Friday, September 30, 2016

పాపం పాక్ మంత్రి..

పాకిస్థాన్ ర‌క్ష‌ణ మంత్రి క్వాజా మహ్మద్ ప్యాంట్ జారి పోయింది.. వాస్త‌వానికి ఈ ఘ‌ట‌న రెండు నెల‌ల క్రిత‌మే జ‌రిగింది.. కానీ భార‌త్ చేతిలో పాకిస్థాన్‌కు వ‌రుసగా భంగ‌పాట్లు ఎదుర‌వుతున్న ద‌శ‌లో సోష‌ల్ మీడియాలో ఈ వీడియో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.. ఉరీ ఘ‌ట‌నకు భార‌త సైన్యం ప్ర‌తీకారం తీర్చుకుంది.. ఈ నేప‌థ్యంలో ప్యాంట్ ఊడటంపై వ్యంగ్యాస్థ్రాలు కుచ్చ‌కుంటున్నాయి పాక్ పాల‌కుల‌కు.. ఎప్పుడైతేనేం మొత్తానికి జారిపోతున్నాయి..  ప్యాంట్ ఊడ‌ట‌మే కాదు.. పైజామాలు కూడా త‌డుపుకుంటున్నార‌ట‌..

Thursday, September 29, 2016

పాకిస్థాన్ కు గట్టి గుణపాఠం

కరిచింది పిచ్చికుక్కే కదా అని తేలికగా వదలొద్దు.. దుడ్డకర్ర తీసుకొని గట్టిగా ఒక్కటిచ్చుకోవాల్సిందే.. లేకుంటే మన సహనాన్ని పిరికితనంగా భావించే అవకాశం ఉంది..
ఉరీలో భారత సైనిక స్థావరంపై పాకిస్థాన్ ప్రేరిత ఉగ్రవాదుల దాడి తర్వాత దేశ ప్రజలంతా ఆగ్రహావేశాలతో ఊగిపోయారు.. పాకీలపై ప్రతికారం తీర్చుకోవాల్సిందే నినదించారు.. భారత సైన్యం అదను చూసి పాకిస్థాన్ కు గట్టి బుద్ధి చెప్పింది.. సర్జికల్ ఆపరేషన్ పేరుతో ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద శిక్షణ శిబిరాలపై మెరుపు దాడి జరిపి 9 మంది పాకిస్థాన్ సైనికులను. 38 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టింది..

మంచితనం అన్ని వేళలా పనికి రాదు.. శత్రువు మంచి తనాన్ని కూడా బలహీనతగా భావిస్తాడు.. పదే పదే కవ్వించేవారికి గూబ పడిలేలా గట్టి జవాబు చెప్పాల్సందే.. ఇప్పుడు భారత సైన్యం చేసింది ఆ పనే..

