Monday, January 23, 2017

జననమే తప్ప మరణం లేని మహా నేత

స్వాతంత్ర్యం అంటే బిచ్చమడిగి తీసుకునేది కాదు.. పోరాడి సాధించుకోనే హక్కు..’ ‘నేను మీకు ఆకలి. దాహం, కష్టం, మృత్యువు మాత్రమే ఇవ్వగలరు.. నాకు మీ రక్తాన్ని ఇవ్వండి.. మీకు స్వాతంత్య్రాన్ని ఇస్తాను.. ఈ మాటలు చాలు ఆయన వజ్ర సంకల్పం గురుంచి చెప్పడానికి.. బ్రిటిష్ వారి కబంద హస్తాల నుండి భారత దేశానికి స్వాతంత్ర్యం ఇప్పించానికి ఎందరో మహనీయులు, యోధులు తమ తమ మార్గాల్లో పోరాటం సాగించారు.. అందరూ నాయకులే(నేతలే).. కానీ దేశ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నేతాజీ ఒకరే.. ఆయనే సుభాష్ చంద్రబోస్..
చరిత్ర తిరిగేస్తే గొప్ప వ్యక్తులందరి జనన మరణాలు కనిపిస్తాయి. కానీ జననమే తప్ప మరణం నమోదు కాని వ్యక్తి ఒక్కరే. ఆ అరుదైన గౌరవం సుభాష్ చంద్రబోస్ సొంతం. 1897లో జనవరి 23వ తేదీన కటక్ పట్టణంలో ప్రభావతి దేవి, జానకీనాధ్ బోస్ దంపతులకు జన్మించారు సుభాష్ చంద్రబోస్. జానకీనాధ్ బోస్ పేరొందిన న్యాయవాది, జాతీయవాది. తండ్రి ప్రభావం సుభాష్ పై ఎక్కువగా ఉండేది. బోస్ విద్యాభ్యాసం కలకత్తాలోని స్కాటిష్ చర్చ్ కాలేజీ, ఫిట్జ్ విలియమ్ కాలేజీలో సాగింది ఆ తర్వాత కేంబ్రిడ్జ్ విశ్వ విద్యాలయంలో ఉన్నత విద్యాభ్యాసం చేశారు.
 


సివిల్ సర్వీసును వదలి స్వాతంత్ర్య సమరంలోకి..
చిన్నప్పటి నుండి చదువుల్లో చురుగ్గా ఉండే సుభాష్ చంద్రబోస్ 1920లో ఇండియన్ సివిల్ సర్వీసు(ఐసీఎస్) పరీక్షకు హాజరై నాలుగో ర్యాంకు సాధించారు. బ్రిటిష్ పాలనలో ఆనాటి దేశ పరిస్థితులు బోసుబాబును ఎంతో కలిచివేశాయి. దీంతో ప్రతిష్టాత్మకమైన ఐసీఎస్ నుండి వైదొలిగారు స్వాతంత్ర్య పోరాటంలోకి దిగారు.  భారత జాతీయ కాంగ్రెస్ లో సుభాష్ చంద్రబోస్ కీలక పాత్ర పోశించారు.. మహాత్మా గాంధీ సూచన మేరకు చిత్తరంజన్ దాస్ తో కలసి బెంగాల్ లో సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ముమ్మరం చేశారు. 11 మార్లు జైలుకు వెళ్లడంతో పాటు ఎన్నోసార్లు గృహ నిర్భందాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది.
సుభాష్ చంద్రబోస్ తనదైన వ్యక్తిత్వం, నాయకత్వ లక్షణాలతో అందరి మన్ననలను పొందారు. కాంగ్రెస్ లో కీలక నాయకునిగా గుర్తింపు పొందారు. ఈ దశలో 1938లో జరిగిన కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎన్నికల్లో గాంధీజీ సూచించిన పట్టాభి సీతారామయ్యపై పోటీ చేసి విజయం సాధించారు సుభాష్ బాబు. పట్టాభి సీతారామయ్య ఓటమిని తన పరాజయంగా భావించారు గాంధీజీ.

