Friday, July 31, 2015

అన్నదాత మీకు గిట్టడా?

ఆరుగాలం కష్టపడి సమాజానికి తిండిని ఇచ్చే రైతన్నంటే అందరికీ అలుసే..
రైతుల ఆత్మహత్యలకు ప్రేమ వైఫల్యం, నపుంసకత్వం కూడా కారణమని సన్నాయినొక్కులు వినిపించారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధా మోహన్ సింగ్.. ఈ వ్యాఖ్యలపై దుమారం రేగడంతో ఈ వివరాలను తాము జాతీయ నేర నమోదు బ్యూరో నుండి తీసుకున్నామని వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.. పైగా ఆత్మహత్యలు చేసుకున్నవారి వృత్తుల్లో వ్యవసాయం అనే సబ్ కేటగిరీ ఈ గందరగోళానికి కారమయ్యిందని ముక్తాయింపు..
చూశారా ఎన్డీఏ ప్రభుత్వం రైతుల మీద ఎంత అన్యాయంగా మాట్లాడిందో అంటున్నారు కాంగ్రెస్ నేతలు.. మరి యూపీఏ ప్రభుత్వ హయంలో వ్యవసాయ మంత్రిగా ఉన్న శరద్ పవార్ సైతం ఆత్మహత్యలకు ప్రేమ వైఫల్యాలు కూడా కారణం అని చెప్పార కాదా అని ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ రికార్డులు తిరగేశారు.
రాహుల్ గాంధీ రైతుల ఆత్మహత్యలపై యాగీ చేస్తూ ఇటీవల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో యాత్రలు చేపట్టారు.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను పట్టించుకోవడం లేదని మొసలి కన్నీరు ఒలికించారు.. ఈ మహానుభావుడికి కేంద్ర రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రైతుల సమస్యలు, ఆత్మహత్యలు కనిపించలేదు.. అప్పుడు ఓదార్చే తీరిక దొరకలేదు.. ఇప్పుడే తీరింది.. ఎందుకంటే అప్పుడు చలవద్దాలు ధరించారు.. ఇప్పుడు భూతద్దాలు పెట్టుకున్నాడు.. అదే కారణం కాబోలు.
గత ఏడాది తెలుగు రాష్ట్రాల్లో 1979 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఇందులో 1347 మంది తెలంగాణలో, 632 మంది ఆం.ప్ర.లో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డట్లు నివేదికలు చెబుతున్నాయి.. ఈ విషయంలో రెండు రాష్ట్రాల అధినేతలు సక్రమంగా స్పందించిన దాఖలాలు లేవు.. రైతులకు రుణాలు, ఎరువులు, రసాయనాలు సకాలంలో అందించడంలో వీరికి ఏమాత్రం శ్రద్ధలేదు.. వర్షాభావం కారణంగా ఈ ఏడాది మళ్లీ కష్టకాలమే కనిపిస్తోంది.. ఇప్పటికే నిండా మునిగి ఉన్న అన్నదాతలను ఆదుకునే విషయంలో కనీస భరోసాకు కూడా దిక్కులేదు..

ప్రభుత్వ ఉద్యోగులకు జీతాల పెంపు, సమాజంలోని వివిధ వర్గాలకు ప్రజాధనాన్ని అప్పణంలా సంతర్పణ చేస్తున్నఈ ప్రభుత్వాలకు రైతులు, వారి కష్టాలు కనిపించడం లేదా? రైతన్న అంటే అంత అలుసైపోయాడా?

No comments:

Post a Comment