Wednesday, September 28, 2016

మూసీ ప్రళయ రూపం.. భాగ్యనగర విషాదం

28 సెప్టెంబర్, 1908.. భాగ్యనగర చరిత్రలో అత్యంత విషాదకరమైన రోజు ఇది.. ఆ రోజు తెల్లవారు ఝాముకు ముందే భారీ జల ఖడ్గం విరుచుకుపడింది.. కారు చీకటి వేళ 15 వేల మందికి పైగా తుడుచుకు పోయారు.. 80 వేల మంది నిరాశ్రయులుగా మారారు.. అంతటా ఆక్రందనలు..
రెండు మూడు రోజులుగా మేఘాలు బద్దలై నేలపై పడ్డాయా అన్నంత భయంకరమైన వర్షం.. వికారాబాద్ సమీపంలోని అనంతగిరి కొండల నుండి దూకిన మూసీనది ఉగ్ర రూపం దాల్చింది.. జోరు వర్షాలకు చెరువులను గండ్లుపడి నదిలోకి వరద నీరు ప్రవహించింది.. ఉప్పొంగిన మూసీ భారీ ప్రవాహ రూపంలో హైదరాబాద్ ను ముంచెత్తింది. మూడో వంతు నగరం గల్లంతైపోయింది.. నిద్రలోనే ఎంతో మంది విగత జీవులైపోయారు.. చిమ్మ చీకటిలో ఎటు చూసినా జల ప్రవాహం.. అయిన వారు కళ్ల ముందు కొట్టుకుపోతున్నా రక్షించలేని దుస్థితి.. ఇళ్లూ, వాకిలి, ఆస్తిపాస్తులు గల్లంతు.. మూసీ నది సాధారణ స్థితికన్నా 40 50 అడుగుల ఎత్తు ప్రవహించింది.. నగరంలోని నాలుగు వంతెనలు మునిగిపోయాయి.. పురానాపూల్ మాత్రమే భద్రంగా ఉంది.. అఫ్జల్ గంజ్ వంతెన కొట్టుకుపోయింది.. ముసల్లంజంగ్, చాదర్ ఘాట్ వంతెనలు దెబ్బతిన్నాయి.. ఎటు చూసినా బురద రాళ్ల మేటలు, కొట్టుకువచ్చిన శవాలు, కూలిన ఇండ్లూ, భవనాల శిథిలాలు.. జనం ఆహాకారాలు, రోదనలు.. ధనికులు, పేదల అంతరం తెలియని విషాద ఘటన అది..
మూసీ ప్రళయం చూసి హైదరాబాద్ పాలకుడు ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ చలించిపోయాడు.. ప్రజలకు కలిగిన కష్టం చూసి కన్నీటి పర్యంతమయ్యాడు.. కుండపోత వర్షంలో ఏనుగుపై తిరుగుతూ జనం దగ్గరకు వెళ్లి ఓదార్చాడు.. నిరాశ్రయులకు తన అధికార నివాసం పురాణా హవేలీ ప్రాంగణంలో రోజుల తరబడి వసతి భోజన, వస్త్ర సౌకర్యాలు కల్పించాడు.. మహబూబ్ అలీఖాన్ దగ్గరిండి మరీ సహాయక కార్యక్రమాలు పర్యవేక్షించాడు..
ఉగ్రరూపంలో ఉన్న మూసీ శాంతించాలంటే ఏమి చేయాలని ప్రధానమంత్రి మహారాజా కిషన్ పర్షాద్ ను అడిగాడు నిజాం నవాబు.. నది వరద తగ్గాలంటే ఏమి చేయాలని అడిగాడు.. ఆయన సలహా ప్రకారం వెండి పల్లెంలో పట్టుచీర, కుంకుమ పసుపు, ప్రమిదలతో నదీమ తల్లికి హారతి సమర్పించాడు.. మూసీ వరద క్రమంగా తగ్గుముఖం పట్టింది..
హైదరాబాద్ చరిత్రను గమనిస్తే మూసీనదికి 12 సార్లు భయంకరమైన వరదలు వచ్చాయి.. ఇందులో 1631, 1831, 1908 సంవత్సరాల్లో వచ్చిన వరదలు అత్యంత ప్రమాదాన్ని మిగిల్చాయి.. 1903లో కూడా ఒక మోస్తరు పెద్ద వరదే వచ్చింది.. 1831లో హైదరాబాద్ వచ్చిన ఏనుగుల వీరాస్వామయ్య తన కాశీయాత్ర చరిత్రలో ఆనాటి వరద పరిస్థితిని ఉల్లేఖించాడు.. ఆధునిక కాలంలో వచ్చిన 1908 మూసీ వరద తాలూకు చేదు గుర్తులు ఇప్పటికీ కనిపిస్తాయి.. ఉస్మానియా ఆస్పత్రి ఆవరణలోని భారీ చింత చెట్టుకు పైకి ఎక్కిన 150 మంది తమ ప్రాణాలను కాపాడుతున్నారు..
మూసీనదికి భవిష్యత్తులో ఇలాంటి వరదలు రాకూడదని భావించారు మీర్ మహబూబ్ అలీఖాన్.. ప్రఖ్యాత ఇంజినీరు మోక్షగుండం విశ్వేశయ్యను హైదరాబాద్ రప్పించారు.. ఆయన సలహా మేరకు మూసీనది, దాని ఉపనది ఈసీపై ఉస్మాన్ సాగర్, హిమయత్ సాగర్ ఆనకట్టలను కట్టించారు.. మూసీ నది తీరం వెంట పెద్ద ఎత్తున గోడలు నిర్మించారు.. ఈ పనులు ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ హయాంలో పూర్తయ్యాయి..
ఒకనాడు ఉదృతమైన ప్రవాహంతో, నౌకాయానంతో కళకళలాడింది మూసీ.. ఈ నదీ తీరమంతా పచ్చని ఉద్యానవనాలు, పంట పొలాలతో కనిపించేది.. కానీ అదంతా గతం.. కాలక్రమంలో మూసీ ఒక డ్రైనేజీ స్థాయికి దిగజారిపోయింది.. జీవనది స్థాయిని కోల్పోయింది.. కబ్జాలతో కుందించుకుపోతోంది.. ఇప్పుడు మూసీ ధీన స్థితిని చూస్తే జాలేస్తోంది.. నదిని రక్షించుకోవాల్సిన తక్షణ కర్తవ్యం మనపై పడింది..


Sunday, September 25, 2016

విశ్వ నగరం తీరు ఇలాగేనా?

