Saturday, December 20, 2014

వందేళ్ల క్రితమే గాడ్గేబాబా స్పచ్ఛ అభియాన్..

స్వచ్ఛ్ భారత్ అభియాన్.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుణ్యమా అని దేశమంతా మార్మోగుతోంది.. నాయకులు, సెలబ్రటీలు చీపుర్లు పట్టి వీధులూడుస్తూ ఫోజులిచ్చేస్తున్నారు.. ఒక మంచి ఉద్దేశ్యంతో చేపట్టిన కార్యక్రమం ఇలా పబ్లిసిటీ జిమ్మిక్కులకే పరిమితం అవుతోందా అనే బాధ మనసులో కలుగుతోంది.. ప్రధాని మోదీ ఎంతో ప్రాధాన్యత ఇస్తున్న ఈ ఉద్యమం ఎంత వరకూ ఫలిస్తుంది అనే చర్చను పక్కన పెట్టి వందేళ్ల క్రితం స్వచ్ఛతా ఉద్యమాన్ని జనం ముందుకు తెచ్చిన మహనీయున్ని గుర్తు తెచ్చుకుందాం..
మహారాష్ట్రలోని అమరావతి జిల్లా షేన్ గావ్ లో జన్మించారు గాడ్గేబాబా.. బాబా అసలు పేరు దేవూజీ.. 30వ ఏటా భార్యా పిల్లలు అనే బంధాన్ని తెంచుకున్న బాబా, జీవితాంతం సన్యాసిగా జీవించి ఈ పదానికి నిజమైన అర్థాన్ని ఆచరణలో చూపించారు.. మూఢ నమ్మకాలు మానేయమని, కులం పేరుతో సాటి మనిషిని కించపరచొద్దని మనుషులంతా ఒకటే అని ప్రబోధించేవారు బాబా.. ఆలయాల్లో పాటలు, కీర్తనల పాడుతూ అందరినీ ఆకట్టుకునేలా ఆధ్యాత్మిక, నైతిక, ఆచరనీయమైన విషయాలను బోధించేవారు..
గాడ్గేబాబా చేపట్టిన అతిపెద్ద ఉద్యమ  స్వచ్ఛతా అభియాన్.. రంగుల గుడ్డ పేలికల బట్టలతో కనిపించే బాబా తలపై మట్టి చిప్ప కనిపించేది.. చేతిలో చీపురు పట్టుకొని కనిపించేవారు.. గాడ్గేబాబా ఏ ఊరికి వెళ్లినా అక్కడి వీధులు, ఆలయాలను శభ్రంగా ఊడ్చేవారు.. పొలం పనులు, మట్టిపని, కుమ్మరిపని చేసి పొట్ట నింపుకునేవారు బాబా.. ఎవరినీ చేయిచాచి అడగలేదు.. దేవాలయాల చెంతో, ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ పడుకునేవారు.. చివరకు రోడ్డు మీదే దేహం చాలించారు.
ఇంత నిరాడంబరంగా జీవించిన గాడ్గేబాబా ఒక వ్యక్తి సమాజానికి పనికి వచ్చే పనులు ఎలా చేయవచ్చే చేసి చూపించారు.. అనాధాశ్రమాలు, పాఠశాలలు, బాలల వసతి గృహాలు, ధర్మశాలలు ప్రజల సహకారంతో నిర్మించారు.. నేటి తరం వారికి తెలియని విషయం ఏమిటంటే మహాత్మాగాంధీ, బాబా సాహెబ్ అంబేద్కర్ లాంటి ప్రముఖులకు గాడ్గేబాబా స్పూర్తినిచ్చారు. బాబాను అంబేద్కర్ తన గురువుగా చెప్పుకునేవారు..

గాడ్గేబాబా జన్మించింది ఫిబ్రవరి 23, 1876న.. పరమపదించిన తేదీ డిసెంబర్ 20, 1956, అంటే సరిగ్గా ఇదే రోజు.. స్వచ్ఛ్ భారత్, కుల రహిత సమాజం కోసం వందేళ్ల క్రితమే ఉద్యమించారు బాబా.. వీటిని విజయవంతం చేసి ఆచరణలో చూపించడమే మనం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి..

No comments:

Post a Comment