Saturday, June 7, 2014

ఏరు దాటాక..

నెల రోజుల క్రితం ఓ బ్రాండెడ్ షాపులో చెప్పులు కొన్నాను.. ఆరు నెలల వారంటీ అన్నాడు షాపువాడు.. కానీ రెండు వారాలకే తెగిపోయాయి.. ఆ షాపుకి వెళ్లి అడిగితే మీరు సరిగ్గా వాడలేదు.. వారంటీ వర్తంచదు అన్నాడు.. షరతులు వర్తిస్తాయనే నిబంధన చూడలేదా? అని దబాయించాడు.. అప్పుడనిపించింది.. వాన్ని చెప్పుతో ఒక్కటిచ్చుకోవాలని.. సరిగ్గా వాడటం అంటే చెప్పులను ఇంట్లోనే భద్రంగా పెట్టుకొని పాద పూజలు చేయాలేమో..
ఇటీవలి సార్వత్రిక ఎన్నికల సందర్భంగా లక్షలోపు రైతుల రుణాలు మాఫీ చేస్తామని టీఆర్ఎస్, టీడీపీ హోరెత్తించాయి.. తెలంగాణలో టీఆర్ఎస్ అధికారం చేపడితే, ఆంధ్రప్రదేశ్లో టీడీపీ పగ్గాలు తీసుకునేందుకు సిద్ధంగా ఉంది.. ఏరు దాటగా ఓడ మల్లన్న బోడి మల్లన్న అయ్యాడు.. ఇప్పడు ఓటరన్న పరిస్థితి ఇలాగే ఉంది..
అన్ని రుణాలు మాఫీ చేయలేమంటూ షరతులు విధిస్తోంది టీఆర్ఎస్ ప్రభుత్వం.. తిక్కరేగిన రైతన్నలు రోడెక్కి ఆందోళనలు చేస్తున్నారు.. రుణ మాఫీపై గంపెడు ఆశలు పెట్టుకున్న ఒకరిద్దరు రైతన్నలు హరీమన్నారు.. రాష్ట్ర విభజన తర్వాత ఆర్థికంగా బలోపేతలంగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలోనే కేసీఆర్ ఇచ్చిన వాగ్దానాన్ని నిల్పుకోలేని దుస్థితి ఉంటే, తాడూ బొంగరం లేకుండా లోటు బడ్జెట్తో మిగిలిన అవశేష ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ఎలా ఉద్దరిస్తాడో చూడాలి..

ఎన్నికల ముందు గెలవడమే లక్ష్యంగా అడ్డగోలు వాగ్దానాలు చేస్తాయి రాజకీయ పార్టీలు.. నమ్మిన ఓటరన్నలు గెద్దెనెక్కిస్తే బడ్జెట్టూ.. ఆర్థిక భారం.. అంత చేయలేం.. ఇంతే చేస్తాం అంటూ కుంటి సాకులు చెబుతారు నాయకులు.. షరతులు వర్తిస్తాయని చావు కబురు చల్లగా చెబుతారు.. నిజానికి ఇక్కడ తప్పంతా ఓటర్లదే.. మేక కసాయిని నమ్మినట్లు నాయకులు చెప్పినవన్నీ నమ్మేసి గుడ్డిగా ఓట్లేస్తారు.. ఓటేయడానికి ముందు అదెలా సాధ్యమో వివరించమని గట్టిగా నిలదీసి వివరణ అడిగి ఉంటే ఇలా జరిగేదా? ఆలోచించండి.. (క్రాంతి దేవ్ మిత్ర)

No comments:

Post a Comment