Friday, July 10, 2015

చరిత్ర చెప్పే బాహుబలి వేరు

బాహుబలి హిట్టా ఫట్టా?.. అని అడిగాడో మిత్రుడు. ఏ బాహుబలీ.. అంటూ ఎదురు ప్రశ్న వేశా.. అతను అయోమయంగా నా వైపు చూశాడు.. జర్నలిస్టువై ఉండి ఆ మాత్రం తెలీదా అనే జాలి చూపు కనిపించింది..
అవును.. చరిత్ర విద్యార్థిగా నాకు తెలిసిన బాహుబలి వేరు మరి.. ఇది తెలుసుకోవాలంటే కర్ణాటకలోని శ్రావణ బెళగొళ వెళ్లాల్సిందే.. జైన తీర్థంకరుల్లో ఒకరైన భారీ గోమఠేశ్వరుని విగ్రహం కనిపిస్తుంది.. ఈ గోమఠేశ్వరుడి అసలు పేరు బాహుబలి..
జైన గ్రంధాల ప్రకారం పోతనపురం (బోధన్, నిజామాబాద్) రాజధానిగా ఉన్న రాజ్యాన్ని పాలించిన ఇక్ష్వాకు వంశానికి చెందిన వృషభనాధుని కుమారుడే బాహుబలి.. అతనికి భరతుడు అనే సోదరుడు కూడా ఉన్నాడు.. ఇద్దరూ పరాక్రమవంతులే.. తండ్రి తర్వాత రాజ్యాధికారం కోసం పోటీ పడ్డారు. యుద్దంతో అపార నష్టం ఎందుకని ద్వంద్వ పోరాటం చేశారు. బాహుబలి విజయుడైనా భరతున్ని చంపకుండా వదిలేశాడు. తనకు రాజ్యాధికారం వద్దని, దీన్ని తృణప్రాయంగా వదిలేస్తున్నానని ప్రకటించాడు బాహుబలి.. అప్పటికప్పుడు సన్యాస దీక్ష తీసుకున్నాడు..
కాలక్రమంగా బాహుబలి గోమఠేశ్వరునిగా ప్రసిద్దికెక్కాడు.. జైన తీర్థంకరుల్లో ఒకడిగా మారాడు.. శ్రావణ బెళగొళలో గోమఠేశ్వరుని 58 అడుగుల భారీ విగ్రహం రూపొందింది.. ఇది సంక్షిప్తం చరిత్ర.. వివరంగా వెళ్లాలంటే చాలా ఉంది.

నాకు తెలిసిన బాహుబలి, సినిమా బాహుబలి వేర్వేరు.. రాజమౌళి భారీ వ్యయంతో తీసిన చిత్రం కథకు, చరిత్రకు సంబంధం లేదు.. పేరు యాదృచ్చికమే.. అందుకే పెద్దగా చర్చ వద్దని భావిస్తున్నాను..

No comments:

Post a Comment