Friday, July 31, 2015

అన్నదాత మీకు గిట్టడా?

ఆరుగాలం కష్టపడి సమాజానికి తిండిని ఇచ్చే రైతన్నంటే అందరికీ అలుసే..
రైతుల ఆత్మహత్యలకు ప్రేమ వైఫల్యం, నపుంసకత్వం కూడా కారణమని సన్నాయినొక్కులు వినిపించారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధా మోహన్ సింగ్.. ఈ వ్యాఖ్యలపై దుమారం రేగడంతో ఈ వివరాలను తాము జాతీయ నేర నమోదు బ్యూరో నుండి తీసుకున్నామని వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.. పైగా ఆత్మహత్యలు చేసుకున్నవారి వృత్తుల్లో వ్యవసాయం అనే సబ్ కేటగిరీ ఈ గందరగోళానికి కారమయ్యిందని ముక్తాయింపు..
చూశారా ఎన్డీఏ ప్రభుత్వం రైతుల మీద ఎంత అన్యాయంగా మాట్లాడిందో అంటున్నారు కాంగ్రెస్ నేతలు.. మరి యూపీఏ ప్రభుత్వ హయంలో వ్యవసాయ మంత్రిగా ఉన్న శరద్ పవార్ సైతం ఆత్మహత్యలకు ప్రేమ వైఫల్యాలు కూడా కారణం అని చెప్పార కాదా అని ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ రికార్డులు తిరగేశారు.
రాహుల్ గాంధీ రైతుల ఆత్మహత్యలపై యాగీ చేస్తూ ఇటీవల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో యాత్రలు చేపట్టారు.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను పట్టించుకోవడం లేదని మొసలి కన్నీరు ఒలికించారు.. ఈ మహానుభావుడికి కేంద్ర రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రైతుల సమస్యలు, ఆత్మహత్యలు కనిపించలేదు.. అప్పుడు ఓదార్చే తీరిక దొరకలేదు.. ఇప్పుడే తీరింది.. ఎందుకంటే అప్పుడు చలవద్దాలు ధరించారు.. ఇప్పుడు భూతద్దాలు పెట్టుకున్నాడు.. అదే కారణం కాబోలు.
గత ఏడాది తెలుగు రాష్ట్రాల్లో 1979 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఇందులో 1347 మంది తెలంగాణలో, 632 మంది ఆం.ప్ర.లో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డట్లు నివేదికలు చెబుతున్నాయి.. ఈ విషయంలో రెండు రాష్ట్రాల అధినేతలు సక్రమంగా స్పందించిన దాఖలాలు లేవు.. రైతులకు రుణాలు, ఎరువులు, రసాయనాలు సకాలంలో అందించడంలో వీరికి ఏమాత్రం శ్రద్ధలేదు.. వర్షాభావం కారణంగా ఈ ఏడాది మళ్లీ కష్టకాలమే కనిపిస్తోంది.. ఇప్పటికే నిండా మునిగి ఉన్న అన్నదాతలను ఆదుకునే విషయంలో కనీస భరోసాకు కూడా దిక్కులేదు..

ప్రభుత్వ ఉద్యోగులకు జీతాల పెంపు, సమాజంలోని వివిధ వర్గాలకు ప్రజాధనాన్ని అప్పణంలా సంతర్పణ చేస్తున్నఈ ప్రభుత్వాలకు రైతులు, వారి కష్టాలు కనిపించడం లేదా? రైతన్న అంటే అంత అలుసైపోయాడా?

నరహంతకులను ఎందుకు క్షమించాలి?

దేశ ద్రోహులకు, హంతకులకు న్యాయ స్థానాలు విధించిన ఉరిశిక్షలను అమలు చేసేందుకు రంగం సిద్దమైనప్పుడల్లా కొందరు మేతావులు, సెలబ్రిటీలు, సోకాల్డ్ సెక్యులరిస్టులు, పబ్లిసిటీ ప్రియులు తమ ఉనికి చాటుకునేందుకు మీడియా ముందు ఆరాటపడుతుంటారు.. వారిని క్షమించి వదిలేయాలని, ఆధునిక సమాజంలో ఉరి శిక్షలు సరికావని, మానవత్వం, హక్కులు, నాగరిక విలువలు అంటూ సుద్దులు చెబుతున్నారు... మెమన్, అఫ్జల్ గురు, కసబ్ లాంటి కేసులు వచ్చినప్పుడే  వీరికి ఇవి గుర్తుకు వస్తాయి.. మిగతా సమయంలో వారి గళాలు ఎందుకు మూగ బోతాయి?.. ఉరి శిక్షపై చర్చకు ఇలాంటి సందర్భాల్లోనే వీరికి తీరిక దొరుకుతోందా?
1993 ముంబై బాంబు పేలుళ్ల కేసు విషయానికి వద్దాం.. యాకూబ్ మెమన్ తన అన్న టైగర్ మెమన్ తో కలిసి 257 మందిని అన్యాయంగా పొట్టన పెట్టుకోవడం మానవత్వమా? నాగరిక విలువలకు నిదర్శనమా? పాకిస్తాన్ తో చేతులు కలిపి దేశ ద్రోహం కాదా?.. పార్లమెంటుపై దాడికి కుట్రలో భాగస్వామి కావడం ద్వారా మన దేశ సార్వభౌమత్వానికే సవాలు విసిరిన అఫ్జల్ గురు, పాకిస్తాన్ నుండి దొంగ చాటుగా వచ్చి ముంబైలో నర మేధానికి పాల్పడ్డ అజ్మల్ కసబ్ ల విషయంలోనూ వీరి వాదన ఇలాగే ఉంది..
 

పాకిస్తాన్ మతాన్ని పావుగా వాడుకొని మన దేశంలో చిచ్చు పెడుతోంది.. వారికి తెలుసు మారణహోమం సాగిస్తే అన్ని మతాల వారు, చివరకు ముస్లింలు కూడా బాధితులవుతారని.. భారత్ ను అస్థిర పరిచే లక్ష్యంతోనే ఉగ్రవాదులు ఇలాంటి పనులకు తెగిస్తున్నారు.. మనం ఉగ్రవాదుల పట్ల కఠిన వైఖరి అవలంభించకపోతే ఏం సందేశాన్ని పంపుతున్నట్లు?.. క్షమాభిక్షలు ఇచ్చుకుంటూ కూర్చుంటే మన జైళ్లు ఇలాంటి వారికి పునరావాస కేంద్రాలుగా, రిక్రియేషన్ క్లబ్బులుగా మారతాయి.. ఇలాంటి వారిని మేపేందుకేనా ప్రభుత్వానికి పన్నులు కట్టేది?
ఉరి శిక్షను వ్యతిరేకించిన వారు ఏనాడైనా తీవ్ర వాదుల దుశ్చర్యలను ప్రశ్నించారా? అమాయక పౌరులను చంపుతుంటే అప్పుడు గుర్తుకు రాదా ఈ మానవత్వం?.. వారు హత్యలు చేస్తే శృంగారం, న్యాయ వ్యవస్థ శిక్షిస్తే వ్యభిచారంలా కనిపిస్తోందా వీరి కళ్లకు?.. బాధితుల కుటుంబాల వ్యధను కూడా చూడండి.. యాకూబ్ మెమన్ ఉరి తీయవద్దని వాదించిన వారి ద్వంద్వ వైఖరి నగ్నంగా కనిపించింది.. వారి వాదన పూర్తిగా రాజకీయ, మత కోణంలోనే కనిపిస్తోంది.. న్యాయస్థానం రాజకీయ, మతం కారణాల వల్లే శిక్ష విధించిందని రుజువు చేయగలరా?..