అహింస చాలదు.. పోరాడి సాధించాల్సిందే..
సుభాష్ చంద్రబోస్ కు మహాత్మాగాంధీతో భిన్నాభిప్రాయాలు ఉండేవి. అయినా ఆయన్ని మహానాయకునిగా అంగీకరించేవారు బోసు బాబు. గాంధీజీ సూచించిన అహింసా మార్గంతోనే స్వరాజ్యం వస్తుందనే వాదనతో విబేధించారు సుభాష్ చంద్రబోస.. బ్రిటిష్ వారిని దేశం నిండి తరిమి కొట్టడానికి సాయుధపోరాటం అవసరమని వాదించేవారు. గాంధీజీతో సిద్దాంతపరమైన అభిప్రాయ బేధాలు, వర్గపోరు కారణంగా కాంగ్రెస్ పార్టీలో ఇమడలేని పరిస్థితి వచ్చింది. దీంతో ఆ పార్టీకి రాజీనామా చేసి ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని స్థాపించారు సుభాష్ చంద్రబోస్.
1939లో రెండో ప్రపంచ యుద్దం వచ్చింది. భారతీయ నాయకులతో సంప్రదించకుండానే ఇండియాను యుద్ద రంగంలోకి దింపారు బ్రిటిష్ వారు.. దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టారు బోసుబాబు. ప్రభుత్వం అతన్ని అరెస్టు చేసి జైలుకు పంపింది. ఆ తర్వాత విడుదల చేసి గృహ నిర్భందంలో పెట్టింది. ఇలా శాంతియుత పోరాటాలతో ఫలితం ఉండదని గ్రహించిన సుభాష్ చంద్రబోస్ దేశం వదిలి వెళ్లి బయటి నుండి పోరాటం చేయాలని నిర్ణయానికి వచ్చారు.

జ్ఞాతవాసం..
శత్రువు శత్రువు మిత్రుడు అవుతాడంటారు. బ్రిటిస్ వారిని దేశం నుండి తరిమి కోట్టాలంటే వారి శత్రువుల సహకారం తీసుకోవాలని భావించారు బోసుబాబు. ఇందులో భాగంగానే దేశం వెలుపలికి వెళ్లి ప రాటం చేయాలని కృత నిశ్చయానికి వచ్చారు. సుభాష్ చంద్రబోస్ జీవితంతో పాటు దేశ స్వాతంత్ర్యోద్యమాన్ని మలుపుతిప్పింది ఈ అజ్ఞాతవాసం. 1941 జనవరి19న బ్రిటిష్ ప్రభుత్వ వేగుల కన్నుగప్పి పఠాన్ వేషంలో తన ఇంటి నుండి బయట పడ్డారు సుభాష్ బాబు. తన మేనల్లు శిశిర్ తో కలిసి ఆఫ్ఘనిస్థాన్ లోని పెషావర్, కాబూల్ మీదుగా సోవియట్ సరిహద్దులకు చేరారు. మస్కో, ఇటలీ మీదుగా జర్మన్ రాజధాని బెర్లిన్ వెళ్లారు. అక్కడ హిట్లర్ ను కలుసుకున్నారు. యూరోప్ లోని భారతీయ యుద్ద ఖైదీలందరినీ సమీకరించారు సుభాష్ చంద్రబోస్.
యూరోప్ లో ఫ్రీ ఇండియా సెంటర్ ప్రారంభించారు సుభాష్.. దీని ఆధ్వర్యంలో ఆజాద్ హింద్ రేడియో ప్రారంభించారు. ప్రవాసంలోని భారతీయుల్లో స్వాతంత్ర్య ఆకాంక్షను నెలకొల్పడంలో ఇది ఎంతో దోహదం చేసింది. సుభాష్ చంద్రబోస్ తన తదుపరి కార్యాచరణలో భాగంగా జలాంతర్గామి ద్వారా ప్రయాణం చేసి జపాన్ వెళ్లారు సుభాష్ చంద్రబోస్. ప్రవాసంలో ఆజాద్ హింద్ ఫౌజ్ ను ఏర్పాటు చేసి బిట్రిష్ ప్రభుత్వంపై యుద్దం ప్రకటించారు. ఇందుకు జర్మనీ, జపాన్ దేశాల సహకారం తీసుకున్నారు.

