాటు వైద్యం చేస్తుంటాడు.. వినడానికి హస్యాస్పదంగా, విడ్డూరంగా ఉన్నా ఇవి కఠోర వాస్తవాలు.. ఇప్పటికే న్యాయవాద వృత్తికి చెట్టుకింద ప్లీడర్లనే పేరొచ్చింది.. ఇప్పడు ఈ జాబితాలో ఇంజనీరింగ్, మెడిసిన్ ప్రొఫెషనర్లు చేరబోతున్నారు.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీల తీరు తెన్నులను చూస్తుంటే భయమేస్తోంది.. ఈ ధోరణి మారకపోతే భవిష్యత్తు తరం భారీ మూల్యమే చెల్లించాల్సి ఉంటుంది..
దేశ వ్యాప్తంగా 3,393 ఇంజనీరింగ్ కాలేజీలు ఉంటే, అందులో అత్యధికంగా మన రాష్ట్రంలోనే 710 కాలేజీలు ఉన్నాయి.. దేశంలో 355 మెడికల్ కాలేజీలు ఉంటే మన దగ్గరే 40 ఉన్నాయి.. పుట్ట గొడుగుల్లా, అడ్డగోలుగా వెలుస్తున్న ఈ కాలేజీలకు గుడ్డిగా అనుమతులు ఇచ్చేస్తున్నారు.. తమ పిల్లలను ఇంజనీర్లుగా, డాక్టర్లుగా చూసుకోవాలని ఆశ పడే తల్లిదండ్రుల బలహీనతకు తోడు ఫీజు రీఎంబర్స్ అనే జాడ్యం పరిస్థితిని దారుణంగా దిగజారుస్తోంది.. ఇంజనీరింగ్, మెడిసిన్ విద్య అంగడి సరుకైపోయింది.. లక్షలాది రూపాయలు చెల్లించే తల్లిదండ్రుల బలహీనతే కాలేజీలకు పెట్టుబడిగా మారింది..

మన రాష్ట్రంలో ఉన్న మెజారిటీ ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీల్లో కనీస ప్రమాణాలు లేనివే.. సరియైన అధ్యాపకులు, బోధనా పరికరాలు లేనే లేవు.. రాశిలోనే ఘనం.. వాసిలో పూర్తి నాసిరకం.. సోకాల్డ్ ఇంజనీర్లు, డాక్టర్లను ఉత్పత్తి చేసే మర యంత్రాలు మాత్రమే ఇవి.. విద్యార్థుల్లో నైపుణ్యం, ప్రతిభ నేతి బీరకాయలో నేతి లాంటిదే.. పరిశోధనలకు ఏ మాత్రం ప్రాధాన్యతే లేదు.. ప్రతిభ గల కొద్ది విద్యార్థలు విదేశాలకు చెక్కేస్తున్నారు.. మిగిలే సరుకంతా నాసిరకం.. ఫీజు రీఎంబర్స్ వచ్చాక మనదేం పోయింది? పిల్లోడు చదివితే చదువుతాడు.. లేకుంటే ఇంకేమైనా చేసకొని బతుకుతాడనే దారుణమైన ఆలోచనా విధానం తల్లిదండ్రుల్లో వచ్చేసింది.. ప్రతిభ ఉండి, ఉన్నత చదువులు చదవలేని పేద విద్యార్థులను ప్రభుత్వం పూర్తి ఆర్థిక సహాయం అందించి మెరుగైన విద్యను అందిస్తే బాగుంటుంది.. కానీ ప్రస్థుత విధానం వల్ల ప్రయోజనం పొందుతున్నదెవరు? అప్పనంగా ప్రజల సొమ్మును ప్రయివేటు కాలేజీలకు దోచిపెట్టడం ఎంత వరకు సమంజసం?
ఇంజనీరింగ్, మెడిసిన్ విద్యార్థులను కించపరచడం నా ఉద్దేశ్యం ఎంతమాత్రం కాదు.. ఎవరికైనా వారు కోరుకునే చదువు చదిదే అధికారం పూర్తిగా ఉంది.. కానీ దిగజారుతున్న ప్రమాణాలు చూసి తట్టుకోలేకే ఈ మాత్రమైనా స్పందించే అర్హత మాత్రం నాకుందని భావిస్తున్నాను.. ఓటు బ్యాంకు రాజకీయాల కారణంగా ఏ రాజకీయ పార్టీ , విద్యార్థి సంఘం కూడా ఈ ధోరణిని ప్రశ్నించలేకపోతోంది.. మేధావులైనా ముందుకు వచ్చి పిల్లి మెడలో గంటకట్టే ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను..

