Monday, December 29, 2014

దండగమారి 31

డిసెంబర్ 31.. క్యాలండర్లో చివరి తేదీ.. అలాగే జనవరి 1 క్యాలండర్లో మొదటి తేదీ మాత్రమే.. ఈ రెండు తేదీలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరమే లేదు.. మీ జీవితాల్లో కొత్తగా వచ్చే మార్పేమీ ఉండదు.. పోయేదీ ఏమీ లేదు.. గోడకు కొత్త క్యాలండర్ తగిలించుకోండి.. డైరీ రాసే అలవాటు ఉంటే కొనుక్కోండి.. లేదంటే ఎవరైనా గిఫ్ట్ ఇస్తే తీసుకోండి..
చాలా మందికి డిసెంబర్ 31 తేదీని తలచుకోగానే ఎక్కడలేని పూనకం వచ్చేస్తోంది.. తాగాలి, తినాలి, చిందులేయాలి, రోడ్లపై హ్యాపీ న్యూ ఇయర్ అంటూ వెర్రి కేకలు వేస్తూ ర్యాష్ డ్రైవింగ్ చేయాలి.. ఇదీ వారి సైకాలజీ.. ఇదెక్కడి సంస్కృతి? ఇందు వల్ల వారికి కాని, సమాజానికి గానీ ఏమైనా మేలు జరుగుతోందా? ఆలోచించండి.. ఎందుకీ పనికి మాలిన వేడుకలు.. ఈ వేడుకలు జరుపుకోవడం వల్ల లాభ పడేది మద్యం అమ్మకాల వల్ల వైన్ షాపులు, బార్ల ఓనర్లు.. ప్రభుత్వానికి ఖజానా నిండుతుంది.. క్లబ్బులు, హోటళ్లకు, బేకరీ షాపుల వాలకు ఆదాయం.. చమురు వదిలేది మాత్రం మీకే.. ఒళ్లు గుళ్లయ్యేదీ మీకే.. ఉత్సాహం శృతి మించితే విషాదం కూడా..
జనవరి 1న న్యూ ఇయర్ జరుపుకోవడం తప్పా, ఒప్పా అని నేను చర్చించదలచుకోలేదు.. కానీ అర్థం లేని వేడుకల కోసం కాలాన్ని, డబ్బును వృధా ఎందుకు చేసుకోవడం?.. అంతగా ఉత్సహంగా ఉంటే అందరికీ శుభం కలగాలని మీ ఇష్ట దైవాన్ని మొక్కుకోండి.. పనికి మాలిన సంబరాల కోసం పెట్టే ఖర్చును సామాజిక సేవా కార్యక్రమాల కోసం ఉపయోగించండి.. ఇందు వల్ల కాస్త పుణ్యం, పురుషార్థం ఉంటుంది.. 

Thursday, December 25, 2014

మదన్ మోహన్ మాలవీయ – MMM..

 ఆయన చేపట్టిన మహా యజ్ఞానికి నిజాం నవాబు కూడా విరాళం ఇవ్వక తప్పలేదు.. That is MMM మనీ మేకింగ్ మిషన్..
మదన్ మోహన్ మాలవీయ పేద కుటుంబంలో పుట్టి అతికష్టం మీద చదువుకోగలిగారు.. వేదాధ్యనం చేశారు.. ఉపాధ్యాయ వృత్తి చేపట్టి న్యాయవాద విద్య పూర్తి చేసుకొని లాయర్ అయ్యారు.. జాతీయ ఉద్యమంలో చేరి స్వాతంత్ర్య సంగ్రామంలో తనవంతు పాత్ర పోషించారు.. కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షునిగా, గాంధీజీకి సన్నిహితునిగా పని చేశారు..
చిన్నప్పుడు చదువుకోడానికి తాను పడ్డ కష్టం మరెవరికీ రాకూడనుకున్నారు మదన్ మోహన్ మాలవీయ.. అందు కోసం ఏకంగా విశ్వ విద్యాలయం స్థాపించడానికి నిర్ణయించుకున్నారు.. దానికి బెనారస్ హిందూ యూనివర్సిటీ అనే పేరు పెట్టారు.. ఇందు కోసం అవసరమయ్యే నిధుల కోసం కాలికి బలపం కట్టుకొని దేశమంతా తిరిగారు.. మాలవీయ వ్యక్తిత్వం తెలిసిన సంస్థానాధీశులు, ప్రముఖులు, నాయకులు, ధనవంతులు భూరి విరాళాలు ఇచ్చి ప్రోత్సహించారు.. మాలవీయ ఎక్కడికి వెళ్లినా ఉత్త చేతులతో తిరిగి రారని పేరుండేది.. అందుకే ఆయనను మనీ మేకింగ్ మిషన్ అని సరదాగా పిలిచేవారు..
ఈ క్రమంలో మదన్ మోహన్ మాలవీయ హైదరాబాద్ వచ్చారు.. సంస్థానాధీశుడు నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ను కలసి తాను ఎందుకు వచ్చానో వివరించాడు.. ముస్లింనైన నేను హిందూ యూనివర్సిటీకి విరాళం ఇవ్వడం ఏమిటి.. ప్రసక్తే లేదు అని నిరాకరించాడు నవాబు.. కానీ మాలవీయ ఉత్తి చేతులతో పోయే కాదు కదా.. నిజాం ప్యాలస్ నుండి బయటకు వచ్చారు.. నగర వీధుల్లో తిరుగుతుండగా ఓ శవయాత్ర కనిపించింది.. ఊరేగింపులో శవంపై చిల్లర నాణేలు చల్లుతున్నారు.. పరుగున వెళ్లి ఏరుకోవడం మొదలు పెట్టారు.. దారిన పోయేవారు మాలవీయ చేస్తున్న పని చూసి ఆశ్చర్యపోయారు.. సమాచారం నిజాం నవాబుకు చేరింది.. మదన్ మోహన్ మాలవీయను పిలిచి ఏమిటి మీరు చేస్తున్న పని అని నిలదీశాడు.. తాను చేపట్టిన సంకల్పం నెరవేర్చుకునేందుకు ఉత్తి చేతులతో హైదరాబాద్ వదిలి వెళ్లే ప్రసక్తి లేదని స్పష్టం చేశారాయన.. తన తప్పును గుర్తించిన మీర్ ఉస్మాన్ అలీఖాన్ సముచిత రీతిలో విరాళం అందించారు.. విజయగర్వంతో హైదరాబాద్ నుండి బయలు దేరారు మాలవీయ..