ఆజాద్ హిందూ ఫౌజ్..
బ్రిటిష్ వారిపై సాయుధ పోరాటం చేసేందుకు జపాన్ సహకారంతో మోహన్ సింగ్ దేవ్ భారత జాతీయ సైన్యం (ఆజాద్ హిందూ ఫౌజ్) ప్రారంభించారు. ఆ తర్వాత కాలంలో కొన్ని పరిణామాల కారణంగా దీని కార్యకలాపాలు ఆగిపోయాయి. సుభాష్ చంద్రబోస్ రాకతో పగ్గాలను ఆయనకు అప్పగించారు. 1943లో సింగపూర్ లో ఆజాద్ హిందూ ఫౌజ్ బాధ్యతలు స్వీకరించిన సుభాష్ చంద్రబోస్ స్వతంత్ర భారత ప్రభుత్వాన్ని ప్రకటించారు. ఈ ప్రభుత్వం జారీ చేసిన కరెన్సీ, తపాళా బిళ్లలను జపాన్, జర్మనీ, ఇటలీ, క్రొయేషియా, థాయ్ లాండ్, బర్మా, ఫిలిఫీన్స్ కూడా ఆమోదించడం విశేషం..
1944లో బర్మాలో ఆజాద్ హిందూ ఫౌజ్ నిర్వహించిన ర్యాలీలో సుభాష్ చంద్రబోస్ చేసిన మీ రక్తాన్ని ధారబోయండి.. మీకు స్వాతంత్ర్యాన్ని ఇస్తాను.. ప్రసంగం భారతీయులను ఉత్తేజితులను చేసింది.. బోసుబాబు పిలుపుతో చాలా మంది యువకులు ఆయన సైన్యంలో చేరారు. బ్రిటిష్ వారిపై పోరాటానికి జపాన్, జర్మనీల సహకారం తీసుకునే విషయంలో సుభాష్ చంద్రబోస్ నిర్ణయాన్ని కాంగ్రెస్ నాయకులతో పాటు చాలా మంది విమర్శకులు తప్పు పట్టారు. కానీ బోసు బాబు వ్యూహాత్మకంగా తీసుకున్న ఈ సాహసోపేత నిర్ణయం భారతీయులందరి అభిమానాన్ని చూరగొంది. నేతాజీ అనే బిరుదును తెచ్చిపెట్టింది..

విమాన ప్రమాద మిస్టరీ
ఆజాద్ హిందూ ఫౌజ్ ద్వారా బ్రిటిష్ వారికి కంటిమీద నిద్ర లేకుండా చేసిన సుభాష్ చంద్రబోస్ ఆ తర్వాత కనిపించకుండా పోవడం మిస్టరీగా మారింది. 1945 ఆగస్టు 18న ఆయన ప్రయాణిస్తున్న విమానం తైవాన్ లో కుప్పకూలిందని చెబుతారు. ఈ ప్రమాదంలో బోసుబాబు మరణించారని చెబుతున్నా, ఇంత వరకూ సరైన ఆధారాలు దొరకలేదు. స్వత్రంత్ర భారత ప్రభుత్వం దీనిపై ఎన్నో విచారణలు వేసినా వాస్తవం తేలలేదు, సుభాష్ చంద్రబోసును సోవియట్ యూనియన్ బందీని చేసి సైబీరియా పంపగా అక్కడ మరణించారని మరో కథనం. ఇది కూడా నిర్ధారణ కాలేదు. జపాన్ లోని రెంకోజీ ఆలయంలో బోసు చితాభస్మం ఉందని చెబుతారు. అది ఆయనది కాదని కూడా తేలిపోయింది.
విమాన ప్రమాదంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణించలేదని స్పష్టమైనా, ఆయన అదృష్యం మిస్టరీగానే మిగలిపోయింది. బోసు బాబు కొంత కాలం అయోధ్యలో అపరిచిత సాధువుగా జీవించి మరణించారని కథనాలు ఉన్నాయి. ఇవి అవాస్తవమని దర్యాప్తులో తేలిపోయింది.. నేతాజీ సుభాష్ చంద్రబోసు మరణించారనే వార్తలను ఆయన కుటుంబ సభ్యులు కూడా పలుమార్లు తోసిపుచ్చారు..

