Sunday, February 26, 2017

ఏ శక్తీ కశ్మీర్ ను విడదీయలేదు..

 జమ్మూ కశ్మీర్ రాష్ట్రం భారత దేశంలో ఎప్పటికీ అంతర్భాగం.. ఏ శక్తి విడదీయలేదు అని సంకల్ప్ దివస్ చాటి చెప్పింది.. జమ్మూ కశ్మీర్ స్టడీ సెంటర్ – హైదరాబాద్ చాప్టర్ ఆధ్వర్యంలో కాచిగూడ భద్రుకా కాలేజీలో ఈ కార్యక్రమం జరిగింది.. దేశమంతా తమ వెంట ఉందనే నమ్మకాన్ని కశ్మీర్ పండిట్లకు, అక్కడి ప్రజలకు కల్పించాలని సంకల్ప్ దివస్ వక్తగా విచ్చేసిన జేకేఎస్సీ ఢిల్లీ డైరెక్టర్ అసుతోష్ భట్నాగర్ తెలిపారు.. ఇటీవల కశ్మీర్ లోయలో పర్యటించి వచ్చిన భారతీయ ప్రజ్ఞ ఎడిటర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అక్కడి పురాతన దేవాలయాలు, తరిమివేయబడిన పండిట్ల శిథిల గృహాల పరిస్థితిని విరించారు..  కార్యక్రమానికి జేకేఎస్సీ హైదరాబాద్ ఛాప్టర్ ఉపాధ్యక్షుడు బీహెచ్ఆర్ చౌదరి అధ్యక్షత వహించారు.. కార్యక్రమంలో రాకా సుధాకర్, ఎన్వీకే ప్రసాద్, క్రాంతి దేవ్ మిత్ర, సుమంత్, అను శర్మ పిళ్లై, విక్రమ్ సింహా, కృష్ణ (కన్నన్), సోమేశ్వరరావు, రవి చావలి, సాయిబాబా, నీలేశ్, వీరప్ప గార్లతో పాటు ఇతర మిత్రులు పాల్గొన్నారు..

Saturday, February 25, 2017

అటూ మనమే.. ఇటూ మనమే..

మహారాష్ట్రలో ఇప్పుడు అధికార పక్షమైనా, ప్రతిపక్షమైనా జాతీయవాదులే.. ఇటీవలి స్థానిక ఎన్నికల్లో అధికార బీజేపీ అఖండ విజయం నమోదు చేసుకుంది.. తర్వాతి స్థానంలో ఎన్డీఏ భాగస్వామి అయిన శివసేన నిలవడం విశేషం..
ఈ మార్పు చూస్తుంటే నాకు తమిళనాడు రాజకీయాలు గుర్తుకు వస్తున్నాయి.. అక్కడ కాంగ్రెస్ పార్టీకి అర్ధ దశాబ్దం కిందే ద్రవిడ పార్టీలు పాతరేశాయి.. 1967లో తమిళనాట అధికారం కోల్పోయిన కాంగ్రెస్ ఇప్పటికీ కోలుకోలేదు.. డీఎంకే, ఏఐఏడీఎంకేల మధ్యే అధికార మార్పిడి జరుగుతోంది..
ఇప్పుడు చూడబోతే మహారాష్ట్రలోనూ అదే దృశ్యం కనిపిస్తోంది.. గతంలో మిత్రపక్షాలైన బీజేపీ, శివసేన పార్టీలు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో, నిన్నటి స్థానిక ఎన్నికల్లో విడిగా పోటీ చేశాయి.. అక్కడ కాంగ్రెస్, ఎన్సీపీలో ఉనికిని కోల్పోయాయి.. వారి ఓట్లు అన్నీ బీజేపీ వైపు మరలినట్లు స్పష్టం అవుతోంది.. గతంలో రాజ్ ఠాక్రే శివసేన నుండి విడిపోయి మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన పెట్టడంతో ఆ పార్టీకి కళ్లెం పడింది.. ఇప్పుడు ఎంఎన్ఎస్పీ ఓట్లు తిరిగి శివసేనకు పడుతున్నాయని తెలుస్తోంది..
ఎన్టీఏలో భాగస్వామిగా ఉన్న శివసేన తన ఉనికిని కాపాడుకోడానికి అప్పుడప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం నుండి బయటకు వస్తామని హెచ్చరించండం ద్వారా సొంత అస్థిత్వాన్ని కాపాడుకోవాలని ప్రయత్నిస్తోంది.. అయితే ఓటర్లు కాంగ్రెస్, ఎస్పీపీలను పక్కన పెట్టి బీజేపీ, శివసేనల్లో ఎవరికో ఒక్కరికి ఓటేస్తున్నారు..మొత్తానికి అక్కడ జాతీయవాద పార్టీలే గెలుస్తున్నాయన్నమాట..

