Saturday, August 4, 2012

ఎవరి పని వారే చేయాలి..

అనగనగా ఓ రైతు.. ఆయనకో గాడిద, కుక్క ఉన్నాయి.. గాడిద వ్యవసాయ పనుల్లో చేదోడు వాదోడుగా ఉంటే, కుక్క ఇంటికి కాపలాగా ఉండేది.. ఓ రోజు రాత్రి ఆ ఇంటికి దొంగ రావడాన్ని గాడిద గమనించింది.. కానీ కుక్క గుర్రుపెట్టి నిద్ర పోతోంది.. ఇప్పుడెలా అని ఆలోచించిన గాడిద, తానే కుక్క పని చేయాలని భావించింది.. గట్టిగా ఓండ్ర పెట్టింది.. దొంగ పారిపోవడం సంగతి పక్కన పెడితే నిద్రా భంగం కలిగిందని ఆగ్రహించిన రైతు, గాడిదను దుడ్డుకర్రతో చితగ్గొట్టేశాడు.. ఆ కథ ద్వారా తెలిసిన నీతి ఏమిటంటే.. ఎవరి పని వారే చేయాలి. తగునమ్మా అని ఇతరుల పనిలో తల దూర్చొద్దు..
ఇప్పడు వాస్తవ కథకు వద్దాం.. అవినీతిని వ్యక్తిరేకంగా లోక్ పాల్ చట్టం కోసం పోరాడుతూ వచ్చిన అన్నా హజారే, చివరకు తన ఉద్యమాన్ని రాజకీయ పార్టీ దిశగా మరల్చారు.. సమాజానికి అంటిన బురదను తొలగించాల్సిన తానే బురదలోకి దిగాడన్నమాట.. అవినీతికి వ్యతిరేకించే వారంతా ఈ ఉద్యమం రాజకీయాలకు అతీతంగా సాగాలని కోరుకున్న వారే (నేను సైతం).. కానీ అన్నాజీ స్వయంగా పార్టీ పెడితే మద్దతు ఇస్తారనే గ్యారంటీ ఏమిటి? గతంలో లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ప్రారంభించిన అవినీతి వ్యతిరేక పోరాటం క్రమంగా జనతా పార్టీ పేరిట మారి అధికారం చేపట్టగానే ఎలా భ్రష్టు పట్టిందో పాత తరానికి గుర్తుండే ఉండాలి.. ప్రస్తుత తరంలో మరో జేపీ గారు ప్రజాస్వామ్య సంస్కరణల కోసం ప్రారంభించిన లోక్ సత్తాను ప్రారంభంలో జనం బాగా ఆదరించారు.. కానీ లోక్ సత్తా రాజకీయ పార్టీగా మారగానే ఏమైందో గమనించే ఉంటారు..
అసలు అన్నా హజారే ఉద్యమం ఇప్పటికే గాడి తప్పింది.. ఆయన చేపట్టిన తాజా దీక్షా శిబిరం గతంలో ఉన్నంత జనాధరణ లేక వెలవెల బోయిన విషయాన్ని మీడియాలో గమనించే ఉంటాం.. దీక్షా శిబిర ప్రాంగణంలో పేకాట, మద్యపాన ప్రియులు సైతం కనిపించారు.. ఇక అన్నా చేత దీక్ష విరవింప జేసిన మాజీ సైన్యాధిపతి తన పుట్టిన రోజు విషయంలో కక్కుర్తి పడి దేశ ప్రతిష్టను ఎంతగా దిగజార్చాడో అందరికీ తెలుసు.. ఇక అన్నా వెంట ఉండే కేజ్రీవాల్ తదితర నాయకుల ప్రసంగాలు వింటే మతి స్థిమితం లేని మాటల్లాగే అనిపిస్తాయి.. పార్లమెంటులో ఉన్న వారంతా నేరగాళ్లు, రేపిస్టులు అని ఆయన వ్రాకుచ్చడం తెలిసిందే.. చివరకు అవినీతి వ్యతిరేక ఉద్యమానికి కాస్త రాజకీయ రంగు ఇచ్చేశారు.. ఇలాంటి వ్యక్తులను హజారే ఎలా నియంత్రిస్తారో ఆ దేవుడికే ఎరుక.. రాజకీయ పార్టీ ప్రకటన ద్వారా అన్నా వెంట ఉన్నవారి స్వార్థపర ఉద్దేశ్యాలు బయటపడిపోయాయి.. ఇకపై అవినీతికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా, వారికి రాజకీయాల్లోకి వచ్చే దు(దూ)రాలోచన ఉన్నవారిగానే చూడాలన్న మాట.. అన్నా టీమ్ ఈ వ్యాసం ప్రారంభంలోని నీతి కథను చదువుకోవాలని నేను కోరుకుంటున్నాను..

No comments:

Post a Comment