Wednesday, January 30, 2013

విశ్వరూపం.. జయ నిజస్వరూపం

మద్రాసు హైకోర్టు విశ్వరూపంపై స్టే ఎత్తేసినా జయ లలిత సర్కారు దీన్ని సవాలు చేయడం దర్వారా తన నిజ స్వరూపం ఏమిటో చాటుకుంది.. కమల్ హాసన్ దేశం గర్వించదగ్గ గొప్ప నటుడు, కళాకారుడు.. ఎన్నో రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి పురస్కారాలు ఆయన్ని వరించాయి.. ఇలాంటి మహానటుడి చిత్రాన్ని కొందరు వ్యక్తులు వ్యతిరేకించారనే సాకుతో నిషేధించడం దారుణం..
నిజానికి కమల్ హాసన్ తన విశ్వరూపం చిత్రంలో తీవ్రవాదానికి వ్యతిరేకంగా తీసింది.. ఇందులో ముస్లింలను కించపరిచారని చెప్పడం అర్ధ రహితం.. గతంలో కమల్ హాసన్ తీసిన ఎన్నో చిత్రాల్లో విలన్లు హిందువులు.. అంత మాత్రాలన అవి హిందువులకు వ్యతిరేకంగా తీశారని చెప్పగలమా? విశ్వరూపం చిత్రం కోసం కమల్ ఎంతో కష్ట పడ్డారు.. తన ఇల్లు, ఆస్తులను తాకట్టుపెట్టి ఈ సినిమా తీశారు.. డీటీహెచ్ ద్వారా సినిమాను విడుదల చేద్దామనే కమల్ ఆలోచనలకు డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యజమానులు మోకాలడ్డారు.. తీరా సినిమా విడుదల అయ్యే సమయానికి ముస్లిం మనోభావాలను సాకుగా చూసి తమిళనాడు ప్రభుత్వం విశ్వరూపాన్ని అడ్డుకుంది..

నిజానికి జయలలిత విశ్వరూపం సినిమాను అడ్డుకోవడానికి వేరే కారణాలు ఉన్నాయి.. ఈ సినిమా రైట్స్ జయటీవికి ఇవ్వలేదనే ఆగ్రహం ఒకటైతే.. చెన్నైలో గత నెల జరిగిన ఓ కార్యక్రమంలో చిదంబరం ప్రధాని కావాలని కమల్ తన ఆకాంక్షను వ్యక్తం చేయడం మరో కారణం.. కోపం తలకెక్కిన జయలలిత విశ్వరూపంపై తన నిజస్వరూపాన్ని చాటుకున్నారు..
విశ్వరూపంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న కమల్ హాసన్ జయసర్కారు ధోరణితో కన్నీటి పర్యంతమయ్యారు.. తను వేరే దేశం వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.. ఇలాంటి కష్ట సమయంలో మనమంతా కమల్ హాసన్ కు అండగా నిలవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది..  కమల్ విశ్వరూపాన్ని ఆదరిద్దాం.. ఆయన మరిన్ని వైవిధ్యభరిత చిత్రాలు నిర్మించేలా ప్రోత్సహిద్దాం..

కమల్జీ ఆగే బడో.. హమ్ తుమారే సాథ్ హై..


Tuesday, January 29, 2013

ఫేస్ బుక్.. జర భద్రం


డియర్ ఫ్రెండ్స్..
ఫేస్ బుక్ ద్వారా స్నేహం కోసం నాకు ప్రతి రోజూ 4,5 అయినా అభ్యర్థనలు వస్తున్నాయి.. అయితే నేను ఇప్పటి వరకూ చాలా తక్కువ అభ్యర్థనలకే స్పందించాను.. నేను స్పందించనంత మాత్రాన తిరస్కరించానని భావించరాదు..
నాకు అభ్యర్థనలు పంపే వారు చాలా వరకూ తమకు సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వడం లేదు.. పేర్లు సరిగ్గా ఉండవు.. కొందరు మారు పేర్లతో అభ్యర్థనలు పంపుతుంటారు.. చిరునామాలు, వారి వృత్తులు, అభిరుచులకు సంబంధించిన సమాచారం ఇవ్వడం లేదు.. సరైన సమాచారం లేకుండా స్నేహం చేయడం ఇబ్బందే..
కొందరు వీఐపీల పేర్లతో కొనసాగుతున్న ఖాతాలు నకిలీవని నా దృష్టికి వచ్చింది.. ఇలాంటి వారి పట్ల కొంత అప్రమత్తంగా ఉండటం అవసరం.. ఇటీవల కొందరు వ్యక్తులు ఫేస్ బుక్ లో మహిళల పట్ల అతి నీచంగా కామెంట్లు చేశారు.. ఈ విషయం ఒక పత్రిక వెల్లడించడం చూసే ఉంటారు..
మన అభిప్రాయాలు స్వేచ్చగా ప్రకటించుకునే అవకాశాన్ని ఫేస్ బుక్ ఇచ్చింది.. ఈ స్వేచ్చ దుర్వినియోగం కావద్దని నా మనవి.. ఫేస్ బుక్ లో కొందరు మిత్రులు ఉపయోగిస్తున్న భాష ఇబ్బందిని కలిగిస్తోంది.. మన అభిప్రాయాలను ఏకీభవించని వారిని బెదిరించడమో, తిట్టడమో, అవహేళన చేయడమో సరికాదు.. ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి.. నచ్చక పోతే వదిలేయాల్సిందే.. కానీ మన వాదనే సరైందనే మూడు కాళ్ల కుందేటి సిద్దాంతం సరి కాదు..
ఈ విషయంలో నేను ఎవరికైనా బాధ కలిగించి ఉంటే అన్యదా భావించరాదని మనవి..