ఈ కథ రకరకాలుగా ప్రచారంలో ఉంది.. కానీ ఏది ఏమైనా మదన్ మోహన్ మాలవీయ సంకల్పానికి అద్దం పట్టే కథ ఇది.. That’s MMM.. మనీ మేకింగ్ మిషన్.. ఆయన చేసిన కృషి ఫలించింది బెనారాస్ యూనివర్సిటీ మనోన్నత విద్యాలయంగా ఆవిర్భవించింది..

భారత రత్నకు జన్మదిన శుభాకాంక్షలు

పార్లమెంట్లో ఓ కొత్త ప్రతిపక్ష సభ్యుడి వాక్పటిమను చూసి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ ముగ్దుడయ్యారు.. వివిధ అంశాలపై ఆయన అవగాహణను, అసాధారణ నైపుణ్యాన్ని చూసి ప్రశంసించలేకుండా ఉండలేకపోయారు.. ఈ యువకుడు ఏనాటికైనా ఈ దేశ ప్రధాని అవుతాడని నెహ్రూ ఊహించారు.. 1957 నాటి మాట ఇది.. ఆ కొత్త సభ్యుడు బలరాంపూర్ నియోజకవర్గం నుండి లోక్ సభకు ఎన్నికైన అటల్ బిహారీ వాజపేయి.. నెహ్రూ అంఛనా భవిష్యత్ లో నిజమైంది..
దేశంలో కాంగ్రెస్ పతనం తర్వాత కిచిడీ సంకీర్ణ ప్రభుత్వాల వైఫల్యం తర్వాత దేశ ప్రజలు బీజేపీని బొటాబొటీ మెజారిటీతో గెలిపించారు.. ఇలాంటి సమయంలో ప్రధానమంత్రి అయిన వాజపేయి భాగస్వామ్య పక్షాలను ఒప్పిస్తూ సంకీర్ణ ప్రభుత్వాన్ని విజయవంతంగా నడిపారు.. అటల్జీ ప్రధానిగా ఉన్న సమయంలో దేశ అభివృద్దికి కొత్త బాటలు పడ్డాయి.. స్వర్ణ చతుర్భుజి రహదారుల లాంటి మౌళిక సదుపాయాలను విస్తరించారు. సంస్కరణలను అమలు చేయడంలో విజయం సాధించారు.. దేశం ఆర్థికంగా బలోపేతమైంది..  పోక్రాన్ అణుపరీక్ష ద్వారా అగ్రరాజ్యాలకు సవాలు విసిరారు. భారత దేశ శాస్త్ర సాంకేతిక సత్తాను ప్రపంచానికి చాటారు.. కయ్యానికి కాలు దువ్విన పాకిస్తాన్ కు కార్గిల్ యుద్దంలో గట్టి బుద్ది చెప్పారు..
అటల్ బిహారీ వాజపేయి గొప్ప రాజనీతిజ్ఞుడు మాత్రమే కాదు.. ఆయన గొప్ప కవి, వక్త కూడా.. హిందీలో అటల్జీ రాసిన కవిత్వం, వ్యాసాలు పండితుల ప్రశంసలందుకున్నాయి.. ఆయన అనర్ఘళ  ప్రసంగాలకు జనం మంత్ర ముగ్దులైపోయేవారు.. అసమాన ప్రతిభావంతుడైన వాజపేయి ప్రసంగాన్ని ఆలకించేందుకు పార్లమెంట్లో అన్నిపక్షాల సభ్యులు ఆసక్తిని చూపించేవారు.. ఆజన్మ బ్రహ్మచారిగా దేశ సేవకు అంకితమైన అటల్జీ వ్యక్తిత్వం పార్టీలకు అతీతంగా అందరినీ మిత్రులుగా మార్చింది..  

సుపరిపాలన అంటే ఏమిటో ఆచరణలో చూపించారు అటల్ బిహారీ వాజపేయి.. అందుకే అటల్జీ జన్మదినాన్ని సుపరిపాలన దినోత్సవంగా ప్రకటించారు ప్రధాని నరేంద్ర మోదీ.. వాజపేయి దేశానికి చేసిన సేవలకు గుర్తింపుగా భారతరత్న అవార్డును ప్రకటించారు.. వాజపేయిని అలంకరిచడంతో భారత రత్నానికి విలువ పెరిగింది.. అటల్జీకి సంపూర్ణ ఆయురారోగ్యాలు కలగాలని కోరుకుందాం..

క్రైస్తవ మిత్రులు, వారి కుటుంబ సభ్యులందరికీ..


Wednesday, December 24, 2014

విలువ పెరిగిన భారత రత్న..