Monday, July 27, 2015

కలాంజీ మహాభినిష్క్రమణ..

భారత దేశం దిగువన ధనుష్కోటిలో పేద కుటుంబంలో పుట్టిన ఆ బాలుడు చిన్నప్పుడే భవిష్యత్తు గురుంచి కలలు కన్నాడు..  హిమాలయాలంత ఎత్తుకు ఎదిగాడు.. చివరి శ్వాస వరకూ దేశం కోసం జీవించాడు.. కోట్లాది భారతీయుల హృదయాల్లో నిలిపోయాడు. ఆయన రాజకీయ నాయకుడు కాదు.. కానీ రాజకీయులను మించిన ఖ్యాతిని సంపాదించాడు..
డాక్టర్ అవుల్ పకీర్ జైలులబ్దీన్ అబ్దుల్ కలాం.. భారత మాజీ రాష్ట్రపతి ఇక లేక లేరనే వార్త ఒక్కసారిగా తీరని ఆవేదనకు గురి చేసింది..
చిన్నప్పటి నుండే ప్రతిభావంతునిగా పేరు తెచ్చుకున్న అబ్దుల్ కలాం, మద్రాస్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఏరోనాటిక్ ఇంజనీరింగ్ పట్టా పొందారు. రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ, భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థల్లో శాస్త్రవేత్తగా పని చేశారు. మొదట ఉపగ్రహాల ప్రయోగ వాహనాల అభివృద్ది కోసం పని చేశారు. ఆ తర్వాత స్వదేశీ క్షిపణలు తయారీపై దృష్టి పెట్టారు అబ్దుల్ కలాం.. అగ్ని, పృథ్వి క్షిపణులను తయారు చేసి విజయవంతంగా ప్రయోగించడంతో ఆయనకు మిస్సైల్ మాన్ అనే పేరు వచ్చింది.
భారత ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక ప్రధాన సలహాదారు హోదాలో ఫోఖ్రాన్ 2 అణుపరీక్షలు విజయవంతంగా నిర్వహించి ఇండియాను అణ్వస్త్ర దేశాల సరసన చేర్చారు కలాం.. పద్మ విభూషన్, భారత రత్నతో పాటు ఎన్నో గౌరవ డాక్టరేట్లు ఆయన్ని వరించాయి.. వాజపేయి ప్రభుత్వ హయాంలో భారత రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు అబ్దుల్ కలాం..
కలాం వ్యక్తిగత జీవితంలో అత్యంత క్రమశిక్షణ పాటించారు. పూర్తి శాఖాహారి, మద్యపానానికి వ్యతిరేకి.. వ్యక్తిగత స్వార్ధం ఉండరాదనే భావనతో వివాహం చేసుకోకుండా బ్రహ్మచారిగానే ఉండిపోయారు. ఖురాన్ తో పాటు భగవద్గీతనూ పఠిస్తారాయన.. శాంతి కామకుడు, అన్నింటికీ మించి గొప్ప మానవతావాది..
భారత దేశాన్ని శాస్త్ర సాంకేతిక రంగాల్లో, ఆర్థికంగా అగ్రగామిగా నిలిపేందుకు తన వంతు కృషి చేశారు అబ్దుల్ కలాం.. విద్యార్ధులు, యువతకు మార్గదర్శనం చేయడాయనికి నిరంతర యాత్రను కొనసాగించారు. ఈ జీవనయానంలోనే ఆయన శ్వాస ఆగిపోయింది..
అక్టోబరు 15, 1931న జన్మించిన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జులై 27, 2015న జీవితాన్ని చాలించారు.. కలలు కనండి.. వాటిని సాధించే వరకూ విశ్రమించకండి.. కలాంజీ ఇచ్చిన పిలుపు ఇది..  ఆయన స్పూర్తి భారతీయుల్లో నిరంతరం కొనసాగాలని ఆశిస్తూ శ్రద్ధాంజలి ఘటిద్దాం.. 

ఉగ్రవాదులకు శిక్ష మినహాయింపా?

తప్పు చేసిన వారికి చట్ట ప్రకారం శిక్ష పడాలి.. కానీ కులం మతం, భాష, వర్గం, ప్రాంతాల ఆధారంగా శిక్షలు మినహాయించవచ్చా?.. 1993 నాటి ముంబై పలుళ్ల కేసు నిందితుడు యాకూబ్ మెమన్ కు ఎప్పుడో పడిన ఉరి శిక్షను అమలు చేయాలని నిర్ణయించగానే కొందరు వ్యక్తులు గగ్గోలు మొదలు పెట్టారు. ఆయన్ని క్షమించేయాలట.. ముస్లింలను మాత్రమే ఉరి తీస్తున్నారని వీరి విచిత్రమైన వాదన.. ఇందులో నిజం ఎంతో చూడండి.. నేషనల్ లా యూనివర్సిటీ నివేదిక ప్రకారం స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారత దేశంలోని వివిధ రాష్ట్రాల్లో 1,342 ఉరి శిక్షలు అమలు కాగా అందులో ముస్లింలు 72 మంది మాత్రమే.. (ఈ పోస్టుతో జత చేసిన పట్టిక చూడండి.. అసలు వాస్తవాలు తెలుస్తాయి).
ఇందులో ఇంకా విచిత్రమై వాస్తవం ఏమిటంటే దేశంలో అత్యధిక ముస్లిం జనాభా ఉన్న జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో 5 ఉరి శిక్షలు అమలుకాగా, వీరిలో ఒక్కరు కూడా ముస్లిలు లేరు.. కాశ్మీర్ లోయ నుండి వేర్పాటు వాదులు, మతోన్మాదులు లక్షకు పైగా పండిట్లను తరిమేశారు. వేలాది అత్యాచారాలు, లూఠీలు జరిగాయి. ఆ నిందితుల్లో ఒక్కరిపై కూడా కనీసం కేసు నమోదు కాలేదు.. పండిట్లను కదిలిస్తే ఈ ఘోర కలి గురుంచి చెబుతారు.
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ, పంజాబ్ మాజీ సీఎం బియాంత్ సింగ్ హంతకుల విషయంలో ప్రాంతీయ పార్టీలు అవలంభిస్తున్న వైఖరి ఎంత ప్రమాదకమో ఆలోచించండి.. మన దేశ సమగ్రతకు సవాలు విసిరిన శక్తులతో కలిసి, దేశ నాయకత్వాన్ని హత్య చేసిన వారిని క్షమించడం ద్వారా ఏ సందేశం పంపుతున్నట్లు?.. పార్లమెంట్ పై దాడి చేసి కేసులలో నిందితుడు అఫ్జల్ గురు, ముంబై మారణకాండలో పాల్గొన్న పాకిస్తాన్ పౌరుడు అజ్మల్ కసబ్ లకు ఉరి శిక్ష పడినా రాష్ట్రపతి క్షమాభిక్ష సాకుతో నెలల తరబడి జైళ్లలో సజీవంగా ఉంచి ప్రజాధనంతో మేపారు.. చివరకు ఎన్నికల ముందు ప్రజాగ్రహానికి జడిసి ఉరి తీశారు..
ఇక 1993 ముంబై పేలుళ్ల  విషయానికి వస్తే.. ఆనాడు జరిగిన 13 వరుస బాంబు పేలుళ్లలో 257 మంది మరణించగా, 713 మంది గాయపడ్డారు. అంతటి ఘోర ఘటనకు కారకుల్లో ఒకడైన మెమన్ కు క్షమాభిక్ష పెట్టాలనడంలో వాదనలో న్యాయం ఉందా?