Monday, January 28, 2013

ఎన్నాళ్లీ దగా?..

మళ్లీ అదే మోసం.. దగా.. తెలంగాణ ప్రజలతో కేంద్ర ప్రభుత్వం అడుతున్న నాటకాలు కొనసాగుతున్నాయి.. 1969 ఉద్యమం తర్వాత జరిగిన మోసం మళ్లీ పునరావృత్తమయ్యింది.. తాజాగా ఈ నెల 29లోగా తేల్చి చెబుతామన్న కేంద్ర ప్రభుత్వం గడువేమీ లేదంటూ తేల్చి చెప్పి మళ్లీ వంచింది..
తెలంగాణలో అనిశ్చిత పరిస్థితి ఇంకా ఎంత కాలం కొనసాగాలి.. కాలాయాపన ద్వారా సమస్య పరిష్కారం అవుతుందని భావిస్తే అది కచ్చితంగా మూర్ఖత్వమే అవుతుంది.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేందుకు ఎన్ని అబద్దాలు ప్రచారం చేయాలో అన్నిచేస్తున్నారు.. ఎన్ని కుట్రలు పన్నాలో అన్ని పన్నేస్తున్నారు..
నిజానికి తెలంగాణకు అడ్డుపడుతున్నది సీమాంధ్ర ప్రజలు కాదు.. కొద్ది మంది స్వార్థ రాజకీయ నాయకులు మాత్రమే.. మంది రాజకీయ పారిశ్రామికవేత్తల స్వార్థానికి తలొగ్గిన కేంద్ర ప్రభుత్వం వారు ఆడించినట్లాడుతోంది.. సమైక్యాంధ్ర పేరిట నాటకాలాడుతున్న నాయకులకు ఈ ప్రాంతంలో ఉన్న స్వార్థ ప్రయోజనాలు తెలియనిదెవరికి?.. మీరు నడుపుతున్న సమైక్య ఉద్యమాల్లో తెలంగాణ నాయకులు, ప్రజలు ఎవరైనా కనిపిస్తున్నారా? కేవలం సీమాంధ్రులే కనిపించే ఉద్యమాలకు సమైక్యాంధ్ర ముసుగు ఎందుకు? ఈ ఉద్యమాలు సైతం రాజధాని నగరంలో జరగవు.. కానీ హైదరాబాద్ మాదే అంటారు.. హైదరాబాద్లో వారు స్వేచ్చగా తిరగలేని పరిస్థితి ఉన్నప్పుడు ఈ మహానగరంపై హక్కునెలా కోరుకుంటారు? ఎంత కాలం ఇలా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని అణచి వేస్తూ పోలీసు, సైనిక శాసనాలను కొనసాగిస్తారు?
తెలంగాణ డిమాండ్ హఠాత్తుగా నిన్న మొన్న పుట్టుకొచ్చింది కాదు.. ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడ్డప్పటి నుండి ఉన్నదే.. 1969లొ ఉవ్వెత్తున లేచిన ఉద్యమ కెరటాన్ని కాంగ్రెస్ పార్టీ సామ దాన దండోపాయాలతో అణచి వేసింది.. కానీ దశాబ్దకాలంగా మళ్లీ రగులుకున్న ఉద్యమాన్ని అణచి వేయడం ప్రస్తుత పరిస్థితుల్లో కష్టమే.. ప్రపంచంలో ఏ ఉద్యమమైననా హింస సహజం.. అలాగే ఇందుకు తెలంగాణ ఉద్యమం మినహాయింపు కాదు.. ఆ మాటకొస్తే ఉద్యమం 69 నాటితో పోలిస్తే ప్రశాంతంగానే ఉంది.. కానీ సహనానికి కూడా హద్దు ఉంటుంది.. ఎందరో యువతీ యువకులు ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణ త్యాగం చేశారు.. దురదృష్టవశాత్తు ఇలాంటి అమరుల త్యాగాలను తక్కువ చేసి మాట్లాడే వారున్నారు.. వారి సంస్కారం గురుంచి మన మనం చర్చించుకోవాల్సిన అవసరం లేదు.. కొత్త రాష్ట్రం ఏర్పడితే కొన్ని సాధక బాధలు సహజం.. రాజధాని, నదీ జలాలు, వనరుల పంపిణీ తదితర అంశాలు సామరస్యంగా పరిష్కరించుకోవచ్చు.. కానీ వీటిని సాకుగా చూపి రాష్ట్ర విభజనను అడ్డుకోవడం కచ్చితంగా అన్యాయమే..
తెలంగాణ ఏర్పడితే నష్టం ఎవరికి?.. మా రాష్ట్రం మాకు కావాలి అని అడగం తప్పెలా అవుతుంది.. మీరు విడిపోవడానికి వీళ్లేదు అని శాసించడం, అడ్డుకోవడం అమానుషం కాదా? తెలుగు ప్రజలకు రెండు రాష్ట్రాలు ఉంటే తప్పేమిటి? ఎవరి ప్రయోజనాలు వారు కాపాడుకుంటూ, ఎవరి పాలన వారు సాగించుకోవడానికి అభ్యంతరం ఏమిటి?.. పరస్పరం అనుమానించుకుంటూ, ఘర్షించుకోవడంకన్నా ఎవరి ఉద్యోగాలు వారు చేసుకుంటే సరిపోదా?
తెలుగు ప్రజలు మనసులో ఎలాంటి భావోద్వేగాలు లేకుండా ప్రశాంతంగా ఆలోచించాలి.. ఒక్కసారి చరిత్రను గమనించండి.. ఏ దేశానికీ, రాష్ట్రానికి శాశ్వత సరిహద్దులు లేదు.. ఆ మాటకొస్తే కొత్త జిల్లాలు, గ్రామాలు ఏర్పడ్డాయి.. మన నగరాల చుట్టూ ఎన్ని కొత్త కాలనీలు పుట్టడం లేదు.. మద్రాసు రాష్ట్రం నుండి ఆంధ్రా విడిపోయి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడలేదా? తెలంగాణ ఏర్పడితే తప్పెలా అవుతుంది?.. ఈనాడు తెలంగాణ కోరేవారు వేర్పాటు వాదులు అయితే.. ఆనాడు ఆంధ్రా కోరిన వారిని ఏమనాలి?.. తెలంగాణ కావాలనే వారి కోరికను అణచిపెట్టడం ఎలా సాధ్యం?