భారత రత్న అవార్డుకు ఈసారి నిజంగా విలువ పెరిగింది.. రెండు మహోన్నత శిఖరాలకు ఈ రత్నాలను అలంకరిస్తున్నారు.. ఒక మహోన్నత స్వాతంత్ర్య సమరయోధుడికి, మరో మహా రాజనీతిజ్ఞునికి భారత రత్న అవార్డులను ప్రధానం చేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయించడం ఎంతో ఆనందించదగిన విషయం..
భారత స్వాతంత్ర్య సమయపోరాటంలో కీలక పాత్ర పోషించిన పండిత మదన్ మోహన్ మాలవీయ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షునిగా పని చేశారు.. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం స్థాపించారు. విద్యావేత్తగా, సంఘ సంస్కర్తగా పేరు తెచ్చుకున్నారు.. సాంప్రదాయ హిందూ కుటుంబంలో పుట్టిన మావవీయ చిన్నప్పుడే వేదాంతం అభ్యసించారు.. సమాజంలో కుల, మత బేధాలకు వ్యతిరేకంగా పని చేశారు.. మహాత్మా గాంధీతో కలిసి లండన్ రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్లడంతో పాటు క్విట్ ఇండియా ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. రెండు దిన పత్రికలను కూడా స్థాపించారు. సరిగ్గా స్వాతంత్ర్యానికి ఒక సంవత్సరం ముందే కన్ను మూశారు..
అటల్ బిహారీ వాజపేయి మహోన్నత జాతీయ వాది.. దేశం కోసం జీవితాన్నే అంకితం చేసిన మహానీయుడు.. ఆర్ఎస్ఎస్ ద్వారా సమాజ సేవను ప్రారంభించిన అటల్జీ, జనసంఘ్, బీజేపీలకు నాయకత్వం వహించారు.. ఎమర్జెన్సీ కాలంలో జైలుపాలయ్యారు.. జనతా ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా పని చేశారు.. దేశంలో సంకీర్ణ ప్రభుత్వాల పాలన ప్రారంభం అయ్యాక తొలి కాంగ్రెసేతర ప్రభుత్వానికి నాయకత్వం వహించి పరి పాలనలో తన సత్తా చాటారు.. సమర్థ నాయకత్వంతో సుస్థిర ప్రభుత్వాన్ని ఆచరణలో చూపించడమే కాకుండా, సంస్కరణ వేగం పెంచి దేశాన్ని ఆర్ధికంగా బలోపేతం చేశారు.. స్వర్ణ చతుర్జుజి లాంటి పథకాలతో మౌళిక సదుపాయాలను మెరుగు పరిచారు. పార్టీలకు అతీతంగా దేశ ప్రజలందరి మన్నలు అందుకుంటున్నారు వాజపేయి.. అటల్జీ మంచి నాయకుడు మాత్రమే కాదు వక్త, కవి, రచయితగా కూడా ప్రసిద్దులు.. ఆయన జన్మదినాన్ని నరేంద్ర మోదీ ప్రభుత్వం సుపరిపానా దినోత్సవంగా ప్రకటిచడం దేశ ప్రజలందరికీ గర్వకారణం..

మదన్ మోహన్ మాలవీయజీ, అటల్ బిహారీ వాజపేయిజీ.. ఇద్దరి జన్మదినోత్సవాలు డిసెంబర్ 25వ తేదీనే.. ఇరువురినీ భారత రత్న అవార్డులు వరించడం అదృష్టం..


మరోసారి మోదీ శక్తి..

కాంగ్రెస్ ముక్త్ భారత్.. బీజేపీ ఇచ్చిన నినాదం వాస్తవ రూపంలో కొనసాగుతోంది.. దేశమంతటా వరుసగా కాంగ్రెస్ కోటలు కూలుతున్నాయి.. తాజా ఝార్ఖండ్, జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ భాగస్వామిగా ఉన్న సంకీర్ణ ప్రభుత్వాలు పడిపోవడమేకాదు.. ఆ పార్టీ ప్రాంతీయ పార్టీలన్నా చిన్నదైపోయింది..
ఎన్నికల ఫలితాలు వస్తున్న సమయంలో ఓ మిత్రుడు ఇక బీజేపీ పని అయిపోయిందని సంబరపడ్డాడు.. ఆయన ఉద్దేశ్యం ఝార్ఖండ్లో బీజేపీకి ఎగ్జిట్ ఫోల్స్ చెప్పినట్లు సీట్లు రాలేదని. జమ్మూకశ్మీర్లో మిషన్44+ సక్సెస్ కాలేదని.. ఝర్ఖండ్లో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన స్పష్టమైన మెజారిటీ బీజేపీకి ఉంది.. తొలిసారి హంగేతర ప్రభుత్వం అక్కడ ఏర్పటవుతోంది..
ఇక జమ్మూ కశ్మీర్ విషయానికి వస్తే అక్కడ బీజేపీ సాధించిన విజయం చిన్నదేం కాదు.. పీడీపీ 28 స్థానాలు పొందితే, బీజేపీ 25 సీట్లు సాధించింది.. మరో ముఖ్య విషయం ఏమిటంటే ఓట్ల శాతంలో బీజేపీదే పైచేయి.. బీజేపీకి 23 శాతం వస్తే, పీడీపీకి 22.7 శాతం ఓట్లు దక్కాయి.. కశ్మీర్ లోయ, లద్దాక్ లలో బీజేపీకి సీట్లు రాకపోవచ్చు కానీ రాష్ట్రంలో కీలక శక్తిగా బీజేపీ ఆవిర్భవించడం వేర్పాటు వాదులకు గడ్డు పరిస్థిస్తే.. వాస్తవానికి ఫలితాలను ఇంతకు మించి ఊహించడం కాస్త అత్యాశే అవుతుంది.. జమ్మూ, కశ్మీర్ లోయ జనాభా నిశ్పత్తి ప్రకారం చూస్తే కశ్మీర్లో అసెంబ్లీ సీట్లు కాస్త ఎక్కువున్నాయి.. కాబట్టి సహజంగా అక్కడ విజయం సాధించే వారిదే పైచేయి అవుతుంది..