నేతాజీపై నెహ్రూ నిఘా పెట్టారా?
1947 ఆగస్టు 15 భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది.. జవహర్ లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.. వాస్తవానికి ఆ స్థానంలో ఉండాల్సింది నేతాజీ సుభాష్ చంద్రబోస్.. కోట్లాది మంది భారతీయుల హృదయాల్లో గూడు కట్టుకున్న బోసుబాబు అదృశ్యం వెనుకు కాంగ్రెస్ పార్టీ హస్తం ఉందనే ఆరోపణలు ఉన్నాయి.. నేతాజీ కారణంగా తమకు ఎప్పటికైనా ముప్పు ఉందని నెహ్రూ తదితర నేతలు నిరంతరం ఆందోళనతో ఉండేవారు..  బోసు కుటుంబంపై నెహ్రూ ప్రభుత్వం నిఘా పెట్టడం ఇందుకు బలం చేకూరుస్తోంది.. నెహ్రూ మరణానంతరం కూడా ఈ నిఘా కొనసాగింది.. సుభాష్ చంద్రబోస్ జ్ఞాతానికి సంబంధించిన వాస్తవాలు వారికి తెలిసే ఉంటాయనే అనుమానాలు ఉన్నాయి..
          నేతాజీ విదేశాల్లో ఉన్న సమయంలో బ్రిటిష్ ప్రభుత్వ ఏజెంట్లు ఆయనను హతమార్చేందుకు కుట్ర పన్నారనే ఆరోపణలున్నాయి..  కొద్ది నెలల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నేతాజీకి సంబంధించిన పలు కీలక జ్ఞాత పత్రాలను నేతాజీ కుటుంబ సభ్యులకు అందజేశారు.. అయితే అందులో ఏముందో పూర్తి స్థాయిలో స్పష్టం కాలేదు..
ఇంతకీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఏమైనట్లు?.. ఆయన ఎక్కడికీ పోలేదు.. కోట్లాది మంది భారతీయుల హృదయాల్లోనే చిరస్థాయిగా ఉంటారు.

(నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి జనవరి 23 సందర్భంగా జాగృతి వార పత్రికలో ప్రచురితం)

Friday, January 20, 2017

అమెరికా అధ్యక్షునిగా హిందువు?.. సాధ్యమేనా?

అమెరికాకు ఏనాటికైనా నల్ల జాతీయుడు అధ్యక్షుడు కావాలని మార్టిన్ లూథర్ కింగ్ కలగన్నాడు.. 1963లో వాషింగ్టన్ లింకన్ స్మారక స్థూపం దగ్గర నాకో కల ఉంది..అంటూ ఆయన చేసిన ఉపన్యాసం చారిత్రికం.. అమెరికాకు బరాక్ ఒబామా అధ్యక్షుడు కావడంతో లూథర్ కింగ్ స్వప్నం నెరవేరింది..