ఒక కుటుంబం విడిపోయినంత మాత్రాన అన్నదమ్ముళ్లు శత్రువులైపోతారా? విడిపోయినా ప్రేమా ఆప్యాయతలు ఉంటాయి కదా? ఈ సూత్రం తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమలకు ఎందుకు వర్తించదు.. స్వార్థ రాజకీయాలు కట్టిపెట్టి వివేకవంతంగా ఆలోచించాల్సిన సమయం ఇదే..

Friday, January 25, 2013

ఇది సాంస్కృతిక తీవ్రవాదమే..


కమల్ హాసన్ అన్నట్లు ఇది కచ్చితంగా సాంస్కృతిక తీవ్రవాదమే..
విశ్వరూపం సినిమా తమ మనోభావాలను దెబ్బతీస్తోందని కొందరు ముస్లింలు ఆందోళన చేయగానే తమిళనాడు సర్కారు నిషేధం విధించింది.. మిలాదున్ నబీ, శుక్రవారం సాకు చూసి హైదరాబాద్ నగరంలో తొలి రోజు ఆట నిలిపేశారు.. అసలు విశ్వరూపం సినిమా ముస్లింలకు వ్యతిరేకం అని చెప్పిన మూర్ఖుడు ఎవరు?
మన దేశంలో వెర్రితలలు వేస్తున్న కుహనా లౌకికవాదం నగ్న స్వరూపాన్ని విశ్వరూపం సినిమా మరోసారి బట్టబయలు చేసింది.. ముస్లింల మనోభావాలు దెబ్బతింటాయనే సాకుతో విడుదలకు ముందే విశ్వరూపంపై ఆంక్షలు విధించారు.. మరి మన దేశంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్ని సినిమాలు హిందువుల దేవతలను, ఆచారాలను, బ్రాహ్మణులను కించ పరచలేదు.. వాటిని ఏనాడైనా నిషేధించారా?
ఈ దేశంలో మతాన్నిబట్టి మనోభావాలను గౌరవిస్తారా?.. మనోభావాలు కేవలం ఒక మతం వారికే ఉంటారా? ఈ దేశంలో మెజారిటీ మతస్తులకు మనోభావాలు ఉండవా? వాటికి విలువ లేదా?

కుహనా లౌకిక వాదమా వర్ధిల్లు..

కర్రు కాల్చి వాత పెట్టాల్సిందే..

సొంత రాష్ట్రం కశ్మీర్లో తీవ్రవాదాన్ని ఎదుర్కొనే జాదూ తెలియని గులాం నబీ..
అరవ దేశంలో తంబీల ముందు అరవ లేన సీట్లు సర్దుకొని గెలిచే చిదంబరం..
మళయాళీ కంగాళీ కాంగ్రెస్ గ్రూపుల్లో టోన్ లేని ఆంటోనీ, వయలార్ రవి..
గుజరాత్ గల్లీల్లో మోడీని ఢీకొట్టలేక ఢిల్లీ అమ్మోరి సేవకే పరిమితమైన అహ్మద్ పటేల్..
మధ్య ప్రదేశ్ లో టికానా కోల్పోయిన దిగ్విజయ్ సింగ్..
ఉగ్రవాదానికి, దేశ భక్తికి తేడా తెలియక సెన్స్ లేకుండా మాట్లాడి విలువ తగ్గించుకున్న సుశీల్ కుమార్ షిండే..
సొంతంగా దేశాన్ని పాలించలేక, నిర్ణయం తీసుకునే శక్తిలేక మౌనీ మన్మోహన్ బాబాకు పగ్గాలు ఇచ్చేసిన సోనియా గాంధీ..
వీరేనా తెలంగాణా సమస్యను పరిష్కరించే కాంగ్రెస్ అధిష్టానం నాయకులు?..
తెలంగాణ సమస్యకు ఈ నెల 28లోపు పరిష్కరిస్తామని షిండే అంటే, ఆ తేదీలోపు తేల్చడం అసాధ్యమని ఆజాద్ తేల్చారు.. తెలంగాణ ఇచ్చేది మేమే, తెచ్చేది మేమే అనీ మేకపోతు గాంభీర్య ప్రకటనలు చేసిన టీ.కాంగ్రెస్ నాయకులు తమ పార్టీ అగ్రనేతల వైఖరితో బిత్తరపోతున్నారు.. చూడబోతో కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చేలా లేదు.. ఈ నాయకులు తెచ్చేలా లేరు..
కోదండరాముడు అన్నట్లు వీరందరికీ కర్రు కాల్చి వాత పెట్టాల్సిందే..