అందరూ శాఖాహారులేనట.. కానీ బుట్టెడు రొయ్యలు మాయం..
హైదరాబాద్ నగరాన్ని మరోసారి వరదలు ముంచెత్తాయి.. ఇది కొత్తేంకాదు.. ఊహించనిది అంతకన్నా కాదు.. లోతట్టులో ఉన్న బస్తీలు, కాలనీలు నీట మునిగాయి.. నాలాలు, చెరువులు ఉప్పొంగాయి.. ఇళ్లు, అపార్టుమెంటుల్లోకి నీరు చేరింది.. రోడ్లు కాలువలుగా మారిపోయి ఎక్కడ ఏ గొయ్యి ఉందో తెలియని పరిస్థితి ఏర్పడింది..
వరద ముప్పు నుండి హైదరాబాద్ బయట పడక ముందేబురద చల్లుకొనుడు మొదలైంది.. ఈ పాపం మీదంటే మీదంటూ రాజకీయుల పరస్పర విమర్శలు, సోషల్ మీడియాలో వారి ఫాలోవర్ల సెటైర్లు.. కానీ తిలాపాపం తలా పిడికెడు అనే నిజాన్ని మరచిపోతున్నాం..
నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో ఒకప్పుడు 500కు పైనా జలాశయాలుండేవి.. చెరువులు, కుంటలు, వాగులు, కాలువలు, బావులు, తోటలతో చూడ ముచ్చటగా ఉండేది భాగ్యనగరం.. మరి ఏమయ్యాయి ఇవన్నీ.. నేటి పాలకులకు, పౌరులకు వాటి గురుంచి ఏమైనా అవగాహన ఉందా? విచ్చల విడిగా కబ్జాలు చేసి, పూడ్చేసి, అమ్మేసుకుంటే ఇంకెక్కడి చెరువులు, నాలాలు?..
నీళ్లు పల్లమెరుగు’.. దానికి ధర్మం ప్రకారం అది ప్రవహిస్తుంది.. భాగ్యనగరంలోని చెరువులన్నీ కాలువలతో అనుసంధానమై గొలుసుకట్టుగా ఉంటాయి.. వర్షం నీరు, వరదతో వరుసగా నిండుతాయి.. అధిక జలాలు మూసీ నదిలోకి వెళ్లిపోతాయి.. కానీ వాటి సహజ స్థావరాలను దర్జాగా కబ్జా చేసేస్తే ఎక్కడికి పోతాయి ఆ ప్రవాహాలు.. వాటి స్థలాలకు అవి వస్తున్నాయి.. అక్కడ ఉంటున్న మన జనాలకే అంతిమ నష్టం.. కబ్జాలు చేసి అమ్మినోళ్లు, వారికి అండగా ఉన్న నాయకులు, దళారులు వారి వాటాలతో వారు హాయిగా జీవిస్తున్నారు.. కానీ కొన్నవారు, అక్కడ నివసిస్తున్న వారే అంతిమంగా నష్టపోతున్నారు..
హైదరాబాద్ నగరానికి ఏర్పడ్డ ఈ దుస్థితికి పరస్పరం నిందించుకుంటున్నాయి రాజకీయ పార్టీలు.. కానీ ముసుగులు తీసి గుద్దులాటలు ఆపేస్తే ఎవరు ఏమిటనేది జనాలకే అర్థం అవుతుంది.. ఇక్కడ ఎవరూ సుద్దపూసలు కాదు.. అత్యధిక కాలం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కాలంలో సగానికి పైగా జలాశయాలు మాయమయ్యాయి.. నాలాల వెంట నివాసాలు వచ్చింది ఈ కాలంలోనే.. ఇక తెలుగు దేశం వారు ఏమీ తక్కువ తినలేదు.. అధికారంలో ఉన్నంత కాలం హైదరాబాద్ కు మేకప్పులు వేసి, లిప్ స్టిక్కులు పూసి తామే ఈ నగరాన్ని నిర్మించామన్నంత గొప్పలు చెప్పుకున్నారు.. కానీ ఏనాడూ చెరువుల కబ్జాలు, డ్రైనేజీలు, నాళాల దుస్థితి మీద దృష్టి పెట్టలేదు.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి రెండేళ్లు గడచిపోయింది.. కానీ టీఆర్ఎస్ ఇంకా గత పాలకులనే నిందిస్తోంది..
హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దాలనే తపన సరే.. కానీ నగరం రోడ్లు, డ్రైనేజీల నిర్వహణ సంగతి గాలికి వదిలేస్తే ఎలా? ఈ వర్షాకాలం భారీ వర్షాలు పడతాయని ముందుగా ఊహించిందే.. కానీ డ్రైనేజీలు, నాలాల్లో ముందుగా ఎక్కడా పూడిక తీయలేదు.. రోడ్ల మీద నీరు నిల్వ ఉండే పాయింట్స్ అందరికీ తెలిసినవే.. కనీసం అక్కడ కాస్త గట్టి రోడ్డు వేసే పని కూడా చేయలేదు.. మెట్రో రైలు లైన్ నిర్మాణ మార్గాల్లో విస్తరణ పనులు పూర్తి చేయకపోవడంతో ట్రాఫిక్ సమస్యలు దారుణంగా మారాయి.. నగరం ఇంతటి దుస్థితిలో ఉండటానికి కారకులైన వారిలో చాలా మంది ఇప్పుడు టీఆర్ఎస్ లోకి ఫిరాయించారు.. వారు కూడా ఇప్పుడు సుద్దులు చెప్పుతున్నారు..

విమర్శలను  పక్కన పెట్టి తక్షణం చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి.. ముందుగా కబ్జాకు గురైన చెరువులను గుర్తించాలి.. అక్కడ ఉన్న వారిని ఖాళీ చేయించడం ఇప్పుడు కష్టమే.. అక్కడ నీరు చేరే అవకాశం లేకుండా కొత్తగా డ్రైన్లను నిర్మించాలి.. చెరువులు, నాలాల వెంట ఉన్న నిర్మాణాలను నిర్ధాక్షిణ్యంగా తొలగించాలి.. వాటి చుట్టూ చక్కని పార్కులు నిర్మించి కాపాడాలి.. నగరంలో రోడ్లన్నీ తక్షణం సీసీ రోడ్లుగా మార్చేయాలి.. మళ్లీ మళ్లీ తవ్వే అవకాశం లేకుండా ముందుగానే శాశ్వత డ్రైనేజీ, కేబుల్ డక్ట్ లైన్లు వేయాలి.. అన్నింటికన్నా ముందుగా మెట్రోరైలు మార్గంలో ట్రాఫిక్ సక్రమంగా సాగేందు కోసం రోడ్డుకు ఇరువైపులా ఉన్న కట్టడాలను నిర్ధాక్షిణ్యంగా తొలగించాలి.. భాగ్యనగరాన్ని నిజంగా విశ్వనగరంగా మార్చేందుకు ఇవే తొలిమెట్లు..  