నాకూ ఒక కల ఉంది.. అమెరికాకు ఏనాడైనా భారతీయ సంతతివాడు అధ్యక్షుడు కావాలని.. అమెరికా వలస దేశం.. వలస వెళ్లిన ప్రజలు స్వతంత్రం ప్రకటించుకొని ఆ దేశాన్ని అగ్ర రాజ్యంగా తీర్చి దిద్దారు.. అమెరికాకు కొద్ది ధశాబ్దాలుగా పెద్ద సంఖ్యలో వలస వెళ్లిన భారతీయులు ఆ దేశాన్ని సుసంపన్నం చేయడంలో కీలక పాత్ర పోశిస్తున్నారు.. మరి భవిష్యత్తులో ప్రవాస భారతీయుడు అమెరికాకు అధ్యక్షుడు కావడం న్యాయమే కదా?..
అమెరికా అధ్యక్ష పదవి నుండి వైదొలగుతున్న ఒబామా తుది ప్రసంగాన్ని గుర్తు చేసుకోండి.. అమెరికాలో జాతి వైవిధ్యాన్నికాపాడితే ఒక మహిళ.. ఒక హిందువు.. ఒక యూదు.. ఒక నాటినో తప్పకుండా అధ్యక్షులవుతారు.. అన్నారు ఒబామా.. ఆ వాక్కులు ఫలించాలని కోరుకుందాం.. అమెరికాకు భారతీయుడు అధ్యక్షుడు కావాలని నేను కోరుకున్నాడు.. ఒబామా వాక్కు ఫలించి ఆ భారతీయుడు హిందువే అయితే ఇంకా సంతోషం..

Sunday, January 15, 2017

దేశ ఔన్నత్యం జవాను చేతిలోనే..

కొద్ది వారాల క్రితం సరిహద్దుల్లో నిత్యం అలజడి సృష్టిస్తున్న పాకిస్థాన్ భూభాగంపై మన వీర జవాన్లు ఆకస్మిక దాడులు చేయడం దేశ ప్రజల్లో భావోద్వేగాలను నింపడంతో పాటు ఎంతో ఆనందాన్ని కలిగించింది.. ఆ సమయంలో ఒక జవాను పాకిస్థాన్ ను హెచ్చరిస్తూ చేసిన చేసిన ప్రసంగం వీడియో సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకుంది.. దేశ ప్రజల ప్రశంసలను అందుకుంది..
ఇటీవల సరిహద్దుల్లో కాపాలా కాస్తున్న మరో జవాను తమకు అధికారులు సరైన ఆహారం పెట్టడం లేదంటూ సోషల్ మీడియాలో పెట్టిన వీడియో కూడా అంతే సంచలనం సృష్టించింది.. దీనిని సైన్యం కూడా తీవ్రంగానే పరిగణించింది.. ఇక మీదట ఇలాంటి పనులు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది..
ఇక్కడ మొదటి జవాను మన సైన్యం సత్తాను చాటి దేశ ప్రతిష్టను పెంచాడు.. రెండో సైనికుడు సాధారణ సమస్యను భూతద్దంలో చూపించి దేశ ప్రతిష్టను దిగజార్చాడు..
సైన్యం అంటే ప్రజలకు, ముఖ్యంగా భారత దేశంలో విపరీతమైన అభిమానం ఉంటుంది.. క్లిష్టమైన వాతావరణంలో రాత్రింబవళ్లు దేశ సరిహద్దులను కాపాడే సైనికులు అంటే గౌరవం, ఆరాధనా భావం భారతీయులకు కాస్త ఎక్కువే.. సైనికులను హీరోలుగా చూస్తాం.. ప్రాణాలకు తెగించి తీవ్రవాదులు, శత్రువులతో పోరాడి ప్రాణ త్యాగాలు చేసిన జవాన్లకు ఎంతో ఉద్వేగంతో జేజేలు పలుకుతాం..

