Wednesday, September 14, 2016

హైదరాబాద్ సంస్థాన పతనానికి నాంది..

13-09-1948... నిరంకుశ నిజాం పాలన నుండి హైదరాబాద్ సంస్థానానికి విమోచనంలో తొలి అడుగు పడిన చారిత్రిక దినమిది.. భారత దేశంలో చేరకుండా  హైదరాబాద్ స్వతంత్రంగా ఉంటుందని ప్రకటించిన నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ కలలు చెదిరిపోయిన రోజు ఇది.. అసఫ్ జాహీ పాలన, రజాకార్ల చెర నుండి హైదరాబాద్ సంస్థానాన్ని విముక్తం చేసేందుకు నాటి కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆదేశాల మేరకు భారత సైన్యం ఆపరేషన్ పోలో చేపట్టింది.. మేజర్ జనరల్ జె.ఎన్. చౌధురి నేతృత్వంలో సంస్థానాన్ని నలు వైపుల నుండి చుట్టు ముట్టింది.. దీనికే పోలీస్ యాక్షన్ అనే మరో పేరు..

సెప్టెంబర్ 13 నాడు భారత సైన్యం షోలాపూర్ వైపు నుండి హైదరాబాద్ సంస్థానంలోని ఉస్మానాబాద్ జిల్లాలోకి ప్రవేశించింది.. బోరీ నది వంతెన దాటి సరిహద్దుకు 19 కిలో మీటర్ల దూరంలోని నలదుర్గ్ పట్టణంలోకి దూసుకుపోయింది.. పెద్ద పోరాటం లేకుండా కేవలం రెండు తూటాలతో నలదుర్గ్ భారత సైన్యానికి స్వాధీనమైపోయింది.. ఆ తర్వాత జాల్కోట్, తల్ముడి పట్టణాల్లోకి ప్రవేశం.. అప్పటికే నిజాం సైన్యం, రజాకార్లు ఆ పట్టణం విడిచి పారిపోయారు.. అక్కడి ప్రజలు సైన్యానికి ఘన స్వాగతం పలికారు.. మరోవైపు తుల్జాపూర్ లో రజాకార్లు సైన్యంతో రెండు గంటల పాటు పోరాడారు.. పెద్ద సంఖ్యలో రజాకార్లు చనిపోగా, మిగతావారు లొంగిపోయారు.. మరోవైపు హోసపేట నుండి బయలు దేరిన సైన్యం తుంగభద్ర నది దాటి హైదరాబాద్ సంస్థానంలోని కీలక ప్రాంతాలను స్వాధీనం చేసుకుంది..

భారత సైన్యాన్ని ఎదిరిస్తాం.. ఢిల్లీ ఎర్రకోటపై అసఫ్ జాహీ పతాకాన్ని ఎగురవేస్తాం అని బీరాలు పలికిన రజాకార్ల నాయకుడు కాశీం రజ్వీకి, హైదరాబాద్ సైన్యానికి తొలిరోజు యుద్దంలోనే చుక్కెదురైంది.. అయినా హైదరాబాద్ సైన్యం యుద్దంలో వీర విహారం చేస్తూ భారత సైన్యాన్ని తరిమి కొడుతోంది అంటూ దక్కన్ రేడియోలో గోబెల్స్ ప్రచారాన్ని కొనసాగించారు.. సంస్థాన ప్రజలంతా భారత సైన్యం విజయం సాధించాలని మొక్కుకున్నారు.. (మిగతాది రేపు.. 14 సెప్టెంబర్ నాటి యుద్ద వివరాలు)

No comments:

Post a Comment