Tuesday, July 14, 2015

విషాదంలో రాజకీయం తగదు..

రాజమండ్రిలో గోదావరి పుష్కరాల వేళ విషాదం.. పవిత్ర స్నానాలకు వచ్చి తిరిగిరాని లోకాలకు పోవడం దురదృష్టకరం.. అన్ని ఏర్పాట్లు ఘనంగా చేశామని చెప్పుకుంది ప్రభుత్వం.. పుష్కరాలు ప్రారంభమైన మొదటి రోజే తొలి గడియల్లోనే దుర్ఘటన.. తక్కినలాట జరిగిన ప్రాంతంలో పరిస్థితులను చూస్తే ఇది కచ్చితంగా ఏర్పాట్లలో వైఫల్యమేనని స్పష్టంగా చెప్పవచ్చు..
పుష్కరాల తొలి గడియల్లోనే పుణ్య స్నానాలు చేయాలని భక్తులు ఆరాట పడటం సహజం.. పుష్కర ఘాట్ దగ్గర ముఖ్యమంత్రి, ఇతర వీఐపీలు ఉన్నారనే కారణంతో దార్లను మూసేసి తొక్కిసలాటకు తావిచ్చారు. గంటల తరబడి వేచి ఉన్న భక్తులు త్వరగా స్నానాలకు వెళ్లే తొందరలో ఉన్నారు.. అప్పటికే స్నానాలు పూర్తి చేసుకున్నవారు బయటకు వస్తున్నారు.. ఇద్దరికీ ఒకే దారి.. ఫలితంగా ఒకే మార్గంలో వచ్చేవారు, పోయేవారు తోపులాటకు దిగాల్సిన దుస్థితి ఏర్పడింది..
పుష్కర ఘాట్ దగ్గర ఒకేసారి అంత మంది భక్తులు గుమి గూడకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోలేదు.. భక్తులకు సూచనలు ఇచ్చేవారే కరువయ్యారు.. తొక్కిస లాట జరగకుండా నియంత్రించేందుకు తగిన సిబ్బంది లేరు.. దుర్ఘటన జరగగానే తీసుకెళ్లేందుకు తగిన అంబులెన్సులు, స్ట్రెచర్స్ అందుబాటులో లేవు.. ఘటనా స్థలంలో ప్రాథమిక చికిత్స చేసే యంత్రాంగమే లేదు..

చంద్రబాబు నాయుడు లాంటి ఎంతో అనుభవం ఉన్న నాయకుని నేతృత్వంలో ఇలాంటి దుర్ఘటన జరగడం శోఛనీయమైన విషయం.. ఇలాంటి బాధాకరమైన సమయంలో రాజకీయాలు చేయడం తగదు.. పోయిన ప్రాణాలు ఎలాగూ తిరిగి రావు.. ప్రతిపక్షాలు, మీడియా, విమర్శకులు  ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా పుష్కరాలు సక్రమంగా పూర్తయ్యేలా సలహాలు, సూచనలు ఇచ్చి సహకరించాల్సిన అవసరం ఉంది..

No comments:

Post a Comment