Thursday, September 22, 2016

జల రవాణా సంస్థ

హైదరాబాద్ నగరంలో రాష్ట్ర జల రవాణా సర్వీసులు.. కాస్త హాస్యంగా కనిపిస్తున్నా కుండపోత కురిస్తే రోడ్డు, నాలా, మ్యాన్ హోల్ ఏది ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి..

Wednesday, September 21, 2016

ఈత వస్తే లైసెన్స్

!dea.. పట్నంల డ్రైవింగ్ లైసెన్స్ కోసం అప్లయ్ చేసుకునేటోళ్ళకు ఈత వచ్చి ఉండాలనే కండిషన్ పెట్టాలె..

Tuesday, September 20, 2016

దండం దశగుణం భవేత్..

పాకిస్థాన్ మరోసారి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.. మతం  ఆధారంగా భారత్ నుండి విడిపోయింది పాక్.. అంతటితో సరిపుచ్చుకోకుండా నిరంతరం మన దేశంలో అశాంతిని రగిలిస్తూ రాక్షసానందం పొందుతున్నారు అక్కడి పాలకులు..

భారత దేశంతో జరిగిన 1947, 1965, 1971, 1999 యుద్ధాల్లో ఘోర పరాజయం పొందింది వారికి బుద్ధి రాలేదు.. 1947లో కాశ్మీర్ లో చొరబడిన పాక్ మూకలను పూర్తిగా తరిమి కొట్టక ముందే ప్రధాని నెహ్రూ తొందరపాటుతో ఐక్యరాజ్యసమితిని ఆశ్రయించారు.. అప్పటి నుండి సగం కాశ్మీర్ (పీవోకే) ఇంకా పాక్ కబ్జాలోనే ఉంది.. 1965లో భారత సైన్యం లాహోర్ దాకా చొచ్చుకుపోయి మన జాతీయ పతాకాలను సగర్వంగా ఎగురవేసింది.. కానీ మన ప్రభుత్వ ఆదేశాలతో తిరగి వచ్చేసింది.. 1971లో తూర్పు పాకిస్థాన్ (బంగ్లాదేశ్)ను కోల్పోయినా ఆ దేశానికి బుద్ది రాలేదు..  1999 కార్గిల్ యుద్దంలోనూ మనదే పై చేయి..
ప్రత్యక్ష పోరాటంలో గెలవలేక పరోక్షపద్దతిలో ఉగ్రవాదలను ప్రోత్సహిస్తోంది.. ముంబై మారణకాండ, పార్లమెంటుపై దాడి, సరిహద్దుల్లో చొరబాట్లు-కాల్పులు, ఆర్మీ క్యాంపులపై దాడుల వెనుక పాకిస్థాన్ ఉందని జగమెరిగిన సత్యమే అయినా తమకు సంబంధం లేదని బుకాయించడం వారికి అలవాటైపోయింది.. పాకిస్థాన్ తో శాంతి కోసం ఎన్ని చర్చలు జరిపినా బూడిదలో పోసిన పన్నీరే.. స్నేహ హస్తం అందించి వెన్నుపోటు పొడవడం ఆ దేశ పాలకులకు వెన్నతో పెట్టిన విద్య..

యూరిలో జరిగిన ఘటనపై దేశ ప్రజలంతా ఉడికిపోతున్నారు.. ఈ సమయం పాకిస్థాన్ తిరిగి కోలుకోలేని రీతిలో గుణపాఠం చెప్పడం తప్పని సరి.. ముందుగా మనం పాకిస్థాన్ లోని ఉగ్రవాద స్థావరాలపై భారీ దాడులు చేయాలి.. పాక్ ఆక్రమిత కశ్మీర్ ను స్వాధీనం చేసుకోవాలి.. దౌత్య మార్గంలో పాకిస్థాన్ కపట నీతిని ప్రపంచ దేశాలకు వివరించాలి.. అన్నింటికన్నా ముఖ్యం బలూచిస్థాన్ తిరుగుబాటుదారులకు నేరుగా సహకారం అందించాలి.. అప్పుడు పాకిస్థాన్ మాత్రమే కాదు, మన దేశంలో ఉన్న వారి తొత్తులు కూడా దారికి వస్తారు..

Sunday, September 18, 2016

పాకీలు మూల్యం చెల్లించుకోక తప్పదు..

యూరి సెక్టార్ పై ఉగ్రవాదుల దాడికి కారణమైన పాకిస్థాన్ కు గట్టి మన దేశం గట్టి బుద్ది చెప్పాల్సిందే..
జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని ఈ సైనిక స్థావరంపై జైషే మహ్మద్ ఉగ్రవాదుల దాడి చాలా దారుణం.. ఈ ఘటనలో 17 మంది భారత జవానులు వీర మరణం పొందడం బాధాకరణం.. దాడి చేసిన నలుగురు టెర్రరిస్టులను సైన్యం మట్టుబెట్టింది.. పాకిస్థాన్ సహాయ సహకారాలతో ఉగ్రవాద మూకలు తరచూ మన స్థావరాలపై దాడులు చేస్తూ, సైనికుల నైతిక స్థైర్యాన్ని దెబ్బ తీయడానికి ప్రయత్నిస్తున్నారు..
ఇలాంటి దాడి ఘటనలు జరిగినప్పుడు భారత ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేయడం, తీవ్రంగా ఖండించడం షరా మామూలే.. కానీ పాకిస్థాన్ కు గట్టి జవాబు మాత్రం చెప్పలేకపోతున్నాం.. ఈ విషయంలో ప్రభుత్వం గట్టి నిర్ణయం తీసుకోక తప్పదు..