జమ్మూ కశ్మీర్లో బీజేపీ మిషన్ 44+ ఒక సంకల్పం.. అది పూర్తిగా సాధ్యం కాకున్నా, రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేనంత ప్రశాంతంగా ఓటింగ్ జరగడం, పోలింగ్ శాతం పెరగడం ప్రజాస్వామ్య విజయం.. అక్కడ ఎవరు ఓడినా, గెలిచినా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు, గ్రాంట్లతోనే ప్రభుత్వం నడవాల్సిందే.. అక్కడి ప్రజలు క్రమంగా వేర్పాటు వాదులను దూరం పెడుతూ క్రమంగా యావద్దేశంతో మమేకం అవుతున్నారు.. కశ్మీర్లో వరదలు వచ్చినప్పుడు భారత ప్రభుత్వ అవసరం వారికి తెలిసివచ్చింది..

Tuesday, December 23, 2014

నాకు తెలియకుండానే అభిమాన దర్శకుడు..

నేను సినిమాలు అంతగా చూడను.. చూసే సినిమాలు కూడా కమల్ హాసన్, రజనీకాంత్ లవే ఎక్కవ.. ఈ ఇద్దరు మహా నటులను వెండి తెరకు అందించిన గొప్ప దర్శకుడు బాలచందర్.. నాకు ఎంతో ఇష్టమైన చిత్రాల్లో కూడా సింహ భాగం బాలచందర్ దర్శకత్వంలో వచ్చినవే.. ఆకలిరాజ్యం, మరోచరిత్ర, అంతులేని కథ, రుద్రవీణ చిత్రాలు తరచూ మెదులుతూనే ఉంటాయి.. బాలచందర్ తెలుగులో చాలా తక్కువ సినిమాలే తీసి ఉండవచ్చు.. ఆయన తమిళ దర్శకుడే కావచ్చు.. కానీ నాకు తెలియకుండానే నా అభిమాన దర్శకుల్లో ఒకరైపోయారు.. దర్శకునిగా, నిర్మాతగా, రచయితగా బహుముఖ రూపాల్లో ప్రేక్షక లోకానికి దర్శనం ఇచ్చిన బాలచందర్ మనకు దూరం కావడం బాధాకరంగానే ఉంది.. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్ధిస్తున్నాను..

Saturday, December 20, 2014

గీతా ప్రెస్ భవిష్యత్ ఏమిటి?

తెలుగులో మంచి భగవద్గీత గ్రంధం కావాలని పొరుగు రాష్ట్రంలో ఉన్న ఓ మిత్రుడు కోరాడు.. అది కొందామని సుల్తాన్ బజార్(హైదరాబాద్)లోని గీతాప్రెస్ పుస్తకాలయానికి వెళ్లాను.. భగవద్గీత తెలుగులోనే రూ.2, 5 మొదలుకొని రకరకాల ధరలు, సైజులు, వ్యాఖ్యానాలతో దొరుకుతాయక్కడ.. ఆశ్చర్యంగా నేను కోరుకున్న ప్రతులు లేవక్కడ.. ఇదేమిటని అడిగితే స్టాక్ లేదు అన్నారు అక్కడి సిబ్బంది.. ఎప్పుడొస్తాయి అని అడిగితే చెప్పలేం అన్నారు కాస్త విచారంగా.. ఈ సమాధానానికి కాస్త ఆశ్చర్య పోయాను.. నగరంలో జరుగుతున్న బుక్ ఫెయిర్ వెళ్లితే అక్కడో మిత్రుడు చెప్పిన వార్త షాక్ కలిగించింది.. వర్కర్ల సమ్మె కారణంగా గీతా ప్రెస్ తాత్కాలికంగా మూసేశారట..
భారత దేశంలోని పురాతన ఆధ్యాత్మిక గ్రంథాల ప్రచురణ సంస్థ గీతా ప్రెస్.. 1923లో గోరఖ్ పూర్ కేంద్రంగా స్థాపించారీ సంస్థను.. లాభాపేక్ష లేకుండా చాలా చవక ధరకు, నాణ్యమైన ఆధ్యాత్మిక, నైతిక సాహిత్యాన్ని ప్రజలకు అందిస్తున్న సంస్థ ఇది.. హిందీ, సంస్కృతం, ఇంగ్లీషు, తెలుగు, కన్నడ, బెంగాలి, ఒరియా, తమిళ, గుజరాతీ, మరాఠీ భాషల్లో భగవద్గీత, సనాతన ధర్మం, పురాణాలు, ఉపనిషత్ లతో పాటు గృహస్త్య, నైతిక అంశాలకు సంబంధించిన పుస్తకాలను ప్రచురిస్తుంది గీతా ప్రెస్..

