Tuesday, December 2, 2014

గీతా రహస్యం

భగవద్గీత.. అంటే భగవంతుని గీతం. వేదాలు, ఉపనిషత్తుల్లో ఉన్న సారాంశాన్ని శ్రీకృష్ణుడు 18 అధ్యాయాల్లో భగవద్గీత ద్వారా బోధించాడు.. భక్తి, జ్ఞానము, కర్మ, యోగం, మోక్షం, తత్వం, సన్యాసం తదితర అంశాలు ఇందులో నిక్షిప్తమై ఉన్నాయి.. యుద్ధానికి విముఖుడైన అర్జునిడికి శ్రీకృష్ణుడు చేసిన కర్తవ్య బోధనే భగవద్గీతగా ప్రసిద్ధికెక్కింది..
భగవద్గీతను కేవలం ఆధ్యాత్మిక గ్రంధంగా చూస్తే దాన్ని మనం సరిగ్గా అర్ధం చేసుకోనట్లే.. ఇప్పుడు మనం పర్సనాలిటీ డెవలప్మెంట్ అని గొప్పగా చెప్పుకుంటున్నాం.. కానీ భగవద్గీత కూడా అలాంటి కోర్సే అని చెప్పక తప్పదు.. ఉత్తమ మానవునిగా ఎదిగేందుకు మార్గాన్ని భగవద్గీత చూపుతుంది..
భగవద్గీత అంటే చనిపోయినప్పుడు వినిపించే ఘంటసాల సంగీతం అనే భావన చాలా మందిలో ఏర్పడటం దురదృష్టకరం.. ఆ సమయంలో ఆధ్మాత్మిక చింతన, ఉపశమనం కోసం భగవద్గీతను వినడంలో ఎలాంటి తప్పులేదు.. కానీ నిత్య జీవితంలో అన్ని సందర్భాల్లోనూ మనం గీతా సారాంశాన్ని తెలుసుకొని ఆచరించాలి..
మరి కొందరు భవవద్గీతను పదవీ విరమణ తర్వాత కాలక్షేపం కోసం చదువుకుంటారు.. కానీ జీవిత చరమాంకంలో మాత్రమే గీతను చదువుకోవడం వల్ల ఏం లాభం? ముందుగానే చదువుకుంటే వారు తమ జీవితాలను మరింత ఫలవంతంగా తీర్చి దిద్దుకునేవారు కదా?
భగవద్గీత కేవలం హిందువులదేనా?.. శ్రీకృష్ణుడు ఎక్కడా అందులో చెప్పలేదు. మానవ జీవితాన్ని మార్చేసిన ఆవిష్కరణలు, సిద్దాంతాలు ఒక మతానికే పరిమితం కాలేదు కదా? మరి కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆవిర్భవించిన గీతాన్ని ఒక మతంతో ముడి పెట్టడం సమంజసమేనా? హిందుత్వం ఒక జీవన విధానం.. భగవద్గీత ఈ ధర్మాన్ని ఆచరించే వారి జీవితాన్ని పరిపూర్ణం చేస్తుంది.. అన్య మత విశ్వాసులకు ఈ అదృష్టం ఎందుకు దక్కరాదు?
నేడు గీతాజయంతి.. మార్గశీర్ష మాసం శుద్ధ ఏకాదశి రోజున భగవద్గీత ఆవిర్భవించింది.. ఈ శుభ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు.. 

No comments:

Post a Comment