నేరస్తులు ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ భాషీయుడైనా, ఏ వర్గీయుడైనా, ఏ ప్రాంతీయుడైనా కఠినంగా శిక్షించాల్సిందే..

Sunday, July 26, 2015

కార్గిల్ విజయ స్పూర్తిని మరచిపోకండి..

కార్గిల్ యుద్ధం పేరు వినగానే నా మనసు భావోద్వేగంతో నిండిపోతుంది.. 1999లో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని కార్గిల్ సెక్టార్లోకి పాకిస్తాన్ సైన్యం చొచ్చుకు వచ్చింది.. ఈ చొరబాట్లను తిప్పి కొట్టేందుకు భారత సైన్యం ఎత్తైన పర్వత శిఖరాల్లో సాగిన యుద్ధం మూడు నెలల పాటు కొనసాగింది.. జులై 26న టైగర్ హిల్స్ పై మన జవానులు విజయకేతం ఎగురేయడంతో యుద్ధం ముగిసింది. ఆనాటి యుద్ధంలో 527 మంది జవాన్లు దేశ సరిహద్దులను రక్షించేందుకు ప్రాణ త్యాగం చేశారు..
కార్గిల్ అమర వీరుడు మేజర్ పద్మపాణి ఆచార్య మా హస్తినాపురం కాలనీ వాసి అని చెప్పుకునేందుకు నేనెంతో గర్వపడుతుంటాను... ఆయన పార్థివ దేహం మా కాలనీకి చేరినప్పుడు వేలాది మంది నివాళ్లర్పించేందుకు తరలి వచ్చారు.. ఆనాటి భావోద్వేగ దృశ్యాలు నేటికీ నా కళ్ల ముందు మెదులుతున్నాయి. ఎక్కడ చూసినా భారత్ మాతాకీ జై.. మేజర్ పద్మపాణి ఆచార్య అమర్ హై.. పాకిస్తాన్ ఖబర్దార్.. మార్ దాలో __కో, పాకిస్తాన్ కుత్తోంకో ’ అనే నినాదాలు.. మేమంతా కలసి పాకిస్తాన్ పతాకాన్ని కాల్చేసి కసి తీర్చుకున్నాం..
16 ఏళ్ల తర్వాత పరిస్థితి గమనిస్తే దేశ ప్రజలే కాదు, మా కాలనీ వాసులు సైతం కార్గిల్ విజయాన్ని మరచిపోయినట్లున్నారు.. కొత్త తరానికి ఆనాటి భావోద్వేగాలు, స్పూర్తిని గుర్తు చేసినా వారికి అంతగా పట్టనట్లు అనిపిస్తోంది.. ఈ పరిణామం కాస్త బాధ కలిగించేదే..

దేశ సరిహద్దులు భద్రంగా ఉన్నప్పుడే మనం స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను అనుభవిస్తాం.. సరిహద్దుల్ని నిరంతరం కాపాడుతున్న వీర జవాన్లకు మనం ఎప్పటికీ రుణపడే ఉంటాం.. వారిది సాదాసీదా ఉద్యోగం కాదు, త్యాగాలతో కూడిన బాధ్యత గుర్తించాలి.. కార్గిల్ యుద్ద విజయం సాధించి 16 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా అమర జవాన్లను స్మరించుకుందాం..

Friday, July 24, 2015

బ్రిటన్ తన దోపిడీకి మూల్యం చెల్లిస్తుందా?

బ్రిటన్లో పారిశ్రామిక విప్లవం, అభివృద్ధి అంతా భారత దేశంలో వారు లూఠీ చేసిన సొమ్ము ద్వారానే సాధ్యమైంది.. కాంగ్రెస్ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ ఆక్స్ ఫర్డ్ యూనియన్ లో సమావేశంలో చేసిన వ్యాఖ్యాలివి.. వలస పాలన ద్వారా భారత్ ను కొల్లగొట్టిన ఆ దేశం నష్ట పరిహారం చెల్లించుకోవాలి అని ఆయన చేసిన డిమాండ్ కు ఆ సభలోని బ్రిటన్ పౌరులు కూడా చప్పట్లు కొట్టారు..
పదేళ్ల క్రితం నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ లండన్ పర్యటించిన సమయంలో భారత దేశంలో బ్రిటన్ పాలను తెగ పొడిగారు.. తెల్లోళ్లు పాలించడం బట్టే భారత్ అభివృద్ధి చెందిందంటూ చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.. ఎంతలో ఎంత తేడా..
వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన దాదాబాయి నౌరోజీ పార్లమెంట్ సభ్యుడి హోదాలో వందేళ్ల క్రితమే బ్రిటన్ పార్లమెంట్ లో వారి దోపిడి పలనను ఎండగట్టారు. భారత్ ను కొల్లగొట్టి బ్రిటన్ ను వలస పాలకులు అభివృద్ది చేసుకుంటున్న తీరును నౌరోజీ డ్రెయిన్ థియరీ రూపంలో చెప్పారు..
శశిథరూర్ ప్రసంగం యూట్యూబ్ ద్వారా సంచనలం సృష్టించడమే కాదు, ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు అందుకోవడం అందుకోవడాన్ని కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేకపొతోంది.. ఫలితంగా పార్లమెంట్ సమావేశాలకు అంతరాయం కలిగించడం సమంజసం కాదని థరూర్ చేసిన సూచనను సాకుగా చూపుతూ ఆయన్ని అధికార ప్రతినిధి పదవి నుండి తొలగించింది..

Monday, July 20, 2015

రైతును గాలికొదిలిన తెలుగు రాష్ట్రాలు

2014లో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 1979 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.. ఇందులో తెలంగాణలో 1347 మంది, ఆంధ్రప్రదేశ్లో 632 మంది రైతులున్నారు.. జాతీయ నేర నమోదు సంస్థ వెల్లడించిన నివేదిక ఇది.. రైతుల ఆత్మహత్యల్లో దేశ వ్యాప్తంగా 31.3 శాతం తెలుగు రాష్ట్రాల్లోనే నమోదు కాగా తెలంగాణ రెండో స్థానంలో, ఏపీ ఏడో స్థానంలో ఉంది.. ఇక దినసరి కూలీల విషయానికి వస్తే తెలంగాణలో 1242, ఏపీలో 1033 మంది ఆత్మహత్య చేసుకున్నారు.. ఈ నివేదిక కాస్త ఆలస్యంగా వచ్చినా పట్టించుకోకుండా వదిలించుకోలేం..
ఉభయ తెలుగు రాష్ట్రాలు పాలన, రాజకీయ పరమైన గిల్లి కజ్జాలతో రైతుల సమస్యలను నిర్లక్ష్యం చేసిన ఫలితమిది.. అన్నదాత మృత్యుఘోష తెలంగాణ, ఏపీ పాలకులకు పట్టలేదు.. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రాలు కాబట్టి బాలారిష్టాలు సహజం అని సరిపెట్టుకోవడంలో అర్థం లేదు.. ఇద్దరు ముఖ్యమంత్రులు ఎన్నికల ముందు అవి చేస్తాం, ఇవి చేస్తాం అంటూ రైతులను భ్రమల్లో ముంచెత్తారు.. కానీ అధికారంలోకి రాగానే ముందుగా రుణమాఫీ విషయంలో దోబూచులాడారు.. అక్కడే రైతులు అర్థం చేసుకున్నారు తాము మళ్లీ మోసపోయామని..

