Sunday, September 25, 2016

విశ్వ నగరం తీరు ఇలాగేనా?

అందరూ శాఖాహారులేనట.. కానీ బుట్టెడు రొయ్యలు మాయం..
హైదరాబాద్ నగరాన్ని మరోసారి వరదలు ముంచెత్తాయి.. ఇది కొత్తేంకాదు.. ఊహించనిది అంతకన్నా కాదు.. లోతట్టులో ఉన్న బస్తీలు, కాలనీలు నీట మునిగాయి.. నాలాలు, చెరువులు ఉప్పొంగాయి.. ఇళ్లు, అపార్టుమెంటుల్లోకి నీరు చేరింది.. రోడ్లు కాలువలుగా మారిపోయి ఎక్కడ ఏ గొయ్యి ఉందో తెలియని పరిస్థితి ఏర్పడింది..
వరద ముప్పు నుండి హైదరాబాద్ బయట పడక ముందేబురద చల్లుకొనుడు మొదలైంది.. ఈ పాపం మీదంటే మీదంటూ రాజకీయుల పరస్పర విమర్శలు, సోషల్ మీడియాలో వారి ఫాలోవర్ల సెటైర్లు.. కానీ తిలాపాపం తలా పిడికెడు అనే నిజాన్ని మరచిపోతున్నాం..
నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో ఒకప్పుడు 500కు పైనా జలాశయాలుండేవి.. చెరువులు, కుంటలు, వాగులు, కాలువలు, బావులు, తోటలతో చూడ ముచ్చటగా ఉండేది భాగ్యనగరం.. మరి ఏమయ్యాయి ఇవన్నీ.. నేటి పాలకులకు, పౌరులకు వాటి గురుంచి ఏమైనా అవగాహన ఉందా? విచ్చల విడిగా కబ్జాలు చేసి, పూడ్చేసి, అమ్మేసుకుంటే ఇంకెక్కడి చెరువులు, నాలాలు?..
నీళ్లు పల్లమెరుగు’.. దానికి ధర్మం ప్రకారం అది ప్రవహిస్తుంది.. భాగ్యనగరంలోని చెరువులన్నీ కాలువలతో అనుసంధానమై గొలుసుకట్టుగా ఉంటాయి.. వర్షం నీరు, వరదతో వరుసగా నిండుతాయి.. అధిక జలాలు మూసీ నదిలోకి వెళ్లిపోతాయి.. కానీ వాటి సహజ స్థావరాలను దర్జాగా కబ్జా చేసేస్తే ఎక్కడికి పోతాయి ఆ ప్రవాహాలు.. వాటి స్థలాలకు అవి వస్తున్నాయి.. అక్కడ ఉంటున్న మన జనాలకే అంతిమ నష్టం.. కబ్జాలు చేసి అమ్మినోళ్లు, వారికి అండగా ఉన్న నాయకులు, దళారులు వారి వాటాలతో వారు హాయిగా జీవిస్తున్నారు.. కానీ కొన్నవారు, అక్కడ నివసిస్తున్న వారే అంతిమంగా నష్టపోతున్నారు..
హైదరాబాద్ నగరానికి ఏర్పడ్డ ఈ దుస్థితికి పరస్పరం నిందించుకుంటున్నాయి రాజకీయ పార్టీలు.. కానీ ముసుగులు తీసి గుద్దులాటలు ఆపేస్తే ఎవరు ఏమిటనేది జనాలకే అర్థం అవుతుంది.. ఇక్కడ ఎవరూ సుద్దపూసలు కాదు.. అత్యధిక కాలం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కాలంలో సగానికి పైగా జలాశయాలు మాయమయ్యాయి.. నాలాల వెంట నివాసాలు వచ్చింది ఈ కాలంలోనే.. ఇక తెలుగు దేశం వారు ఏమీ తక్కువ తినలేదు.. అధికారంలో ఉన్నంత కాలం హైదరాబాద్ కు మేకప్పులు వేసి, లిప్ స్టిక్కులు పూసి తామే ఈ నగరాన్ని నిర్మించామన్నంత గొప్పలు చెప్పుకున్నారు.. కానీ ఏనాడూ చెరువుల కబ్జాలు, డ్రైనేజీలు, నాళాల దుస్థితి మీద దృష్టి పెట్టలేదు.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి రెండేళ్లు గడచిపోయింది.. కానీ టీఆర్ఎస్ ఇంకా గత పాలకులనే నిందిస్తోంది..
హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దాలనే తపన సరే.. కానీ నగరం రోడ్లు, డ్రైనేజీల నిర్వహణ సంగతి గాలికి వదిలేస్తే ఎలా? ఈ వర్షాకాలం భారీ వర్షాలు పడతాయని ముందుగా ఊహించిందే.. కానీ డ్రైనేజీలు, నాలాల్లో ముందుగా ఎక్కడా పూడిక తీయలేదు.. రోడ్ల మీద నీరు నిల్వ ఉండే పాయింట్స్ అందరికీ తెలిసినవే.. కనీసం అక్కడ కాస్త గట్టి రోడ్డు వేసే పని కూడా చేయలేదు.. మెట్రో రైలు లైన్ నిర్మాణ మార్గాల్లో విస్తరణ పనులు పూర్తి చేయకపోవడంతో ట్రాఫిక్ సమస్యలు దారుణంగా మారాయి.. నగరం ఇంతటి దుస్థితిలో ఉండటానికి కారకులైన వారిలో చాలా మంది ఇప్పుడు టీఆర్ఎస్ లోకి ఫిరాయించారు.. వారు కూడా ఇప్పుడు సుద్దులు చెప్పుతున్నారు..

విమర్శలను  పక్కన పెట్టి తక్షణం చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి.. ముందుగా కబ్జాకు గురైన చెరువులను గుర్తించాలి.. అక్కడ ఉన్న వారిని ఖాళీ చేయించడం ఇప్పుడు కష్టమే.. అక్కడ నీరు చేరే అవకాశం లేకుండా కొత్తగా డ్రైన్లను నిర్మించాలి.. చెరువులు, నాలాల వెంట ఉన్న నిర్మాణాలను నిర్ధాక్షిణ్యంగా తొలగించాలి.. వాటి చుట్టూ చక్కని పార్కులు నిర్మించి కాపాడాలి.. నగరంలో రోడ్లన్నీ తక్షణం సీసీ రోడ్లుగా మార్చేయాలి.. మళ్లీ మళ్లీ తవ్వే అవకాశం లేకుండా ముందుగానే శాశ్వత డ్రైనేజీ, కేబుల్ డక్ట్ లైన్లు వేయాలి.. అన్నింటికన్నా ముందుగా మెట్రోరైలు మార్గంలో ట్రాఫిక్ సక్రమంగా సాగేందు కోసం రోడ్డుకు ఇరువైపులా ఉన్న కట్టడాలను నిర్ధాక్షిణ్యంగా తొలగించాలి.. భాగ్యనగరాన్ని నిజంగా విశ్వనగరంగా మార్చేందుకు ఇవే తొలిమెట్లు..  

No comments:

Post a Comment