Friday, February 24, 2017

ఓం నమశ్శివాయ


భారతమాత సేవలో శివైక్యం

జన్మస్థలం: మరాఠ్వాడా.. కార్యస్థలం: తెలుగు నేల.. చేపట్టిన పని: భారతమాత సేవ.. తుది శ్వాస వరకూ ఇదే పనిలో ఉన్నారు హల్దేకర్ జీ..
మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిలాల హల్దా గ్రామంలో ఫిబ్రవరి 5, 1930 నాడు జన్మించారు శ్రీరామచంద్ర సదాశివ హల్దేకర్.. హైదరాబాద్‌లో బీఎస్సీ చదువుతున్న సమయంలో వారికి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ పరిచయమైంది.. చదువు వదిలేసి సంఘ ప్రచారక్‌గా పని ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విభాగ్ ప్రచారక్, సహ ప్రాంత ప్రచారక్, ప్రాంత ప్రచారక్, క్షేత్ర ప్రచారక్ తదితర బాధ్యతలు నిర్వర్తించారు..  పలు ప్రకృతి విపత్తుల సమయంలో హల్దేకర్ జీ నేతృత్వంలో స్వయం సేవకులు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించారు
ఎంతో మంది స్వయంసేవకులు, వారి కుటుంబాలతో ఆత్మీయ సంబంధాలు ఏర్పరచుకున్నారు హల్దేకర్జీ.. తెలుగు భాషను నేర్చుకొని మరాఠీ నుండి ఎన్నో గ్రంధాలను అనువదించారు.. ఈ క్రమంలో డాక్టర్జీ జీవిత చరిత్రను పెను తుఫానులో ద్వీప స్థంబం, గురూజీ జీవిత చరిత్రను ఓం రాష్ట్రాయ స్వాహా పేరిట తెలుగులో తీసుకువచ్చారు..
హల్దేకర్ జీ పిత్రార్జితంగా వచ్చిన యావదాస్తిని సంఘానికి ఇచ్చేశారు.. కొంత కాలంగా శ్వాసకోస వ్యాధితో బాధపడుతూ చకిత్స పొందుతున్నారు.. రాంభావు హల్దేకర్‌జీ తన 87వ ఏట ఫిబ్రవరి 23న మధ్యాహ్నం 12.15 గంటలకు బర్కత్‌పురాలోని కేశవ నిలయంలో తుదిశ్వాస విడిచారు. మరణానంతరం ఆయన కోరికపై నేత్రదానం జరిగింది..
దేశమాత సేవ కోసం, సమాజం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన జ్యేష్ఠ ప్రచారకులు హల్దేకర్జీ సేవలు చిరస్మరణీయం.. ఓం శాంతి..