కార్మికులు తమ వేతనాలు, ఇతర డిమాండ్ల కోసం సమ్మె చేపట్టడంతో విధిలేని పరిస్థితుల్లో గీతా ప్రెస్ యాజమాన్యం లాకౌట్ ప్రకటించిందట.. లాభాపేక్ష లేకుండా సేవా భావంతో నడుస్తున్న సంస్థను కార్మిక సంఘాలు ఎలా వీధికీడ్చాయో చూడండి.. దీని వల్ల ఎవరికి లాభం? కార్మికులు పస్తులుండాల్సిందే కదా.. పైగా ఉత్తమ ఆధ్మాత్మిక, నైతిక సాహిత్యాన్ని ప్రజలకు దూరం చేసిన అపకీర్తి ఎవరికి?.. త్వరలో గీతాప్రెస్ తిరిగి ప్రారంభం కావాలని కోరుకుందాం..

వందేళ్ల క్రితమే గాడ్గేబాబా స్పచ్ఛ అభియాన్..

స్వచ్ఛ్ భారత్ అభియాన్.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుణ్యమా అని దేశమంతా మార్మోగుతోంది.. నాయకులు, సెలబ్రటీలు చీపుర్లు పట్టి వీధులూడుస్తూ ఫోజులిచ్చేస్తున్నారు.. ఒక మంచి ఉద్దేశ్యంతో చేపట్టిన కార్యక్రమం ఇలా పబ్లిసిటీ జిమ్మిక్కులకే పరిమితం అవుతోందా అనే బాధ మనసులో కలుగుతోంది.. ప్రధాని మోదీ ఎంతో ప్రాధాన్యత ఇస్తున్న ఈ ఉద్యమం ఎంత వరకూ ఫలిస్తుంది అనే చర్చను పక్కన పెట్టి వందేళ్ల క్రితం స్వచ్ఛతా ఉద్యమాన్ని జనం ముందుకు తెచ్చిన మహనీయున్ని గుర్తు తెచ్చుకుందాం..
మహారాష్ట్రలోని అమరావతి జిల్లా షేన్ గావ్ లో జన్మించారు గాడ్గేబాబా.. బాబా అసలు పేరు దేవూజీ.. 30వ ఏటా భార్యా పిల్లలు అనే బంధాన్ని తెంచుకున్న బాబా, జీవితాంతం సన్యాసిగా జీవించి ఈ పదానికి నిజమైన అర్థాన్ని ఆచరణలో చూపించారు.. మూఢ నమ్మకాలు మానేయమని, కులం పేరుతో సాటి మనిషిని కించపరచొద్దని మనుషులంతా ఒకటే అని ప్రబోధించేవారు బాబా.. ఆలయాల్లో పాటలు, కీర్తనల పాడుతూ అందరినీ ఆకట్టుకునేలా ఆధ్యాత్మిక, నైతిక, ఆచరనీయమైన విషయాలను బోధించేవారు..
గాడ్గేబాబా చేపట్టిన అతిపెద్ద ఉద్యమ  స్వచ్ఛతా అభియాన్.. రంగుల గుడ్డ పేలికల బట్టలతో కనిపించే బాబా తలపై మట్టి చిప్ప కనిపించేది.. చేతిలో చీపురు పట్టుకొని కనిపించేవారు.. గాడ్గేబాబా ఏ ఊరికి వెళ్లినా అక్కడి వీధులు, ఆలయాలను శభ్రంగా ఊడ్చేవారు.. పొలం పనులు, మట్టిపని, కుమ్మరిపని చేసి పొట్ట నింపుకునేవారు బాబా.. ఎవరినీ చేయిచాచి అడగలేదు.. దేవాలయాల చెంతో, ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ పడుకునేవారు.. చివరకు రోడ్డు మీదే దేహం చాలించారు.
ఇంత నిరాడంబరంగా జీవించిన గాడ్గేబాబా ఒక వ్యక్తి సమాజానికి పనికి వచ్చే పనులు ఎలా చేయవచ్చే చేసి చూపించారు.. అనాధాశ్రమాలు, పాఠశాలలు, బాలల వసతి గృహాలు, ధర్మశాలలు ప్రజల సహకారంతో నిర్మించారు.. నేటి తరం వారికి తెలియని విషయం ఏమిటంటే మహాత్మాగాంధీ, బాబా సాహెబ్ అంబేద్కర్ లాంటి ప్రముఖులకు గాడ్గేబాబా స్పూర్తినిచ్చారు. బాబాను అంబేద్కర్ తన గురువుగా చెప్పుకునేవారు..

గాడ్గేబాబా జన్మించింది ఫిబ్రవరి 23, 1876న.. పరమపదించిన తేదీ డిసెంబర్ 20, 1956, అంటే సరిగ్గా ఇదే రోజు.. స్వచ్ఛ్ భారత్, కుల రహిత సమాజం కోసం వందేళ్ల క్రితమే ఉద్యమించారు బాబా.. వీటిని విజయవంతం చేసి ఆచరణలో చూపించడమే మనం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి..

Friday, December 19, 2014

గాంధీ బీర్..

మద్య పానాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు మహాత్మా గాంధీ.. అలాంటి మహాత్మున్ని అవమాన పరిచేలా అమెరికాలోని ఒక కంపెనీ ఏకంగా గాంధీజీ పేరిట బీర్ టిన్, బాటిళ్ళను విడుదల  చేసింది. పైగా మహాత్మా గాంధీని వ్యంగ్య చిత్రాన్ని టిన్ మీద ముద్రించింది.. 
కనెక్టికట్ స్టేట్ ఉడ్ బ్రిడ్జ్ నగరంలోని   న్యూ ఇంగ్లాండ్ బెవరేజేస్ అనే కంపెనీ చేసిన ఈ దుశ్చర్యను ప్రవాస భారతీయులు తీవ్రంగా ఖండిస్తూ న్యాయ పోరాటానికి దిగారు.. 

Thursday, December 18, 2014

బుద్దిరాని పాక్..