దానవ నాగేందర్

శ్రీ కృష్ణ జన్మాష్టమి నాడు పిల్లలంతా చిన్ని కిట్టయ్య పాత్రలు ధరిస్తే మంత్రి దానం నాగేందర్ కంసుడి అవతారం ఎత్తారు.. బంజారాహిల్స్ లోని నరసింహ స్వామి ఆలయానికి తాళం వేసి దానవ నాగేందర్ అనిపించుకున్నారు.. స్వార్థ రాజకీయాలతో హిందువుల మనోభావాలను కించపరిచారు..

Thursday, August 9, 2012

ఫోన్లొద్దు.. సబ్బులివ్వండి..

అన్ని విధాల విఫలమైన యూపీఏ సర్కారు మరో జనాకర్షక పథకంతో రాబోయే ఎన్నికల్లో గట్టెక్కాలని చూస్తోంది.. దేశంలో 6.52 కోట్ల మంది నిరుపేదలకు మొబైల్ ఫోన్లు, ప్రతి నెలా 200 నిమిషాల టాక్ టైమ్ ఉచితంగా ఇస్తుందట.. ఇందు కోసం కేంద్ర సర్కారుపై ప్రతి ఏటా రూ.8 కోట్ల భారం పడుతుందట.. సమాచార సాంకేతిక రంగం విస్తరించిన ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికీ మొబైల్ ఫోన్ల అవసరం ఎంతైనా ఉంది.. సెల్ ఫోన్లు, టారిఫ్ చౌక అయిన తర్వాత ధనిక, పేద అనే తారతమ్యం లేకుండా అవసరం ఉన్న వారంతా కనెక్షన్ తీసుకుంటున్నారు.. ఇలాంటి పరిస్థితిలో ఉచితంగా ఇచ్చి ప్రభుత్వంపై భారం పెంచుకోవడం అర్థం లేని పని.
మన దేశంలో మరుగు దొడ్లకన్నా మొబైల్ ఫోన్లే అధికమని జైరామ్ రమేష్(?) లాంటి వారు తరచూ వాపోతుంటారు.. అయితే మొబైల్ ఫోన్ల వాడకానికి, మరుగుదొడ్లకు లంకె ఏమిటో నాకు ఇంత మరకూ అర్థం కాని విషయం.. ఎవరి అవసరం వారిది.. పేద వారు మొబైల్ వాడొద్దనే తాలిబాన్ తరహా ఆంక్షలను సమర్థింలేం కానీ, ఉచితంగా మొబైల్ ఫోన్లు ఇచ్చే చౌకబారు ప్రచార ఎత్తుగడను సమర్థించడానికి నా మనసు ఒప్పుకోవడం లేదు.. ఇందుకు బదులుగా పేద ప్రజల ఆరోగ్య సంరక్షణకు అవసరమైన సబ్బులు, యాంటిసెప్టిక్ లోషన్, ఇతరత్రా మందులు ప్రతి నెలా ఉచితంగా ఇస్తే బాగుంటుంది.. ప్రజలందరికీ రక్షిత మంచి నీరు ఇవ్వలేని చేతగాని ప్రభుత్వం కనీసం ఈ పుణ్యకార్యమైనా చేస్తే చాలు..

