Thursday, July 2, 2015

అత్యవసర సందేశాలు.. సమస్యలు

విజయ్ సోదరుడు ఆస్పత్రిలో ఉన్నాడు. అర్జంటుగా పలానా గ్రూప్ రక్తం కావాలి. వాట్సప్ లో తన మొబైల్ నెంబర్ ఇచ్చి మెసేజ్ పెట్టాడు.. ఆ మెసేజ్ చూశాడు రాకేష్.. తనది ఆ గ్రూపు రక్తం కాదు ఎలా?.. అయ్యో పాపం అర్జంటు అంటున్నారు కదా అని మెసేజ్ మరి కొందరికి ఫార్వర్డ్ చేశాడు.. అలా పదులు, వందలు, వేల మందికి ఆ సందేశం వెళ్లింది.. కొద్ది వారాల పాటు ఇంకా ఫార్వర్డ్ అవుతూనే ఉంది..
విజయ్ సోదరునికి కావాల్సిన గ్రూప్ రక్తం దొరికింది. ఆపరేషన్ విజయవంతమై డిస్చార్జ్ అయ్యాడు.. కానీ కొత్త సమస్య పుట్టుకొచ్చింది.. విజయ్ కు మూడు నెలలుగా మొబైల్ మోగుతూనే ఉంది. సార్ రక్తం కావాలా? ఎక్కడికి రావాలి అని అడుగుతున్నారు. పాపం విజయ్.. అవసరం ఎప్పుడో తీరిపోయిందని అందరికీ ఓపికగా సమాధానం చెబుతున్నాడు. ఒక రకంగా ఇది హింసే.. ఈ కాల్స్ భరించలేక నెంబర్ మార్చలేని పరిస్థితి, మారిస్తే కాంటాక్ట్స్ పోతాయి.. ఈ సమస్య విజయ్ ఒకరిదే కాదు.. దాదాపు ప్రతి ఒక్కరిదీ..
ఆపదలో ఉన్నవారికి చేతనైన సాయం చేయడం మన ధర్మం, మానవత్వం.. మనం చేయలేకపోయినా, ఏదో రూపంలో సాయం అందాలని తపనపడుతుంటాం.. అందుకే అర్జంటుగా రక్తం కావాలంటూ మెసేజ్ రాగానే ఫార్వర్డ్ చేసేస్తుంటాం.. కానీ దాని వల్ల వస్తున్న సమస్యలు చూశారు కదా?.. మరి మెసేజ్ ఫార్వర్డ్ చేయకపోతే అవతల ఆపదలో ఉన్నవారికి సకాలంలో సాయం అందక ఇబ్బంది పడతారు కదా అనే అనుమానం రావడం సహజం. దీనికో పరిష్కారం ఉంది...
మీకు అర్జంటుగా బ్లడ్ కావాలనుకుంటే సందేశంతో పాటు దాన్ని పోస్ట్ చేసిన తేదీ కూడా పెట్టండి.. తద్వారా ఆ మెసేజ్ ఎప్పటిదో అవతలి వారికి తెలుస్తుంది.. అలాగే మెసేజ్ అందుకున్నవారు కూడా డిటైల్స్ జాగ్రత్తగా చూడండి.. అందులోని కాంటాక్ట్ నెంబర్ కు ఫోన్ చేసి అవసరం తీరిందా, లేదా? కనుక్కోండి.. ఆ తర్వాతే షేర్ చేయండి.. ఈ జాగ్రత్తలు పాటిస్తే అవసరమైన వారికి సకాలంలో సాయం అందడంతో పాటు, వారికి ఇబ్బందులు కూడా తప్పుతాయి.. (ఈ మెసేజ్ మాత్రం నిరభ్యంతరంగా అందరికీ షేర్ చేయండి..)

No comments:

Post a Comment