Wednesday, February 22, 2017

జమ్మూ కశ్మీర్ సంకల్ప దివస్

బ్రిటిష్ వారు స్వాతంత్ర్యం ఇస్తూనే భారత దేశాన్ని విడగొట్టారు.. కొత్తగా ఏర్పడిన పాకిస్తాన్ మొదటి నుండి జమ్మూ కశ్మీర్ రాష్ట్రం మీద కన్నేసింది.. మహారాజా హరిసింగ్ అక్టోబర్ 26, 1947 నాడు జమ్మూ కశ్మీర్ ను భారత దేశంలో సంపూర్ణంగా విలీనం చేశారు.. ఆ సమయంలో పాకిస్తాన్ సైన్యం కిరాయి మూకల ముసుగులో ఈ రాష్ట్రంలోని గిల్గిత్ బాల్టిస్తాన్ భూభాగాన్ని ఆక్రమించుకున్నాయి.. భారత సైన్యం ఈ ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకునే తరుణంలోనే ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఈ అంశాన్ని ఐక్య రాజ్య సమతి దృష్టికి తీసుకుపోయారు.. అప్పటి నుండి యధాతథ స్థితి పేరుతో ఆ భాగం పాకిస్తాన్ ఆక్రమణలోనే ఉండిపోయింది.. మరోవైపు అక్సాయ్ చిన్ ప్రాంతాన్ని పాకిస్తాన్, చైనాకు దారాదత్తం చేసింది..

జమ్మూ కశ్మీర్ విషయంలో పాకిస్తాన్ మన దేశంతో ఇప్పటికి మూడు యుద్దాలు చేసి చావు దెబ్బతిన్నది.. అయినా బుద్ది మారకుండా ఈ రాష్ట్రాన్ని భారత్ నుండి విడదీసేందుకు ప్రయత్నాలు సాగిస్తూనే ఉంది.. ఉగ్రవాదానికి, వేర్పాటు వాదానికి ఆజ్యం పోస్తూ కశ్మీర్ లో నిత్యం ఆరాచకాలను కొనసాగిస్తోంది.. జమ్మూ కశ్మీర్ ను వివాదాస్పద ప్రాంతంగా పేర్కొంటూ  పదే పదే అంతర్జాతీయం చేస్తోంది..
ఈ నేపథ్యంలో భారత పార్లమెంటు ఫిబ్రవరి 22, 1994 నాడు పార్లమెంటులో చేసిన తీర్మాణం చరిత్రలో నిలచిపోయింది.. ప్రధాని పీవీ నరసింహారావు నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ చేసిన ఈ తీర్మాణాన్ని ప్రతిపక్ష భాజపాతో సహా అన్ని పక్షాలు  సమర్ధించాయి.. జమ్మూ కశ్మీర్ విషయంలో మన దేశ దృఢ సంకల్పాన్ని, కృత నిశ్చయాన్నిఈ తీర్మాణం ప్రపంచానికి చాటి చెప్పింది..
ఈ తీర్మానంలో నాలుగు అంశాలున్నాయి.
1) జమ్మూ కశ్మీర్ భారత్ లో అంతర్భాగం. దీన్ని వేరుచేసే ఏ ప్రయత్నాన్నైనా అన్ని పద్ధతుల్లో అడ్డుకుంటాం. 
2) భారతదేశపు ఐక్యత, సార్వభౌమత్వం, భౌగోళిక ఏకాత్మతను అడ్డుకునే ఏ ప్రయత్నాన్నైనా ఎదుర్కొనే సంకల్పం, సామర్థ్యం భారత్ కు ఉంది. 
3) దురాక్రమణ ద్వారా ఆక్రమించిన జమ్మూ కశ్మీర్  ప్రాంతాలనుంచి పాకిస్తాన్ వైదొలగాలి.
4) భారత దేశ అంతర్గత వ్యవహారాల్లో ఎలాంటి జోక్యాన్నీ భారత్ సహించదు.
చాలా స్పష్టంగా ఉన్న ఈ తీర్మాణం దేశ ప్రజల ఆకాంక్షలను, మనోభావాలను ప్రతిబింబిస్తోంది..

ఈ తీర్మాణం చేసిన ఫిబ్రవరి 22వ తేదీని జమ్మూ కశ్మీర్ సంకల్ప దివస్ గా దేశ వ్యాప్తంగా జరుపుకుంటున్నాం.. 

Tuesday, February 21, 2017

మన భాషను రక్షించుకోవడం ఎలా?