భారతీయ సమాజంలో సైనికునికి ఎంతో గౌరవం ఉంది.. సాధారణ ఉద్యోగులతో పోలిస్తే ప్రభుత్వం సైనికుల ప్రయోజనాలకు అత్యధిక ప్రధాన్యత ఇస్తుంది.. ఎన్నో రకాల రాయితీలు, సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది.. ఇవన్నీ దేశ ప్రజల నుండి వసూలు చేస్తున్న పన్నుల ద్వారానే..
ప్రజులు తమకు ఇస్తున్న గౌరవాన్ని, చూపిస్తున్న అభిమానాన్ని నిలుపుకోవాల్సిన బాధ్యత సైనికులపై కూడా ఉంది.. సమస్యలు అనేవి అంతటా ఉంటాయి.. సైన్యం కూడా దీనికి అతీతం కాదు.. వీటిని పరిష్కరించుకునేందుకు మార్గాలు ఎన్నో ఉన్నాయి.. సోషల్ మీడియా ద్వారా అతిగా చూపించడం ద్వారా ప్రజల దృష్టిలో చులకన కావడం, క్రమశిక్షణా చర్యలకు గురి కావడం తప్ప సాధించేది ఏమీ ఉండదు..

జవానులు ప్రజల దృష్టిలో ఎప్పటికీ హీరోలుగానే ఉండాలి.. జీరోలుగా మారి చులకన కావద్దు..

Saturday, January 14, 2017

సంక్రాంతి శోభ

సంక్రాంతి పండుగ.. ఇంటింటా పంచాలి సుఖ సంతోషాలు, సిరి సంపదలు, భోగ భాగ్యాలు.. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు..

Friday, January 13, 2017

జీవహింసకు మతాన్ని బట్టి ఉంటుందా?

నాదో అమాయకపు ప్రశ్న.. జీవహింస పేరుతో సంక్రాంతి సందర్భంగా జరిగే సాంప్రదాయ జల్లికట్టు, కోడి పందేలపై నిషే్ధం విధిస్తున్నారు.. సంతోషం.. కానీ సంవత్సరమంతా కోళ్లు, మేకలు, పశువులను కోసుకు తినవచ్చా?.. అది జీవహింస పరిధిలోకి రాదా?.. ఈ న్యాయస్థానాలు, ప్రభుత్వాలు, జీవకారుణ్య సంస్థలు మెజారిటీ ప్రజలు జరుపుకునే పండుగలు, సాంప్రదాయాలపై మాత్రమే ఎందుకు కన్నేస్తాయి.. ఇతరులు జరుపునే పండుగల సందర్భంగా పెద్ద ఎత్తున జీవాలను కోస్తుంటే ఎందుకు పట్టించుకోరు?.. కానీ బోనాలు, మేడారం తదితర పండుగలు, జాతరల్లో బలులు మాత్రం వద్దంటారు?.. జీవహింస ఎవరు చేసినా, ఎప్పుడు చేసినా ఒకే న్యాయం ఎందుకు వర్తించదు?.. ఎందుకు ఈ వివక్ష?.. ఇదేనా న్యాయం?

భోగి పండుగ మీ ఇంట భోగ భాగ్యాలు తేవాలని కోరుకుంటున్నాను..