రైతులకు ఏమి చేయబోతున్నారన్నది తర్వాత విషయం.. ముందు వారిలో భరోసా కల్పించి ఉంటే 1979 ప్రాణాల్లో కొన్నైనా మిగిలేవి కదా..

Sunday, July 19, 2015

పుష్కరాలు తప్పా?

తప్పంతా పీఠాధిపతులు, స్వాములు, ప్రవచనకారులదే.. భక్తి ఉద్యమం ద్వారా మహా పాపం చేస్తున్నారు.. శాస్త్రాలు, పురాణాలను ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.. విశ్వాసం పేరిట ప్రజలను మాయలో పడేస్తున్నారు.. భక్తి పేరిట అవివేకులుగా మారుస్తున్నారు.. పుష్కర స్నానం చేస్తే పుణ్యం పేరిట గోదావరిని మురికిగా మారుస్తున్నారు.. రాజమండ్రిలో 27 మంది చావుకు బాధ్యత వీరిదే..
ఎలా ఉంది వితండ వాదం?.. సనాతన ధర్మాన్ని, విశ్వాసాలు, సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు కాపాడుకోవాలనే శ్రద్ధాసక్తులు ప్రజల్లో పెరగడాన్ని జీర్ణించుకోలేని శక్తులు కొత్తగా ఈ తరహా దుష్ప్రచారాన్ని మొదలు పెట్టాయి.. అన్య మతస్తులు తమ విశ్వాసాలను ప్రచారం చేసుకోవడానికి ఎంతకైనా బరితెగించుకోవచ్చు.. కానీ వీరు చేస్తున్నది మాత్రం ఘోరమైన తప్పు.. ఇదేగా మీరు చెప్పదలచుకున్నది..
పుష్కరాలు కొత్తగా పుట్టుకొచ్చాయా? వీటిని కనిపెట్టింది ఈ పీఠాధిపతులు, స్వాములు, ప్రవచనకారులేనా?.. పుష్కర విధులను భక్తులకు గుర్తు చేసి, పుణ్యస్నానాలు, తర్పణలు చేయమని బోధించడమే వీరు చేసిన మహాపాపమా?..

రాజమండ్రిలో జరిగిన దుర్ఘటనకు ఎవరు బాధ్యులు? ఎవరి తప్పిదం కారణంగా భక్తులు అన్యాయంగా మరణించారు?.. ఈ విషయాన్ని ఎందుకు ప్రశ్నించరు?.. అసలు వాస్తవాన్ని గాలికి వదిలి, ప్రజల దృష్టిని మరల్చడానికి ఇంత దుష్ప్రచారం అవసరమా?.. 

Friday, July 17, 2015

పిచ్చివారు ఇలా మొరుగుతూనే ఉంటారు..

ఈ దేశంలో హిందుత్వం ఉండరాదు.. వేదాలకు వ్యతిరేకంగా రచనలు చేయాలి.. గోదావరి పుష్కరాలకు ఒక్కరు కూడా పోకుండా అడ్డుకోవాలి.. బ్రాహ్మణులకు వ్యతిరేకంగా పోరాడాలి.. ఈ బాధ్యత క్రైస్తవులు, దళితులు తీసుకోవాలట..  ఇదీ ఓ పిచ్చి పుల్లయ్య వాదన.. నేను హిందువునెట్లయిత? అంటాడు.. హిందూమతంపై విషయం కక్కుతుంటాడు.. ఈయన హిందువే కానప్పుడు, హిందువులపై విద్వేషాన్ని ప్రకటించడం పరమత అసహనం కాదా?.. క్రైస్తవులను హిందువులపై రెచ్చగొట్టడంలో అర్థం ఏమిటి? కుల, మత ఘర్షణలలతో కొట్టుకు చావాలని ఆశిస్తున్నాడా?..

ఆయన ఏ మతస్తుడో తెలియదు.. కానీ భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డంపెట్టుకొని అడ్డగోలుగా హిందూ మతంపై నిప్పులు కక్కుతుంటారు.. ఆయన నాలిక ఎటంటే అటు పోతుంది.. టీవీ చర్చల్లో ఎవరైనా పాయింట్ టూ పాయింట్ నిలదీస్తే చర్చను పక్కవోవ పట్టిస్తాడు.. ఇలాంటి వారిని పట్టించుకోకపోవడమే మంచిది.. మతి స్థిమితం లేని వారిని కదిలిస్తే బురదలో రాయి వేయడమే అవుతుంది.. మీడియా ప్రచారం దొరికినతం కాలం పిచ్చివాగుడు వాగుతూనే ఉంటాడు. ఆయన పేరు ప్రస్థావించడం నాకు ఇష్టం లేకున్నా మీరు గ్రహించే ఉంటారు..

Tuesday, July 14, 2015

విషాదంలో రాజకీయం తగదు..

రాజమండ్రిలో గోదావరి పుష్కరాల వేళ విషాదం.. పవిత్ర స్నానాలకు వచ్చి తిరిగిరాని లోకాలకు పోవడం దురదృష్టకరం.. అన్ని ఏర్పాట్లు ఘనంగా చేశామని చెప్పుకుంది ప్రభుత్వం.. పుష్కరాలు ప్రారంభమైన మొదటి రోజే తొలి గడియల్లోనే దుర్ఘటన.. తక్కినలాట జరిగిన ప్రాంతంలో పరిస్థితులను చూస్తే ఇది కచ్చితంగా ఏర్పాట్లలో వైఫల్యమేనని స్పష్టంగా చెప్పవచ్చు..
పుష్కరాల తొలి గడియల్లోనే పుణ్య స్నానాలు చేయాలని భక్తులు ఆరాట పడటం సహజం.. పుష్కర ఘాట్ దగ్గర ముఖ్యమంత్రి, ఇతర వీఐపీలు ఉన్నారనే కారణంతో దార్లను మూసేసి తొక్కిసలాటకు తావిచ్చారు. గంటల తరబడి వేచి ఉన్న భక్తులు త్వరగా స్నానాలకు వెళ్లే తొందరలో ఉన్నారు.. అప్పటికే స్నానాలు పూర్తి చేసుకున్నవారు బయటకు వస్తున్నారు.. ఇద్దరికీ ఒకే దారి.. ఫలితంగా ఒకే మార్గంలో వచ్చేవారు, పోయేవారు తోపులాటకు దిగాల్సిన దుస్థితి ఏర్పడింది..
పుష్కర ఘాట్ దగ్గర ఒకేసారి అంత మంది భక్తులు గుమి గూడకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోలేదు.. భక్తులకు సూచనలు ఇచ్చేవారే కరువయ్యారు.. తొక్కిస లాట జరగకుండా నియంత్రించేందుకు తగిన సిబ్బంది లేరు.. దుర్ఘటన జరగగానే తీసుకెళ్లేందుకు తగిన అంబులెన్సులు, స్ట్రెచర్స్ అందుబాటులో లేవు.. ఘటనా స్థలంలో ప్రాథమిక చికిత్స చేసే యంత్రాంగమే లేదు..

