Friday, September 9, 2016

ఎవని భాషలో వాడు రాయాలె..


సోయి తప్పిన యాసకు యాది తెప్పించిండు.. ఆ యాసే మన శ్వాస, భాష అని గుర్తు చేసిండు మన కాళన్న..
తెలుగులో అన్ని మాండలికాలను సమానంగా ఆదరించాలన్నాడు కాళోజీ నారాయణ రావు.. ఒక ప్రాంత మాండలికమే ప్రామాణిక తెలుగు భాషగా చెలామణి చేయడాన్ని వ్యతిరేకించాడు.. ‘రెండున్నర జిల్లాల భాష తెలుగు భాష ఎట్లయితది’ అని ప్రశ్నించాడాయన..
తెలంగాణ యాసను గేలి చేసిన వారిని సహించలేకపోయాడు కాళన్న.. ‘తెలంగాణ యాసనెపుడు యీసడించు భాషీయుల సుహృద్భావన ఎంతని వర్ణించుట సిగ్గు చేటు’ అంటూ ఎండగట్టాడు..
‘ఎవని భాష వాడు రాయాలె.. అట్ల రాస్తె అవతలోనికి తెలుస్తదా అని ముందర్నే అనుకొనుడు, మనను మనం తక్కువ చేసుకున్నట్లే.. ఈ బానిస భావన పోవాలె.. నేనెన్నోసార్లు చెప్పిన భాష రెండు తీర్లు.. ఒకటి బడి పలుకుల భాష, రెండోది పలుకుబడుల భాష.. పలుకు బడుల భాష కావాలె ‘అని స్పష్టంగా చెప్పాడు కాళోజీ..
తెలుగు భాషను చిన్నచూపు చూసేవారికి అసలు సహించలేరు కాళోజీ.. ‘తెలుగు బిడ్డవురోరి.. తెలుగు మాట్లాడుటకు సంకోచ పడియెదవు సంగతేమిటిరా?’ అని నిలదీశారు..
‘ఏ భాష నీది ఏమి వేషమురా., ఈ భాష, ఈ వేషమెవరికోసమురా, ఆంగ్లమందు మాట్లడగానే ఇంత కుల్కెదవెందుకురా.. తెలుగువాడివై తెలుగు రాదనుచు సిగ్గులేక ఇంక చెప్పుటెందుకురా, అన్య భాషలు నేర్చి ఆంధ్రమ్ము రాదంచు సకిలించు ఆంధ్రుడా చావవెందుకురా?‘ అని ఈసడించారు కాళోజీ..
కాళోజీ నారాయణ రావు అసలు పేరు ‘రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరావు రాంరాజా’ తండ్రి మరాఠి, తల్లి కన్నగ.. కానీ తెలుగు భాషను ప్రేమించారు కాళోజీ.. తెలుగే ఆయన భాష, మాట, రాత, శ్వాస అయింది.. నిజాం నిరంకుశ పాలనను నిరసించారు.. అరాచక పాలనపై అక్షరాయుధాలతో పోరాటం చేశారు.. సత్యాగ్రహం చేసి జైలుకు వెళ్లారు.. ఆర్యసమాజం, ఆంధ్రమహాసభ, స్టేట్ కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు.. విశాలాంధ్ర, తెలంగాణ ఉద్యమాలు.. అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా పోరాటం.. పౌరహక్కులు, గ్రంధాలయ ఉద్యమం.. ఇలా అన్నింటా తానై పని చేశారు.. అన్ని సిద్ధాంతాలను సమానంగా ఆదరించారు.. జనం ఆవేదనే ఆయన గోడు అయింది.. కాళోజీ గొప్ప ప్రజాస్వామ్యవాది.. వ్యక్తి స్వేచ్ఛను గట్టిగా బలపరిచారు.. అన్నింటికీ మించి ఆయన గొప్ప మానవతావాది..
కాళోజీ గొప్ప జాతీయవాది.. ‘పుట్టుక నీది.. చావు నీది.. బతుకంతా దేశానిది..’ అంటూ లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ దివంగతులైనప్పుడు నివాళి అర్పించారు కాళోజీ..
కాళోజీ నారాయణ రావు జయంతిని ‘తెలంగాణ భాషా దినోత్సవం’గా నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం.. ఆ సందర్భంగా ఆ మహనీయుని సేవలను స్మరించుకుందాం..
(కాళోజీ నారాయణ రావు జయంతి నేడు- 09.09.1914)

No comments:

Post a Comment