Thursday, January 12, 2017

యువతకు ఆశాజ్యోతి.. వివేకానంద

ఆయన జీవించింది కేవలం 39 ఏళ్లు మాత్రమే.. కానీ తానిచ్చిన భవిష్యత్తు తరాలకు మార్గదర్శిగా నిలిచారు.. ‘లేవండి.. మేల్కొనండి.. గమ్యం చేరే వరకూ విశ్రమించకండి..’ అంటూ యువతకు కర్తవ్యాన్ని సూచించారు.. ‘బలమే జీవితం, బలహీనతే మరణం’ అని చెప్పారు.. ‘ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్ప మనసున్న యువత’ ఈ దేశానికి కావాలన్నారు.. ‘దరిద్రుల సేవే నారాయణ సేవ’ అని ఉద్బోధించారు.. ‘నా దేశంలో కుక్క సైతం ఆకలితో చావద్దు’ అని సూచించారు..
భారత దేశం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం జాతి పునర్ నిర్మాణమే మార్గమని సూచించారు.. ధర్మాన్ని పాటించమన్నారు.. స్వధర్మం తల్లివంటిదని, పర ధర్మం సవతి వంటిదని అన్నారు.. ఏ విధంగా చూసినా హిందుత్వమే అన్ని ధర్మాలకన్నా గొప్పదని చికాగోలో జరిగిన ప్రపంచ మతాల సదస్సులో చాటి చెప్పారు.. ప్రపంచానికి భారత దేశం ఆధ్యాత్మిక నాయకత్వం వహించాలన్నారు..
నేడు వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన పుస్తకాలు మర్కెట్లో కుప్పలు తెప్పలుగా దొరుకుతున్నాయి.. కానీ వందేళ్ల క్రితమే వ్యక్తి నిర్మాణం గురుంచి ఆయన చక్కని బోధనలు చేశారు.. అవి చదివితే చాలు, మరే వ్యక్తిత్వ వికాస పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు..
స్వామి వివేకానంద జయంతి నేడు.. యువతకు ఆశాజ్యోతి, మార్గదర్శి అయిన స్వామీజీ జయంతిని జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటున్నారు..
స్వామీ వివేకానందను గుర్తు తెచ్చుకుందాం.. ఆయన చూపిన మార్గాన్ని అనుసరిద్దాం.. ఈ దేశాన్ని పునర్నిర్మిద్దాం..

Monday, January 9, 2017

స్వామీజీ జీవితం అందరికీ ఆదర్శం

మనం మహనీయుల గొప్పదనాన్ని వివరించేందుకు వారిలోని విశిష్టతను చెప్పుకుంటాం.. వారిని ఆదర్శంగా తీసుకోవాలని పిల్లలకు చెబుతుంటాం.. ఏ మనిషైనా పుట్టుకతో గొప్పవ్యక్తి కాలేడు.. తన జీవితాన్ని తీర్చి దిద్దుకోవడం ఇతరులకు మార్గదర్శకంగా నిలిచిన వారినే మహనీయుడని లోకం కొనియాడుతుంది..
భారత దేశ ఆధ్యాత్మిక వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు స్వామి వివేకానంద.. యువతకు స్పూర్తి ప్రధాత.. స్వామీజీ చిన్నప్పడు చదువులో అత్తెసరు మార్కులతో పాసయ్యారనే వార్తలు అన్ని పత్రికలూ ప్రచురించాయి.. ఒకటిన్నర శతాబ్దాల క్రితం పుట్టిన ఒక ఆధ్యాత్మిక నాయకుని చదువు గురుంచి ఒకాయన పరిశోధించాడని ఆ వార్త బోగట్టా.. అది వాస్తవం కావచ్చు..
ప్రముఖుల జీవితాల గురుంచి తెలుసుకోవాలనే ఆసక్తి ప్రతి ఒక్కరికీ ఉంటుంది.. వీటి గురుంచి పరిశోధించి రాసే వారినీ తప్పు పట్టలేం.. కానీ రామాయణంలో పిడకల వేట మాదిరిగా వివేకానందుని విద్యార్హతలను బయట పెట్టడం ద్వారా సదరు రచయిత ఏమి చెప్పదలచుకున్నాడే విషయంలో స్పష్టత లేదు..
వివేకానంద అసలు పేరు నరేంద్ర దత్తుడు.. చిన్నప్పటి నుండే ఆధ్యాత్మిక చింతనతో దైవాన్వేషణ సాగించినట్లు ఆయన జీవిత చరిత్ర చెబుతోంది.. ఇందు కోసం ఆయన ఎన్నో పుస్తకాలను చదివారు.. రామకృష్ణ పరమహంసతో సహా ఎందరో మహాపురుషులను కలిశారు.. సమాజ సేవకు ఆధ్యాత్మిక చింతన కారణం వల్ల స్వామీజీ తరగతి గదులకు సంబంధించిన పాఠాలపై పెద్దగా ధ్యాస పెట్టలేదు..

