Wednesday, January 2, 2013

సమాజానికి ఉపయోగపడే పనులు చేద్దాం..

న్యూ ఇయర్ ఎలా ఎంజాయ్ చేశావ్?.. అంటూ ఆరా తీశాడో మిత్రుడు.. దాదాపు నిలదీసినట్లుగా?.. డిసెంబర్ 31న ఆఫీస్లో నైట్ డ్యూటీలో ఉన్నానని చెప్పే సరిగా నా వైపు జాలిగా చూశాడాయన.. గత ఏడాదైతే ఎప్పటిలాగే ఇంట్లో హాయిగా నిద్రపోయానని చెబితే మరింత ఆశ్చర్యపోయాడతగాడు..
31 డిసెంబర్ సెలబ్రేషన్ అంటే ఆ మిత్రుడి దృష్టిలో చక్కగా మందు కొట్టి, అర్థ రాత్రి 12 గంటలు దాటగానే హ్యపీ న్యూ ఇయర్ అంటూ కేరింతలు కొట్టి చిందులేయడమే.. కొత్త సవంత్సర వేళ మితి మీరి తాగి రోడ్డపై అడ్డదిడ్డంగా వేగంగా వాహనాలు నడిపి తాము ప్రమాదానికి గురవడమే కాకుండా ఎదుటి వారని చావు బతుకుల్లో పడేసిన సంఘటనలేన్నో చూశాను.. ఇలాంటి పనులు అర్థం లేనివనే నేను మొదటి నుండీ విశ్వసిస్తున్నాను.. కొత్త సంవత్సరం అంటే నా దృష్టిలో క్యాలెండర్ మార్పు మాత్రమే.. ఇంత చిన్న వ్యవహారానికి వెర్రి చేష్టలెందుకో మరి?
న్యూ ఇయర్ పేరిట పేరిట కోట్లాది రూపాయల సంపద వృధా అయిపోతోంది.. హోటళ్లు, రిసార్టులు, బేకరీలు, వ్యాపారులు, మీడియాకు ఇదో ఆదాయ వనరుగా మారిపోయింది.. నిజానికి అర్థం పర్థంలేని ఇలాంటి సెలబ్రేషన్లను ప్రమోట్ చేసి వారు జేబులు నింపుకుంటున్నారు.. న్యూ ఇయర్ వేడుకలు జరుపు కోవడమా? వద్దా అనేది అనవసరమైన చర్చే.. కానీ మనం చేసే ప్రతి పనిలో కొంత సామాజిక ప్రయోజం కూడా ఉండాలని నేను భావిస్తున్నాను..
కొత్త సంవత్సర వేడుకలకు ఖర్చు చేసిన సొమ్ములో కొంతైనా పేదలు, అనాధ పిల్లల సంక్షేమం కోసం ఖర్చు చేస్తే కలిగే తృప్తి (లేదా పుణ్యం) ఎలా ఉంటుందో ఊహించుకోండి.. నా సలహా న్యూ ఇయర్ వేడుకల కోసమే కాదు.. మీ ఇంట్లో జన్మదిన, వివాహ వార్శికోత్సవాలు, ఇతర శుభ కార్యాలకు కూడా వర్తిస్తుంది.. మిగతా వివరాలకు నన్ను సంప్రదిస్తే అదెలాగో చెబుతాను..

No comments:

Post a Comment