Wednesday, September 28, 2016

మూసీ ప్రళయ రూపం.. భాగ్యనగర విషాదం

28 సెప్టెంబర్, 1908.. భాగ్యనగర చరిత్రలో అత్యంత విషాదకరమైన రోజు ఇది.. ఆ రోజు తెల్లవారు ఝాముకు ముందే భారీ జల ఖడ్గం విరుచుకుపడింది.. కారు చీకటి వేళ 15 వేల మందికి పైగా తుడుచుకు పోయారు.. 80 వేల మంది నిరాశ్రయులుగా మారారు.. అంతటా ఆక్రందనలు..
రెండు మూడు రోజులుగా మేఘాలు బద్దలై నేలపై పడ్డాయా అన్నంత భయంకరమైన వర్షం.. వికారాబాద్ సమీపంలోని అనంతగిరి కొండల నుండి దూకిన మూసీనది ఉగ్ర రూపం దాల్చింది.. జోరు వర్షాలకు చెరువులను గండ్లుపడి నదిలోకి వరద నీరు ప్రవహించింది.. ఉప్పొంగిన మూసీ భారీ ప్రవాహ రూపంలో హైదరాబాద్ ను ముంచెత్తింది. మూడో వంతు నగరం గల్లంతైపోయింది.. నిద్రలోనే ఎంతో మంది విగత జీవులైపోయారు.. చిమ్మ చీకటిలో ఎటు చూసినా జల ప్రవాహం.. అయిన వారు కళ్ల ముందు కొట్టుకుపోతున్నా రక్షించలేని దుస్థితి.. ఇళ్లూ, వాకిలి, ఆస్తిపాస్తులు గల్లంతు.. మూసీ నది సాధారణ స్థితికన్నా 40 50 అడుగుల ఎత్తు ప్రవహించింది.. నగరంలోని నాలుగు వంతెనలు మునిగిపోయాయి.. పురానాపూల్ మాత్రమే భద్రంగా ఉంది.. అఫ్జల్ గంజ్ వంతెన కొట్టుకుపోయింది.. ముసల్లంజంగ్, చాదర్ ఘాట్ వంతెనలు దెబ్బతిన్నాయి.. ఎటు చూసినా బురద రాళ్ల మేటలు, కొట్టుకువచ్చిన శవాలు, కూలిన ఇండ్లూ, భవనాల శిథిలాలు.. జనం ఆహాకారాలు, రోదనలు.. ధనికులు, పేదల అంతరం తెలియని విషాద ఘటన అది..
మూసీ ప్రళయం చూసి హైదరాబాద్ పాలకుడు ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ చలించిపోయాడు.. ప్రజలకు కలిగిన కష్టం చూసి కన్నీటి పర్యంతమయ్యాడు.. కుండపోత వర్షంలో ఏనుగుపై తిరుగుతూ జనం దగ్గరకు వెళ్లి ఓదార్చాడు.. నిరాశ్రయులకు తన అధికార నివాసం పురాణా హవేలీ ప్రాంగణంలో రోజుల తరబడి వసతి భోజన, వస్త్ర సౌకర్యాలు కల్పించాడు.. మహబూబ్ అలీఖాన్ దగ్గరిండి మరీ సహాయక కార్యక్రమాలు పర్యవేక్షించాడు..
ఉగ్రరూపంలో ఉన్న మూసీ శాంతించాలంటే ఏమి చేయాలని ప్రధానమంత్రి మహారాజా కిషన్ పర్షాద్ ను అడిగాడు నిజాం నవాబు.. నది వరద తగ్గాలంటే ఏమి చేయాలని అడిగాడు.. ఆయన సలహా ప్రకారం వెండి పల్లెంలో పట్టుచీర, కుంకుమ పసుపు, ప్రమిదలతో నదీమ తల్లికి హారతి సమర్పించాడు.. మూసీ వరద క్రమంగా తగ్గుముఖం పట్టింది..
హైదరాబాద్ చరిత్రను గమనిస్తే మూసీనదికి 12 సార్లు భయంకరమైన వరదలు వచ్చాయి.. ఇందులో 1631, 1831, 1908 సంవత్సరాల్లో వచ్చిన వరదలు అత్యంత ప్రమాదాన్ని మిగిల్చాయి.. 1903లో కూడా ఒక మోస్తరు పెద్ద వరదే వచ్చింది.. 1831లో హైదరాబాద్ వచ్చిన ఏనుగుల వీరాస్వామయ్య తన కాశీయాత్ర చరిత్రలో ఆనాటి వరద పరిస్థితిని ఉల్లేఖించాడు.. ఆధునిక కాలంలో వచ్చిన 1908 మూసీ వరద తాలూకు చేదు గుర్తులు ఇప్పటికీ కనిపిస్తాయి.. ఉస్మానియా ఆస్పత్రి ఆవరణలోని భారీ చింత చెట్టుకు పైకి ఎక్కిన 150 మంది తమ ప్రాణాలను కాపాడుతున్నారు..
మూసీనదికి భవిష్యత్తులో ఇలాంటి వరదలు రాకూడదని భావించారు మీర్ మహబూబ్ అలీఖాన్.. ప్రఖ్యాత ఇంజినీరు మోక్షగుండం విశ్వేశయ్యను హైదరాబాద్ రప్పించారు.. ఆయన సలహా మేరకు మూసీనది, దాని ఉపనది ఈసీపై ఉస్మాన్ సాగర్, హిమయత్ సాగర్ ఆనకట్టలను కట్టించారు.. మూసీ నది తీరం వెంట పెద్ద ఎత్తున గోడలు నిర్మించారు.. ఈ పనులు ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ హయాంలో పూర్తయ్యాయి..
ఒకనాడు ఉదృతమైన ప్రవాహంతో, నౌకాయానంతో కళకళలాడింది మూసీ.. ఈ నదీ తీరమంతా పచ్చని ఉద్యానవనాలు, పంట పొలాలతో కనిపించేది.. కానీ అదంతా గతం.. కాలక్రమంలో మూసీ ఒక డ్రైనేజీ స్థాయికి దిగజారిపోయింది.. జీవనది స్థాయిని కోల్పోయింది.. కబ్జాలతో కుందించుకుపోతోంది.. ఇప్పుడు మూసీ ధీన స్థితిని చూస్తే జాలేస్తోంది.. నదిని రక్షించుకోవాల్సిన తక్షణ కర్తవ్యం మనపై పడింది..


No comments:

Post a Comment