Friday, August 10, 2012

అంగడి సరుకు..

పదేళ్ల తర్వాత పరిస్థితిని ఇప్పుడే ఊహించి చెబుతున్నా.. పంజాగుట్ట సెంటర్ సమీపంలో అత్తెసరు మార్కులతో పాసైన ఓ ఇంజనీరింగ్ విద్యార్థి పంచర్లు వెస్తుంటే, మరొకడు కారు ఇంజన్ రిపేర్ చేస్తుంటాడు.. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో ఓ మెడికల్ విద్యార్థి ఆర్ఎంపీ డాక్టర్ తరహా నాటు వైద్యం చేస్తుంటాడు.. వినడానికి హస్యాస్పదంగా, విడ్డూరంగా ఉన్నా ఇవి కఠోర వాస్తవాలు.. ఇప్పటికే న్యాయవాద వృత్తికి చెట్టుకింద ప్లీడర్లనే పేరొచ్చింది.. ఇప్పడు ఈ జాబితాలో ఇంజనీరింగ్, మెడిసిన్ ప్రొఫెషనర్లు చేరబోతున్నారు.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీల తీరు తెన్నులను చూస్తుంటే భయమేస్తోంది.. ఈ ధోరణి మారకపోతే భవిష్యత్తు తరం భారీ మూల్యమే చెల్లించాల్సి ఉంటుంది..
దేశ వ్యాప్తంగా 3,393 ఇంజనీరింగ్ కాలేజీలు ఉంటే, అందులో అత్యధికంగా మన రాష్ట్రంలోనే 710 కాలేజీలు ఉన్నాయి.. దేశంలో 355 మెడికల్ కాలేజీలు ఉంటే మన దగ్గరే 40 ఉన్నాయి.. పుట్ట గొడుగుల్లా, అడ్డగోలుగా వెలుస్తున్న ఈ కాలేజీలకు గుడ్డిగా అనుమతులు ఇచ్చేస్తున్నారు.. తమ పిల్లలను ఇంజనీర్లుగా, డాక్టర్లుగా చూసుకోవాలని ఆశ పడే తల్లిదండ్రుల బలహీనతకు తోడు ఫీజు రీఎంబర్స్ అనే జాడ్యం పరిస్థితిని దారుణంగా దిగజారుస్తోంది.. ఇంజనీరింగ్, మెడిసిన్ విద్య అంగడి సరుకైపోయింది.. లక్షలాది రూపాయలు చెల్లించే తల్లిదండ్రుల బలహీనతే కాలేజీలకు పెట్టుబడిగా మారింది..

మన రాష్ట్రంలో ఉన్న మెజారిటీ ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీల్లో కనీస ప్రమాణాలు లేనివే.. సరియైన అధ్యాపకులు, బోధనా పరికరాలు లేనే లేవు.. రాశిలోనే ఘనం.. వాసిలో పూర్తి నాసిరకం.. సోకాల్డ్ ఇంజనీర్లు, డాక్టర్లను ఉత్పత్తి చేసే మర యంత్రాలు మాత్రమే ఇవి.. విద్యార్థుల్లో నైపుణ్యం, ప్రతిభ నేతి బీరకాయలో నేతి లాంటిదే.. పరిశోధనలకు ఏ మాత్రం ప్రాధాన్యతే లేదు.. ప్రతిభ గల కొద్ది విద్యార్థలు విదేశాలకు చెక్కేస్తున్నారు.. మిగిలే సరుకంతా నాసిరకం.. ఫీజు రీఎంబర్స్ వచ్చాక మనదేం పోయింది? పిల్లోడు చదివితే చదువుతాడు.. లేకుంటే ఇంకేమైనా చేసకొని బతుకుతాడనే దారుణమైన ఆలోచనా విధానం తల్లిదండ్రుల్లో వచ్చేసింది.. ప్రతిభ ఉండి, ఉన్నత చదువులు చదవలేని పేద విద్యార్థులను ప్రభుత్వం పూర్తి ఆర్థిక సహాయం అందించి మెరుగైన విద్యను అందిస్తే బాగుంటుంది.. కానీ ప్రస్థుత విధానం వల్ల ప్రయోజనం పొందుతున్నదెవరు? అప్పనంగా ప్రజల సొమ్మును ప్రయివేటు కాలేజీలకు దోచిపెట్టడం ఎంత వరకు సమంజసం?
ఇంజనీరింగ్, మెడిసిన్ విద్యార్థులను కించపరచడం నా ఉద్దేశ్యం ఎంతమాత్రం కాదు.. ఎవరికైనా వారు కోరుకునే చదువు చదిదే అధికారం పూర్తిగా ఉంది.. కానీ దిగజారుతున్న ప్రమాణాలు చూసి తట్టుకోలేకే ఈ మాత్రమైనా స్పందించే అర్హత మాత్రం నాకుందని భావిస్తున్నాను.. ఓటు బ్యాంకు రాజకీయాల కారణంగా ఏ రాజకీయ పార్టీ , విద్యార్థి సంఘం కూడా ఈ ధోరణిని ప్రశ్నించలేకపోతోంది.. మేధావులైనా ముందుకు వచ్చి పిల్లి మెడలో గంటకట్టే ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను..

No comments:

Post a Comment