Thursday, September 15, 2016

నిజాం సైన్యం పరాజయాలు..

15-09-1948.. హైదరాబాద్ సంస్థానాన్ని నలువైపుల నుండి స్వాధీనం చేసుకుంటూ ముందుకు సాగుతున్నాయి భారత సైన్యాలు.. నిజాం సైన్య డొల్లతనం క్షేత్ర స్థాయిలో స్పష్టంగా కనిపిస్తోంది.. ఎక్కడా ఊహించిన స్థాయి ప్రతిఘటన కూడా లేదు.. జాల్నా నుండి హైదరాబాద్ దిశగా బయలు దేరిన సైన్యం లాతూరును స్వాధీనం చేసుకున్నాయి.. భారత సైన్యం కల్యాణి, బీదర్, హుమ్నాబాద్, జహీరాబాద్ ల మీదుగా హైదరాబాద్ వైపు వస్తున్నాయనే వార్తలు నిజాం నవాబును కలవరపరిచాయి.. అడ్డుకోవడం ఇక అసాధ్యమని నిజాంకు అర్థమైపోయింది.. మొయినాబాద్ సమీపంలో ఎదుర్కొనే ప్రయత్నం చేసిన నిజాం సైన్యాన్ని భారత సైన్యం తిప్పికొట్టింది..
అటు తూర్పు దిశగా విజయవాడ నుండి దూసుకువస్తున్న భారత సైన్యం సూర్యాపేట చేరింది.. అక్కడ కొంత మంది యువకులు సైన్యంపై దాడికి ప్రయత్నించారు.. వారికి నచ్చజెప్పి పంపేందుకు ప్రయత్నిస్తే వినలేదు.. దీంతో సైన్యం ఒక శతఘ్ని గుండును పేల్చింది.. ఆ యువకుల్లో కొందరు కుప్పకూలగా మిగతా వారు పారిపోయారు.. భారత సైన్యం ముందుకు రాకుండా మూసీనది మీద వంతెనను కూల్చేసింది నిజాం సైన్యం.. అయినా మరమత్తు చేసుకుకొని ముందుకు కదిలారు సైనికులు.. నార్కట్ పల్లి దగ్గర జరిగిన పోరాటంలో నిజాం సైన్యం దారుణంగా దెబ్బతిన్నది..

పరిస్థితులు విషమించాయని అర్థమైన హైదరాబాద్ ప్రభుత్వం భారత్ తో సంధి కోసం ప్రతిపాదన పంపింది.. కానీ ఢిల్లీ నుండి ఎలాంటి స్పందన రాలేదు.. మరోవైపు పాకిస్తాన్ ద్వారా వత్తిడి తేవడానికి చేసిన ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి.. హైదరాబాద్ ప్రభుత్వం ఐక్యరాజ్య సమితిలో ఈ అంశాన్ని లేవనెత్తేందుకు అప్పటికే ప్రతినిధులను పంపింది.. సెప్టెంబర్ 15వ తేదీన అంతర్జాతీయ పత్రికల్లో హైదరాబాద్ పై భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ పోలో వార్తలు పతాక శీర్శికల్లో వచ్చాయి.. (16 సెప్టెంబర్.. కీలక పోరాటం, ప్రపంచ దేశాల లొల్లి)

1 comment:

  1. ఇదేపని కశ్మీర్ లో చేసుంటే బాగుండేది.

    ReplyDelete