యూపీఏ1 కాలంలో రైతులకు రూ.60 వేల కోట్ల రుణాలు మాఫీ చేసింది.. అయితే ఈ పథకం రుణాలు చెల్లించే స్థోమత ఉన్న ధనిక రైతులకే ఎక్కవగా ఉపయోగపడింది.. భూమి లేని కౌలు రైతులకు ఏ మాత్రం ఉపయోగపడలేదు.. నిజానికి మన దేశంతో భూమి ఉన్న వారి కన్నా కౌలు రైతులే పెద్ద సంఖ్యలో ఉన్నారు.. ప్రభుత్వం ఏ పని చేసినా చిత్తశుద్ధి అవసరం.. రాజకీయ నాయకులకు దూర దృష్టి ఉండదెందుకో?..

క్విట్ ఇండియా ఉద్యమానికి 70 ఏళ్లు

క్విట్ ఇండియా ఉద్యమానికి నేటితో ఏడు పదులు (70 ఏళ్లు) నిండాయి. రెండో ప్రపంచ యుద్ధంలో భారతీయులు తమకు సహకరించినందుకు ఇండియాను వదిలి వెళ్తామని చెప్పిన తెల్లదొరలు మాట మార్చి ఇక్కడే తిష్టవేసేందుకు సిద్ధపడ్డారు. ఇక స్వాతంత్ర్య సమర ఉద్యమానికి ఊపు తేక తప్పదని భారత జాతీయ కాంగ్రెస్ భావించింది.. నేతలంతా చర్చించుకొని ‘క్విట్ ఇండియా’ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. 1942 ఆగస్టు 8న ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు. మరుసటి రోజు అంటే 1942 ఆగస్టు 9న ముంబైలో సమావేశమై క్విట్ ఇండియా నినాదం చేశారు. బ్రిటిష్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా లక్షలాది మంది భారతీయులను చెరసాలల్లో పెట్టింది. అయినా ఉద్యమం ఆగలేదు.. ఉప్పెనై ఎగిసింది. చివరకు 1947 ఆగస్టు 15న భారత దేశానికి స్వాతంత్ర్యం ఇవ్వాలని నిర్ణయించారు..


దురదృష్టవశాత్తు దేశ ప్రజలు ఈ మహత్తర ఉద్యమాన్ని మరచిపోయారు.. మీడియాలో కూడా ఈ ఉద్యమానికి సంబంధించిన కథనాలు కనిపించకలేదు.. కొన్ని పత్రికలు ముక్కుబడిగా లోపలి పేజీల్లో చిన్న ప్రస్థావన మాత్రం చేశాయి..

Tuesday, August 7, 2012

సామల సదాశివ.. అసమాన సాహితీవేత్త.. భౌతికంగా మనకు దూరమైనారు.. కానీ ఎప్పటికీ మన 'యాది'లోనే ఉంటారు..


మన ఎంపీలు అసమర్థులోయ్

కన్యాశుల్కం గిరీషం నిజంగా ఉన్నుంటే మన ఎంపీలు అసమర్థులోయ్ వెంకటేషూ.. అనేవాడు. ఇంత మంద ఉండి ఏం లాభం.. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటం చేతకాదు.. బెంగాలీలు, తమిళులకు ఉన్న పాటి ప్రాంతీయ అభిమానం లేదు.. రాష్ట్ర ప్రయోజనాలు ఏమాత్రం పట్టవు.. మన రాష్ట్రం మరాఠీలు నుండి గ్యాసు తన్నుకు పోతే కేంద్రాన్ని నిలదీసే బదులు దేబిరిస్తున్నారు.. కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్రం నుండి ప్రాతి నిధ్యం వహిస్తున్న మంత్రులు మొద్దు నిద్ర పోతున్నారో?, నటిస్తున్నారో అర్థం కాదు.. కేంద్ర పెట్రోలియం మంత్రి గారు తెలుగు వాడని చెప్పుకోవడానికి మనం సిగ్గు పడక తప్పదు.. యూపీఏ ప్రభుత్వ మనుగడకు ఏపీ నుండి ఎన్నికైన మెజారిటీ కాంగ్రెస్ ఎంపీలే ఆయువు పట్టు.. సోనియా భజనలో ఉన్నంత శ్రద్ధలో కనీసం పదో వంతైనా రాష్ట్ర ప్రయోజనాలపై ఉంటే మెడలు వంచి సాధించుకునే వారం.. ఇలాంటి అసమర్థ ఎంపీలను తిరిగి ఎన్నుకోకపోవడమే సరైన శిక్ష..