ప్రపంచంలో అంతరిస్తున్న భాషలో జాబితాలో తెలుగు కూడా ఉందంటే కాస్త ఆందోళన చెందాల్సిన విషయమే.. మన కళ్ల ముందు కనిపిస్తున్న వాస్తవాల మీద దృష్టి పెడదాం.. ఒక్కసారి ఆలోచించండి..
1.మీ పిల్లలు తెలుగు మాధ్యమంలోనే చదువుతున్నారా?
2.తెలుగు పత్రికలను స్పష్టంగా చదవగలరా?
2. అన్య భాషా పదాలు లేకుండా తెలుగులో మాట్లాడుతున్నారా?..
ఈ మూడు ప్రశ్నల్లో ఏ ఒక్కదానికీ ఔననే సమాధానం లేకపోతే మా ఇంట్లో తెలుగు భాషకు ప్రమాద ఘంటికలు మొగుతున్నట్లే లెక్క..
తెలుగు భాషా సంస్కృతుల పరిరక్షణ కోసం ప్రభుత్వం సక్రమంగా పని చేయడం లేదని, ఆంగ్లానికే పెద్ద పీట వేస్తున్నారని ఆరోపిస్తుంటాం.. కానీ భాషను రక్షించుకునే విషయంలో మన వంతు పాత్ర ఏమిటి అనే ప్రశ్నకు మాత్రం సమాధానం లేదు.. తెలుగు మాధ్యమం పాఠశాలలు మూత పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నాం.. కానీ మన పిల్లలను మాత్రం ఆంగ్ల మాద్యమ పాఠశాలలకే పంపుతాం.. టీవీ యాంకర్లు భాషను ఖూనీ చేస్తున్నారని నిందిస్తున్నాం.. కానీ అలాంటి కార్యక్రమాలు ఎందుకు చూస్తున్నామనే విషయాన్ని ఆలోచించం.. మీలో తెలుగు అక్షరాలను వరుసక్రమం తప్పకుండా రాసే వారు ఎంత మంది?.. ఇంతకీ తెలుగు భాషలో అక్షరాలు ఎన్ని ఉన్నాయి?.. కొన్ని అక్షరాలను ఎందుకు మింగేశాం? ఈ రోజు మనం మాతృ భాషను వదిలేసి అన్య భాషల వెంట పడుతున్నాం.. రేపు మన ధర్మం, సంస్కృతి, సాంప్రదాయాలను కూడా ఇలాగే వదిలేస్తామా?
తెలుగు భాషను రక్షించుకునే విషయంలో వ్యక్తిగా మనవంతు కర్తవ్యాన్ని నిర్వహిద్దాం.. సమాచార సాంకేతిక రంగం విస్తరించిన ఈ రోజుల్లో మాతృభాషను రక్షించుకునే అవకాశాలు గతంలో కన్నా మెరుగయ్యాయి.. దీన్ని సద్వినియోగం చేసుకోగలిగితే మన భాషకు ఎప్పటికీ ఢోకా ఉండదు.. ఎన్ని భాషలైనా నేర్వండి.. కానీ మీ మాతృభాషను మాత్రం మరచిపోకండి..

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం (21 ఫిబ్రవరి) సందర్భంగా ఆలోచించాల్సిన విషయాలు ఇవి..

Monday, February 20, 2017

తొలి ఏడాది పూర్తి చేసుకున్న WE CAN CHANGE

WE CAN CHANGE  విజయవంతంగా ఏడాది కాలం పూర్తి చేసుకుందని చెప్పడానికి సంతోషం వ్యక్తం చేస్తున్నాను.. సరిగ్గా సంవత్సరం క్రితం 20 ఫిబ్రవరి, 2016 నాడు రాత్రివేళ WE CAN CHANGE ఆవిర్భవించింది.. ఇప్పటికే ఎన్నో గ్రూప్స్ ఉన్నాయి మరో గ్రూప్ అవసరమా? అని కొందరు మిత్రులు ప్రశ్నించారు.. ఇతర గ్రూప్స్ కు మనం పూర్తిగా భిన్నంగా పోతున్నాం.. చూస్తూనే ఉండండి అని వారికి చెప్పాను.. మరునాటి ఉదయానికే ఫలితం కనిపించింది.. నా నమ్మకం వమ్ము కాలేదు..