కుక్క తోక వంకరే కదా మరి.. తాలిబాన్ ఉగ్రవాదులు చిన్నారులను   పొట్టన పెట్టుకున్నా పాకిస్తాన్ పాలనా యంత్రాంగానికి బుద్ధి రాలేదు.. కరడుగట్టిన ఉగ్రవాది జాకీ ఉర్ రెహ్మాన్ లక్వీకి పాకిస్తాన్ ఉగ్రవాద వ్యతిరేక న్యాయస్థానం నిర్లజ్జగా బెయిల్ ఇచ్చేసింది.. 164 మందిని బలి తీసుకున్న ముంబై 26/11 మారణకాండకు స్కెచ్ గీసింది ఈ లక్వీ రక్కసుడే.. 

Wednesday, December 17, 2014

పెషావర్లో దారుణం..

మాటలకందని రాక్షసకాండ ఇది.. విష సర్పాన్ని పెంచి ముద్దాడితే ఏమవుతుంది?.. ఊహించిందే జరిగింది.. భారత దేశంపై విషయం కక్కుతూ ఆవిర్భవించిన పాకిస్తాన్ చివరకు తాను తీసిన గోతిలో తానే పడుతోంది..
పెషావర్ నగరంలో సైనిక పాఠశాలపై తాలిబాన్లు దాడి చేసి 130కి పైగా విద్యార్థులను పొట్టన పెట్టుకోవడం ప్రపంచాన్నే నివ్వెరపరచింది.. పాకిస్తాన్ ప్రభుత్వం, సైన్యంపై ఉన్న కోపాన్ని పసి పిల్లలపై చూపించారు తాలిబాన్లు.. ఈ తాలిబాన్లు ఎక్కడివారో, ఎవరు పెంచి పోషించారో అందరికీ తెలుసు.. పాకిస్తాన్ తాను చేసిన పాపానికి తానే బలవుతోంది.. ఇప్పటికైనా ఆ దేశ పాలకులకు కనువిప్పు కావాలి..

Saturday, December 13, 2014

పాశ్చాత్య మీడియా వక్ర దృష్టి..

దేవుడు వరమిచ్చినా పూజారి వరమివ్వలేదనే సామెత మనకు బాగా తెలిసిందే. దేవుడు మన పట్ల సానుభూతితో ఉన్న మధ్యలో ఉండే పూజారే మనపై శీతకన్నేశాడనే అర్థంలో దీన్ని వాడుతుంటారు. ఈ సామెత విషయాన్ని పక్కన పెడితే.. అమెరికాకు చెందిన ప్రఖ్యాత TIME (టైమ్) పత్రిక ప్రతి ఏటా ఎంపిక చేసే పర్సన్ ఆఫ్ ఇయర్ కోసం పాఠకుల అభిప్రాయాలను సేకరిస్తుంటుంది. ఈసారి జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో భారత ప్రధాని నరేంద్ర మోదీకి అత్యధిక పాఠకులు మద్దతు పలికారు. 16.2 శాతం ఓట్లతో ఆయన మొదటి స్థానంలో నిలిచారు. 50 లక్షల ఓట్లు వస్తే అందులో 37 శాతం అమెరికన్లవే. భారత్ నుండి 17 శాతం ఓట్లు వచ్చాయట.. కానీ విచిత్రంగా టైమ్ ఎడిటోరియల్ బోర్డు పాఠకుల అభిప్రాయాన్ని పక్కన పెట్టింది. 
అయోధ్య రామజన్మ భూమి ఉద్యమం భారత దేశ చరిత్రను మలుపు తిప్పింది.. ప్రపంచం దృష్టినీ ఆకర్షించింది. బ్రిటన్ కు చెందిన BBC 1990లో నిర్వహించిన పర్సన్ ఆఫ్ ద ఇయర్ సర్వేలో నాటి బీజేపీ సారధి లాల్ క్రిష్ణ అడ్వానీకి పాఠకులు అత్యధిక సంఖ్యలో ఓటేశారు. కానీ ఇరాక్ నియంత సద్దాం హుస్సేన్ ఎంపికయ్యాడు.. ఇందుకు BBC చూపిన సాకు కూడా విచిత్రంగా అనిపించింది. అడ్వానీకి మద్దతుగా వచ్చిన ఓట్ల తాలూకు పోస్టల్ కవర్లు ఒకే రంగులో ఉన్నాయట..
కొద్ది వారాల క్రితమే భారత దేశం మంగళ్ యాన్ విజయవంతం చేయడం తెలిసిందే.. అంగారక గ్రహంపై తొలి ప్రయత్నంలోనే విజయవంతంగా ఉపగ్రహాన్ని పంపి ప్రపంచ వ్యాప్త ప్రశంసలు అందుకున్నారు భారత శాస్త్రవేత్తలు.. పాపం ఇది THE NEW YARK TIMES పత్రిక వారికి నచ్చలేదు కాబోలు.. ఒక భారతీయ పశువుల కాపరి Elite Space Club డోరు తడుతున్న కార్టూన్ ప్రచురించింది.. అయితే భారతీయుల మనోభావాలు దెబ్బతిన్నాయని గ్రహించి ఆ తర్వాత క్షమాపణలు చెప్పుకుంది..

మనం మొదట చెప్పుకున్న TIME పత్రిక నరేంద్ర మోదీపై మొదటి నుండీ శీతకన్ను వేసినట్లే కనిపిస్తోంది.. గతంలో 2012 మోస్ట్ వాంటెడ్ అంటూ మోదీని చిత్రీకరించే ప్రయత్నం చేసింది.. ఆ తర్వాత కాలంలో ఆయన ఇండియా ప్రధాని కావడం ఖాయమని గ్రహించి, Modi meas business అనే కవర్ పేజీ స్టోరీని కాస్త అటూ ఇటూ అల్లి కవర్ చేసుకుంది.. ఈ ఉదాహరణలన్నీ అంతర్జాతీయ మీడియాకు భారత దేశం, బీజేపీలపై ఉన్న వక్రదృష్టికి అద్దం పడుతున్నాయి..