కుక్కతోకలా పాకిస్థాన్ బుద్ది ఎప్పడూ వంకరే.. ఇటుకతో కొడితే మనం ఇటుకతో కొట్టే విధానం వద్దు.. వారు మళ్లీ కోలుకోని రీతిలో బదులు ఇవ్వాల్సిందే.. శాంతి, చర్చలు అంటూ మడిగట్టుకొని కూర్చుంటే వాళ్లు ఇంకా చెలరేగిపోతూనే ఉంటారు..  పాకిస్థాన్ మళ్లీ మన వంక చూసేందుకు సాహసించనంత గట్టిగా బుద్ది చెప్పాలి.. 

Saturday, September 17, 2016

హైదరాబాద్ సంస్థాన ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీల్చిన వేళ..

17-09-1948.. హైదరాబాద్ సంస్థానాన్ని 224 సంవత్సరాల పాటు పాలించిన అసఫ్ జాహీ వంశానికి చివరి రోజు.. ఏడు తరాల బూజు వదిలిన దినమిది..
హైదరాబాద్ దిశగా పురోగమిస్తున్న భారత సైన్యం బీదర్ పట్టణాన్ని స్వాధీనం చేసుకుంది.. మరోవైపు చిట్యాల, బీబీనగర్ కూడా స్వాధీనమైపోయింది.. ఆపరేషన్ పోలో పేరిట మొదలైన ఐదో రోజు నాటికి నిజాం సేనలు, రజాకారులు పూర్తి తోక ముడిచారు.. హైదరాబాద్ నగరం వైపు దూసుకు వస్తున్న భారత సైన్యానికి పటాన్ చెరు దగ్గర ప్రజలు జేజేలు పలికారు..
అంతా అయిపోయిందని అర్థమైన నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ భారత ప్రభుత్వ ఏజెంట్ జనరల్ కె.ఎం.మున్షీని పిలిపించారు.. ఇప్పుడు తాను ఏమి చేయాలని సలహా కోరాడు.. లొంగిపోవడమే ఏకైక మార్గమని మున్షీ సూచించారు.. సాయంత్రం ఏడు గంటల సమయంలో నిజాం ప్రభువు దక్కన్ రేడియోలో ప్రసంగిస్తూ తన ప్రభుత్వ రాజీనామాను ప్రకటించాడు..
భారత సైన్యాలు సికింద్రాబాద్ లోని బొల్లారం చేరుకున్నాయి.. డకోటా విమానంలో దిగిన మేజర్ జనరల్ జేఎన్ చౌధురికి ఘన స్వాగతం పలికారు.. హైదరాబాద్ సైన్యం చీఫ్ ఎల్. అద్రూస్ అసఫ్ జాహీ పతకాన్ని అవగతం చేసి, జెఎన్ చౌధురి ఎదుట లొంగుబాటును ప్రకటించారు..
హైదరాబాద్ ప్రధాని లాయక్ అలీ అప్పటికే రాజీనామా చేయగా, ఆయనను గృహ నిర్భందంలో ఉంచారు.. రజాకార్ల నాయకుడు ఖాసిం రజ్వీని అరెస్టు చేశారు..
హైదరాబాద్ విమోచనం నిజాం పాలన నుండి సంపూర్ణంగా విమోచనం పొంది భారతావనిలో విలీనమైంది.. సంస్థాన ప్రజలు భారత జాతీయ పతాకాలతో వీధుల్లో కేరింతలు కొడుతూ స్వేచ్ఛా వాయువులను ఆస్వాదించారు..

Friday, September 16, 2016

అంతర్జాతీయ వత్తిడి..

16-09-1948.. ఆపరేషన్ పోలో ఆరో రోజు ఇది.. ఉదయాన్నే భారత సైన్యం బీదర్, హుమ్నాబాద్ మీదుగా జహీరాబాద్ చేరింది.. దారిలో అడుగగుడగునా నిజాం సైన్యం పెట్టిన మందుపాతరలు ఉన్నాయి.. వీటిని నిర్వీర్యం చేస్తూ మందుకు సాగింది సైన్యం.. అక్కడక్కడా దాగిన రజాకార్లు చాటు భారత సైన్యంపై కాల్పులు జరిపారు.. సైన్యం దగ్గర ఉన్న అధునాతన ఆయుధాల ముందు వారు మట్టికరిచారు..
భారత సైన్యం హైదరాబాద్ వైపు దూసుకువస్తోందనే సమాచారంతో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాడు.. కింగ్ కోఠి ప్యాలస్ లో ప్రధాని లాయక్ అలీ, ఇతర అధికారులతో సుదీర్ఘ సమాలోచనలు జరుపుతున్నాడు.. అన్ని వైపుల నుండి పరాజయ వార్తలే వస్తున్నాయి. విజయవాడ వైపు నుండి వస్తున్న భారత సైన్యాన్ని ఇక ఎంత మాత్రం ఆపలేమని సైనికాధికారులు స్పష్టం చేశారు.. ఇంతలో ఒక విమానం ప్యాలస్ మీదుగా  చాలా దగ్గర నుండి వెళ్లడంతో అందరూ భయపడిపోయారు..