చంద్రబాబు నాయుడు లాంటి ఎంతో అనుభవం ఉన్న నాయకుని నేతృత్వంలో ఇలాంటి దుర్ఘటన జరగడం శోఛనీయమైన విషయం.. ఇలాంటి బాధాకరమైన సమయంలో రాజకీయాలు చేయడం తగదు.. పోయిన ప్రాణాలు ఎలాగూ తిరిగి రావు.. ప్రతిపక్షాలు, మీడియా, విమర్శకులు  ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా పుష్కరాలు సక్రమంగా పూర్తయ్యేలా సలహాలు, సూచనలు ఇచ్చి సహకరించాల్సిన అవసరం ఉంది..

పుష్కన వేళ ఇది..


విగ్రహం కృష్ణునిదా? రామారావుదా?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భక్తజనకోటి విశ్వాసాలతో ఎలా ఆడుకుందో చూడండి..  పవిత్ర పుష్కరాల సాక్షిగా గోదావరి నది ఒడ్డున అపచారానికి ఒడిగట్టింది.. అక్కడ ప్రతిష్టించించింది రామారావు విగ్రహమా?, శ్రీకృష్ణ పరమాత్ముని విగ్రహమా?.. కాదు శ్రీకృష్ణుని రూపంలో ఉన్న ఎన్టీరామారావు విగ్రహం.. ఈ తరహా విగ్రహ ఏర్పాటు ద్వారా ఏపీ ప్రభుత్వం ప్రజలకు ఇస్తున్న సందేశం ఏమిటి?.. వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంది..
ఎన్టీఆర్ తెలుగు వెండి తెరపై ధృవతార.. తెలుగువారంతా పార్టీలకు అతీతంగా అభిమానిస్తారు.. పలు పౌరాణిక చిత్రాల్లో శ్రీకృష్ణుని పాత్రను పోషించారు.. అంత మాత్రాన ఏకంగా కృష్ణుని రూపంలో రామారావు విగ్రహాన్ని పెట్టడం ఎందుకు?.. ఎన్టీరామారావు విగ్రహమో, శ్రీకృష్ణుని విగ్రహమో.. ఏదో ఒకటి ఏర్పాటు చేసి ఉంటే ఎవరికీ అభ్యంతరం ఉండదు.. కానీ రెండింటినీ కలగలపడం ద్వారానే అసలు సమస్య ఏర్పడింది..
గతంలో ఎన్నికల సందర్భంగా టీడీపీ వారు శ్రీకృష్ణుని పాత్రతో ఉన్న ఎన్టీరామారావు కటౌట్లను ఏర్పాటు చేస్తే, ఎన్నికల సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది.. ఫలితంగా వాటిని తొలగించుకోవాల్సి వచ్చింది.. దీని వెనుక అభ్యంతరాన్ని ఆ పార్టీ వారు గ్రహించే ఉండాలి..
తెలుగు దేశం వారికి ఎన్టీరామారావుపై ఉన్న అభిమానాన్ని ప్రకటించుకోవడానికి ఇతర మార్గాలు లేవా? వారు తమ పార్టీ కార్యాలయాలు, నివాసాల ఆవరణలో నిరభ్యతరంగా ఈ తరహా విగ్రహాలను ప్రతిష్టించుకోవచ్చు.. ఎవరికీ అభ్యంతరం ఉండదు.. కానీ బహిరంగ ప్రదేశాల్లో ప్రతిష్టించడంతోనే అభ్యంతరం ఏర్పడింది..

శ్రీకృష్ణుని పాత్రలో ఉన్న ఎన్టీరామారావు విగ్రహం ఏర్పాటుపై సోషల్ మీడియాలో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నవారిపై టీడీపీ, ఎన్టీఆర్ అభిమానులు దాడులు చేస్తున్నారు.. అది వారికి ఉన్న స్వేచ్ఛగానే భావిద్దాం.. కానీ నిజం నిష్టూరంగా ఉంటుంది.. యదార్థవాది లోక విరోధి అంటారు అందుకే.. దాడులతో వాస్తావాన్ని కప్పి పుచ్చడం సాధ్యం కాదు.. 

Monday, July 13, 2015

పుష్కరాలు.. పవిత్రత

గోదావరి నదికి పుష్కరాలు వచ్చాయి.. చలో అంటూ అందరూ పవిత్ర స్నానాలకు బయలు దేరేందుకు సిద్దమయ్యారు.. అసలు పుష్కరాలేమిటి? దీని పవిత్రత ఏమిటి?.. సంక్షిప్తంగా తెలుసుకుందామా?..
సృష్టిలో సకల జీవకోటి మనుగడకు జలమే ప్రధానం.. ప్రపంచంలోని నాగరికతలన్నీ నదీ తీరాల్లోనే పుట్టాయి. నదిని తల్లిగా భావించి పూజించడం మన సాంప్రదాయం.. మన పుణ్యక్షేత్రాలు కూడా చాలా వరకూ నదుల వెంటే ఉన్నాయి..
పంచ భూతాల్లో జలం కూడా ఒకటి.. పోషయతీతి, పుష్ణాతీతి పుష్కరం.. అంటే పోషించేది, పుష్టినిచ్చేది పుష్కరం అని అర్థం.. పుష్కరం అంటే మరేమిటో కాదు, జలాన్నే పుష్కరం అని కూడా అంటారు..
పుష్కరం 12 సంవత్సరాలు అని మరో అర్థం.. మనకు రాశులు 12.. ప్రతి నదికి ఒక రాశి ఉంది.. భారత దేశంలో 12 ప్రధాన నదులకు ప్రతి 12 ఏళ్లకోసారి పుష్కరాలు వస్తాయి.. అంటే ప్రతి ఏటా ఒక నదికి పుష్కరం వస్తుంటూనే ఉంటుంది.. బృహస్పతి ఆయా రాశుల్లో ప్రవేశించిన సంబంధిత నదికి పుష్కరాలు వస్తాయి.. పుష్కరం కాలం ఏడాది పాటు ఉంటుంది.. తొలి 12 రోజులను ఆది పుష్కరమని, చివతి 12 రోజుల్ని అంత్యపుష్కరమని వ్యవహరిస్తారు..
ఇప్పుడు బృహస్పతి సింహరాశిలో ప్రవేశించాడు.. సింహరాశి గోదావరి నదిది.. అందుకే గోదావరిని నదికి ప్రస్తుతం పుష్కరాలు వచ్చాయి.. జులై 14 నుండి 25వ తేదీ వరకూ గోదావరి ఆది పుష్కరాలు.. ఈసారి జరిగే గోదావరి పుష్కరాలకు మరో విశిష్ట ఉంది.. ఇవి 144 సంవత్సరాకు ఒకసారి వచ్చే మహా పుష్కరాలు..  గోదావరి నది మహారాష్ట్రలోని త్రయంబకేశ్వరంలో జన్మించి తెలంగాణ మీదుగా ప్రవహించి ఆంధ్రప్రదేశ్లో బంగాళాఖాతంలో కలుస్తుంది.. గోదావరి ప్రవహించే  1465 కిలో మీటర్ల మేర పుష్కరాలు కొనసాగుతాయి..
పుష్కరాల సందర్భంగా నదీ స్నానం, దానం, పిండప్రధాన క్రతువులు చేయడం మన ఆనవాయితీ. అన్నింటికీ మించి పుష్కార స్నానం పరమపవిత్రం అని చెబుతారు. పుష్కర సమయంలో త్రిమూర్తులు, సకల దేవతలు, పితృదేవతలు సప్తరుషులతో పాటు భూలోకంలోని అన్ని నదుల జలాలు అక్కడే ఉంటాయి. అందుకే పుష్కర స్నానానికి అంత పవిత్రత ఉంది..