Wednesday, December 10, 2014

చార్మినార్ కడుతున్న ఫోటో అట.. హహహ్హ..

నిజం నిద్ర లేచేలోపు అబద్దం లోకం చుట్టి వస్తుందంటారు.. ఈ ఫోటో చూశాక అలాగే అనిపించింది.. చార్మినార్ నిర్మిస్తున్న దృశ్యం అంటూ సోషల్ మీడియాలో ప్రచారం పొందుతున్న ఫోటో ఇది.. నిజానికి చార్మినార్ 1591లో నిర్మాణమైంది.. అప్పటికి అసలు ఫోటోగ్రఫీయే పుట్టలేదు.. ఫోటోగ్రపీ ఒక రూపం సంతరించుకున్నది 1820 తర్వాతే.. చార్మినార్ నిర్మించే సమయంలో ఫోటో తీయడమే నిజమైతే పాపం కులీ కుతుబ్ షా ఎందుకు ఫోటో దిగలేదు? ఆలోచించారా?
వాస్తవం ఏమిటంటే 1940 నాటి ఫలక్ నూమా ప్యాలస్ ఏరియల్ వ్యూ ఫోటోను ఎవరో మహానుభావుడు మార్ఫింగ్ చేసి, చార్మినార్ నిర్మిస్తుట్లు మార్చేశాడు.. పాపం వాస్తవం బోధపడక చాలా మంది దీన్ని షేర్ చేసుకుంటున్నారు.. ముఖ్యంగా వాట్స్ఆప్ లో ఈ చిత్రం ఎక్కువగా షేర్ అవుతోంది.. ఇంతలా చర్చకు దారి తీసిన ఆ మార్ఫింగ్ వీరుడికి జోహార్లు..
ఇక్కడ పొందు పరిచిన మార్ఫింగ్ ఫోటో, అసలు ఫోటో జాగ్రత్తగా గమనించండి..

Sunday, December 7, 2014

కేజ్రీ.. ద బిజినెస్ క్లాస్ మాన్..

కేజ్రీవాల్ కో అచ్చే దిన్ గయా.. ఆమ్ ఆద్మీ ఖాస్ అద్మీ బన్ గయా..
ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బిజినెస్ క్లాస్ ప్రయాణం వివాదాస్పదమైంది. ప్రపంచ బ్రాండ్ సమ్మిట్ ఈ ఏడాది అత్యంత ప్రభావిత వ్యక్తిగా కేజ్రీవాల్‌ను ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో ఆయనను సన్మానించేందుకు బ్రాండ్ సమ్మిట్ సంస్థ ఆహ్వానించింది. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆయన దుబాయ్ వెళ్లారు. కేజ్రీవాల్ బిజినెస్ క్లాస్ సీటులో ఉన్న సమయంలో ఓ ప్రయాణీకుడు ఫోటో తీసి, వెంటనే దాన్ని ట్విట్టర్‌లో పెట్టాడు.
నిజానికి అరవింద్ కేజ్రీవాల్ బిజినెస్ క్లాస్లో ప్రయాణించడాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు.. అది ఆయన ఇష్టం.. కానీ రెండు నాల్కల ధోరనే ప్రశ్నార్ధకం.. కేజ్రీవాల్ జనంలో ఉన్నప్పుడు చేసే పనులకు, వ్యక్తిగత ఆచరణలో చూపేదానిలోనే ఉంది తేడా అంతా.. గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పెద్ద కార్లను ఉపయోగించలేదు. పెద్ద ప్రభుత్వ బంగళా తీసుకున్నా విమర్శలు రావడంతో వదులుకున్నారు.
ఓ వైపు పార్టీ విరాళాలు అంటూ తనతో భోజనానికి ప్లేట్ కు రూ.20 వేలు ఖరీదు కట్టే ఈ ఆమ్ ఆద్మీ ఇలా ఖరీదైన విమానయానం చేయడం ఏమిటి? టికెట్టు ధరను ఆయనను పిలిచిన వారే భరించి ఉండొచ్చు.. కానీ సాధారణ ప్రయాణం చేసి, మిగతా సొమ్మును తన పార్టీ విరాళానికి జమ చేయమని వారిని అడిగి ఉండాల్సింది..
ఈ తతంగాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు, కార్యకర్తలు సమర్ధించుకోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది.. సాధారణ ప్రజలు కూడా బిజినెస్ క్లాస్ ప్రయాణం చేయవచ్చట.. కేజ్రీవాల్ దీన్ని నిరూపించారట.. ఇది వింటుంటే తాటి చెట్టు ఎందుకు ఎక్కావయ్యా అని ప్రశ్నిస్తే, దూడ గడ్డి కోసం అని సమాధానం చెప్పినట్లుగా లేదూ?

Saturday, December 6, 2014

గూడు లేని రామచంద్రుడు..