Tuesday, January 22, 2013

ఒక జ్ఞాపకం.. ఒక ఆందోళన

పోలవరం ప్రాజెక్ట్ కడితే పాపికొండలు, భద్రాచలం, పర్ణశాల మునిగి పోతాయి తెలుసా?.. 
గత నాలుగేళ్ళుగా ఎక్కడ విన్నా ఇదే చర్చ.. మునిగి పోతాయో లేదో తర్వాత విషయం కాని ముందు ఈ ప్రాంతాలను చూసి రావాలన్న కోర్కె తీరింది.. పాపి కొండలు చూసేందుకు నా కుటుంబం, బంధువులతో కలిసి  గోదావరిలో లాంచి ప్రయాణం చేశాను.. గోదావరిలో నీరు తక్కువే ఉన్నా ఇదో అద్భుత యాత్ర.. సెల్ ఫోన్ల రణగొణలకు, కాలుష్యానికి దూరంగా ప్రకృతి వడిలో లాంచీ నదిలో విహారం..  పొగ మంచులో దోబూచు లాడిన పాపికొండలను చేరే సరికి గోదావరి ఇరుకై పోయింది.. కాని లోతు పెరిగింది.. 

పోలవరం(ఇందిరా సాగర్) ప్రాజెక్ట్ రెండు కిలో మీటర్ల పొడువు, అర కిలోమీటర్(?) ఎత్తులో కడుతున్నారని మా టూర్ ఆపరేటర్ గైడ్ చెప్పాడు.. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే భద్రాచలం, పాపికొండలు, పర్ణశాల సహా ఉభయ గోదావరి, ఖమ్మం జిల్లాల్లో కొన్ని వందల గ్రామాలు మినిగి పోతాయట.. అదే సమయంలో కొన్ని వేల ఎకరాలకు సాగు నీరు అందుబాటులోకి వస్తుందట.. సాగు నీటి సదుపాయం సంగతి దేవుడెరుగు.. అనీ వందల గ్రామాల ప్రజలను నిర్వాసితులను చేయడం అవసరమా అనిపించింది.. 
అసలు అభివృద్ధి పేరుతో గిరిజన గ్రామాల సంస్కృతీ, సంప్రదాయాలను కబలించడం.. జీవ వైవిధ్యానికి నిలయం అయిన పాపికొండలను ముంచడం సమంజసమేనా?.. రాముల వారు కొలువైన భద్రాచలం, అరణ్య వాసం గడపిన పర్ణశాల మునిగి పోతాయంటే జీర్ణించుకోలేక పోయాను.. 
 ఎనిమిది గంటల నదీ విహారం మరపురాని జ్ఞాపకాన్ని మిగిల్చింది.. దీనితో పాటు కొంత పోలవరం ముంపు తాలూకు అందోళన బాధించింది..

గారడి చేస్తుండ్రు.. గడబిడ బెడుతుండ్రు..


వినాశకాలే విపరీత బుద్దీ..


Sunday, January 20, 2013

ఎవరు దేశభక్తులు? ఎవరు తీవ్ర వాదులు?


కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే ప్రకటన చూసిన తర్వాత అసలాయన ఆ పదవికి అర్హుడేనా అనే అనుమానం వచ్చింది.. దేశంలో శాంతి భద్రతలను కాపాడాల్సిన ఈ పెద్ద మనిషి తన బాధ్యతలను ఎంత వరకు నిర్వహిస్తున్నారో తెలియదు కాని, ఒక గొప్ప రహస్యాన్ని కానీ పెట్టారు.. బీజేపీ, ఆరెస్సెస్ శిబిరాల్లో హిందుత్వ తీవ్రవాద శిక్షణ శిబిరాలను నిర్వహిస్తున్నాయట.. 
షిండే ప్రకటన చూసిన తర్వాత మన ఇంటలిజెన్స్ ఎంత సమర్దవంతంగా పని చేస్తోందో అర్థం అవుతోంది.. ఈ దేశంలో కోట్లాది మంది బీజేపీ, ఆరెస్సెస్ కార్యకర్తలు ఉన్నారు.. షిండే గారి ప్రకటన అనుసారం వారంతా తీవ్ర వాదులే.. బహుషా దేశ భక్తీ షిండే గారి దృష్టిలో తీవ్రవాదం కావచ్చు.. భారత్ మాతాకీ జై అంటే తప్పేమో.. 
హిందువుల పవిత్ర దినమైన సంక్రాంతి రోజే ఒక మతాచార్యున్ని పుణ్య క్షేత్రంలో అరెస్ట్ చేసి సెక్యులరిస్ట్ నిష్టను ప్రదర్శించుకున్న కాంగ్రెస్ పార్టీ, హిందూ మతాన్ని నిష్టగా ఆచరించే వారిని తీవ్రవాదులుగా భావించడంలో ఆశ్చర్యం ఏమి కలగడం లేదు.. పార్లమెంట్ పై దాడి కేసు నిందితుడిని ఉరి తీయకుండా ఇంటి అల్లుడిగా కాపాడుతున్న కాంగ్రెస్ నాయకులు గొప్ప దేశ భక్తులేమో.. ఇద్దరు భారతీయ జవాన్లను దారుణంగా చంపిన పొరుగు దేశంకు గట్టిగా బుద్ది  చెప్పడం చేతగాని పాలకులు కూడా గొప్ప దేశ భక్తులే.. కాని ఈ భారత దేశం తప్ప సొంత దేశం లేని హిందువులకు ప్రాతినిద్యం వహిస్తున్న పాపానికి పై సంస్థలు, వ్యక్తులు తీవ్రవాదులు అయిపోయారు.. 
పేరు చెప్పను కాని కొందరు వ్యక్తులు పిచ్చాసుపత్రిలో ఉండటానికే అర్హులు.. కాని ఏకంగా అత్యన్నత పదవుల్లో కూర్చొని పిచ్చి పిచ్చిగా అరుస్తున్నారు.. వినాష కాలే విపరీత బుద్ది.. హే  భగవాన్.. హిందువులను, నా దేశాన్ని ఇలాంటి సూడో  సెక్యులరిస్ట్ ల నుండి కాపాడు..

