Monday, December 29, 2014

దండగమారి 31

డిసెంబర్ 31.. క్యాలండర్లో చివరి తేదీ.. అలాగే జనవరి 1 క్యాలండర్లో మొదటి తేదీ మాత్రమే.. ఈ రెండు తేదీలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరమే లేదు.. మీ జీవితాల్లో కొత్తగా వచ్చే మార్పేమీ ఉండదు.. పోయేదీ ఏమీ లేదు.. గోడకు కొత్త క్యాలండర్ తగిలించుకోండి.. డైరీ రాసే అలవాటు ఉంటే కొనుక్కోండి.. లేదంటే ఎవరైనా గిఫ్ట్ ఇస్తే తీసుకోండి..
చాలా మందికి డిసెంబర్ 31 తేదీని తలచుకోగానే ఎక్కడలేని పూనకం వచ్చేస్తోంది.. తాగాలి, తినాలి, చిందులేయాలి, రోడ్లపై హ్యాపీ న్యూ ఇయర్ అంటూ వెర్రి కేకలు వేస్తూ ర్యాష్ డ్రైవింగ్ చేయాలి.. ఇదీ వారి సైకాలజీ.. ఇదెక్కడి సంస్కృతి? ఇందు వల్ల వారికి కాని, సమాజానికి గానీ ఏమైనా మేలు జరుగుతోందా? ఆలోచించండి.. ఎందుకీ పనికి మాలిన వేడుకలు.. ఈ వేడుకలు జరుపుకోవడం వల్ల లాభ పడేది మద్యం అమ్మకాల వల్ల వైన్ షాపులు, బార్ల ఓనర్లు.. ప్రభుత్వానికి ఖజానా నిండుతుంది.. క్లబ్బులు, హోటళ్లకు, బేకరీ షాపుల వాలకు ఆదాయం.. చమురు వదిలేది మాత్రం మీకే.. ఒళ్లు గుళ్లయ్యేదీ మీకే.. ఉత్సాహం శృతి మించితే విషాదం కూడా..
జనవరి 1న న్యూ ఇయర్ జరుపుకోవడం తప్పా, ఒప్పా అని నేను చర్చించదలచుకోలేదు.. కానీ అర్థం లేని వేడుకల కోసం కాలాన్ని, డబ్బును వృధా ఎందుకు చేసుకోవడం?.. అంతగా ఉత్సహంగా ఉంటే అందరికీ శుభం కలగాలని మీ ఇష్ట దైవాన్ని మొక్కుకోండి.. పనికి మాలిన సంబరాల కోసం పెట్టే ఖర్చును సామాజిక సేవా కార్యక్రమాల కోసం ఉపయోగించండి.. ఇందు వల్ల కాస్త పుణ్యం, పురుషార్థం ఉంటుంది.. 

No comments:

Post a Comment