గోదావరి పుష్కరాల సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు..

ఆర్టీసీ పుష్కర దోపిడి..


పూర్వం యాత్రీకులను బందిపోట్లు దోచుకునే వారు.. ఇప్పుడు ఆర్టీసీ ఆ లోటు తీరుస్తోంది..

Sunday, July 12, 2015

ఏదీ స్వచ్ఛ హైదరాబాద్..

ఏవీ నిరుడు చీపురు పట్టిన చేతులు.. చెత్త ఎత్తిన మీ భుజములెక్కడ?.. ఏరీ ఆ మహా నాయకులు?.. కార్మికుల సమ్మె వేళ చెత్తతో నిందిన వీధుల్ని చూడ మనసు అంగీకరించం లేదా?.. స్వచ్ఛ్ భారత్, స్వచ్ఛ తెలంగాణ, స్వచ్ఛ హైదరాబాద్ నాలుగు రోజుల ముచ్చటేనా.. నిరంతరం కొనసాగాలి అంటిరి కదా ఈ ఉద్యమం.. అప్పుడే అస్త్ర (చీపురు) సన్యాసమేల?..

మున్సిఫల్ కార్మికులు సమ్మెతో హైదరాబాద్ మహా నగరంతో సహా తెలంగాణ నగరాలు, పట్టణాలు కంపు కొడుతున్నాయి.. వీధుల్లో పేరుకున్న చెత్తతో దుర్గంధం వ్యాపిస్తోంది.. ఇక రోగాలే తరువాయి.. కార్మికుల సమ్మెతో చెత్త ఎత్తేవారు లేదు.. మరి నిన్న మొన్నటి దాకా స్వచ్ఛ మంత్రం పఠించిన నేతాజీలు ఏమి చేస్తున్నారు?.. ఫోటోలకు ఫోజులు ఇవ్వడంతోనే స్వచ్ఛ ఉద్యమం?. రండి వీధుల్లోకి చెత్త ఎత్తిపోయండి.. మీ చిత్తశుద్దిని చాటుకోడానికి ఇంతకన్నా మంచి తరుణం ఏముంటుంది? 

Saturday, July 11, 2015

ఛాయ్.. ఇంటర్నెట్

Tea with Wi-Fi.. ఛాయ్ తాగండి  మొబైల్ ఇంటర్నెట్ వాడుకోండి.. అంటున్నాడు సంజయ్ బఘుల్.. వదోదరలో రోడ్డు పక్క టీకొట్టు వ్యాపారి అతడు.. అతని దగ్గర ఛాయ్ తాగడానికి వచ్చే వారికి వైఫై సదుపాయం కల్పించాడు.. అదీ ఉచితంగానే.. నా దగ్గర టీ తాగపోయినా పర్వాలేదు.. ఇంటర్నెట్ యాక్సెస్ ఫ్రీగానే చేసుకోవచ్చని వినయంగా చెబుతున్నాడు ఈ ఛాయ్ వాలా.. జనం హాయిగా ఛాయ్ తాగుతూ తమ మొబైల్ ఫోన్లలో ఇంటర్నెట్ సౌకర్యాన్ని ఆస్వాదిస్తూ, సంజయ్ కు థాంక్స్ చెప్పుకుంటున్నారు..
జనానికి ఉచితంగా వైఫై సదుపాయాన్ని కల్పించడం వల్ల సంజయ్ బఘుల్ ఏమైనా అధనంగా ప్రయోజనం పొందుతున్నాడా? అదేమీ లేదంటున్నాడీ ఛాయ్ వాలా.. మరెందుకు ఈ పని చేస్తున్నాడు.. ప్రధాని నరేంద్ర మోదీ డిజిటల్ ఇండియాస్వప్నం తనను ఆకట్టుకుందని సంజయ్ చెబుతున్నాడు.. 2019 నాటి దేశంలోని రెండున్నర లక్షల గ్రామాలకు ఫాస్ట్ ఇంటర్నెట్ కల్పించే డిజిటల్ ఇండియా కార్యక్రమానికి బడా పారిశ్రామికవేత్తలు ఇస్తున్న సహకారం ఏమిటో తెలియదు కానీ ఓ ఛాయ్ వాలా ఉడతా భక్తిగా తన వంతు సాయం ఇలా చేస్తున్నాడు..

ఇంటర్నెట్ సదుపాయాన్ని ఉచితంగా అందించడం అసాధ్యమేమీ కాదు. కానీ అలా చేస్తే తమ వ్యాపార సౌధాలు కూలుతాయని మొబైల్ సర్వీస్ ప్రొవైడర్ల భయం.. దేశ వ్యాప్తంగా ఉన్న వ్యాపార సంస్థలు గట్టిగా తలచుకుంటే సాకారం చేయవచ్చు.. బహిరంగ ప్రదేశాల్లో, షాపింగ్ సెంటర్లలో ఇప్పటికే చాలా చోట్ల ఉచిత వైఫై సౌకర్యం ఉంది.. దీన్ని మరింతగా విస్తరించాల్సి అవసరం ఉంది.. ఈ విషయంలో సంజయ్ బఘుల్ అందరికీ ఆదర్శంగా నిలిచాడు..

Friday, July 10, 2015

చరిత్ర చెప్పే బాహుబలి వేరు

బాహుబలి హిట్టా ఫట్టా?.. అని అడిగాడో మిత్రుడు. ఏ బాహుబలీ.. అంటూ ఎదురు ప్రశ్న వేశా.. అతను అయోమయంగా నా వైపు చూశాడు.. జర్నలిస్టువై ఉండి ఆ మాత్రం తెలీదా అనే జాలి చూపు కనిపించింది..
అవును.. చరిత్ర విద్యార్థిగా నాకు తెలిసిన బాహుబలి వేరు మరి.. ఇది తెలుసుకోవాలంటే కర్ణాటకలోని శ్రావణ బెళగొళ వెళ్లాల్సిందే.. జైన తీర్థంకరుల్లో ఒకరైన భారీ గోమఠేశ్వరుని విగ్రహం కనిపిస్తుంది.. ఈ గోమఠేశ్వరుడి అసలు పేరు బాహుబలి..
జైన గ్రంధాల ప్రకారం పోతనపురం (బోధన్, నిజామాబాద్) రాజధానిగా ఉన్న రాజ్యాన్ని పాలించిన ఇక్ష్వాకు వంశానికి చెందిన వృషభనాధుని కుమారుడే బాహుబలి.. అతనికి భరతుడు అనే సోదరుడు కూడా ఉన్నాడు.. ఇద్దరూ పరాక్రమవంతులే.. తండ్రి తర్వాత రాజ్యాధికారం కోసం పోటీ పడ్డారు. యుద్దంతో అపార నష్టం ఎందుకని ద్వంద్వ పోరాటం చేశారు. బాహుబలి విజయుడైనా భరతున్ని చంపకుండా వదిలేశాడు. తనకు రాజ్యాధికారం వద్దని, దీన్ని తృణప్రాయంగా వదిలేస్తున్నానని ప్రకటించాడు బాహుబలి.. అప్పటికప్పుడు సన్యాస దీక్ష తీసుకున్నాడు..
కాలక్రమంగా బాహుబలి గోమఠేశ్వరునిగా ప్రసిద్దికెక్కాడు.. జైన తీర్థంకరుల్లో ఒకడిగా మారాడు.. శ్రావణ బెళగొళలో గోమఠేశ్వరుని 58 అడుగుల భారీ విగ్రహం రూపొందింది.. ఇది సంక్షిప్తం చరిత్ర.. వివరంగా వెళ్లాలంటే చాలా ఉంది.