సమాజంలోని వివిధ వర్గాల్లో ఉన్న జాతీయవాద సోషల్ మీడియా మిత్రులతో ప్రారంభమైన WE CAN CHANGEవిజయానికి కారణాలను నేను ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.. నిజానికి ఇందులో నా గొప్పదనం ఏమీ లేదు.. ఇదంతా సమిష్టి కృషితో సాధ్యమైన విజయం.. నేను ఎన్నో గ్రూపులలో ఉన్నాను.. మన సభ్యులు కూడా ఇతర గ్రూప్ లలో ఉన్నారు.. అందరికీ సొంత గ్రూప్స్ ఉన్నాయి.. ఆయా గ్రూప్ లలో క్రియాశీలకంగా ఉన్నవారిని గుర్తించి వారితో కొత్త ప్రయోగం చేశాను.. ఏ గ్రూప్ నూ మనం పోటీగా భావించలేదు.. ఎందుకంటే అందరూ మన మిత్రులే..
జాతీయవాద భావజాల ప్రచారమే WE CAN CHANGE ప్రధాన ఎజెండా.. Nation First అనేది మన నినాదం.. ఇది కేవలం ఒక నినాదం కాదు.. ఆచరణ.. ఇతర గ్రూప్స్ కు మనం భిన్నంగా పోదామని ఆరంభంలోనే అనుకున్నాం.. కాపీ + కట్ + పేస్ట్ సాధ్యమైనంత వరకూ వద్దని నిర్ణయించుకున్నాం.. చర్చలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చాం.. ఇందుకు అనుగుణంగా రూపొందించిన నియమ నిబంధనలను సభ్యులంతా పాటించారు..
WE CAN CHANGE కేవలం సోషల్ మీడియా ఛాటింగ్స్ కే పరిమితం కాదు.. Social Media for Social Change అనే నినాదంతో సామాజిక సేవను కూడా చేపట్టింది.. ఇందులో భాగంగా గ్రూప్ లోని మిత్రుల సహకారంతో కుడుమూరు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో పుస్తకాల పంపిణీ చేపట్టాం.. భవిష్యత్తులోనూ ఈ ప్రయత్నాన్ని కొనసాగిస్తాం..
ఈ ఏడాది కాలంలో సహకరించిన మిత్రులందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను.. ముఖ్యంగా అడ్మిన్స్, టీమ్ బృందం అందిస్తున్న సహకారం విస్మరించలేనిది.. వారి తోడ్పాటు లేకుంటే ఈ గ్రూప్ నిర్వహణ ఏ మాత్రం సాధ్యమయ్యేది కాదు.. మన గ్రూప్ ఇదే విధంగా ముందుకు సాగేందుకు సభ్యులంతా తోడ్పాటును అందించాలని కోరుకుంటున్నాను.. ధన్యవాదాలు..

జాతీయవాద స్పూర్తితో We Can Change




We Can Change ఆధ్వర్యంలో  జరిగిన సోషల్ మీడియా - జాతీయవాదం చర్చాగోష్టికి విచ్చేసిన మిత్రులందరికీ పేరు పేరునా ధన్యవాదాలు.. తక్కువ సమయంలో కార్యక్రమాన్ని చేపట్టినా ఇంత మంది హాజరు కావడం సంతోషంగా ఉంది.. భవిష్యత్తులో మనం మరిన్ని కార్యక్రమాలు చేపట్టి జయప్రదం చేద్దాం.. ఈ రోజు పెళ్లిళ్లు, ఇతర కార్యక్రమాల కారణంగా రాలేకపోతున్నామని పలువురు మిత్రులు సమాచారం అందించారు.. రాలేక పోయిన మిత్రులంతా తదుపరి సమావేశానికి వస్తారని ఆశిస్తున్నాను.. మీ అందరి ఆదరాభిమానాలు ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను..🙏

హిందూ హృదయ సామ్రాట్ జయంతి

భారత దేశ చరిత్రను గమనిస్తే మన దేశ ప్రజలు అత్యధిక సంఖ్యలో ఆరాధించే చారిత్రిక వీరుడు ఛత్రపతి శివాజీయే.. మన ధర్మాన్ని, దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్న విదేశీ ముష్కరులపై కత్తి గట్టిన యోధుడు శివాజీ.. మొఘల్ సామ్రాట్ ఔరంగజేబును ముప్పు తిప్పలు పెట్టి
 హైందవ సామ్రాజ్యాన్ని స్థాపించిన వీరుడు మన శివాజీ.. ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా ఆయన స్పూర్తిని కొనసాగించేందుకు మనమంతా ప్రతినబూనుదాం..

