Sunday, December 7, 2014

కేజ్రీ.. ద బిజినెస్ క్లాస్ మాన్..

కేజ్రీవాల్ కో అచ్చే దిన్ గయా.. ఆమ్ ఆద్మీ ఖాస్ అద్మీ బన్ గయా..
ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బిజినెస్ క్లాస్ ప్రయాణం వివాదాస్పదమైంది. ప్రపంచ బ్రాండ్ సమ్మిట్ ఈ ఏడాది అత్యంత ప్రభావిత వ్యక్తిగా కేజ్రీవాల్‌ను ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో ఆయనను సన్మానించేందుకు బ్రాండ్ సమ్మిట్ సంస్థ ఆహ్వానించింది. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆయన దుబాయ్ వెళ్లారు. కేజ్రీవాల్ బిజినెస్ క్లాస్ సీటులో ఉన్న సమయంలో ఓ ప్రయాణీకుడు ఫోటో తీసి, వెంటనే దాన్ని ట్విట్టర్‌లో పెట్టాడు.
నిజానికి అరవింద్ కేజ్రీవాల్ బిజినెస్ క్లాస్లో ప్రయాణించడాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు.. అది ఆయన ఇష్టం.. కానీ రెండు నాల్కల ధోరనే ప్రశ్నార్ధకం.. కేజ్రీవాల్ జనంలో ఉన్నప్పుడు చేసే పనులకు, వ్యక్తిగత ఆచరణలో చూపేదానిలోనే ఉంది తేడా అంతా.. గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పెద్ద కార్లను ఉపయోగించలేదు. పెద్ద ప్రభుత్వ బంగళా తీసుకున్నా విమర్శలు రావడంతో వదులుకున్నారు.
ఓ వైపు పార్టీ విరాళాలు అంటూ తనతో భోజనానికి ప్లేట్ కు రూ.20 వేలు ఖరీదు కట్టే ఈ ఆమ్ ఆద్మీ ఇలా ఖరీదైన విమానయానం చేయడం ఏమిటి? టికెట్టు ధరను ఆయనను పిలిచిన వారే భరించి ఉండొచ్చు.. కానీ సాధారణ ప్రయాణం చేసి, మిగతా సొమ్మును తన పార్టీ విరాళానికి జమ చేయమని వారిని అడిగి ఉండాల్సింది..
ఈ తతంగాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు, కార్యకర్తలు సమర్ధించుకోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది.. సాధారణ ప్రజలు కూడా బిజినెస్ క్లాస్ ప్రయాణం చేయవచ్చట.. కేజ్రీవాల్ దీన్ని నిరూపించారట.. ఇది వింటుంటే తాటి చెట్టు ఎందుకు ఎక్కావయ్యా అని ప్రశ్నిస్తే, దూడ గడ్డి కోసం అని సమాధానం చెప్పినట్లుగా లేదూ?

No comments:

Post a Comment