Friday, June 27, 2014

దొందుకు దొందు..దొందుడుకు చర్యలు..

ఆంధ్రప్రదేశ్,తెలంగాణ ప్రభుత్వాల పరస్పర ప్రతీకార చర్యలు భావి పౌరుల భవిష్యత్తుకు ముప్పుగా మారాయి.. తెలంగాణ ప్రభుత్వం  స్థానికతను సాకుగా చూపి, అర్థం లేని నిభందనలు పెట్టి విద్యార్థులకు ఫీస్ రీయంబర్స్, స్కాలర్షిప్స్ నిరాకరించడం బాధాకరం.. 1956కు ముందు తెలంగాణలో స్థిర పడిన వారే అర్హులట.. బతుకు తెరువు కోసం తెలంగాణకు వలసవచ్చిన కుటుంబాలకు ఇది గొడ్డలి పెట్టుగా మారింది..
ఇక్కడ బాధితులు సీమాంధ్ర వాసులే కాదు.. పొరుగున ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర, చత్తీస్ ఘఢ్ రాష్ట్రాల నుండి వలస వచ్చిన వారికీ ఇబ్బంది కరమే.. వీరిలో చాలా మందికి తమ స్వస్థలాల్లో ఆస్తిపాస్తులు కూడా లేవు.. కొందరైతే కాలక్రమంలో కుటుంబ సభ్యులకు, బంధు మిత్రులకు దూరమైపోయారు.. ఇందులో తెలంగాణ వారితో బంధుత్వాలు కలుపుకున్న కుటుంబాలూ ఉన్నాయి.. నా సీమాంధ్ర మిత్రుల్లో చాలా మంది తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి మద్దతు ఇచ్చారు. ఇప్పుడు వారు సైతం నొచ్చుకునే పరిస్థితి ఏర్పడింది..  అర్థం లేని ఆంక్షలు వారి భవిష్యత్తును అంధకారంలోకి నెడుతున్నాయి..

మరోవైపు ఆంధ్రప్రదేశ్ సర్కారు వైఖరి కూడా ఇందుకు భిన్నంగా లేదు.. తెలంగాణ సరిహద్దు జిల్లాల నుండి విజయవాడ్, కర్నూలు నగరాలకు వెళ్లి చదువుకునే విద్యార్ఠులు పెద్ద సంఖ్యలొనే ఉన్నారు.. ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ అధికారులు వారికి బస్ పాసులు ఇవ్వడంపై ఆంక్షలు పెడుతున్నారు.. ఈ సమస్య ఖమ్మం జిల్లా వాసులకు ఎక్కువగా ఉంది..  
చావు పుట్టుకలు మన చేతుల్లో ఉండవు.. తెలిసో తెలియకో ఉపాధి కోసం వలస వచ్చిన వారిని అర్థం లేని ఆంక్షలతో మానసికంగా శిక్షించడం భావ్యమేనా? ఇరు రాష్ట్రాల పాలకులు పగలు, ప్రతీకారాలు వదిలి సామరస్యంగా ఆలోచించాలి..

No comments:

Post a Comment