Thursday, December 25, 2014

భారత రత్నకు జన్మదిన శుభాకాంక్షలు

పార్లమెంట్లో ఓ కొత్త ప్రతిపక్ష సభ్యుడి వాక్పటిమను చూసి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ ముగ్దుడయ్యారు.. వివిధ అంశాలపై ఆయన అవగాహణను, అసాధారణ నైపుణ్యాన్ని చూసి ప్రశంసించలేకుండా ఉండలేకపోయారు.. ఈ యువకుడు ఏనాటికైనా ఈ దేశ ప్రధాని అవుతాడని నెహ్రూ ఊహించారు.. 1957 నాటి మాట ఇది.. ఆ కొత్త సభ్యుడు బలరాంపూర్ నియోజకవర్గం నుండి లోక్ సభకు ఎన్నికైన అటల్ బిహారీ వాజపేయి.. నెహ్రూ అంఛనా భవిష్యత్ లో నిజమైంది..
దేశంలో కాంగ్రెస్ పతనం తర్వాత కిచిడీ సంకీర్ణ ప్రభుత్వాల వైఫల్యం తర్వాత దేశ ప్రజలు బీజేపీని బొటాబొటీ మెజారిటీతో గెలిపించారు.. ఇలాంటి సమయంలో ప్రధానమంత్రి అయిన వాజపేయి భాగస్వామ్య పక్షాలను ఒప్పిస్తూ సంకీర్ణ ప్రభుత్వాన్ని విజయవంతంగా నడిపారు.. అటల్జీ ప్రధానిగా ఉన్న సమయంలో దేశ అభివృద్దికి కొత్త బాటలు పడ్డాయి.. స్వర్ణ చతుర్భుజి రహదారుల లాంటి మౌళిక సదుపాయాలను విస్తరించారు. సంస్కరణలను అమలు చేయడంలో విజయం సాధించారు.. దేశం ఆర్థికంగా బలోపేతమైంది..  పోక్రాన్ అణుపరీక్ష ద్వారా అగ్రరాజ్యాలకు సవాలు విసిరారు. భారత దేశ శాస్త్ర సాంకేతిక సత్తాను ప్రపంచానికి చాటారు.. కయ్యానికి కాలు దువ్విన పాకిస్తాన్ కు కార్గిల్ యుద్దంలో గట్టి బుద్ది చెప్పారు..
అటల్ బిహారీ వాజపేయి గొప్ప రాజనీతిజ్ఞుడు మాత్రమే కాదు.. ఆయన గొప్ప కవి, వక్త కూడా.. హిందీలో అటల్జీ రాసిన కవిత్వం, వ్యాసాలు పండితుల ప్రశంసలందుకున్నాయి.. ఆయన అనర్ఘళ  ప్రసంగాలకు జనం మంత్ర ముగ్దులైపోయేవారు.. అసమాన ప్రతిభావంతుడైన వాజపేయి ప్రసంగాన్ని ఆలకించేందుకు పార్లమెంట్లో అన్నిపక్షాల సభ్యులు ఆసక్తిని చూపించేవారు.. ఆజన్మ బ్రహ్మచారిగా దేశ సేవకు అంకితమైన అటల్జీ వ్యక్తిత్వం పార్టీలకు అతీతంగా అందరినీ మిత్రులుగా మార్చింది..  

సుపరిపాలన అంటే ఏమిటో ఆచరణలో చూపించారు అటల్ బిహారీ వాజపేయి.. అందుకే అటల్జీ జన్మదినాన్ని సుపరిపాలన దినోత్సవంగా ప్రకటించారు ప్రధాని నరేంద్ర మోదీ.. వాజపేయి దేశానికి చేసిన సేవలకు గుర్తింపుగా భారతరత్న అవార్డును ప్రకటించారు.. వాజపేయిని అలంకరిచడంతో భారత రత్నానికి విలువ పెరిగింది.. అటల్జీకి సంపూర్ణ ఆయురారోగ్యాలు కలగాలని కోరుకుందాం..

No comments:

Post a Comment