Sunday, June 29, 2014

బోనాల పండుగ మొదలయ్యింది..

తెలంగాణ రాష్ట్రంలో తొలి బోనాల పండుగ.. చారిత్రిక గోల్కొండ కోటలో బోనాల సందడి మొదలయ్యింది..నెల రోజుల పాటు తెలంగాణ అంతటా ఘనంగా జరిగే బోనాలకు రాష్ట్ర పండుగ హోదా రావడం సంతోషకరం..తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ఇది నిజమైన గౌరవం.. నెత్తిన బోనం కుండలు.. పొతరాజుల కోళాహలం.. అమ్మోరి సిగాలు.. ఆషాడ మాసంలో ఈ నెల రోజుల పాటు తెలంగాణ అంతటా సందడి సందడి.. అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు..

పి.వి, ఎన్.టి.ఆర్.లకు భారతరత్న ఇవ్వాలి

పాములపర్తి వెంకట నరసింహా రావు, నందమూరి తారక రామారావు.. ఇద్దరూ ఇద్దరే.. ప్రపంచ ప్రఖ్యాతి గడించిన వారు.. అందునా మన తెలుగు వారు కావడం మనందరికీ గర్వకారణం..
ఏం.. పి.వి, ఎన్.టి.ఆర్. భారతరత్న అవార్డులకు అర్హులు కాదా? ఇప్పటికే ఈ అవార్డు అందుకున్న ఎం.జి.ఆర్., రాజీవ్ గాంధీతో పొలిస్తే, వీరు ఏ విధమైన అర్హత లేదో చెప్పగలరా?..
మన తెలుగు లెజెండ్స్ ఇద్దరికి భారతరత్న ఇవ్వాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు కలసికట్టుగా సిఫార్స్ చేయాలని డిమాండ్ చేద్దాం.. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తప్పకుండా పరిశీలిస్తుందనే నమ్మకం నాకుంది.. 

Friday, June 27, 2014

దొందుకు దొందు..దొందుడుకు చర్యలు..

ఆంధ్రప్రదేశ్,తెలంగాణ ప్రభుత్వాల పరస్పర ప్రతీకార చర్యలు భావి పౌరుల భవిష్యత్తుకు ముప్పుగా మారాయి.. తెలంగాణ ప్రభుత్వం  స్థానికతను సాకుగా చూపి, అర్థం లేని నిభందనలు పెట్టి విద్యార్థులకు ఫీస్ రీయంబర్స్, స్కాలర్షిప్స్ నిరాకరించడం బాధాకరం.. 1956కు ముందు తెలంగాణలో స్థిర పడిన వారే అర్హులట.. బతుకు తెరువు కోసం తెలంగాణకు వలసవచ్చిన కుటుంబాలకు ఇది గొడ్డలి పెట్టుగా మారింది..
ఇక్కడ బాధితులు సీమాంధ్ర వాసులే కాదు.. పొరుగున ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర, చత్తీస్ ఘఢ్ రాష్ట్రాల నుండి వలస వచ్చిన వారికీ ఇబ్బంది కరమే.. వీరిలో చాలా మందికి తమ స్వస్థలాల్లో ఆస్తిపాస్తులు కూడా లేవు.. కొందరైతే కాలక్రమంలో కుటుంబ సభ్యులకు, బంధు మిత్రులకు దూరమైపోయారు.. ఇందులో తెలంగాణ వారితో బంధుత్వాలు కలుపుకున్న కుటుంబాలూ ఉన్నాయి.. నా సీమాంధ్ర మిత్రుల్లో చాలా మంది తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి మద్దతు ఇచ్చారు. ఇప్పుడు వారు సైతం నొచ్చుకునే పరిస్థితి ఏర్పడింది..  అర్థం లేని ఆంక్షలు వారి భవిష్యత్తును అంధకారంలోకి నెడుతున్నాయి..

మరోవైపు ఆంధ్రప్రదేశ్ సర్కారు వైఖరి కూడా ఇందుకు భిన్నంగా లేదు.. తెలంగాణ సరిహద్దు జిల్లాల నుండి విజయవాడ్, కర్నూలు నగరాలకు వెళ్లి చదువుకునే విద్యార్ఠులు పెద్ద సంఖ్యలొనే ఉన్నారు.. ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ అధికారులు వారికి బస్ పాసులు ఇవ్వడంపై ఆంక్షలు పెడుతున్నారు.. ఈ సమస్య ఖమ్మం జిల్లా వాసులకు ఎక్కువగా ఉంది..  
చావు పుట్టుకలు మన చేతుల్లో ఉండవు.. తెలిసో తెలియకో ఉపాధి కోసం వలస వచ్చిన వారిని అర్థం లేని ఆంక్షలతో మానసికంగా శిక్షించడం భావ్యమేనా? ఇరు రాష్ట్రాల పాలకులు పగలు, ప్రతీకారాలు వదిలి సామరస్యంగా ఆలోచించాలి..

Thursday, June 26, 2014

30 రోజులు..

కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారం చేపట్టి నెల రోజులు పూర్తయ్యింది.. మోదీ నెల రోజుల పాలన ఎలా ఉందని అడిగితే, చూసే వారి కోణాన్ని బట్టి జవాబు ఉంటుంది..
మోదీ సర్కారు రైలు చార్జీలు పెంచిందని, పెట్రోలియం ఉత్పత్తుల ధరలను నియంత్రించడం లేదని ప్రతిపక్షాలు, ఆయనంటే గిట్టని వారు గగ్గోలు పెట్టేస్తున్నారు. నిజానికి ఇది ఎప్పుడూ ఉండే గోలే.. వారు నరేంద్ర మోదీని గతంలో విమర్శించారు.. ఇప్పుడూ విమర్శిస్తున్నారూ.. భవిష్యత్తులొ కూడా ఇలాగే ఏడుస్తూనే ఉంటారు.. మనం సద్విమర్శలనే స్వీకరిద్దాం..
నరేంద్ర మోదీ ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూనే, పొరుగు దేశాలతో సత్సంబంధాలకు నాంది పలికారు.. ప్రభుత్వ యంత్రాంగంలో బాధ్యత, జవాబుదారి తనం పెంచే దిశగా ప్రయత్నాలు చేపట్టారు.. ప్రతి ప్రభుత్వ విభాగాన్నీ ఆయతన  నిషితంగా పరిశీలిస్తున్నారు.. దశాబ్ద కాలంగా పేరుకుపొయిన యూపీఏ పాలన తాలూకు చెత్తను తొలగించాలంటే కొంత సమయం పడుతుంది. అయితే విమర్షకులు ఆగేట్టు లేరు.. బిడ్డ పుట్టగానే పరుగెత్తాలనే తొందర వారిది.. మోదీ ప్రధాని అయిన మరునాటి నుండే వారి దాడి మొదలైంది.. ఇలాంటి వారిని పట్టించుకోవాల్సిన అవసరం ఉందంటారా?
ఒక ఆంగ్ల పత్రిక నిర్వహించిన తాజా సర్వే ప్రకారం.. నరేంద్ర మోదీ నెల రోజుల పాలనపై అత్యధిక శాతం ప్రజలు దేశ ప్రజలు సంత్రుప్తిని వ్యక్తం చేశారు.. గత ప్రధానులతో పొలిస్తే 69 శాతం ఉత్తమమని మార్కులిచ్చారు.. దేశం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే సత్తా మోదీకే ఉందన్నారు.. ఇది చాలు నెల రోజుల పాలనపై జడ్జ్ చేసేందుకు..   

Tuesday, June 24, 2014

కాశ్మీర్ కోసం బలిదానం

జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370కి వ్యతిరేకంగా పోరాడి అమరుడైన జనసంఘ్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీని గుర్తు తెచ్చుకుందాం.. ఈ రోజు ఆ మహనీయుని బలిదాన దినం (23 జూన్ 1953)
జూలై 6, 1901న కలకత్తాలో అశుతోష్ ముఖర్జీ, జోగమయా దేవిలకు జన్మించారు శ్యామ ప్రసాద్.. తండ్రి అశుతోష్ ముఖర్జీ కలకత్తా విశ్వ విద్యాలయ తొలి వైస్ ఛాన్సలర్..  ఎంఏ, బారిస్టర్ చేసిన శ్యామ ప్రసాద్ ముఖర్జీ 1934లో 33 ఏళ్ల చిన్న వయసులోనే అదే యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ అయ్యి రికార్డు సృష్టించారు.. కాంగ్రెస్ పార్టీ తరపున అవిభక్త బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికైన శ్యామప్రసాద్జీ 1941లో ఆ రాష్ట్ర తొలి ఆర్ధిక మంత్రిగా పని చేశారు.. కాంగ్రెస్ విధానాలతో అసంతృప్తితో హిందూ మహాసభలో చేరారు.. ఆ సంస్థకు అధ్యక్షునిగా పని చేశారు.. బ్రిటిష్ వారు దేశ విభజన తలపెట్టినప్పుడు బెంగాల్ ను ఏకమొత్తంగా పాకిస్తాన్లో చేర్చేందుకు అభ్యంతరం చెప్పారు శ్యామప్రసాద్ ముఖర్జీ.. ఇవాళ పశ్చిమ బెంగాల్ భారత దేశంలోనే ఉందంటే అది ఆయన పోరాట ఫలితమే..
జవహర్ లాల్ నెహ్రూ ప్రధానిగా ఏర్పాటైన స్వాతంత్ర భారత తొలి క్యాబినెట్లో శ్యామప్రసాద్ ముఖర్జీ పరిశ్రమల శాఖమంత్రిగా పని చేశారు.. నెహ్రూ విధానాలతో విసుగొచ్చి 1950లో కేంద్ర మంత్రి పదవికి  రాజీనామా చేశారు.. ఆర్ఎస్ఎస్ సర్ సంఘ్ చాలక్ గోల్వాల్కర్ (గురూజీ) చర్చించిన శామప్రసాద్ ముఖర్జీ 1951 అక్టోబర్ 21న భారతీయ జనసంఘ్ పార్టీని స్థాపించారు ( కాలక్రమంలో భారతీయ జనతా పార్టీగా మారింది)
భారత దేశంలో సంపూర్ణంగా విలీనమైన జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370కి వ్యతిరేకంగా శ్యామ ప్రసాద్ ముఖర్జీ ఉద్యమం ప్రారంభించారు.. జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక జెండా, రాజ్యాంగం, ప్రధానమంత్రి ఉండటాన్ని ప్రశ్నించారు.. ఒకే దేశంలో రెండు రాజ్యాంగాలు, రెండు జెండాలు, ఇద్దరు ప్రధానులు ఉండరాదని గట్టిగా నినదించారు.. కాశ్మీర్ వెళ్లి నిరాహార దీక్ష తలపెట్టారు.. శ్యామప్రసాద్ ముఖర్జీ గుర్తింపు కార్డు లేకుండా కాశ్మీర్ లోకి ప్రవేశించారనే సాకుతో  షేక్ అబ్దుల్లా ప్రభుత్వం మే 11, 1953న ఆయనను అరెస్టు చేసింది.. కాశ్మీర్ జైలులో అనుమానాస్పద పరిస్థితుల్లో జూన్ 23న ప్రాణాలు కోల్పోయారు శ్యామ ప్రసాద్జీ.. ఆయన మరణంపై విచారణ జరిపించాలని జనసంఘ్ డిమాండ్ చేసినా ప్రధాని నెహ్రూ పట్టించుకోలేదు..  ముఖర్జీ మరణం నేటికీ అనుమానాస్పదంగా మిగిలింది..

