Saturday, September 17, 2016

హైదరాబాద్ సంస్థాన ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీల్చిన వేళ..

17-09-1948.. హైదరాబాద్ సంస్థానాన్ని 224 సంవత్సరాల పాటు పాలించిన అసఫ్ జాహీ వంశానికి చివరి రోజు.. ఏడు తరాల బూజు వదిలిన దినమిది..
హైదరాబాద్ దిశగా పురోగమిస్తున్న భారత సైన్యం బీదర్ పట్టణాన్ని స్వాధీనం చేసుకుంది.. మరోవైపు చిట్యాల, బీబీనగర్ కూడా స్వాధీనమైపోయింది.. ఆపరేషన్ పోలో పేరిట మొదలైన ఐదో రోజు నాటికి నిజాం సేనలు, రజాకారులు పూర్తి తోక ముడిచారు.. హైదరాబాద్ నగరం వైపు దూసుకు వస్తున్న భారత సైన్యానికి పటాన్ చెరు దగ్గర ప్రజలు జేజేలు పలికారు..
అంతా అయిపోయిందని అర్థమైన నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ భారత ప్రభుత్వ ఏజెంట్ జనరల్ కె.ఎం.మున్షీని పిలిపించారు.. ఇప్పుడు తాను ఏమి చేయాలని సలహా కోరాడు.. లొంగిపోవడమే ఏకైక మార్గమని మున్షీ సూచించారు.. సాయంత్రం ఏడు గంటల సమయంలో నిజాం ప్రభువు దక్కన్ రేడియోలో ప్రసంగిస్తూ తన ప్రభుత్వ రాజీనామాను ప్రకటించాడు..
భారత సైన్యాలు సికింద్రాబాద్ లోని బొల్లారం చేరుకున్నాయి.. డకోటా విమానంలో దిగిన మేజర్ జనరల్ జేఎన్ చౌధురికి ఘన స్వాగతం పలికారు.. హైదరాబాద్ సైన్యం చీఫ్ ఎల్. అద్రూస్ అసఫ్ జాహీ పతకాన్ని అవగతం చేసి, జెఎన్ చౌధురి ఎదుట లొంగుబాటును ప్రకటించారు..
హైదరాబాద్ ప్రధాని లాయక్ అలీ అప్పటికే రాజీనామా చేయగా, ఆయనను గృహ నిర్భందంలో ఉంచారు.. రజాకార్ల నాయకుడు ఖాసిం రజ్వీని అరెస్టు చేశారు..
హైదరాబాద్ విమోచనం నిజాం పాలన నుండి సంపూర్ణంగా విమోచనం పొంది భారతావనిలో విలీనమైంది.. సంస్థాన ప్రజలు భారత జాతీయ పతాకాలతో వీధుల్లో కేరింతలు కొడుతూ స్వేచ్ఛా వాయువులను ఆస్వాదించారు..

No comments:

Post a Comment