Saturday, July 11, 2015

ఛాయ్.. ఇంటర్నెట్

Tea with Wi-Fi.. ఛాయ్ తాగండి  మొబైల్ ఇంటర్నెట్ వాడుకోండి.. అంటున్నాడు సంజయ్ బఘుల్.. వదోదరలో రోడ్డు పక్క టీకొట్టు వ్యాపారి అతడు.. అతని దగ్గర ఛాయ్ తాగడానికి వచ్చే వారికి వైఫై సదుపాయం కల్పించాడు.. అదీ ఉచితంగానే.. నా దగ్గర టీ తాగపోయినా పర్వాలేదు.. ఇంటర్నెట్ యాక్సెస్ ఫ్రీగానే చేసుకోవచ్చని వినయంగా చెబుతున్నాడు ఈ ఛాయ్ వాలా.. జనం హాయిగా ఛాయ్ తాగుతూ తమ మొబైల్ ఫోన్లలో ఇంటర్నెట్ సౌకర్యాన్ని ఆస్వాదిస్తూ, సంజయ్ కు థాంక్స్ చెప్పుకుంటున్నారు..
జనానికి ఉచితంగా వైఫై సదుపాయాన్ని కల్పించడం వల్ల సంజయ్ బఘుల్ ఏమైనా అధనంగా ప్రయోజనం పొందుతున్నాడా? అదేమీ లేదంటున్నాడీ ఛాయ్ వాలా.. మరెందుకు ఈ పని చేస్తున్నాడు.. ప్రధాని నరేంద్ర మోదీ డిజిటల్ ఇండియాస్వప్నం తనను ఆకట్టుకుందని సంజయ్ చెబుతున్నాడు.. 2019 నాటి దేశంలోని రెండున్నర లక్షల గ్రామాలకు ఫాస్ట్ ఇంటర్నెట్ కల్పించే డిజిటల్ ఇండియా కార్యక్రమానికి బడా పారిశ్రామికవేత్తలు ఇస్తున్న సహకారం ఏమిటో తెలియదు కానీ ఓ ఛాయ్ వాలా ఉడతా భక్తిగా తన వంతు సాయం ఇలా చేస్తున్నాడు..

ఇంటర్నెట్ సదుపాయాన్ని ఉచితంగా అందించడం అసాధ్యమేమీ కాదు. కానీ అలా చేస్తే తమ వ్యాపార సౌధాలు కూలుతాయని మొబైల్ సర్వీస్ ప్రొవైడర్ల భయం.. దేశ వ్యాప్తంగా ఉన్న వ్యాపార సంస్థలు గట్టిగా తలచుకుంటే సాకారం చేయవచ్చు.. బహిరంగ ప్రదేశాల్లో, షాపింగ్ సెంటర్లలో ఇప్పటికే చాలా చోట్ల ఉచిత వైఫై సౌకర్యం ఉంది.. దీన్ని మరింతగా విస్తరించాల్సి అవసరం ఉంది.. ఈ విషయంలో సంజయ్ బఘుల్ అందరికీ ఆదర్శంగా నిలిచాడు..

No comments:

Post a Comment