కాశ్మీర్ కోసం ప్రాణ త్యాగం చేసిన మహానీయుడు శ్యామ ప్రసాద్ ముఖర్జీ.. ఆర్టికల్ 370ని పూర్తిగా రద్దు చేసిన నాడే ఆయనకు నిజమైన నివాళి.. ఇందు కోసం పోడాల్సిన బాధ్యత  ప్రతి భారతీయునిపై ఉంది..

కుబేరుడు అక్రమార్కుడా?

హిందూ మతంలో కుబేరున్ని సంపదకు దేవునిగా పూజిస్తారు.. అష్ట దిక్పాలకుల్లో ఒకరైన కుబేరుడు యక్షులకు రాజు, అలకాపురి ఆయన రాజధాని అని హిందూ పురాణాలు చెబుతున్నాయి.. బౌద్దులు కూడా కుబేరున్ని దేవతగా గుర్తించారు.. సంపదకు అధిపతి అయిన కుబేరుడు మనం కలియుగ దైవంగా పూజిస్తున్న వేంకటేశ్వర స్వామి వారికి అప్పు ఇచ్చాడు.. శ్రీవారి అప్పులు తీర్చేందుకే మనం ఆయనకు ముడుపులు చెల్లించుకుంటున్నాం..
అసలు విషయానికి వద్దాం.. విదేశీ బ్యాంకుల్లో ఉన్న నల్ల ధనాన్ని వెనక్కి రప్పించేందుకు కేంద్రంలోని మోదీ సర్కారు చర్యలు ప్రారంభించింది.. ఈ సందర్భంగా నల్ల ధనాన్ని పోగేసిన వారిని మన మీడియా నల్ల కుబేరులు అని రాస్తోంది.. ఇదేం విడ్డూరం.. కుబేరుడేమన్నా అక్రమంగా ధనం పోగేశాడా?.. అక్రమార్కులను ప్రోత్సహించాడా?..

దేవుడిని గుర్తింపు పొందిన కుబేరున్ని అవమానపరచడం ద్వారా మెజారిటీ ప్రజల మనోభావాలు దెబ్బతింటున్నాయనే స్పృహ ఉందా ఈ రాతగాళ్లకు?

Sunday, June 22, 2014

కొత్త సీసాలో పాత సారా

హైదరాబాద్ పోలీసు వ్యవస్థకు అంతర్జాతీయ ప్రమాణాలు తీసుకు వస్తారట.. ఐక్యరాజ్య సమితి పోలీసుల డ్రెస్ కోడ్, న్యూయార్క్, లండన్ నగరాల్లో ఉన్న పోలీసు విధానాలను అమలు పరుస్తారట.. అత్యాధునిక వాహనాలు, పరికరాలు, సౌకర్యాలు, హంగూ ఆర్భాటం వచ్చేస్తోందట.. ఇదంతా ఆగస్టు 15 నాటికి సిద్దం కావాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ఆదేశాలు.. బాగానే ఉంది.

మరి ఇప్పుడున్న పోలీసులను ఏం చేస్తారు?.. బ్రాండ్ మారినా కొత్త సీసాలో పాత సారా అన్నట్లే ఉంటే కష్టమే కదా?.. మన పోలీసు శాఖకు ఇంటర్నేషనల్ లుక్ తేవడం మంచిదే.. సాధారణ ప్రజలు పోలీసు అంటేనే భయపడిపోతారు.. ఎందుకలా?.. కారణాలు అందరికీ తెలుసు.. ముందు మన పోలీసులను సంస్కరించడం మంచిది.. ఆ తర్వాతే అధునికత గురుంచి ఆలోచిస్తే బాగుంటుంది.. ఈ అంశంపై సోషల్ మీడియా పోలీసు మిత్రులు కూడా స్పందించాలని కోరుకుంటున్నాను..

Friday, June 20, 2014

గవర్నర్లను మార్చొద్దా?

కొత్తగా అధికారంలోకి వచ్చిన ఎవరైనా ప్రభుత్వ యంత్రాంగం తమకు విధేయంగా, అనుకూలంగా ఉండాలని కోరుకోవడం సహజం.. అది కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, మరే కూటమి అధికారంలోకి వచ్చినా చేసే పనే.. గత ప్రభుత్వ వ్యవస్థను, రాజకీయ నియామకాలను కొనసాగించాలని కోరుకోవడం సమంజనం కాదు..
నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక ఈ దిశగా ప్రక్షాళన ప్రారంభించారు.. అందులో భాగంగానే గతించిన యూపీఏ ప్రభుత్వం నియమించిన రాష్ట్రాల గవర్నర్లను తొలగిస్తున్నారు.. ఇంత మాత్రానికే ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టేస్తున్నాయి.. మరి కాంగ్రెస్ వారు 2004లో తాము చేసిన పనేమిటో మరిచిపోయారా? ఎన్డీఏ నియమించిన గవర్నర్లను తొలగించలేదా?.. మరి ఎందుకు గొంగట్లో వెంట్రుకలు ఏరుతున్నారు?
గవర్నర్లను మర్చే దుష్ట సాంప్రదాయం 1977లో అధికారంలోకి వచ్చిన జనతా ప్రభుత్వం ప్రారంభించిందని అంటున్నారు.. నిజమే అప్పుడు తొలిసారిగా అధికారం చేపట్టిన కాంగ్రెసేతర ప్రభుత్వం ఆ పని చేపట్టడాన్ని ఎలా తప్పుపట్టగలం.. ఇప్పడు కాంగ్రెస్ ఇతర ప్రభుత్వాలు కోరుకుంటున్న ప్రకారం తాము నియమించిన గవర్నర్లనే కొనసాగించాలనే అనుకుందాం.. వీరిలో చాలా మంది కాంగ్రెస్ పార్టీ వారే ఉన్నారు.. అంటే ఎన్డీఏ సర్కారులో పరోక్షంగా తమ ఏజెంట్లు ఉండాలి.. పాలనకు ఆటంకాలు కలిగించాలి.. ఇదేనా ఆ పార్టీ కోరుకుంటున్నది.. కొత్త ప్రభుత్వానికి తమ వారిని, విధేయంగా ఉండేవారిని నియమించుకోవద్దు అని వాదించడం మూర్ఖత్వం కాదా?

