Monday, July 13, 2015

పుష్కరాలు.. పవిత్రత

గోదావరి నదికి పుష్కరాలు వచ్చాయి.. చలో అంటూ అందరూ పవిత్ర స్నానాలకు బయలు దేరేందుకు సిద్దమయ్యారు.. అసలు పుష్కరాలేమిటి? దీని పవిత్రత ఏమిటి?.. సంక్షిప్తంగా తెలుసుకుందామా?..
సృష్టిలో సకల జీవకోటి మనుగడకు జలమే ప్రధానం.. ప్రపంచంలోని నాగరికతలన్నీ నదీ తీరాల్లోనే పుట్టాయి. నదిని తల్లిగా భావించి పూజించడం మన సాంప్రదాయం.. మన పుణ్యక్షేత్రాలు కూడా చాలా వరకూ నదుల వెంటే ఉన్నాయి..
పంచ భూతాల్లో జలం కూడా ఒకటి.. పోషయతీతి, పుష్ణాతీతి పుష్కరం.. అంటే పోషించేది, పుష్టినిచ్చేది పుష్కరం అని అర్థం.. పుష్కరం అంటే మరేమిటో కాదు, జలాన్నే పుష్కరం అని కూడా అంటారు..
పుష్కరం 12 సంవత్సరాలు అని మరో అర్థం.. మనకు రాశులు 12.. ప్రతి నదికి ఒక రాశి ఉంది.. భారత దేశంలో 12 ప్రధాన నదులకు ప్రతి 12 ఏళ్లకోసారి పుష్కరాలు వస్తాయి.. అంటే ప్రతి ఏటా ఒక నదికి పుష్కరం వస్తుంటూనే ఉంటుంది.. బృహస్పతి ఆయా రాశుల్లో ప్రవేశించిన సంబంధిత నదికి పుష్కరాలు వస్తాయి.. పుష్కరం కాలం ఏడాది పాటు ఉంటుంది.. తొలి 12 రోజులను ఆది పుష్కరమని, చివతి 12 రోజుల్ని అంత్యపుష్కరమని వ్యవహరిస్తారు..
ఇప్పుడు బృహస్పతి సింహరాశిలో ప్రవేశించాడు.. సింహరాశి గోదావరి నదిది.. అందుకే గోదావరిని నదికి ప్రస్తుతం పుష్కరాలు వచ్చాయి.. జులై 14 నుండి 25వ తేదీ వరకూ గోదావరి ఆది పుష్కరాలు.. ఈసారి జరిగే గోదావరి పుష్కరాలకు మరో విశిష్ట ఉంది.. ఇవి 144 సంవత్సరాకు ఒకసారి వచ్చే మహా పుష్కరాలు..  గోదావరి నది మహారాష్ట్రలోని త్రయంబకేశ్వరంలో జన్మించి తెలంగాణ మీదుగా ప్రవహించి ఆంధ్రప్రదేశ్లో బంగాళాఖాతంలో కలుస్తుంది.. గోదావరి ప్రవహించే  1465 కిలో మీటర్ల మేర పుష్కరాలు కొనసాగుతాయి..
పుష్కరాల సందర్భంగా నదీ స్నానం, దానం, పిండప్రధాన క్రతువులు చేయడం మన ఆనవాయితీ. అన్నింటికీ మించి పుష్కార స్నానం పరమపవిత్రం అని చెబుతారు. పుష్కర సమయంలో త్రిమూర్తులు, సకల దేవతలు, పితృదేవతలు సప్తరుషులతో పాటు భూలోకంలోని అన్ని నదుల జలాలు అక్కడే ఉంటాయి. అందుకే పుష్కర స్నానానికి అంత పవిత్రత ఉంది..

గోదావరి పుష్కరాల సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు..

No comments:

Post a Comment