Saturday, February 18, 2017

తమిళనాట 'సిగ్గు'స్వామ్యం

1989లో డీఎంకే ఎమ్మెల్యేలు ప్రతిపక్ష నేత జయలలిత చీర లాగి అవమానిస్తే, 2017లో అదే సీన్ రిపీట్ అయింది.. అసెంబ్లీలో జరిగిన తోపులాటలో ప్రతిపక్ష నేత స్టాలిన్ చొక్కా చిరిగింది..
తమిళనాడు అసెంబ్లీలో చోటు చేసుకున్న పరిణామాలు ప్రజాస్వామ్యానికే సిగ్గు చేటు.. ఇందులో ఏఐఏడీఎంకే, డీఎంకే ఎమ్మెల్యేలు పోటీలు పడి తమ వంతు పాత్ర పోశించారు.. సీఎం పళని స్వామి బలపరీక్ష సందర్భంగా డీఎంకే సభ్యులు స్పీకర్ చొక్కా చిండం.. అందుకు ప్రతిగా ప్రతిపక్ష నేత స్టాలిన్ కు అవమానం..

ఇవి చూస్తుంటే అది అసెంబ్లీనా? కుస్తీ గోదానా అనే అనుమానం వస్తోంది. కనీసం కుస్తీ పోటీలకు నియమ నిబంధనలు ఉంటాయి.. తమిళనాడు అసెంబ్లీలో అవి కూడా పాటించరా?..

Wednesday, February 15, 2017

నింగిలో జయహో..


భారత అంతరిక్ష పరిశోధనా కేంద్ర - ఇస్రో పీఎస్‌ఎల్‌వీ-సీ37 రాకెట్ ద్వారా ఒకేసారి 104 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపి చరిత్ర సృష్టించింది.. భారత దేశ ఖ్యాతిని ఇనుమడింప జేసిన మన శస్త్రవేత్తలందరికీ అభినందనలు.. జయహో ఇస్రో..

Tuesday, February 14, 2017

ప్రేమకు దినం పెడతారా?

 ఫిబ్రవరి 14 వచ్చింటే ఎక్కడ లేని సందడి.. కాలేజీలు, హోటళ్లు, షాపింగ్ సెంటర్లు, రోడ్లు, పార్కులు యువతీ యువకులతో బిజీగా కనిపిస్తాయి.. ఎందుకీ హడావుడి అని ప్రశ్నిస్తే మనల్ని అమాయకులుగా చూడటం ఖాయం.. ఈరోజు ప్రేమికుల దినమట (వాలెంటైన్ డే).. ప్రేమికులకు దినం పెట్టడం ఏమిటని ఆశ్చర్యపోకండి.. మన భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను హేళన చేసేందుకా అన్నట్లు వచ్చిన ఎన్నో అర్థం లేని దినాల్లో ఇదొకటి.. ప్రేమ అనేది ఒక రోజులో పుట్టి, ఒక రోజులో మరణిస్తుందా? మరి ప్రేమకో రోజును ఖాయం చేయడం మూర్ఖత్వం కాకపోతే మరేమిటి?
 