Saturday, January 19, 2013

భద్రాచలం నుండి పోచవరం వెళ్ళే మార్గంలో దట్టమైన పొగ మంచు కారణంగా 17.01.2013 ఉ.8-30 గంటలకు సూర్యుడు చందమామలా ఎలా మరి పోయాడో చూడండి..


భద్రాచలం సమీపంలోని పర్ణశాల దగ్గర గోదావరి నదిలో నా మొబైల్ ఫోన్ బంధించిన అద్భుత సూర్యాస్థమయ దృశ్యం..

Tuesday, January 15, 2013

నా హైదరాబాద్


సంక్రాంతికి నగరంలో చాలా మంది ఊర్లకు వెళ్లడం, వరుస సెలవుల కారణంగా 3,4 రోజులు హైదరాబాద్ రోడ్లు ఖాళీగా కనిపించాయి.. ఇక్కడే పుట్టి పెరిగిన పక్కా హైదరాబాదీనైన నేను ఎంతో సంతోషించా.. ఈ సంతోషానికి కారణం వేరే ఉంది..
రాష్ట్ర రాజధాని అనే కారణంతో హైదరాబాద్ నగరంపై విపరీతమైన వత్తిడి పెంచింది మన ప్రభుత్వం.. ఇతర నగరాలు, పట్టణాల్లో ఉపాధి అవకాశాలు, సౌకర్యాలను నిర్లక్ష్యం చేశారు మన పాలకులు..  కారణంగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో చదువుకున్న వారంతా హైదరాబాద్ నగరానికే రాక తప్పలేదు.. ఈ వలసల  ఫలితంగా ఈ నగరంపై విపరీతమైన వత్తిడి పెరిగింది.. ఒకప్పుడు వందకు పైగా చెరువులు, జల వనరులు, చెట్లూ చేమలతో ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ లో తాగునీటి సమస్య, అన్ని రకాల కాలుష్యాలు, ట్రాఫిక్ రద్దీ పెరిగి పోయింది.. భూ కబ్జాలు పెరిగి పార్కులు, చెరువులు మాయం అయ్యాయి..
గత మూడు రోజులుగా నా చిన్ననాటి ప్రశాంత వాతావరణాన్ని హైదరాబాద్ రోడ్లపై గమనించాను.. బైక్ పై వీలైనంత వేగంగా వెళ్లుతూ ఎంజాయ్ చేశాను.. రోజూ ఆఫీస్ వెళ్లేందుకు నాకు 40 నిమిషాలకు పైగా సమయం పడుతుంది.. కానీ గత రెండు రోజులుగా 15-20 నిమిషాల్లోపై వెళ్లగలిగాను.. మరీ స్వార్థ పరుడిలా ఆలోచిస్తున్నానా.. ఇందులో నా తప్పేమీ లేదు సుమా.. తప్పంతా వికీంద్రీకరణ పాటించని పాలకులదే..

Monday, January 14, 2013

స్వామి అరెస్టు మతలబు ఏమిటి?

స్వామి కమలానంద భారతిని అరెస్టు చేయడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం తన కుహనా లౌకిక వాదాన్ని, ఓటు బ్యాంకు రాజకీయాలను మరోసారి బయటపెట్టుకున్నది.. హిందూ సంస్థల నుండి వచ్చిన వత్తిడితో రెచ్చగొట్టే ప్రసంగం, దేశ ద్రోహ కేసులో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీని అరెస్టు చేయక తప్పని పరిస్థితుల్లో, ఆ పార్టీని సంతృప్తి పరిచేందుకే కమలానంద భారతి స్వామిని అరెస్టు చేశారనేది సుస్పష్టం.. అసలు స్వామీజీ రెచ్చగొట్టే ప్రసంగం ఏమి చేశారో చెప్పగలరా? అక్బరుద్దీన్ దూకుడును ఆయన మాటల్లోనే తిప్పి కొట్టడం స్వామీజీ చేసిన నేరమా? ఆ మాటకొస్తే అక్బర్ వ్యవహారాన్ని దేశ వ్యాప్తంగా హిందువులంతా తప్పు పట్టారు.. వారందరినీ అరెస్టు చేయడానికి చర్లపల్లి,చంచల్ గూడతో సహా ఈ రాష్ట్ర జైళ్లు సరిపోతాయా? సంక్రాంతి పర్వదినం రోజున స్వామి కమలానంద భారతి అరెస్టును చేయడం ద్వారా ఎంత మంది హిందువుల మనోభావాలు గాయపడ్డాయో ఈ ప్రభుత్వం ఆలోచించిందా? కమలానంద భారతిని అరెస్టు చేశారు సరే.. మరి స్వామీజీ కన్నా కఠినమైన భాషలో మాట్లాడిన అధికార పార్టీ ఎమ్మెల్యే సంగతి ఏమిటి?

Sunday, January 13, 2013

Saturday, January 12, 2013

ప్రతి భారతీయుడు ఆలోచించాలి..

మన దేశం స్వతంత్రం సాధించిన తర్వాత ఎన్నడూ  ఇంతటి దౌర్భాగ్య విదేశాంగ విధానాన్ని చూసి ఉండక పోవచ్చు.. పాకిస్తాన్ సైన్యం బరి తెగించి ఇద్దరు భారతీయ సైనికులను పాశవికంగా చంపినా యు.పి.ఎ. పాలకుల్లో కనీస చలనం లేదు.. నామ మాత్రపు నిరసన తెలిపి ఊరుకుంది.. బహుశ ప్రపంచ దేశాలు మనను  చూసి నవ్వుకొని ఉండ వచ్చు.. ప్రతి భారతీయుడు సిగ్గుతో తల వంచుకోవాల్సిన దుస్థితి ఇది.. 
పాకిస్తాన్ మన దేశంలో ఉగ్రవాదాన్ని రెచ్చ గొడుతున్నా చేతులు ముడుచు కుంటున్నాం.. కసబ్ ను రహస్యంగా ఉరి తీసి చంకలు గుడ్డుకుంటున్నాం.. కాని పార్లమెంట్ పై దాడి కుట్ర దారుడైన అఫ్జల్ గురును ఉరి తీయడానికి ధైర్యం చాలడం లేదు.. అసలు ఈ దుస్థితి అంతటికీ కారణం జవహర్ లాల్ నెహ్రు.. కాశ్మీర్ సమస్య విషయంలో అయన వేసిన తప్పటడుగుల  ఫలితాన్ని ఇప్పుడు భారత దేశం అనుభవిస్తోంది.. కాశ్మీర్ సమస్యను ఐక్య రాజ్య సమితికి తీసుకెల్లడం  ద్వారా శాంతి కాముడిగా పేరు తెచ్చుకుందామని ఆశ పడ్డారాయన.. టిబెట్ ను చైనా ఆక్రమించడాన్ని గుడ్డిగా సమర్దించారు. హిందీ-చీని భాయి భాయి అంటూ మురిశారు.. తీరా చైనా మనపై దాడి చేశాక గాని నెహ్రు గారి భ్రమలు తొలగలేదు.. కాశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్ లలో చాల భాగాలు పాకిస్తాన్,  చైనా ఆక్రమణలో ఉన్నా గట్టిగా ప్రశ్నించాలేక పోతున్నాం.. 
జనాభా పరంగా ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం మనది.. కాని అరవై ఏళ్లుగా సరైన విదేశాంగ విధానాన్ని రూపొందించుకో లేక పోయాం.. ఒకప్పుడు మన దేశంపై ఆధార పడ్డ శ్రీలంక, మాల్దీవులు క్రమంగా చైనా ఒడిలోకి పోతున్నాయి.. బంగ్లాదేశ్, నేపాల్, బర్మా కూడా చైనా వైపే చూస్తున్నాయి..

 ఫ్రెండ్స్ ఈ విషయాలన్నీ మనకెందుకులే అనుకోకండి.. దేశ భద్రత గురుంచి ఆలోచించడం, ప్రశ్నించడం భారతీయులుగా మన అందరి విధి.. మొన్నటికి మొన్న సాముహిక అత్యాచార సంఘటనపై యువత వీధుల్లోకి వచ్చి గట్టిగా నిలదీస్తే ప్రభుత్వం దిగి వచ్చింది.. దేశ భద్రత విషయంలో కూడా అలాగే ప్రభుత్వ మెడలు వంచలేమా? ఆలోచించండి..  

Friday, January 11, 2013


అమెరికా చట్టసభకు ఎన్నికైన తొలి హిందూ అమెరికన్ తులసీ గబార్డ్.. అమెరికా చరిత్రలోనే తొలిసారిగా చట్టసభలో బైబిల్ బదులుగా భగవద్గీత సాక్షిగా ప్రమాణ స్వీకారం చేసి రికార్డ్ నెలకొల్పారు.. ఇది కేవలం హిందువులకే కాదు భారతీయులందరికీ గర్వకారణం.. ఏమాత్రం భారతీయ మూలాలు లేకుండా, అమెరికాలో పుట్టి పెరిగిన తులసీ గబార్డ్ చిన్నప్పటి నుండీ హిందూ మత విశ్వాసి.. భగవద్గీత అన్ని విధాలా తనకు స్పూర్తిగా నిలచిందని చెబుతున్నారు తులసీ గబార్డ్.. స్వధర్మాన్ని వదిలి అన్య మతాల వెంట పడుతున్న హిందువులకు ఆమె కనువిప్పు కలిగిస్తుందని భావిస్తున్నాను..

ఇక రెండో వ్యక్తి విషయానికి వద్దాం.. రాజ్ కేశ్వర్ పరియాగ్ కుటుంబం మూడు తరాల క్రితమే భారత దేశం వదిలేసి బతుకు తెరువు కోసం మారిషస్ తోటల్లో కూలీలుగా పని చేయడానికి వెళ్లింది.. ఆ నాదడు రాజ్ కేశ్వర్ మారిషస్ దేశానికి అధ్యక్షుడైపోయారు.. అయినా ఆయనను తన పూర్వీకుల జన్మభూమి గుర్తుకొచ్చింది.. భారత దేశ పర్యటనకు వచ్చిన మారిషస్ అధ్యక్షుడు బీహార్ రాజధాని పట్నాకు 200 కిలో మీటర్ల దూరంలోని తన పూర్వీకుల గ్రామం వాజీద్ పూర్ వెళ్లారు.. పూర్వీకుల జన్మభూమిని చూసి చలించిపోయి వలవలా ఏడ్చేశారు..


ఈ రెండు వార్తలు తెలుగు పత్రికల్లో ప్రముఖంగానే వచ్చినా,  గమనించని వారి కోసమే నేను పోస్ట్ చేస్తున్నాను..

స్పూర్తిదాత.. వివేకానంద..


