Friday, September 16, 2016

అంతర్జాతీయ వత్తిడి..

16-09-1948.. ఆపరేషన్ పోలో ఆరో రోజు ఇది.. ఉదయాన్నే భారత సైన్యం బీదర్, హుమ్నాబాద్ మీదుగా జహీరాబాద్ చేరింది.. దారిలో అడుగగుడగునా నిజాం సైన్యం పెట్టిన మందుపాతరలు ఉన్నాయి.. వీటిని నిర్వీర్యం చేస్తూ మందుకు సాగింది సైన్యం.. అక్కడక్కడా దాగిన రజాకార్లు చాటు భారత సైన్యంపై కాల్పులు జరిపారు.. సైన్యం దగ్గర ఉన్న అధునాతన ఆయుధాల ముందు వారు మట్టికరిచారు..
భారత సైన్యం హైదరాబాద్ వైపు దూసుకువస్తోందనే సమాచారంతో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాడు.. కింగ్ కోఠి ప్యాలస్ లో ప్రధాని లాయక్ అలీ, ఇతర అధికారులతో సుదీర్ఘ సమాలోచనలు జరుపుతున్నాడు.. అన్ని వైపుల నుండి పరాజయ వార్తలే వస్తున్నాయి. విజయవాడ వైపు నుండి వస్తున్న భారత సైన్యాన్ని ఇక ఎంత మాత్రం ఆపలేమని సైనికాధికారులు స్పష్టం చేశారు.. ఇంతలో ఒక విమానం ప్యాలస్ మీదుగా  చాలా దగ్గర నుండి వెళ్లడంతో అందరూ భయపడిపోయారు..

మరోవైపు ప్యారిస్ వెళ్లిన నిజాం ప్రభుత్వ బృందం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత సైన్యం జరిపిన ఆపరేషన్ పోలో అంశాన్ని లేవనెత్తే ప్రయత్నాలు ముమ్మరం చేసింది.. చైనా, రష్యా మినహా మిగతా దేశాల ప్రతినిధులు భారత్ చర్యను తప్పు పట్టారు. వీరిలో బ్రిటన్, అమెరికా, ప్రాన్స్, కెనడా, అర్జెంటీనా, సిరియా దేశాల ప్రతినిధులు ఉన్నారు.. హైదరాబాద్ కు అండగా ఉంటుందని భావించిన పాకిస్తాన్ వైపు నుండి ఎలాంటి స్పందనా కనిపించకపోవడంతో నిజాం నవాబు గందరగోళంలో పడ్డాడు.. (17 సెప్టెంబర్.. పరాజయం సంపూర్ణం)

No comments:

Post a Comment