Sunday, August 5, 2012

స్నేహమేరా శాశ్వతం..

ఉదయం నుండి SMSలు, మెయిల్స్.. Happy Friendship day అంటూ.. కానీ వీటికి స్పందించడం నాకు ఏ మాత్రం ఇష్టం లేదు.. నేను ప్రశ్నించేది ఒకటే స్నేహానికి దినం పెట్టడం ఏమిటని?.. స్నేహం ఈ ఒక్క రోజుతో ముగిసిపోతుందా?.. స్నేహం 24X7, 365 రోజులే కాదు.. శాశ్వతంగా కొనసాగాలి.. స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం..


ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సైనా నెహ్వాల్ కు శుభాకాంక్షలు.. భారత క్రీడా రంగంలో సైనా శకం ప్రారంభం కావాలని కోరుకుంటున్నాను..


జైపాల్ కాదు అసమర్థ పాల్

యూపీఏ ప్రభుత్వం అసమర్థ ప్రభుత్వం, మన్మోహన్ ఓ ధృతరాష్ట్ర చక్రవర్తి అని నేను భావిస్తూ వచ్చాను.. కానీ ఈ ప్రభుత్వంలో అంతకన్నా పనికి రాని వారున్నారని, అందులో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి జైపాల్ రెడ్డి గారు ప్రథముడని చెప్పక తప్పదు.. కేజీ బేసిన్లో ఉత్పత్తి అయ్యే గ్యాస్ ఏపీలోని విద్యుత్తు ప్రాజెక్టుల అవసరాలను ఏమాత్రం తీర్చకుండా సరిహద్దులు దాటి మహారాష్ట్రకు తరలించాలని సొంత శాఖలో నిర్ణయించినా తనకేమీ సంబంధం లేదని బుఖాయించిన ఘనత జైపాలునిది.. పెట్రోలు, డీజిల్, గ్యాస్ సిలిండర్ ధరలు పెరుగుతున్న ఏమీ చేయలేని అసమర్థ మంత్రిగా దేశ ప్రజలచే కీర్తించబడ్డ రెడ్డి గారు, ఇప్పుడు సొంత రాష్ట్ర ప్రజల ఛీత్కారాలు చవి చూస్తున్నారు.. స్వంత రాష్ట్రానికే ఏమీ చేయలేని జైపాల్ రెడ్డి గారికి అజాగళ స్థనం లాంటి కేంద్ర మంత్రి పదవి ఉంటే ఎంత? పోతే ఎంత? ఒకప్పడు జైపాల్ రెడ్డిని ఎంతో అభిమానించిన నేను అంతటి సీనియర్ నాయకుడు ఇంత వరకూ ముఖ్యమంత్రి ఎందుకు కాలేక పోయారా అని బాధ పడే వాన్ని.. ఇప్పడు ఇలాంటి అసమర్ధ నాయకుడు సీఎం కాకపోవడం రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాను..

Saturday, August 4, 2012

ఎవరి పని వారే చేయాలి..