పాపం అయోధ్యలో రాం లాలా దుస్థితి చూడండి.. వివాదాస్పద కట్టడం నేల కూలి నేటికి 22 ఏళ్లు గడచిపోయింది.. మందిరమో, మసీదో అప్పటి దాకా ఉన్న గూడు కూడా పోయింది.. తన జన్మభూమిలో టెంటులో కాందీశీకునిగా మారిపోయాడు శ్రీరామ చంద్రుడు..
కోర్టు పరిధిలో ఉన్న అంశం అంటూ అక్కడ తాత్కాలికంగా అయినా నిర్మాణాలకు అనుమతించడం లేదు.. దశాబ్దాల తర్వాత ఫైజాబాద్ కోర్టు తీర్పు ఇచ్చినా, మళ్లీ అపీల్ కు పోయారు కక్షిదారులు.. ఇక ఇప్పట్లో ఈ కేసు తేలేనా అనిపిస్తోంది.. అయోధ్య కేసు విషయంలో ప్రధాని దివంగత పీవీ నరసింహారావు అనేవారు కొన్ని సమస్యలను కాలమే పరిష్కరించాలని.. ఆయన ఎందుకు అలా అన్నారో అప్పట్లో ఎవరికీ అర్థం కాలేదు.. కాలం గడుస్తున్న కొద్దీ ఉద్రిక్తతలు తగ్గి సమస్యను జనం మరచిపోతారు.. అప్పుడు ప్రశాంతంగా సమస్యను తేల్చేయొచ్చు..
అయోధ్య విషయంలో ఇప్పుడు ఎవరికీ పెద్దగా పట్టింపు లేదు.. గతంలో అక్కడ ఒక ఆలయం తాలూకు ఆనవాళ్లు ఉన్నాయని పురావస్తుశాఖ తవ్వకాల్లో బయటపడ్డ ఆధారాలను కోర్డు కూడా నిర్ధారించింది.. ఈ కేసు ప్రధాన కక్షిదారు కూడా మనసు మార్చుకొని ఆలయ నిర్మాణానికి అంగీకరిస్తున్నారు మరి సమస్యను సాగదీయండం ఎందుకు? భవ్య రామమందిరం నిర్మించడంలో ఆంతర్యం ఎందుకు?.. కొన్ని పార్టీలు సంస్థలు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం అయోధ్య అంశాన్ని సాగదీస్తున్నాయి.. న్యాయస్థానాలు తర్వగా సమస్యను పరిష్కరించాలని భవ్య రామమందిరం మన జీవిత కాలంలోనే సాధ్యం కావాలని కోరుకుందాం.. జై శ్రీరాం..

Tuesday, December 2, 2014

గీతా రహస్యం

భగవద్గీత.. అంటే భగవంతుని గీతం. వేదాలు, ఉపనిషత్తుల్లో ఉన్న సారాంశాన్ని శ్రీకృష్ణుడు 18 అధ్యాయాల్లో భగవద్గీత ద్వారా బోధించాడు.. భక్తి, జ్ఞానము, కర్మ, యోగం, మోక్షం, తత్వం, సన్యాసం తదితర అంశాలు ఇందులో నిక్షిప్తమై ఉన్నాయి.. యుద్ధానికి విముఖుడైన అర్జునిడికి శ్రీకృష్ణుడు చేసిన కర్తవ్య బోధనే భగవద్గీతగా ప్రసిద్ధికెక్కింది..
భగవద్గీతను కేవలం ఆధ్యాత్మిక గ్రంధంగా చూస్తే దాన్ని మనం సరిగ్గా అర్ధం చేసుకోనట్లే.. ఇప్పుడు మనం పర్సనాలిటీ డెవలప్మెంట్ అని గొప్పగా చెప్పుకుంటున్నాం.. కానీ భగవద్గీత కూడా అలాంటి కోర్సే అని చెప్పక తప్పదు.. ఉత్తమ మానవునిగా ఎదిగేందుకు మార్గాన్ని భగవద్గీత చూపుతుంది..
భగవద్గీత అంటే చనిపోయినప్పుడు వినిపించే ఘంటసాల సంగీతం అనే భావన చాలా మందిలో ఏర్పడటం దురదృష్టకరం.. ఆ సమయంలో ఆధ్మాత్మిక చింతన, ఉపశమనం కోసం భగవద్గీతను వినడంలో ఎలాంటి తప్పులేదు.. కానీ నిత్య జీవితంలో అన్ని సందర్భాల్లోనూ మనం గీతా సారాంశాన్ని తెలుసుకొని ఆచరించాలి..
మరి కొందరు భవవద్గీతను పదవీ విరమణ తర్వాత కాలక్షేపం కోసం చదువుకుంటారు.. కానీ జీవిత చరమాంకంలో మాత్రమే గీతను చదువుకోవడం వల్ల ఏం లాభం? ముందుగానే చదువుకుంటే వారు తమ జీవితాలను మరింత ఫలవంతంగా తీర్చి దిద్దుకునేవారు కదా?
భగవద్గీత కేవలం హిందువులదేనా?.. శ్రీకృష్ణుడు ఎక్కడా అందులో చెప్పలేదు. మానవ జీవితాన్ని మార్చేసిన ఆవిష్కరణలు, సిద్దాంతాలు ఒక మతానికే పరిమితం కాలేదు కదా? మరి కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆవిర్భవించిన గీతాన్ని ఒక మతంతో ముడి పెట్టడం సమంజసమేనా? హిందుత్వం ఒక జీవన విధానం.. భగవద్గీత ఈ ధర్మాన్ని ఆచరించే వారి జీవితాన్ని పరిపూర్ణం చేస్తుంది.. అన్య మత విశ్వాసులకు ఈ అదృష్టం ఎందుకు దక్కరాదు?
నేడు గీతాజయంతి.. మార్గశీర్ష మాసం శుద్ధ ఏకాదశి రోజున భగవద్గీత ఆవిర్భవించింది.. ఈ శుభ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు..