Monday, January 28, 2013

ఎన్నాళ్లీ దగా?..

మళ్లీ అదే మోసం.. దగా.. తెలంగాణ ప్రజలతో కేంద్ర ప్రభుత్వం అడుతున్న నాటకాలు కొనసాగుతున్నాయి.. 1969 ఉద్యమం తర్వాత జరిగిన మోసం మళ్లీ పునరావృత్తమయ్యింది.. తాజాగా ఈ నెల 29లోగా తేల్చి చెబుతామన్న కేంద్ర ప్రభుత్వం గడువేమీ లేదంటూ తేల్చి చెప్పి మళ్లీ వంచింది..
తెలంగాణలో అనిశ్చిత పరిస్థితి ఇంకా ఎంత కాలం కొనసాగాలి.. కాలాయాపన ద్వారా సమస్య పరిష్కారం అవుతుందని భావిస్తే అది కచ్చితంగా మూర్ఖత్వమే అవుతుంది.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేందుకు ఎన్ని అబద్దాలు ప్రచారం చేయాలో అన్నిచేస్తున్నారు.. ఎన్ని కుట్రలు పన్నాలో అన్ని పన్నేస్తున్నారు..
నిజానికి తెలంగాణకు అడ్డుపడుతున్నది సీమాంధ్ర ప్రజలు కాదు.. కొద్ది మంది స్వార్థ రాజకీయ నాయకులు మాత్రమే.. మంది రాజకీయ పారిశ్రామికవేత్తల స్వార్థానికి తలొగ్గిన కేంద్ర ప్రభుత్వం వారు ఆడించినట్లాడుతోంది.. సమైక్యాంధ్ర పేరిట నాటకాలాడుతున్న నాయకులకు ఈ ప్రాంతంలో ఉన్న స్వార్థ ప్రయోజనాలు తెలియనిదెవరికి?.. మీరు నడుపుతున్న సమైక్య ఉద్యమాల్లో తెలంగాణ నాయకులు, ప్రజలు ఎవరైనా కనిపిస్తున్నారా? కేవలం సీమాంధ్రులే కనిపించే ఉద్యమాలకు సమైక్యాంధ్ర ముసుగు ఎందుకు? ఈ ఉద్యమాలు సైతం రాజధాని నగరంలో జరగవు.. కానీ హైదరాబాద్ మాదే అంటారు.. హైదరాబాద్లో వారు స్వేచ్చగా తిరగలేని పరిస్థితి ఉన్నప్పుడు ఈ మహానగరంపై హక్కునెలా కోరుకుంటారు? ఎంత కాలం ఇలా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని అణచి వేస్తూ పోలీసు, సైనిక శాసనాలను కొనసాగిస్తారు?
తెలంగాణ డిమాండ్ హఠాత్తుగా నిన్న మొన్న పుట్టుకొచ్చింది కాదు.. ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడ్డప్పటి నుండి ఉన్నదే.. 1969లొ ఉవ్వెత్తున లేచిన ఉద్యమ కెరటాన్ని కాంగ్రెస్ పార్టీ సామ దాన దండోపాయాలతో అణచి వేసింది.. కానీ దశాబ్దకాలంగా మళ్లీ రగులుకున్న ఉద్యమాన్ని అణచి వేయడం ప్రస్తుత పరిస్థితుల్లో కష్టమే.. ప్రపంచంలో ఏ ఉద్యమమైననా హింస సహజం.. అలాగే ఇందుకు తెలంగాణ ఉద్యమం మినహాయింపు కాదు.. ఆ మాటకొస్తే ఉద్యమం 69 నాటితో పోలిస్తే ప్రశాంతంగానే ఉంది.. కానీ సహనానికి కూడా హద్దు ఉంటుంది.. ఎందరో యువతీ యువకులు ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణ త్యాగం చేశారు.. దురదృష్టవశాత్తు ఇలాంటి అమరుల త్యాగాలను తక్కువ చేసి మాట్లాడే వారున్నారు.. వారి సంస్కారం గురుంచి మన మనం చర్చించుకోవాల్సిన అవసరం లేదు.. కొత్త రాష్ట్రం ఏర్పడితే కొన్ని సాధక బాధలు సహజం.. రాజధాని, నదీ జలాలు, వనరుల పంపిణీ తదితర అంశాలు సామరస్యంగా పరిష్కరించుకోవచ్చు.. కానీ వీటిని సాకుగా చూపి రాష్ట్ర విభజనను అడ్డుకోవడం కచ్చితంగా అన్యాయమే..
తెలంగాణ ఏర్పడితే నష్టం ఎవరికి?.. మా రాష్ట్రం మాకు కావాలి అని అడగం తప్పెలా అవుతుంది.. మీరు విడిపోవడానికి వీళ్లేదు అని శాసించడం, అడ్డుకోవడం అమానుషం కాదా? తెలుగు ప్రజలకు రెండు రాష్ట్రాలు ఉంటే తప్పేమిటి? ఎవరి ప్రయోజనాలు వారు కాపాడుకుంటూ, ఎవరి పాలన వారు సాగించుకోవడానికి అభ్యంతరం ఏమిటి?.. పరస్పరం అనుమానించుకుంటూ, ఘర్షించుకోవడంకన్నా ఎవరి ఉద్యోగాలు వారు చేసుకుంటే సరిపోదా?
తెలుగు ప్రజలు మనసులో ఎలాంటి భావోద్వేగాలు లేకుండా ప్రశాంతంగా ఆలోచించాలి.. ఒక్కసారి చరిత్రను గమనించండి.. ఏ దేశానికీ, రాష్ట్రానికి శాశ్వత సరిహద్దులు లేదు.. ఆ మాటకొస్తే కొత్త జిల్లాలు, గ్రామాలు ఏర్పడ్డాయి.. మన నగరాల చుట్టూ ఎన్ని కొత్త కాలనీలు పుట్టడం లేదు.. మద్రాసు రాష్ట్రం నుండి ఆంధ్రా విడిపోయి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడలేదా? తెలంగాణ ఏర్పడితే తప్పెలా అవుతుంది?.. ఈనాడు తెలంగాణ కోరేవారు వేర్పాటు వాదులు అయితే.. ఆనాడు ఆంధ్రా కోరిన వారిని ఏమనాలి?.. తెలంగాణ కావాలనే వారి కోరికను అణచిపెట్టడం ఎలా సాధ్యం?

ఒక కుటుంబం విడిపోయినంత మాత్రాన అన్నదమ్ముళ్లు శత్రువులైపోతారా? విడిపోయినా ప్రేమా ఆప్యాయతలు ఉంటాయి కదా? ఈ సూత్రం తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమలకు ఎందుకు వర్తించదు.. స్వార్థ రాజకీయాలు కట్టిపెట్టి వివేకవంతంగా ఆలోచించాల్సిన సమయం ఇదే..

No comments:

Post a Comment