అనగనగా ఓ రైతు.. ఆయనకో గాడిద, కుక్క ఉన్నాయి.. గాడిద వ్యవసాయ పనుల్లో చేదోడు వాదోడుగా ఉంటే, కుక్క ఇంటికి కాపలాగా ఉండేది.. ఓ రోజు రాత్రి ఆ ఇంటికి దొంగ రావడాన్ని గాడిద గమనించింది.. కానీ కుక్క గుర్రుపెట్టి నిద్ర పోతోంది.. ఇప్పుడెలా అని ఆలోచించిన గాడిద, తానే కుక్క పని చేయాలని భావించింది.. గట్టిగా ఓండ్ర పెట్టింది.. దొంగ పారిపోవడం సంగతి పక్కన పెడితే నిద్రా భంగం కలిగిందని ఆగ్రహించిన రైతు, గాడిదను దుడ్డుకర్రతో చితగ్గొట్టేశాడు.. ఆ కథ ద్వారా తెలిసిన నీతి ఏమిటంటే.. ఎవరి పని వారే చేయాలి. తగునమ్మా అని ఇతరుల పనిలో తల దూర్చొద్దు..
ఇప్పడు వాస్తవ కథకు వద్దాం.. అవినీతిని వ్యక్తిరేకంగా లోక్ పాల్ చట్టం కోసం పోరాడుతూ వచ్చిన అన్నా హజారే, చివరకు తన ఉద్యమాన్ని రాజకీయ పార్టీ దిశగా మరల్చారు.. సమాజానికి అంటిన బురదను తొలగించాల్సిన తానే బురదలోకి దిగాడన్నమాట.. అవినీతికి వ్యతిరేకించే వారంతా ఈ ఉద్యమం రాజకీయాలకు అతీతంగా సాగాలని కోరుకున్న వారే (నేను సైతం).. కానీ అన్నాజీ స్వయంగా పార్టీ పెడితే మద్దతు ఇస్తారనే గ్యారంటీ ఏమిటి? గతంలో లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ప్రారంభించిన అవినీతి వ్యతిరేక పోరాటం క్రమంగా జనతా పార్టీ పేరిట మారి అధికారం చేపట్టగానే ఎలా భ్రష్టు పట్టిందో పాత తరానికి గుర్తుండే ఉండాలి.. ప్రస్తుత తరంలో మరో జేపీ గారు ప్రజాస్వామ్య సంస్కరణల కోసం ప్రారంభించిన లోక్ సత్తాను ప్రారంభంలో జనం బాగా ఆదరించారు.. కానీ లోక్ సత్తా రాజకీయ పార్టీగా మారగానే ఏమైందో గమనించే ఉంటారు..
అసలు అన్నా హజారే ఉద్యమం ఇప్పటికే గాడి తప్పింది.. ఆయన చేపట్టిన తాజా దీక్షా శిబిరం గతంలో ఉన్నంత జనాధరణ లేక వెలవెల బోయిన విషయాన్ని మీడియాలో గమనించే ఉంటాం.. దీక్షా శిబిర ప్రాంగణంలో పేకాట, మద్యపాన ప్రియులు సైతం కనిపించారు.. ఇక అన్నా చేత దీక్ష విరవింప జేసిన మాజీ సైన్యాధిపతి తన పుట్టిన రోజు విషయంలో కక్కుర్తి పడి దేశ ప్రతిష్టను ఎంతగా దిగజార్చాడో అందరికీ తెలుసు.. ఇక అన్నా వెంట ఉండే కేజ్రీవాల్ తదితర నాయకుల ప్రసంగాలు వింటే మతి స్థిమితం లేని మాటల్లాగే అనిపిస్తాయి.. పార్లమెంటులో ఉన్న వారంతా నేరగాళ్లు, రేపిస్టులు అని ఆయన వ్రాకుచ్చడం తెలిసిందే.. చివరకు అవినీతి వ్యతిరేక ఉద్యమానికి కాస్త రాజకీయ రంగు ఇచ్చేశారు.. ఇలాంటి వ్యక్తులను హజారే ఎలా నియంత్రిస్తారో ఆ దేవుడికే ఎరుక.. రాజకీయ పార్టీ ప్రకటన ద్వారా అన్నా వెంట ఉన్నవారి స్వార్థపర ఉద్దేశ్యాలు బయటపడిపోయాయి.. ఇకపై అవినీతికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా, వారికి రాజకీయాల్లోకి వచ్చే దు(దూ)రాలోచన ఉన్నవారిగానే చూడాలన్న మాట.. అన్నా టీమ్ ఈ వ్యాసం ప్రారంభంలోని నీతి కథను చదువుకోవాలని నేను కోరుకుంటున్నాను..
లండన్ ఒలింపిక్స్ లో సైనా ఎంత కష్టపడి ఆడినా ఓడిపోయిందే అని బాధ పడ్డా.. కానీ ఊహించని మరో విజయం స్వల్పమైనదే అయినా ఎంతో సంతోషాన్నిచ్చింది.. జయహో విజయ్ కుమార్..

Thursday, August 2, 2012

చందనా ఖాన్ తప్పేమీ చెప్పలేదు

సీనియర్ ఐఏఎస్ అధికారిణి చందనా ఖాన్ చేసిన వ్యాఖ్యలను ఎందుకంత వివాదాస్పదం చేస్తున్నారో అర్థం కావడం లేదు.. పాఠశాల్లో మరుగుదొడ్లను కడిగించడం ద్వారా మన పని మనం చేసుకోవడంలో తప్పులేదనే సందేశాన్ని అందించవచ్చు.. మరుగు దొడ్లు కడగటం శ్రమదానంగా ఎందుకు భావించరాదు? పాకీ పనివారో, ఆయాలు మాత్రమే ఈ పని చేయాలని భావించడం సరికాదు.. ఆ మాటకు వస్తే మహాత్మా గాంధీజీ స్వయంగా మరుగు దొడ్లు కడిగారు.. విద్యార్థుల్లో సేవా భావం పెరుగుతుంది.. పని లేని మీడియా ఈ అంశంపై అనవసర రాద్దాంతం చేసింది.. చందనా ఖాన్ తన వ్యాఖ్యలను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు..
మన దేశాన్ని పాలిస్తున్నది ధృతరాష్ట్ర పాలకులు, కళ్లుండీ చూడలేని కబోదులు.. హస్తిన గాంధారి దేవికి ఈ దేశ ప్రయోజనాలేమైతేనేం తమ కుటుంబం చేతిలో అధికారం ఉంటే చాలు.. అవినీతికి వ్యతిరేకంగా ఎన్ని ఉద్యమాలు చేసినా స్పందన దున్నపోతుపై వానపడ్డత మాత్రమే.. అన్నా హజారే, రాందేవ్ బాబా, ఇతర సామాజిక ఉద్యమకారులు ఎన్ని ఉద్యమాలు చేసినా ఈ మొద్దు నిద్ర నటించే ప్రభుత్వం స్పందిస్తుందన్న గ్యారెంటీ లేదు.. ప్రజల్లో చైతన్య తెచ్చే కార్యక్రమాల ద్వారానే ఈ ప్రభుత్వాన్ని శిక్షించాలి.. ప్రభుత్వమే దిగిరావాలన్న ఉద్యమం అత్యాశే.. అన్నా, బాబా తమ దీక్షలు కట్టిపెట్టి దేశ వ్యాప్తంగా పర్యటించి సభల ద్వారా జన జాగరణ కార్యక్రమాలు చేపట్టడే మంచిది..
నీకు నేను రక్ష.. నాకు నీవు  రక్ష.. మనమిద్దరం ఈ దేశానికి రక్ష..    

Wednesday, August 1, 2012

సానియా ఏమిటీ నిర్వాకం

లండన్ ఒలింపిక్స్ ప్రారంభం సందర్భంగా బెంగళూరు అమ్మాయి మధుర నాగ్ అమాయకంగా భారత ఆటగాళ్ల పరేడ్లో నడిస్తే మన క్రీడా శాఖ అధికారులు, మీడియా నానా యాగీ చేశారు.. కానీ మన హైదరాబాదీ సానియా చేసిన తప్పిదాన్ని మాత్రం ఎవరూ పట్టించుకోలేదు. పరేడ్లో పాల్గొన్న క్రీడాకారులంతా జాతీయ పతాకాన్ని చేతబూని దేశ భక్తిని చాటారు.. కానీ మన సానియా మిర్జాకు ఏమైంది? ఆమె చేతిలో పతాకం ఎందుకు లేదు? గతంలో కూడా సానియా జాతీయపతాకాన్ని అవమానించారు.. సానియా మిర్జా ఉద్దేశ్య పూర్వంగా ఇలా చేస్తున్నారా? ఏమో ఆమె పాకిస్తానీ భర్తకే తెలియాలి..