నిజానికి గవర్నర్ల వ్యవస్థే గందరగోళం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను అనుసంధానంగా ఉండేందుకు మన రాజ్యాంగవేత్తలు ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు.. కానీ కేంద్రంలో అధికారంలో ఉండే పార్టీలు దీన్ని రాజకీయ నిరుద్యోగులు, వృద్ధ నేతల పునరావాస కేంద్రంగా మార్చేశాయి.. చాలా రాష్ట్రాల్లో రాజ్ భవన్ లు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలకు వ్యతిరేకంగా, కుట్రలు కుంతంత్రాలకు కేంద్రాలకు మారడం చూస్తునే ఉన్నాం.. ఇలాంటి గవర్లర్ల వ్యవస్థ అవసరమా అనే అంశంపై దశాబ్దాలుగా చర్చ జరుగుతూనే ఉంది.. మోదీ సర్కారు ఈ దిశగా ప్రక్షాళన చేపడితే చాలా బాగుంటుంది..

Wednesday, June 18, 2014

ఛాప్లిన్ కథ.. నా వ్యధ

ఓ రంగస్థల థియేటర్లో ప్రఖ్యాత హాస్య నటుడు ఛార్లీ ఛాప్లీన్ ను అనుకరించే పోటీలు జరుగుతున్నాయి.. చాలా మంది నటులు ఛార్లీని అనుకరిస్తూ పోటీ పడుతున్నారు.. ఇది తెలిసిన అసలు ఛార్లీ ఛాప్లిన్ సరదాగా తానూ రంగస్థలంపై పోటీకి దిగారు.. విచిత్రంగా ఆయనకు రెండో స్థానం వచ్చిది.. మొదటి స్థానం ఓ ఔత్సాహిక నటునికి వచ్చింది.. అసలు విషయం తెలిసి నిర్వాహకులు ఖంగుతిన్నారు.. ఈ స్టోరీ ఎందుకు చెబుతున్నా అనుకుంటున్నారా?..
సోషల్ మీడియాలో నా పోస్టులను చాలా మంది షేర్ చేసుకోవడం సంతోషాన్ని కలిగిస్తోంది.. వారికి అంతగా నచ్చినందుకు గర్వం కలుగుతోంది.. వివిధ అంశాలపై నా రాతాలు ఎంతో మందికి చేరుతున్నందుకు ఒక జర్నలిస్టుగా నా ఇగో అలా సాటిస్పై అవుతుంది.. కానీ దురదృష్టవశాత్తు కొందరు మిత్రులు నా పోస్టును కాపీ అండ్ పేస్ట్ (సంగ్రహణ) చేసుకుంటున్నారు.. కనీసం ఆ పోస్టు పలానా వ్యక్తికి అనే క్రెడిట్ లైన్ కూడా తగిలించడం లేదు.. ఆ పోస్టులకు లైకులూ భారీగానే పడుతున్నాయి.. కొందరు వాహ్వా అద్భుతంగా రాశావు గురూ అని పొగిడేస్తున్నారు. (పాపం వారికి తెల్వదు కదా అది సంగ్రహ తెలివి అని).. కనీసం అప్పుడైనా ఈ పోస్టు నేను రాసింది కాదు.. పలానా మిత్ర అనే ఆయనది అని నిజం చెప్పేసి ఉంటే నేను కొంత సంతోషించేవాన్ని.. కానీ అది అత్యాశే అవుతోంది.. చాలా మంది మిత్రులు తెలిసో తెలియకో ఇలా చేస్తుంటారని నేను స్పందించలేకపోతున్నాను.. కానీ అవి శృతి మించడంతో ఇప్పుడు తప్పలేదు..

అర్థమైంది కదూ.. ఛార్లీ ఛాప్లిన్ కథకూ, నా వ్యధకు లింకేమిటో.. సో మిత్రులారా.. నా పోస్టులు నిరభ్యంతరంగా వాడుకోండి.. షేర్ చేసుకోండి.. కానీ ఇది పలానా (నేనే) ఆయన రాసింది అని చిన్న ట్యాగ్ తగిలస్తే సంతోషిస్తాను..

Monday, June 16, 2014

మీరు కాశ్మీర్ నుండి పోటీ చేయగలరా?

గులాం నబీ ఆజాద్.. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో పుట్టారు.. కాంగ్రెస్ పార్టీ ద్వారా జాతీయ నాయకునిగా ఎదిగారు.. పార్లమెంట్ సభ్యునిగా, కేంద్ర మంత్రిగా పని చేశారు.. జమ్మూ కాశ్మీర్ కు ముఖ్యమంత్రి కూడా అయ్యారు.. ఒకసారి మహారాష్ట్రలో నుండి లోక్ సభకు (1980) పోటీ  చేసి ఎన్నికయ్యారు.. భారత దేశం ఆయనకు ఇచ్చిన గొప్ప అవకాశాలు ఇవి..
మీరూ ఆజాద్ ను స్పూర్తిగా తీసుకోవచ్చు.. కానీ ఒక భారతీయునిగా మీరు వెళ్లి జమ్మూ కాశ్మీర్ నుండి పోటీ చేస్తానంటే చచ్చినా కుదరదు.. ఎందుకంటే అది ఆర్టికల్ 370 పుణ్యమే..
గులాం నబీ ఆజాద్ కు ఢిల్లీలోనో, దేశంలోని మరే ప్రాంతంలోనో ఆస్తిపాస్తులు ఉన్నాయో లేదో నాకైతే తెలియదు.. కానీ మనం వెళ్లి కాశ్మీర్లో ఉద్యోగం చేద్దామన్నా, ఆస్తులు కొనుగోలు చేద్దామన్ని వీలు పడదు.. షరా మామూలే..
భారత రాష్ట్రపతి, ప్రధానమంత్రి సైతం కాశ్మీర్లో వేలు పెట్టలేడు..
ఆర్టికల్ 370.. ఇలాంటి ద్వంద్వ ప్రమాణాలతో కాశ్మీర్, ఇతర రాష్ట్రాల ప్రజలను వేరు చేస్తున్న ఈ చట్టం అవసరమా? భారత దేశంలోని ఏ రాష్ట్రానికీ లేని ఆర్టికల్ 370 జమ్మూ కాశ్మీర్ కే ఎందుకు?

