Monday, July 6, 2015

దేశ సమగ్రత కోసం డాక్టర్ ముఖర్జీ బలిదానం

జిన్నా భారత దేశాన్ని విభజించి పాకిస్తాన్ ఏర్పాటు చేశాడు.. కానీ పాకిస్తాన్ ఏర్పడక ముందే దాన్ని చీల్చాడో నాయకుడు.. ఈనాడు పశ్చిమ బెంగాల్, పంజాబ్ (తూర్పు) రాష్ట్రాలు భారత దేశంలో భాగంగా ఉన్నాయంటే అది ఆ మహా నాయకుని పుణ్యమే... భారత దేశానికి స్వాతంత్ర్యం ఇవ్వాలంటే, ముస్లింల కోసం పాకిస్తాన్ ఏర్పాటు చేయాలని మహ్మద్ అలీ జిన్నా వత్తిడి తెచ్చాడు.. ఆనాటి వృద్ధ కాంగ్రెస్ నేతలు తాము జీవితంలో పదవులు అనుభవించలేమనే ఆందోళనతో దేశ విభజనకు తలొగ్గారు..  కొత్తగా ఏర్పాడే పాకిస్తాన్లో బెంగాల్, పంజాబ్ ప్రాంతాలను పూర్తిగా కలిపేయాలని నిర్ణయించారు.. ఆ సమయంలో గట్టిగా వ్యతిరేకించి అడ్డు పడిందో గళం.. ఈ రెండు రాష్ట్రాల్లో హిందూ, సిక్కు అధిక్యత గల ప్రాంతాలను విభజించి భారత దేశంలోనే ఉంచాలని పట్టుబట్టారా నాయకుడు.. ఆయనే డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ.. స్వతంత్ర భారత దేశంలో జాతీయవాద రాజకీయాలకు నాంది పలికిన మహానేత..
శ్యాంప్రసాద్ ముఖర్జీ.. 1901 జులై 6 కలకత్తాలో జన్మించారు. ఆయన తండ్రి అసుతోష్ ముఖర్జీ ప్రముఖ న్యాయవాది, కలకత్తా విశ్వ విద్యాలయం వైస్ ఛాన్సలర్ గా పని చేశారు.. శ్యాంప్రసాద్ ముఖర్జీ ఎంఏ, న్యాయవాద విద్య అభ్యసించారు. 1934లో 33 ఏళ్ల చిన్న వయసులోనే కలకత్తా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ బాధ్యతలు చేపట్టడం విశేషం. శాసనసభకు ఎన్నికైన శ్యాంప్రసాద్ ముఖర్జీ 1941లో బెంగాల్ ప్రావిన్స్ తొలి ఆర్థిక మంత్రిగా పని చేశారు. ఆ తర్వాత హిందూ మహాసభలో ప్రవేశించి ఆ పార్టీకి అధ్యక్షులు అయ్యారు ముఖర్జీ..
దేశ విభజన సమయంలో బెంగాల్, పంజాబ్ పూర్తిగా పాకిస్తాన్ కు వెళ్లకుండా అడ్డుపడ్డారు శ్యాంప్రసాద్ ముఖర్జీ.. జవహర్ లాల్ నెహ్రూ నేతృత్వంలోని స్వతంత్ర భారత జాతీయ ప్రభుత్వంలో పరిశ్రమల మంత్రిగా చేరారు. అయితే నెహ్రూ విధానాలను వ్యతిరేకించి ప్రభుత్వం నుండి బయటకు వచ్చేశారు.
దేశంలో జాతీయ వాదుల కోసం 1951లో భారతీయ జనసంఘ్ పార్టీని ప్రారంభించారు (ఈ పార్టీ కాలక్రమంలో భారతీయ జనతా పార్టీగా మారింది). 1952లో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో జనసంఘ్ 3 స్థానాల్లో గెలుపొందగా, ఒక స్థానంలో శ్యాంప్రసాద్ ముఖర్జీ విజయం సాధించారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తూ నెహ్రూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు ముఖర్జీ. ఆర్టికల్ 370 రద్దు కోసం పట్టుబట్టారు. ఏక్ దేశ్ మే విధాన్, ఏక్ దేశ్ మే దో ప్రధాన్, ఏక్ దేశ్ మే తో నిషాన్.. నహీ చలేగా, నహీ చలేగా..’ ( ఒక దేశంలో రెండు విధానాలు, ఇద్దరు ప్రధానులు, రెండు పతాకాలు వద్దే వద్దు) అంటూ నినదించారు..
జమ్మూ కాశ్మీర్ భారత దేశంలో సంపూర్ణ భాగం.. ఆ రాష్ట్రంలో భారతీయులకు నివసించే హక్కును ఎలా నిరాకరిస్తారని ప్రశ్నిస్తూ సత్యాగ్రహాన్ని తలపెట్టారు శ్యాంప్రసాద్ ముఖర్జీ.. ఇందులో భాగంగా 1953 మే 11న ఆ రాష్ట్రంలోని ప్రవేశించారు. జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ఆయనను అరెస్టు చేసింది. మే 23న నిర్భందంలోనే ప్రాణాలు కోల్పోయారు ముఖర్జీ.. ఆయన మరణం మిస్టరీగా మిగిలిపోయింది. దీనిపై దర్యాప్తు జరిపించేందుకు ప్రధాని నెహ్రూ నిరాకరించారు.
భారత దేశ సార్వభౌమత్వాన్ని కాపాడాలంటూ బలిదానం అయ్యారు శ్యాంప్రసాద్ ముఖర్జీ.. ఆయన ఇచ్చిన పోరాట స్పూర్తి మనకు ఆదర్శం కావాలి.. జూన్ 6న ముఖర్జీ జన్మదినం సందర్భంగా ఆ మహానాయకున్ని తలచుకుందాం.. దేశ సమగ్రతను కాపాడుకుందాం.. 

No comments:

Post a Comment