నాకు తెలిసిన బాహుబలి, సినిమా బాహుబలి వేర్వేరు.. రాజమౌళి భారీ వ్యయంతో తీసిన చిత్రం కథకు, చరిత్రకు సంబంధం లేదు.. పేరు యాదృచ్చికమే.. అందుకే పెద్దగా చర్చ వద్దని భావిస్తున్నాను..

చెత్త శుద్దిలో చిత్త శుద్ధి ఎంత?

స్వచ్ఛ్ భారత్, స్వచ్ఛ తెలంగాణ, స్వచ్ఛ హైదరాబాద్.. నినాదం ఏదైనా మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలనే స్ఫూర్తి దీని వెనుక ఉంది..  కార్యక్రమంలో సమాజంలోని అన్ని వర్గాలు చేరి భాగస్వాములయ్యాయి. చీపుళ్లు పట్టి వీధులు, పార్కుల్లోని చెత్తను, మట్టిని ఊడ్చి కుండీల్లో వేస్తున్నాం.. అంత వరకూ ఓకే.. ఆ తర్వాత ఏం జరుగుతోంది..
ఈ చెత్తనంతా తరలిండం పారిశుధ్య కార్మికుల పని.. ఎంత ఊడ్చి చెత్త పోగేసినా దాన్ని తీసుకెళ్లేది మాత్రం వీరే.. మనం ఎంత స్వచ్ఛతను పాటించినా ఈ పని జరగకపోతే చేసిందతా నిష్ప్రయోజనమే.. ఇప్పుడు జరుగుతున్నది అదే..
చాలా కాలంగా అపరిశ్కృతంగా ఉన్న తమ సమస్యలను, డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోనందుకు నిరసనగా పారిశుధ్య సిబ్బంది సమ్మెకు దిగారు.. సమస్యను పరిష్కరించే విషయంలో ప్రభుత్వం విఫలమైంది. ఇరువురూ రాజీ పడటంలేదు.. కార్మికుల డిమాండ్లలో చాలా వరకూ న్యాయమే కనిపిస్తోంది.. కానీ వాటికి ఒప్పుకుంటే ఆర్థిక భారం పెరిగిపోతుందని  ప్రభుత్వ వాదన..
ఈ సమస్యకు పరిష్కారం దొరకకపోవడంతో హైదరాబాద్ మహా నగరంలో కొద్ది రోజులుగా వీధుల్లో చెత్త గుట్టలుగా పేరుకుపోతోంది.. కంపు భరించపోతున్నాం.. పరిస్థితి ఇలాగే కొనసాగితే రాజధాని నగరం రోగగ్రస్థం కావడం ఖాయం..

స్వచ్ఛ కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వాములను చేయడమే కాదు, దీనితో ముడిపడి ఉన్న ఇతర అంశాలను ప్రభుత్వం కూడా పరిగణలోకి తీసుకోవాలి.. ఈ చిత్తశుద్ధి లేకపోతే స్వచ్ఛ కార్యక్రమాన్నీ శుద్ధ దండగే అవుతాయి..

Monday, July 6, 2015

దేశ సమగ్రత కోసం డాక్టర్ ముఖర్జీ బలిదానం

జిన్నా భారత దేశాన్ని విభజించి పాకిస్తాన్ ఏర్పాటు చేశాడు.. కానీ పాకిస్తాన్ ఏర్పడక ముందే దాన్ని చీల్చాడో నాయకుడు.. ఈనాడు పశ్చిమ బెంగాల్, పంజాబ్ (తూర్పు) రాష్ట్రాలు భారత దేశంలో భాగంగా ఉన్నాయంటే అది ఆ మహా నాయకుని పుణ్యమే... భారత దేశానికి స్వాతంత్ర్యం ఇవ్వాలంటే, ముస్లింల కోసం పాకిస్తాన్ ఏర్పాటు చేయాలని మహ్మద్ అలీ జిన్నా వత్తిడి తెచ్చాడు.. ఆనాటి వృద్ధ కాంగ్రెస్ నేతలు తాము జీవితంలో పదవులు అనుభవించలేమనే ఆందోళనతో దేశ విభజనకు తలొగ్గారు..  కొత్తగా ఏర్పాడే పాకిస్తాన్లో బెంగాల్, పంజాబ్ ప్రాంతాలను పూర్తిగా కలిపేయాలని నిర్ణయించారు.. ఆ సమయంలో గట్టిగా వ్యతిరేకించి అడ్డు పడిందో గళం.. ఈ రెండు రాష్ట్రాల్లో హిందూ, సిక్కు అధిక్యత గల ప్రాంతాలను విభజించి భారత దేశంలోనే ఉంచాలని పట్టుబట్టారా నాయకుడు.. ఆయనే డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ.. స్వతంత్ర భారత దేశంలో జాతీయవాద రాజకీయాలకు నాంది పలికిన మహానేత..
శ్యాంప్రసాద్ ముఖర్జీ.. 1901 జులై 6 కలకత్తాలో జన్మించారు. ఆయన తండ్రి అసుతోష్ ముఖర్జీ ప్రముఖ న్యాయవాది, కలకత్తా విశ్వ విద్యాలయం వైస్ ఛాన్సలర్ గా పని చేశారు.. శ్యాంప్రసాద్ ముఖర్జీ ఎంఏ, న్యాయవాద విద్య అభ్యసించారు. 1934లో 33 ఏళ్ల చిన్న వయసులోనే కలకత్తా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ బాధ్యతలు చేపట్టడం విశేషం. శాసనసభకు ఎన్నికైన శ్యాంప్రసాద్ ముఖర్జీ 1941లో బెంగాల్ ప్రావిన్స్ తొలి ఆర్థిక మంత్రిగా పని చేశారు. ఆ తర్వాత హిందూ మహాసభలో ప్రవేశించి ఆ పార్టీకి అధ్యక్షులు అయ్యారు ముఖర్జీ..
దేశ విభజన సమయంలో బెంగాల్, పంజాబ్ పూర్తిగా పాకిస్తాన్ కు వెళ్లకుండా అడ్డుపడ్డారు శ్యాంప్రసాద్ ముఖర్జీ.. జవహర్ లాల్ నెహ్రూ నేతృత్వంలోని స్వతంత్ర భారత జాతీయ ప్రభుత్వంలో పరిశ్రమల మంత్రిగా చేరారు. అయితే నెహ్రూ విధానాలను వ్యతిరేకించి ప్రభుత్వం నుండి బయటకు వచ్చేశారు.
దేశంలో జాతీయ వాదుల కోసం 1951లో భారతీయ జనసంఘ్ పార్టీని ప్రారంభించారు (ఈ పార్టీ కాలక్రమంలో భారతీయ జనతా పార్టీగా మారింది). 1952లో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో జనసంఘ్ 3 స్థానాల్లో గెలుపొందగా, ఒక స్థానంలో శ్యాంప్రసాద్ ముఖర్జీ విజయం సాధించారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తూ నెహ్రూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు ముఖర్జీ. ఆర్టికల్ 370 రద్దు కోసం పట్టుబట్టారు. ఏక్ దేశ్ మే విధాన్, ఏక్ దేశ్ మే దో ప్రధాన్, ఏక్ దేశ్ మే తో నిషాన్.. నహీ చలేగా, నహీ చలేగా..’ ( ఒక దేశంలో రెండు విధానాలు, ఇద్దరు ప్రధానులు, రెండు పతాకాలు వద్దే వద్దు) అంటూ నినదించారు..
జమ్మూ కాశ్మీర్ భారత దేశంలో సంపూర్ణ భాగం.. ఆ రాష్ట్రంలో భారతీయులకు నివసించే హక్కును ఎలా నిరాకరిస్తారని ప్రశ్నిస్తూ సత్యాగ్రహాన్ని తలపెట్టారు శ్యాంప్రసాద్ ముఖర్జీ.. ఇందులో భాగంగా 1953 మే 11న ఆ రాష్ట్రంలోని ప్రవేశించారు. జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ఆయనను అరెస్టు చేసింది. మే 23న నిర్భందంలోనే ప్రాణాలు కోల్పోయారు ముఖర్జీ.. ఆయన మరణం మిస్టరీగా మిగిలిపోయింది. దీనిపై దర్యాప్తు జరిపించేందుకు ప్రధాని నెహ్రూ నిరాకరించారు.
భారత దేశ సార్వభౌమత్వాన్ని కాపాడాలంటూ బలిదానం అయ్యారు శ్యాంప్రసాద్ ముఖర్జీ.. ఆయన ఇచ్చిన పోరాట స్పూర్తి మనకు ఆదర్శం కావాలి.. జూన్ 6న ముఖర్జీ జన్మదినం సందర్భంగా ఆ మహానాయకున్ని తలచుకుందాం.. దేశ సమగ్రతను కాపాడుకుందాం.. 