Sunday, June 15, 2014

Article 370 - In Reality పై చర్చ

కాశ్మీర్ సమస్యను హిందూ, ముస్లిం కోణంలో చూడటం సరికాదు.. ఇది జాతీయవాదులు, జాతి వ్యతిరేకులకు మధ్య జరుగుతున్న పోరాటం.. కాశ్మీరీలను జాతీయ జీవన స్రవంతిలోకి తీసుకువచ్చేందుకు ఆర్టికల్ 370ని తొలగించడం సాధ్యమే..
Article 370 - In Reality అనే అంశంపై హైదరాబాద్ లో జరిగిన చర్చలో రాజీవ్ పాండే గారి కీలక ఉపన్యాసంలోని సారాంశం ఇది.. 

తెలుగు తెగులు

పాఠశాలు మళ్లీ తెరిచారు.. చాలా మంది తల్లిదండ్రులు, తాతయ్యలు, నానమ్మలు, అమ్మమ్మలు తమ బుజ్జాయిలకు అక్షరాభ్యాసం కోసం సరస్వతీ దేవి కొలువైన బాసర తీసుకెళ్లడం ఆనవాయితీ.. సరస్వతీ మాత ఆలయంలో భారీ రద్దీ కనిపిస్తోంది.. అక్కడి అర్చకులు చిన్నారులకు మాత ఆశీస్సులతో అచ్చ తెలుగులోనే అక్షరాలు దిద్దిస్తున్నారు.. అంత వరకూ బాగానే ఉంది.. కానీ కొద్ది వారాల క్రితం నేను బాసర వెళ్లినప్పుడు ఒక విచిత్రమైన బోర్డు కనిపించింది.. ఆ బోర్గు మీద 'ప్రత్కేక' అక్షరాభ్యాసం 1000/- అని రాసి ఉంది.. సరస్వతి మాత కొలువులోనే తెలుగుకు తెగులు పట్టిందా అని బాధపడ్డాను.. అక్కడి ఓ అధికారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లితే లైట్ తీసుకోండి సార్ అని సలహా ఇచ్చాడు..
ఇటీవల FBలో మిత్రుడు శ్రీనివాస రావు అవ్వారు మరో విషయం ప్రస్తావించారు.. బాసరలో అక్షరాభ్యాసం కోసం అమ్ముతున్న పలకలపై ఆంగ్ల అక్షరాలు ప్రముఖంగా కనిపిస్తున్నాయి.. పాపం తల్లిదండ్రుల ఎంగిలిపీసు మోజును వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు.. కనీసం అక్షరాభ్యాస పలకలపై అయినా మాతృభాష లేకపోతే ఎలా? అనిపించింది.. అయితే ఒక వ్యాపారి చెప్పిందేమిటంటే బాసరకు తెలుగుతో పాటు హిందీ, మరాఠీ, కన్నడ భాషల వారు కూడా వస్తున్నారట.. వారి కోసం ప్రత్యేకంగా పలకలు అమ్మలేం కదా అంటున్నారు.. ఇదీ నిజమే.. మన పలకలు మనం తీసుకొని పోవడమే తగిన పరిష్కారం అనిపించింది..

నేను నెహ్రూను కాదు..

మన తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ పుణ్యమా అని జమ్మూ కాశ్మీర్ సమస్య నేటికీ రావణ కాష్టంగా రగులుతోంది..ఆర్టికల్ 370పై ప్రస్తుతం మరోసారి దేశ వ్యాప్తంగా చర్చ మొదలైంది..
ఎంత వరకు నిజమో తెలియదు కానీ ప్రచారంలో ఉన్న ఒక అంశాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను..
మన జమ్మూ కాశ్మీర్ లాగే చైనాలో జింగ్ జియాంగ్ (Xinjiang) అనే ముస్లిం ఆధిక్యత గల రాష్ట్రం ఉంది.. 1950లలో అక్కడిన వారు చైనా పాలకుడు మావో దగ్గరకు వెళ్లి, మాకూ కాశ్మీర్ తరహా ఆర్టికల్ 370 ప్రత్యేక ప్రతిపత్తి కావాలని కోరారట..
వారికి మావో ఇచ్చిన సమాధానం.. 'నేను నెహ్రూను కాదు..'

Wednesday, June 11, 2014

విషాద యాత్రగా మార్చకండి..

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని బియాస్ నదిలో హైదరాబాద్ విద్యార్థులు కొట్టుకుపోయిన ఘటన చాలా విచారాన్ని కలిగిస్తోంది.. ఆనందంగా ముగియాల్సిన విహారయాత్ర విషాదంగా మారింది.. ఇక్కడ మొదలి తప్పు హిమాచల్ ప్రభుత్వానికి.. రెండో తప్పు కాలేజీ యాజమాన్యానిది.. అయితే తప్పు ఎవరిది అని చర్చించుకోవడంకన్నా భవిష్యత్తులో ఇలాంటివి పునరావృత్తంకాకుండా చూసుకోవడం ముఖ్యం.. విద్యాసంస్థలు తమ విద్యార్థులను విహార యాత్రలకు పంపే సమయంలో అక్కడి పరిస్థితులు తెలిసిన వారిని గైడ్లుగా పంపాలి.. విద్యార్థులకు తోడుగా అధనపు సిబ్బందిని కూడా పంపాలి..అలాగే ప్రమాద సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముందుగానే చెప్పాలి.. ముందుగా బీమా చేయించడం తప్పని సరి.. అలాగే తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు తగిన జాగ్రత్తలు ముందుగానే చెప్పాలి.. 