మరోవైపు ప్యారిస్ వెళ్లిన నిజాం ప్రభుత్వ బృందం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత సైన్యం జరిపిన ఆపరేషన్ పోలో అంశాన్ని లేవనెత్తే ప్రయత్నాలు ముమ్మరం చేసింది.. చైనా, రష్యా మినహా మిగతా దేశాల ప్రతినిధులు భారత్ చర్యను తప్పు పట్టారు. వీరిలో బ్రిటన్, అమెరికా, ప్రాన్స్, కెనడా, అర్జెంటీనా, సిరియా దేశాల ప్రతినిధులు ఉన్నారు.. హైదరాబాద్ కు అండగా ఉంటుందని భావించిన పాకిస్తాన్ వైపు నుండి ఎలాంటి స్పందనా కనిపించకపోవడంతో నిజాం నవాబు గందరగోళంలో పడ్డాడు.. (17 సెప్టెంబర్.. పరాజయం సంపూర్ణం)

Thursday, September 15, 2016

నిజాం సైన్యం పరాజయాలు..

15-09-1948.. హైదరాబాద్ సంస్థానాన్ని నలువైపుల నుండి స్వాధీనం చేసుకుంటూ ముందుకు సాగుతున్నాయి భారత సైన్యాలు.. నిజాం సైన్య డొల్లతనం క్షేత్ర స్థాయిలో స్పష్టంగా కనిపిస్తోంది.. ఎక్కడా ఊహించిన స్థాయి ప్రతిఘటన కూడా లేదు.. జాల్నా నుండి హైదరాబాద్ దిశగా బయలు దేరిన సైన్యం లాతూరును స్వాధీనం చేసుకున్నాయి.. భారత సైన్యం కల్యాణి, బీదర్, హుమ్నాబాద్, జహీరాబాద్ ల మీదుగా హైదరాబాద్ వైపు వస్తున్నాయనే వార్తలు నిజాం నవాబును కలవరపరిచాయి.. అడ్డుకోవడం ఇక అసాధ్యమని నిజాంకు అర్థమైపోయింది.. మొయినాబాద్ సమీపంలో ఎదుర్కొనే ప్రయత్నం చేసిన నిజాం సైన్యాన్ని భారత సైన్యం తిప్పికొట్టింది..
అటు తూర్పు దిశగా విజయవాడ నుండి దూసుకువస్తున్న భారత సైన్యం సూర్యాపేట చేరింది.. అక్కడ కొంత మంది యువకులు సైన్యంపై దాడికి ప్రయత్నించారు.. వారికి నచ్చజెప్పి పంపేందుకు ప్రయత్నిస్తే వినలేదు.. దీంతో సైన్యం ఒక శతఘ్ని గుండును పేల్చింది.. ఆ యువకుల్లో కొందరు కుప్పకూలగా మిగతా వారు పారిపోయారు.. భారత సైన్యం ముందుకు రాకుండా మూసీనది మీద వంతెనను కూల్చేసింది నిజాం సైన్యం.. అయినా మరమత్తు చేసుకుకొని ముందుకు కదిలారు సైనికులు.. నార్కట్ పల్లి దగ్గర జరిగిన పోరాటంలో నిజాం సైన్యం దారుణంగా దెబ్బతిన్నది..

పరిస్థితులు విషమించాయని అర్థమైన హైదరాబాద్ ప్రభుత్వం భారత్ తో సంధి కోసం ప్రతిపాదన పంపింది.. కానీ ఢిల్లీ నుండి ఎలాంటి స్పందన రాలేదు.. మరోవైపు పాకిస్తాన్ ద్వారా వత్తిడి తేవడానికి చేసిన ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి.. హైదరాబాద్ ప్రభుత్వం ఐక్యరాజ్య సమితిలో ఈ అంశాన్ని లేవనెత్తేందుకు అప్పటికే ప్రతినిధులను పంపింది.. సెప్టెంబర్ 15వ తేదీన అంతర్జాతీయ పత్రికల్లో హైదరాబాద్ పై భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ పోలో వార్తలు పతాక శీర్శికల్లో వచ్చాయి.. (16 సెప్టెంబర్.. కీలక పోరాటం, ప్రపంచ దేశాల లొల్లి)

Wednesday, September 14, 2016

ఇనుమడించిన ఉత్సాహంతో..