Thursday, July 2, 2015

అత్యవసర సందేశాలు.. సమస్యలు

విజయ్ సోదరుడు ఆస్పత్రిలో ఉన్నాడు. అర్జంటుగా పలానా గ్రూప్ రక్తం కావాలి. వాట్సప్ లో తన మొబైల్ నెంబర్ ఇచ్చి మెసేజ్ పెట్టాడు.. ఆ మెసేజ్ చూశాడు రాకేష్.. తనది ఆ గ్రూపు రక్తం కాదు ఎలా?.. అయ్యో పాపం అర్జంటు అంటున్నారు కదా అని మెసేజ్ మరి కొందరికి ఫార్వర్డ్ చేశాడు.. అలా పదులు, వందలు, వేల మందికి ఆ సందేశం వెళ్లింది.. కొద్ది వారాల పాటు ఇంకా ఫార్వర్డ్ అవుతూనే ఉంది..
విజయ్ సోదరునికి కావాల్సిన గ్రూప్ రక్తం దొరికింది. ఆపరేషన్ విజయవంతమై డిస్చార్జ్ అయ్యాడు.. కానీ కొత్త సమస్య పుట్టుకొచ్చింది.. విజయ్ కు మూడు నెలలుగా మొబైల్ మోగుతూనే ఉంది. సార్ రక్తం కావాలా? ఎక్కడికి రావాలి అని అడుగుతున్నారు. పాపం విజయ్.. అవసరం ఎప్పుడో తీరిపోయిందని అందరికీ ఓపికగా సమాధానం చెబుతున్నాడు. ఒక రకంగా ఇది హింసే.. ఈ కాల్స్ భరించలేక నెంబర్ మార్చలేని పరిస్థితి, మారిస్తే కాంటాక్ట్స్ పోతాయి.. ఈ సమస్య విజయ్ ఒకరిదే కాదు.. దాదాపు ప్రతి ఒక్కరిదీ..
ఆపదలో ఉన్నవారికి చేతనైన సాయం చేయడం మన ధర్మం, మానవత్వం.. మనం చేయలేకపోయినా, ఏదో రూపంలో సాయం అందాలని తపనపడుతుంటాం.. అందుకే అర్జంటుగా రక్తం కావాలంటూ మెసేజ్ రాగానే ఫార్వర్డ్ చేసేస్తుంటాం.. కానీ దాని వల్ల వస్తున్న సమస్యలు చూశారు కదా?.. మరి మెసేజ్ ఫార్వర్డ్ చేయకపోతే అవతల ఆపదలో ఉన్నవారికి సకాలంలో సాయం అందక ఇబ్బంది పడతారు కదా అనే అనుమానం రావడం సహజం. దీనికో పరిష్కారం ఉంది...
మీకు అర్జంటుగా బ్లడ్ కావాలనుకుంటే సందేశంతో పాటు దాన్ని పోస్ట్ చేసిన తేదీ కూడా పెట్టండి.. తద్వారా ఆ మెసేజ్ ఎప్పటిదో అవతలి వారికి తెలుస్తుంది.. అలాగే మెసేజ్ అందుకున్నవారు కూడా డిటైల్స్ జాగ్రత్తగా చూడండి.. అందులోని కాంటాక్ట్ నెంబర్ కు ఫోన్ చేసి అవసరం తీరిందా, లేదా? కనుక్కోండి.. ఆ తర్వాతే షేర్ చేయండి.. ఈ జాగ్రత్తలు పాటిస్తే అవసరమైన వారికి సకాలంలో సాయం అందడంతో పాటు, వారికి ఇబ్బందులు కూడా తప్పుతాయి.. (ఈ మెసేజ్ మాత్రం నిరభ్యంతరంగా అందరికీ షేర్ చేయండి..)

Wednesday, July 1, 2015

ఔట్ లుక్ చిల్లర రాతలు

మహిళలను గౌరవంతో చూడాలని మన పెద్దలు చెబుతుంటారు.. మహిళలను పూజించే చోట దేవతలు కొలువై ఉంటారని ఆర్యోక్తి.. ఆధునిక సమాజంలో అన్ని రంగాల్లోనూ పురుషులతో సమానంగా మహిళలు పని చేస్తున్నారు.. తమతో పోటీ పడి ఆడవాళ్లు పని చేయడం ఏమిటీ అనే జలసీతో ఫీలయ్యే మగాళున్న సమాజం మనది. ఈ అహంకారమే సూటి పోటి కామెంట్లకు దారి తీస్తుంది.. ఈ మనస్థత్వం వల్ల పతనమయ్యేదీ వారే.. దురదృష్టవశాత్తు మీడియా కూడా ఈ అహంకార పైత్యంతో బాధపబుతోందని ఔట్ లుక్ చాటుకుంది.. జాతీయ స్థాయితో పేరు ప్రతిష్టలున్న ఈ పత్రిక ఓ మహిళా ఐఏఎస్ అధికారిణిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం మాత్రమే కాకుండా, దిగజారుడు కారికేచర్ వేసింది.. విచిత్రం ఏమిటంటే దీన్ని రాసింది కూడా మహిళా జర్నలిస్టేనట.. ఎంత విడ్డూరం..  సదరు అధికారిణి ఆ పత్రికను నోటీసు పంపారు.. ఆ కథనం తాలూకు క్లిప్పింగ్ నా దగ్గర కూడా ఉన్నా, సోషల్ మీడియాలో చూపించడం, మరింత ప్రచారం కల్పించడం ఇష్టంలేకే పోస్ట్ చేయలేదు. ఔట్ లుక్ పత్రిక క్షమాపణలు చెప్పుకునే వారకూ ఆ పత్రిక చదవొద్దని నిర్ణయించుకున్నాను.. అందరూ అదే పని చేయాలని కోరుతున్నాను..