స్వామి వివేకానంద జీవితం రహస్యం ఏమీ కాదు.. షికాగోలో జరిగిన ప్రపంచ మతాల మహాసభలో హిందూ మత విశిష్టతను, భారత దేశ సంస్కృతిక, ఆధ్మాత్మిక వైభవాన్ని చాటి చెప్పారు.. స్వామీజీ జీవించింది చాలా కొద్ది కాలమే.. కానీ వారి స్పూర్తి మాత్రం తరతరాల వారినీ ఆకర్శిస్తుంటుంది.. వివేకానందుని బోధనలు ఈనాటికీ అందరినీ ఆకర్శిస్తున్నాయి.. స్వామీజీ గొప్పదనం గురుంచి చెప్పేందుకు ఇంతకన్నా ఎక్కువ మాటలు అవసరం లేదు..

Saturday, January 7, 2017

పాపం జియో


జియో వాడు సర్వీసులు మొదలైన కొత్తలో సిమ్ కోసం దరఖాస్తు చేసుకుంటే ఐడీ కార్డులో నా కళ్లు కనిపించడం లేదని తిరస్కరించాడు.. (ఇంకా నయం బాగా వళ్లు చేశావనలేదు).. తర్వాత ిఇచ్చి చచ్చాడునుకోండి..
ఇప్పుడు చూడండి.. సిమ్ములు బాబూ సిమ్ములంటూ రోడ్డు పక్కన ముష్టోళ్లు, కుష్టోళ్లతో కలిసి కస్టమర్ల కోసం ఎలా అడుక్కుంటున్నాడో.. పాపం..

Tuesday, January 3, 2017

నరేంద్ర మోదీ.. ఆలోవాలా..

ఇదేమిటి మ‌న ప్ర‌ధాని నరేంద్ర మోదీ ఆటో న‌డుపుతున్నారేమిటి అనుకుంటున్నారా?
పేరు షేక్ అయూబ్ (49), ఆదిలాబాద్ ప‌ట్ట‌ణం బొక్క‌ల‌గూడ కాల‌నీవాసి.. గ‌తంలో ఆర్టీసీలో డ్రైవ‌ర్‌.. ప్ర‌స్తుతం ఆటో న‌డుపుతూ జీవ‌నం సాగిస్తున్నారు.. అచ్చం న‌రేంద్ర మోదీలా ఉన్న ఈయ‌న ఎక్క‌డికి వెళ్లినా జ‌నం మోదీ, మోదీ అంటున్నారు..దీనికి ఆయూబ్ ఎంతో సంతోషిస్తున్నారు.. అన్న‌ట్లు ప్ర‌ధాని మోదీ చేప‌ట్టిన న‌ల్ల‌ధ‌నంపై పోరాటానికి బాస‌ట ప‌లుకుతున్నారు మ‌న ఆయూబ్ భాయ్‌.. స‌మాన్యుల‌కు తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు ఉన్నా, దేశానికి మంచి రోజులు వ‌స్తాయి అంటున్నారు..

అర్థరాత్రి.. ఒక ఏటీఎం.. ఒక బిచ్చగాడు

_31 డిసెంబర్, రాత్రి 11.15 గం. కింగ్ కోఠి ప్యాలస్ ఎదురుగా.._
రద్దీ తక్కువగా ఉన్న ఏటీఎం కనిపించింది.. భాగ్యనగరంలో ఏమి నా భాగ్యం అనుకుంటూ క్యాష్ డ్రా చేశాను.
బయట అరుగుపై ఒక బిచ్చగాడు కనిపించాడు..
నేను ఏమైనా ఇస్తాననుకొని చేయి చాచాడు..
జేబులు తడుముకొని _'చిల్లర్ నహీ హై'_ అన్నాను..
అతను నా వైపు అదో రకంగా చూసి _'పర్వా నహీ సాబ్ కిత్నా చేంజ్ హోనా?'_ అంటూ తన జోలె నుండి నోట్లు తీశాడు..
అవాక్కవ్వడం నా వంతయింది.