14-09-1948.. హైదరాబాద్ సంస్థానంలో నిజాం సైన్యం నుండి మొదటి రోజు పెద్దగా ప్రతిఘటన లేకపోవడం భారత సైన్యానికి కాస్త ఆశ్చర్యాన్ని, కధనోత్సాహాన్ని కలిగించింది.. అనుమడించిన ఉత్సాహంతో సైన్యం రాజసూర్ పట్టణం వైపు బయలు దేరింది.. నిజాం సైన్యం చేతిలో ఉన్న కాలం చెల్లిన ఆయుధాలు, తుప్పు పట్టిన పరికరాలు భారత సైన్యాన్ని అడ్డుకోలేకపోయాయి.. మధ్యాహ్నంకల్లా రాజసూర్ పట్టణం స్వాధీనమైపోయింది..
ఉస్మానాబాద్ మాత్రం భారత సైన్యానికి, రజాకార్లకు కాస్త భారీ పోరాటమే జరిగింది.. వందలాది మంది రజాకార్లు మరణించారు.. మరోవైపు అసఫ్ జాహీ పాలకుల తొలి రాజధాని ఔరంగాబాద్ భారత సైన్యానికి చాలా తేలికగానే స్వాధీనమైపోయింది.. జాల్నా పట్టణం వద్ద భారత సైన్యాన్ని నిలువరించేందుకు నిజాం సైన్యం కాస్త గట్టిగానే ప్రతిఘటించింది.. వ్యూహాత్మంగా వ్యవహరించిన భారత సైన్యం జాల్నాను చివరకు స్వాధీనంలోకి తెచ్చుకోగలిగింది..

ఔరంగాబాద్ నగరాన్ని కోల్పోయిన వార్త తెలిసి హైదరాబాద్ లోని నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ కన్నీటిని ఆపుకోలేకపోయాడు.. ప్రధాని లాయక్ అలీతో సుధీర్ఘ మంతనాలు.. ఏం చేయాలో తోచని పరిస్థితి.. అన్ని వైపుల నుండి పరాజయ వార్తలే వస్తున్నా, దక్కన్ రేడియోలో మాత్రం నిజాం సైన్య పరాక్రమాలపై కాకిగోల ఆగలేదు.. (15 సెప్టెంబర్.. హైదరాబాద్ సమీపంలో భారత సైన్యం)

హైదరాబాద్ సంస్థాన పతనానికి నాంది..

13-09-1948... నిరంకుశ నిజాం పాలన నుండి హైదరాబాద్ సంస్థానానికి విమోచనంలో తొలి అడుగు పడిన చారిత్రిక దినమిది.. భారత దేశంలో చేరకుండా  హైదరాబాద్ స్వతంత్రంగా ఉంటుందని ప్రకటించిన నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ కలలు చెదిరిపోయిన రోజు ఇది.. అసఫ్ జాహీ పాలన, రజాకార్ల చెర నుండి హైదరాబాద్ సంస్థానాన్ని విముక్తం చేసేందుకు నాటి కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆదేశాల మేరకు భారత సైన్యం ఆపరేషన్ పోలో చేపట్టింది.. మేజర్ జనరల్ జె.ఎన్. చౌధురి నేతృత్వంలో సంస్థానాన్ని నలు వైపుల నుండి చుట్టు ముట్టింది.. దీనికే పోలీస్ యాక్షన్ అనే మరో పేరు..

సెప్టెంబర్ 13 నాడు భారత సైన్యం షోలాపూర్ వైపు నుండి హైదరాబాద్ సంస్థానంలోని ఉస్మానాబాద్ జిల్లాలోకి ప్రవేశించింది.. బోరీ నది వంతెన దాటి సరిహద్దుకు 19 కిలో మీటర్ల దూరంలోని నలదుర్గ్ పట్టణంలోకి దూసుకుపోయింది.. పెద్ద పోరాటం లేకుండా కేవలం రెండు తూటాలతో నలదుర్గ్ భారత సైన్యానికి స్వాధీనమైపోయింది.. ఆ తర్వాత జాల్కోట్, తల్ముడి పట్టణాల్లోకి ప్రవేశం.. అప్పటికే నిజాం సైన్యం, రజాకార్లు ఆ పట్టణం విడిచి పారిపోయారు.. అక్కడి ప్రజలు సైన్యానికి ఘన స్వాగతం పలికారు.. మరోవైపు తుల్జాపూర్ లో రజాకార్లు సైన్యంతో రెండు గంటల పాటు పోరాడారు.. పెద్ద సంఖ్యలో రజాకార్లు చనిపోగా, మిగతావారు లొంగిపోయారు.. మరోవైపు హోసపేట నుండి బయలు దేరిన సైన్యం తుంగభద్ర నది దాటి హైదరాబాద్ సంస్థానంలోని కీలక ప్రాంతాలను స్వాధీనం చేసుకుంది..

భారత సైన్యాన్ని ఎదిరిస్తాం.. ఢిల్లీ ఎర్రకోటపై అసఫ్ జాహీ పతాకాన్ని ఎగురవేస్తాం అని బీరాలు పలికిన రజాకార్ల నాయకుడు కాశీం రజ్వీకి, హైదరాబాద్ సైన్యానికి తొలిరోజు యుద్దంలోనే చుక్కెదురైంది.. అయినా హైదరాబాద్ సైన్యం యుద్దంలో వీర విహారం చేస్తూ భారత సైన్యాన్ని తరిమి కొడుతోంది అంటూ దక్కన్ రేడియోలో గోబెల్స్ ప్రచారాన్ని కొనసాగించారు.. సంస్థాన ప్రజలంతా భారత సైన్యం విజయం సాధించాలని మొక్కుకున్నారు.. (మిగతాది రేపు.. 14 సెప్టెంబర్ నాటి యుద్ద వివరాలు)

Sunday, September 11, 2016

ముందు ఆకలి తీరాలా వద్దా?