Tuesday, June 10, 2014

పాచి పట్టిన ఆధార్..

ఆధార్.. ఇది సామాన్యుని చేతిలో పాశుపతాస్త్రం అంటూ యూపీఏ సర్కారు హడావుడి చేసింది.. చివరకు పాచిపట్టిన అస్త్రం అని తేలిపోయింది..
ఆధార్ కార్డులను సమర్ధంగా ఉపయోగిస్తే ప్రయోజనాల మాట ఎలా ఉన్నా, గ్యాస్ సిలిండర్ల లింకేజీ కారణంగా దేశ ప్రజల వ్యతిరేకతకు కారణమైంది.. ఎంత వ్యతిరేకత అంటే ఆధార్ సృష్టికర్త నందన్ నీలేకని కాంగ్రెస్ టికెట్ పై ఎంపీగా పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు..
ఆధార్ కార్డులపై తప్పులు వస్తే ఎవరికి మొరపెట్టుకోవాలో, వాపసు ఇస్తే తిరిగి కొత్తది ఇస్తారా అనే అనుమానాలు ఉన్నాయి.. వాటిపై ఫోటోలు మబ్బుగా ఉండటంతో ధృవీకరణ పత్రాలుగా కూడా చెల్లడం లేదు..
అసలు విషయానికి వస్తే ఆధార్ కార్డు బాసు నీలేకని గారి పూర్తి పేరు నందర్ మనోహర్ నీలేకని.. అయితే ఆయన పేరు ఆధార్ కార్డుపై నందన్ మోహన్ నీలేకనిగా ముద్రితమైందట.. హతవిధి.. ఆధార్ బాసుకే దిక్కులేని స్థితిలో సామాన్యుని కష్టాలు ఎలా ఉంటాయో ప్రభుత్వాలకు అర్థమయ్యే ఉండాలి
(డా.సుబ్రహ్మణ్య స్వామి పోస్టుకు స్వల్ప మార్పులతో)

Sunday, June 8, 2014

ఒకే పత్రిక.. రాష్ట్రానికో స్పెషల్

తెలుగు మీడియాలో ఆసక్తికరమైన పరిణామం..
ఇవాళ ఈనాడు సండే స్పెషల్ చూశారా?.. కవర్ పేజీ స్టోరీ ఏమిటి?.. ఏముంది కేసీఆర్ పై ఇచ్చారా కదా? అనుకుంటున్నారా?.. అయితే మీరు తెలంగాణ వాళ్లన్నమాట.. కాదే చంద్రబాబు గురుంచి రాశారు కదా? అంటున్నారా?.. అయితే మీరు కచ్చితంగా సీమాంధ్ర వారే..
ఈరోజు ఈనాడు దిన పత్రిక సండే స్పెషల్ రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా ఇచ్చింది.. తెలంగాణ ఎడిషల్ కేసీఆర్ ముఖ చిత్రంతో, ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ చంద్రబాబు ముఖచిత్రంతో సండే స్పెషల్స్ అందించాయి.. కొద్ది నెలలుగా ఈనాడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎడిషన్లను పూర్తి వైవిధ్య స్థానిక వార్తలు, కథనాలను అందిస్తూ వస్తోంది.. అదే బాటలో సాక్షి కూడా నడుస్తోంది.. ఆంధ్రజ్యోతి పాక్షికంగా ఆ పని చేస్తోంది.. అయితే ఆదివారం అనుబంధాలు మాత్రం రెండు ప్రాంతాల్లో ఒకటే వస్తున్నాయి.. విచిత్రంగా ఈనాడు ఇవాళ రెండు ప్రాంతాలకు వేర్వేరు సండే స్పెషల్స్ ఇచ్చి ఆసక్తిని రేకెత్తించింది..

పత్రికలు తమ పాఠకుల ఆసక్తులకు అనుగుణంగా తమ వ్యాపార అవసరాల కోసం స్థానిక వార్తలకు ప్రాధాన్యత ఇస్తూ ఎడిషన్లు తీసుకురావడాన్ని తప్పు పట్టలేం.. కానీ అన్ని ప్రాంతాల వారు ఆసక్తిగా చూసే ఆదివారం అనుబంధాలను కూడా ఇలా తీసుకురావడంలోని ఔచిత్యం ఏమిటో నాకు అర్థం కాలేదు.. ఏం కేసీఆర్ జీవిత విశేషాలు సీమాంధ్ర ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం లేదా?.. చంద్రబాబు గురుంచి తెలంగాణ ప్రజలకు ఇక అవసరం లేదా?.. ఆలోచించండి.. 

నవ్యాంధ్రకు స్వాగతం..

నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న నారా చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు.. తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య పరస్పరం స్నేహ పూర్వకంగా వ్యవహరిస్తూ అభివృద్ధిపదంలో దూసుకుపోవాలని కోరుకుంటున్నాను..

Saturday, June 7, 2014

ఏరు దాటాక..