ఆయన జీవించింది కేవలం 39 ఏళ్లు మాత్రమే.. కానీ నాలుగు పదులైనా నిండని జీవితంతో భవిష్యత్తు తరాలకు మార్గదర్శిగా నిలిచారు.. స్వామీ వివేకానంద 150 ఏళ్ల జయంత్యుత్సవాలను ప్రపంచమంతా ఘనంగా జరుగపుకుంటోంది.. స్వామీజీ బోధనలు క్లుప్తంగా గుర్తు చేసుకుందాం..
‘లేవండి.. మేల్కొనండి.. గమ్యం చేరే వరకూ విశ్రమించకండి..’ అంటూ యువతకు కర్తవ్యాన్ని సూచించారు స్వామీజీ.. ‘బలమే జీవితం, బలహీనతే మరణం’ అని చెప్పారు.. ‘ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్ప మనసున్న యువత’ ఈ దేశానికి కావాలన్నారు.. ‘దరిద్రుల సేవే నారాయణ సేవ’ అని ఉద్బోధించారు.. ‘నా దేశంలో కుక్క సైతం ఆకలితో చావద్దు’ అని సూచించారు..
భారత దేశం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం జాతి పునర్ నిర్మాణమే మార్గమని సూచించారు స్వామీజీ.. ధర్మాన్ని పాటించమన్నారు.. స్వధర్మం తల్లివంటిదని, పర ధర్మం సవతి వంటిదని అన్నారు.. ఏ విధంగా చూసినా హిందుత్వమే అన్ని ధర్మాలకన్నా గొప్పదని చికాగోలో జరిగిన ప్రపంచ మతాల సదస్సులో చాటి చెప్పారు వివేకానంద.. ప్రపంచానికి భారత దేశం ఆధ్యాత్మిక నాయకత్వం వహించాలన్నారు..
నేడు వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన పుస్తకాలు మర్కెట్లో కుప్పలు తెప్పలుగా దొరుకుతున్నాయి..కానీ స్థూలంగా పరిశీలించి చూడండి.. ఎందరు ఎన్ని విధాలుగా చెప్పినా సారాంశం ఒకటే.. కానీ వందేళ్ల క్రితమే వ్యక్తి నిర్మాణం గురుంచి స్వామీజీ చక్కని బోధనలు చేశారు.. ఆయన బోధనలు చదివితే చాలు, మరే వ్యక్తిత్వ వికాస పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు.. యువతకు ఆశాజ్యోతి, మార్గదర్శి అయిన స్వామీ వివేకాంద జయంతిని జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటున్నారు..
స్వామీ వివేకానందను గుర్తు తెచ్చుకుందాం.. ఆయన చూపిన మార్గాన్ని అనుసరిద్దాం.. ఈ దేశాన్ని పునర్నిర్మిద్దాం..

Friday, January 4, 2013

పేర్లు చెప్పను కాని కొంత మంది స్వాములు హిందూ ధర్మానికి చేసున్న మేలు నయా  పైసా కూడా లేదు.. గడ్డాలు  పెంచుకొని, కాళ్లు మొక్కించుకుంటూ, వ్యక్తిగత ఆస్తులు కూడ బెడుతున్నారు.. హిందూ మతానికి, హిందువులకు జరుగుతున్న అన్యాయాలు మీడియాలో వస్తున్నా పట్టించుకోరు.. పైగా ఒక స్వామి అంటే మరొకరికి పడదు.. అయినా హిందువులు వీరిని గుడ్డిగా ఆరాధిస్తున్నారు.. హే  భగవాన్.. ముందు ఇలాంటి స్వాముల నుండి హిందువులను, హిందూ ధర్మాన్ని, ఈ దేశాన్ని రక్షించు.. 

సెక్యులర్ పార్టీలు నిద్ర పోతున్నాయా?

నిర్మల్ బహిరంగ సభలో అక్బరుద్దీన్  ప్రసంగాన్ని యూట్యూబ్లో చూసిన తర్వాత  ఇలాంటి వ్యక్తులు పిచ్చాసుపత్రిలో ఉండటమే మంచిది అనిపిస్తోంది.. పోలీసులు పదిహేను నిముషాలు అందుబాటులో లేకుంటే వంద కోట్ల హిందువులను ఖాతం చేస్తారట.. ఈ పిచ్చోడికి హిందూస్తాన్ మీద అంత ద్వేశం ఉంటె పాకిస్తాన్ పోవడమే మంచిది.. హిందువులను, హిందూ దేవతలను, గోమాతను ఇంత బహిరంగంగా తిట్టిన ఈ నీచుడిని అరెస్ట్ చేసి బొక్కలో తోయడానికి ప్రభుత్వం ఎందుకు జంకుతోంది.. కోర్టులు జోక్యం చేసుకొని ఆదేశిస్తే కానీ పోలీసులు కేసు పెట్టారా? 
నా ముస్లిం స్నేహితుల్లో కొందరు మజ్లిస్ సానుభూతి పరులు ఉన్నారు.. అక్బర్ మాటలకు వారే సిగ్గుపడి పోతున్నారు.. నిర్మల్ సభ విశేషాలు వెలుగులోకి వచ్చి నాలుగైదు రోజులు గడచినా అక్బరుద్దీన్ వివాదాస్పద ప్రసంగాన్ని పత్రికలూ, ప్రభుత్వం పట్టించుకోక పోవడం సిగ్గు చేటు..ఎం.ఐ.ఎం. ముస్లింలకు ఏకైక ప్రతినిధి ఎంత మాత్రం కాదు.. ఈ వాస్తవం తెలిసి కూడా ఇతర రాజకీయ పార్టీలు నోరు మెదపడం లేదు.. వారికీ హిందువుల మనోభావాలు పట్టవా? వారి ఓట్లు మాత్రమే కావాలా? సోకాల్డ్ సెక్యులర్ పార్టీలను నిలదీయండి..