‘చికెన్ బిర్యానీ కావాలి..’
‘సారీ అది లేదు.. వెజ్ బిర్యానీ రెడీగా ఉంది..’
‘నోనో.. నాకు చాలా ఆకలిగా ఉంది.. చికెన్ బిర్యానీ ఇవ్వాల్సిందే..’
‘ఇప్పుడు తాజాగా ఉన్న వెజిటేబుల్ బిర్యానీ అయితే వెంటనే వడ్డించగలం..’
‘మాకు చికెన్ బిర్యానీ కావాలంటే వెజ్ బిర్యానీ పెడతానంటావా?.. నీ బోడి దాబా ఎవడిక్కావాలి..’ మండిపడి పక్క దాబాకు పోయాడు దానయ్య..
అయితే అక్కడ ఇంకా పొయ్యి వెలిగించలేదు.. పాపం దానయ్య.. ఆకలితో అల్లాడిపోతున్నాడు.. తానే ఇంకో దాబా పెడతానంటూ ఆవేశంగా రోడ్డు మీదకు వచ్చాడు..

Friday, September 9, 2016

ఎవని భాషలో వాడు రాయాలె..


సోయి తప్పిన యాసకు యాది తెప్పించిండు.. ఆ యాసే మన శ్వాస, భాష అని గుర్తు చేసిండు మన కాళన్న..
తెలుగులో అన్ని మాండలికాలను సమానంగా ఆదరించాలన్నాడు కాళోజీ నారాయణ రావు.. ఒక ప్రాంత మాండలికమే ప్రామాణిక తెలుగు భాషగా చెలామణి చేయడాన్ని వ్యతిరేకించాడు.. ‘రెండున్నర జిల్లాల భాష తెలుగు భాష ఎట్లయితది’ అని ప్రశ్నించాడాయన..
తెలంగాణ యాసను గేలి చేసిన వారిని సహించలేకపోయాడు కాళన్న.. ‘తెలంగాణ యాసనెపుడు యీసడించు భాషీయుల సుహృద్భావన ఎంతని వర్ణించుట సిగ్గు చేటు’ అంటూ ఎండగట్టాడు..
‘ఎవని భాష వాడు రాయాలె.. అట్ల రాస్తె అవతలోనికి తెలుస్తదా అని ముందర్నే అనుకొనుడు, మనను మనం తక్కువ చేసుకున్నట్లే.. ఈ బానిస భావన పోవాలె.. నేనెన్నోసార్లు చెప్పిన భాష రెండు తీర్లు.. ఒకటి బడి పలుకుల భాష, రెండోది పలుకుబడుల భాష.. పలుకు బడుల భాష కావాలె ‘అని స్పష్టంగా చెప్పాడు కాళోజీ..
తెలుగు భాషను చిన్నచూపు చూసేవారికి అసలు సహించలేరు కాళోజీ.. ‘తెలుగు బిడ్డవురోరి.. తెలుగు మాట్లాడుటకు సంకోచ పడియెదవు సంగతేమిటిరా?’ అని నిలదీశారు..
‘ఏ భాష నీది ఏమి వేషమురా., ఈ భాష, ఈ వేషమెవరికోసమురా, ఆంగ్లమందు మాట్లడగానే ఇంత కుల్కెదవెందుకురా.. తెలుగువాడివై తెలుగు రాదనుచు సిగ్గులేక ఇంక చెప్పుటెందుకురా, అన్య భాషలు నేర్చి ఆంధ్రమ్ము రాదంచు సకిలించు ఆంధ్రుడా చావవెందుకురా?‘ అని ఈసడించారు కాళోజీ..
కాళోజీ నారాయణ రావు అసలు పేరు ‘రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరావు రాంరాజా’ తండ్రి మరాఠి, తల్లి కన్నగ.. కానీ తెలుగు భాషను ప్రేమించారు కాళోజీ.. తెలుగే ఆయన భాష, మాట, రాత, శ్వాస అయింది.. నిజాం నిరంకుశ పాలనను నిరసించారు.. అరాచక పాలనపై అక్షరాయుధాలతో పోరాటం చేశారు.. సత్యాగ్రహం చేసి జైలుకు వెళ్లారు.. ఆర్యసమాజం, ఆంధ్రమహాసభ, స్టేట్ కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు.. విశాలాంధ్ర, తెలంగాణ ఉద్యమాలు.. అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా పోరాటం.. పౌరహక్కులు, గ్రంధాలయ ఉద్యమం.. ఇలా అన్నింటా తానై పని చేశారు.. అన్ని సిద్ధాంతాలను సమానంగా ఆదరించారు.. జనం ఆవేదనే ఆయన గోడు అయింది.. కాళోజీ గొప్ప ప్రజాస్వామ్యవాది.. వ్యక్తి స్వేచ్ఛను గట్టిగా బలపరిచారు.. అన్నింటికీ మించి ఆయన గొప్ప మానవతావాది..
కాళోజీ గొప్ప జాతీయవాది.. ‘పుట్టుక నీది.. చావు నీది.. బతుకంతా దేశానిది..’ అంటూ లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ దివంగతులైనప్పుడు నివాళి అర్పించారు కాళోజీ..
కాళోజీ నారాయణ రావు జయంతిని ‘తెలంగాణ భాషా దినోత్సవం’గా నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం.. ఆ సందర్భంగా ఆ మహనీయుని సేవలను స్మరించుకుందాం..
(కాళోజీ నారాయణ రావు జయంతి నేడు- 09.09.1914)