నెల రోజుల క్రితం ఓ బ్రాండెడ్ షాపులో చెప్పులు కొన్నాను.. ఆరు నెలల వారంటీ అన్నాడు షాపువాడు.. కానీ రెండు వారాలకే తెగిపోయాయి.. ఆ షాపుకి వెళ్లి అడిగితే మీరు సరిగ్గా వాడలేదు.. వారంటీ వర్తంచదు అన్నాడు.. షరతులు వర్తిస్తాయనే నిబంధన చూడలేదా? అని దబాయించాడు.. అప్పుడనిపించింది.. వాన్ని చెప్పుతో ఒక్కటిచ్చుకోవాలని.. సరిగ్గా వాడటం అంటే చెప్పులను ఇంట్లోనే భద్రంగా పెట్టుకొని పాద పూజలు చేయాలేమో..
ఇటీవలి సార్వత్రిక ఎన్నికల సందర్భంగా లక్షలోపు రైతుల రుణాలు మాఫీ చేస్తామని టీఆర్ఎస్, టీడీపీ హోరెత్తించాయి.. తెలంగాణలో టీఆర్ఎస్ అధికారం చేపడితే, ఆంధ్రప్రదేశ్లో టీడీపీ పగ్గాలు తీసుకునేందుకు సిద్ధంగా ఉంది.. ఏరు దాటగా ఓడ మల్లన్న బోడి మల్లన్న అయ్యాడు.. ఇప్పడు ఓటరన్న పరిస్థితి ఇలాగే ఉంది..
అన్ని రుణాలు మాఫీ చేయలేమంటూ షరతులు విధిస్తోంది టీఆర్ఎస్ ప్రభుత్వం.. తిక్కరేగిన రైతన్నలు రోడెక్కి ఆందోళనలు చేస్తున్నారు.. రుణ మాఫీపై గంపెడు ఆశలు పెట్టుకున్న ఒకరిద్దరు రైతన్నలు హరీమన్నారు.. రాష్ట్ర విభజన తర్వాత ఆర్థికంగా బలోపేతలంగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలోనే కేసీఆర్ ఇచ్చిన వాగ్దానాన్ని నిల్పుకోలేని దుస్థితి ఉంటే, తాడూ బొంగరం లేకుండా లోటు బడ్జెట్తో మిగిలిన అవశేష ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ఎలా ఉద్దరిస్తాడో చూడాలి..

ఎన్నికల ముందు గెలవడమే లక్ష్యంగా అడ్డగోలు వాగ్దానాలు చేస్తాయి రాజకీయ పార్టీలు.. నమ్మిన ఓటరన్నలు గెద్దెనెక్కిస్తే బడ్జెట్టూ.. ఆర్థిక భారం.. అంత చేయలేం.. ఇంతే చేస్తాం అంటూ కుంటి సాకులు చెబుతారు నాయకులు.. షరతులు వర్తిస్తాయని చావు కబురు చల్లగా చెబుతారు.. నిజానికి ఇక్కడ తప్పంతా ఓటర్లదే.. మేక కసాయిని నమ్మినట్లు నాయకులు చెప్పినవన్నీ నమ్మేసి గుడ్డిగా ఓట్లేస్తారు.. ఓటేయడానికి ముందు అదెలా సాధ్యమో వివరించమని గట్టిగా నిలదీసి వివరణ అడిగి ఉంటే ఇలా జరిగేదా? ఆలోచించండి.. (క్రాంతి దేవ్ మిత్ర)

Friday, June 6, 2014

మగతనం చచ్చిందా?..

ఎంత దారుణం.. మగతనం చచ్చిపోయిందా వారికి..
ముంబై నగరంలోని డాంబివేలి ప్రాంతంలో ఓ ప్రయాణీకుడు మహిళా కాండక్టర్ బస్సు నుండి కిందకి లాగి బట్టలు చించేసి దారుణంగా కొట్టాడు.. బస్సులోని, బస్టాప్లోని పురుష పుంగవులెవరూ వాన్ని అడ్డుకోలేదట.. ఆతర్వాత కొందరు ప్రయాణీకులు ధైర్యం చేసి వాన్ని పోలీసులకు అప్పగించారట..
కళ్ల ముందే మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా అడ్డుకోలేని దుస్థితి.. మహిళలపై అత్యాచారాలు, హింసాకాండకు అడ్డులేదా అని గొంతు చించుకునేవారు ముందు తమ కళ్లు ఎదుట జరిగే అన్యాయాన్ని ప్రతిఘటించడం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది..

Thursday, June 5, 2014

ఇప్పుడు కాదనగలరా?

నరేంద్ర మోదీ తమ దేశానికి రావద్దని రావద్దని వీసా నిరాకరించిన అమెరికా  దిగిరాక తప్పలేదు.. ద్వైపాక్షిక చర్చల కోసం రావాలని భారత ప్రధానిని అమెరికాకు లాంఛనంగా ఆహ్వానించారు బరాక్ ఒబామా.. కోట్లాది మంది భారతీయులు కోరి ఎన్నుకున్న  ప్రియతమ నాయకున్ని  ప్రధానిని నిరాకరించే దమ్ముందా అమెరికాకు? 

Tuesday, June 3, 2014

అశ్రునివాళి..

కేంద్రమంత్రి గోపీనాథ్ ముండే హఠాన్మరణం బాధాకరం.. మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా పనిచేసిన ముండే.. ఐదు సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు ఎంపిగా ఎన్నికయ్యారు.. తాజా ఎన్నికల్లో భీడ్ నుండి లోకసభ సభ్యునిగా గెలిచి, మోదీ సర్కార్లో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.. రానున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో గోపీనాథ్ ముండేకు ప్రాధాన్యత పెరిగింది.. అంతలోనే ఆయన కన్నుమూత బిజెపి శ్రేణులను విచార సాగరంలో ముంచింది..  ముండే ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిద్దాం..

పటేల్ గుర్తున్నారా?..