Thursday, January 3, 2013

ఎం.ఐ.ఎం. అంటే ఎందుకు భయం?

హైదరాబాద్లో మత సామరస్యం దెబ్బ తీసి రాబోయే ఎన్నికల్లో మరిన్ని సీట్లు పెంచుకోవాలని ఎం.ఐ.ఎం. ప్రయత్నిస్తోంది.. ఇందులో భాగంగా భాగ్యలక్ష్మి ఆలయ అంశాన్ని వివాదాస్పదం చేయాలనీ చూసి భంగ పడింది.. తన పన్నాగం బెడిసి కొట్టేసరికి మరింత రెచ్చి పోయింది అందులో భాగమే అక్బరుద్దీన్ ఒవైసి మితిమీరిన ప్రసంగాలు..
అక్బరుద్దీన్ హిందువుల మనోభావాలను దెబ్బ తీస్తూ ప్రసంగిస్తే బీ.జే.పీ. తప్ప మరే రాజకీయ పార్టీ స్పందించకపోవడం దురదృష్టకరం.. రాజకీయ పార్టీలు ఎం.ఐ.ఎం.ను చూసి భయ పడుతున్నాయా?.. హిందువుల మనోభావాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని భావిస్తున్నాయా? స్పష్టం కావాల్సిన అవసరం ఉంది.. బీ.జే.పీ. మాత్రమే ఎందుకు స్పందించాలి? ఇదెక్కడి సెక్యులరిజం? 
హిందూ దేవతలను, హిందువులను కించ పరుస్తూ అక్బరుద్దీన్ చేసిన ప్రసంగాలను ప్రతి భారతీయుడు ఖండించాల్సిందే.. హిందువుల సహన శీలతను అక్బరుద్దీన్ లాంటి మతోన్మాదులు బలహీనతగా భావిసున్నారు..  మత  సామరస్యాన్ని దెబ్బ తీస్తున్న అక్బరుద్దీన్ను అరెస్ట్ చేయడానికి  ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది? ఇలాంటి దేశ ద్రోహులను వెంటనే అరెస్ట్ చేయాలి..

Wednesday, January 2, 2013

సమాజానికి ఉపయోగపడే పనులు చేద్దాం..

న్యూ ఇయర్ ఎలా ఎంజాయ్ చేశావ్?.. అంటూ ఆరా తీశాడో మిత్రుడు.. దాదాపు నిలదీసినట్లుగా?.. డిసెంబర్ 31న ఆఫీస్లో నైట్ డ్యూటీలో ఉన్నానని చెప్పే సరిగా నా వైపు జాలిగా చూశాడాయన.. గత ఏడాదైతే ఎప్పటిలాగే ఇంట్లో హాయిగా నిద్రపోయానని చెబితే మరింత ఆశ్చర్యపోయాడతగాడు..
31 డిసెంబర్ సెలబ్రేషన్ అంటే ఆ మిత్రుడి దృష్టిలో చక్కగా మందు కొట్టి, అర్థ రాత్రి 12 గంటలు దాటగానే హ్యపీ న్యూ ఇయర్ అంటూ కేరింతలు కొట్టి చిందులేయడమే.. కొత్త సవంత్సర వేళ మితి మీరి తాగి రోడ్డపై అడ్డదిడ్డంగా వేగంగా వాహనాలు నడిపి తాము ప్రమాదానికి గురవడమే కాకుండా ఎదుటి వారని చావు బతుకుల్లో పడేసిన సంఘటనలేన్నో చూశాను.. ఇలాంటి పనులు అర్థం లేనివనే నేను మొదటి నుండీ విశ్వసిస్తున్నాను.. కొత్త సంవత్సరం అంటే నా దృష్టిలో క్యాలెండర్ మార్పు మాత్రమే.. ఇంత చిన్న వ్యవహారానికి వెర్రి చేష్టలెందుకో మరి?
న్యూ ఇయర్ పేరిట పేరిట కోట్లాది రూపాయల సంపద వృధా అయిపోతోంది.. హోటళ్లు, రిసార్టులు, బేకరీలు, వ్యాపారులు, మీడియాకు ఇదో ఆదాయ వనరుగా మారిపోయింది.. నిజానికి అర్థం పర్థంలేని ఇలాంటి సెలబ్రేషన్లను ప్రమోట్ చేసి వారు జేబులు నింపుకుంటున్నారు.. న్యూ ఇయర్ వేడుకలు జరుపు కోవడమా? వద్దా అనేది అనవసరమైన చర్చే.. కానీ మనం చేసే ప్రతి పనిలో కొంత సామాజిక ప్రయోజం కూడా ఉండాలని నేను భావిస్తున్నాను..
కొత్త సంవత్సర వేడుకలకు ఖర్చు చేసిన సొమ్ములో కొంతైనా పేదలు, అనాధ పిల్లల సంక్షేమం కోసం ఖర్చు చేస్తే కలిగే తృప్తి (లేదా పుణ్యం) ఎలా ఉంటుందో ఊహించుకోండి.. నా సలహా న్యూ ఇయర్ వేడుకల కోసమే కాదు.. మీ ఇంట్లో జన్మదిన, వివాహ వార్శికోత్సవాలు, ఇతర శుభ కార్యాలకు కూడా వర్తిస్తుంది.. మిగతా వివరాలకు నన్ను సంప్రదిస్తే అదెలాగో చెబుతాను..