ఓ తెలంగాణ నాయకులారా.. ఉక్కుమనిషిని మరచిపోయారా?..
మనం ఈ రోజున స్వేచ్చా స్వాతంత్ర్యాలను అనుభవిస్తున్నామంటే అది ఎవరి పుణ్యం.. నిరంకుశ నిజాం పాలన నుండి హైదరాబాద్ సంస్థానాన్ని విముక్తం చేసి, భారత దేశంలో విలీనం చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ ది కాదా?..
తెలంగాణ రాష్ట్ర అవతరణ రోజున ఒక్కరైనా ఆయనను స్మరించుకున్నారా?.. శాసన సభ, ముందు అమర వీరుల స్మారక స్థూపానికి సమీపంలోనే పటేల్ విగ్రహం ఉంది.. కనీసం రెండడుగులు వేసి ఈ మహనీయునికి కూడా మొక్కితే మీ సొమ్మేం పోయింది.. వల్లభాయ్ పటేల్ హైదరాబాద్, తెలంగాణ చరిత్రలో భాగం కాదా?
పటేల్ గారిని స్మరిస్తే మీ రజాకార్ మిత్రులు కోపగించుకుంటారనే భయమా?.. ఛీ ఛీ కుహనా సెక్యులరిజమా వర్ధిల్లు..

పాపం సత్తా లేదుగా..

పాపం సోనియా గాంధీ, రాహుల్ గాందీలకు ధైర్యం చాలడం లేదు..తాము వేస్ట్ అని మరోసారి చాటి చెప్పుకున్నారు..
యుపీఏ1,2 ప్రభుత్వాల్లో ప్రధాని పదవి చేపట్టేందుకు తల్లీ కొడుకులు ఇష్టపడలేదు.. కారణాలు అందరికీ తెలుసు.. మన్మోహన్ సింగ్ గారికి ప్రధానిని చేసి రిమోట్ పాలనతో ఇళ్లు చక్కన పెట్టుకున్నారు.. వీరిని పాలనను ఛీ కొట్టిన దేశ ప్రజలు కనీసం ప్రతిపక్ష నేత పదవికి కూడా అనర్హులని తేల్చేశారు..
ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ కేడర్లో ఆత్మ విశ్వాసాన్ని నెలకొల్పే ధైర్యం కూడా వారికి లేకుండా పోయింది.. అందుకే మల్లికార్జున ఖర్గేను లోక్ సభలో తన నాయకునిగా నియమించుకున్నారు..

ఇదీ సపా రాజ్యం..

'రేపిస్టులకు ఉరి శిక్ష వేయడం అన్యాయం..' కొద్ది వారాల క్రితం సమాజ్ వాదీ పార్టీ (సపా) అధినేత ములాయం సింగ్ యాదవ్ నోట ఈ మాట మీరు వినే ఉంటారు.. దేశమంతా ఈ వ్యాఖ్యను ఖండించినా నిర్లజ్జగా ఆయన సమర్థించుకున్నారు..
యధా రాజా.. తథా ప్రజ అంటారు..  ములాయం తనయుడు అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రిత్వం వెలగబెడుతున్న ఉత్తరప్రదేశ్ అనే అసాంఘిక శక్తుల, ఆటవిక రాజ్యంలో ఇద్దరు దళిత బాలికలను దారుణంగా అత్యాచారం చేసి, ఉరేసి చంపారు.. ఈ సంఘటపై దేశమంతా నిరసనలు వ్యక్తం అవుతున్నా ఈ తండ్రీ కొడుకుల్లో కనీసం చలనం లేదు..
ఛీ..ఛీ.. అసలు వీళ్లు మనుషులేనా?.. సపా పాలన సఫా అయ్యే రోజులు దగ్గరపడ్డాయి.

Monday, June 2, 2014

తెలంగాణా తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారికి శుభాభినందనలు..

తెలంగాణలో పొడిచిన తొలి పొద్దు..

నూతన తెలంగాణ రాష్ట్రంలో నా తొలి ప్రభాత వీక్షణం ఎంత హాయిగా ఉందో చూడండి.. 

నాగార్జున సాగర్ రోడ్డులో చంపాపేట(హైదరాబాద్)లో ఇవాళ ఉదయమే తీసిన ఫోటో ఇది

జై తెలంగాణ.. జై హింద్..

ఆరు దశాబ్దాల నిరీక్షణ ఫలించిన వేళ ఇది.. మూడున్నర కోట్ల ప్రజల సంబురమిది.. భారతదేశంలో 29వ రాష్ట్రంలో ఆవిర్భవించిన మహోదయం.. తెలంగాణ రాష్ట్ర స్వప్నం సాకారమైంది.. స్వరాష్ట్రం కోసం జగిన పోరాటాలు, త్యాగాలు, బలిదానాలు ఫలించాయి..
తెలంగాణ రాష్ట్ర అవరతరణ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు..
ప్రత్యేక రాష్ట్రం అనేది స్వపరిపాలన కోసమే.. మనమంతా ముందు భారతీయులం.. ఆ తర్వాతే తెలుగు వారం.. తెలంగాణ వాసులం, ఆంధ్రప్రదేశ్ వాసులం.. ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించినా ఎవరిపై కోపతాపాలు వద్దు.. విభజన అనేది రాజకీయాలు, పరిపాలన వరకే..  ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య ఇలాంటి విభజన లేదు.. స్నేహ సంబధాలు, బంధుత్వాలు, రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది ఉండాల్సిన అవసరమే లేదు..
నా తెలంగాణ కోటి రతనాల వీణ అనే దాశరధి కవిత్వం గుర్తుకు వచ్చి వస్తోంది.. ప్రత్యేక రాష్ట్రంపై తెలంగాణ ప్రజలు ఎన్నెన్నో ఆశలు పెట్టుకున్నారు..  ప్రజల ఆకాంక్ష నెరవేరిన వేళ, నూతన రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని.. ప్రజలందరికీ మెరుగైన జీవితం, విద్య, ఉపాధి అవకాశాలు లభించాలని కోరుకుంటున్నారు..

జై తెలంగాణ.. జై హింద్..

Sunday, June 1, 2014

తెలంగాణా రాజముద్రపై వివాదాలను పక్కన పెడితే, చార్మినార్ లో మూడే మీనార్లు కనిపిస్తున్నాయి.. గమనించారా?