అసలు ప్రేమంటే ఏమిటి?..
వాలెంటైన్ డే గురుంచి చర్చించుకునే ముందు అసలు ప్రేమంటే ఏమిటి అనే విషయాన్ని పరిశీలిద్దాం.. ప్రేమ అనే పదంలో అనిర్వచనీయ అనుభూతి, అనుబంధం ఉన్నాయి.. ప్రేమ అనేది అనంతం, శాశ్వతం, నిత్యనూతనం.. ప్రేమ అంటే కేవలం ప్రేయసీ, ప్రియులకు సంబంధించిన వ్యవహారం మాత్రమే కాదు.. మనం భగవంతున్ని ప్రేమిస్తాం, తల్లిదండ్రులను, భార్యా పిల్లలను, తోబుట్టువులను, బంధు మిత్రులను, సమాజంలోని తోటి మనుషులను, చివరకు పశు పక్షాదులను కూడా ప్రేమతో చూస్తాం.. దురదృష్టవశాత్తు ప్రేమ అంటే ఆడ, మగ మధ్య నడిచే వ్యవహారం అనే అపోహ సమాజంలో ఏర్పడింది.. ఇందుకు కారణం సాహిత్యం, సినిమాల ప్రభావమే.. ఆకర్శణ, శృంగారాసక్తి కూడా ప్రేమేనంటారు కొందరు.. ఇది మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే మనుషులకు, పశుపక్షాదులకు తేడా ఏముంటుంది?..
ప్రేమను శాస్త్రీయ దృక్పథంలో నిర్వచించాలంటే ప్రకృతితో ఆకలి, దప్పుల మాదిరిగానే ప్రేమ కూడా సహజంగా కలిగే జీవ రసాయన ప్రక్రియ.. మనస్థత్వ శాస్త్రం ప్రకారం ప్రేమ అనేది శిశువు, కౌమారం, యవ్వన, వృద్ధాప్య దశలో వివిధ రూపాల్లో కొనసాగుతుంది.. ఇంకా లోతుగా పోతే ప్రేమ అనే పదానికి మనకు అర్థం కానీ నిర్వచనాలు కనిపిస్తాయి.. ప్రేమకు విస్తృతమైన అర్థం ఉంది..
ఎవరీ వాలెంటైన్?..
అసలు ప్రేమికుల దినానికి వాలెంటైన్ కు సంబంధం ఏమిటి అనేది అంతుపట్టని విషయం.. చరిత్రను గమనిస్తే వాలెంటైన్ అనే పేరుతో ఎంతో మంది క్రైస్తవ మృత వీరులు ఉన్నట్లు తెలుస్తోంది.. చాలా ప్రసిద్దికెక్కిన కథనం ప్రకారం ప్రాచీన రోమ్ నగరంలో క్రీ.శ.269 ఫిబ్రవరి 14న  క్రైస్తవ మత బోధకుడైన రోమ్ వాలెంటైన్ ను మతాచారాల కోసం బలి ఇచ్చారు.. అంతకు ముందుగా అంటే క్రీ.శ.197లో ఇంటెరమ్నా పట్టణంలో టెర్నీ వాలెంటైన్ అనే క్రైస్తవ మత బోధకుడు అరేలియన్ చక్రవర్తి ఉన్మాదానికి బలైనట్లు చెబుతారు.. అదే విధంగా ఆఫ్రికాలో మరో వాలెంటైన్ ను ఇలాగే బలి ఇచ్చారని చెబుతారు..
14వ శతాబ్దానికి వచ్చేసరికి అన్నికథనాలు మరుగున పడ్డాయి. రోమ్ వాలెంటైన్ కు ప్రేమ కోణాన్ని జోడించి ప్రచారం మొదలు పెట్టారు.. వాస్తవానికి క్రైస్తవ మత ప్రచారం చేస్తున్న సెయింట్ వాలెంటైన్ రోమన్ చక్రవర్తి రెండో క్లాడియస్ ఆగ్రహానికి గురయ్యాడు.. అతన్ని బంధించి చక్రవర్తి దగ్గరకు విచారణ కోసం తెచ్చారు.. ఆనాటి ప్రాచీన రోమన్ దేవతలను ఆరాధించేందుకు వాలెంటైన్ అంగీకరించలేదు.. దీంతో అతనికి మరణ శిక్షను విధించారు.. అయితే క్రైస్తవులు దీనికి మరో కథనాన్ని వినిపిస్తారు. దీని ప్రకారం..
రోమన్ చక్రవర్తి రెండో క్లాడియస్ కాలంలో నిరంతర యుద్దాలు జరిగేవి.. పెళ్లి సాకుతో యువకులు సైన్యంలో చేరేవారు కాదు.. దీంతో క్లాడియస్ చక్రవర్తి వివాహాలను నిషేధించారు.. దీన్ని వ్యతిరేకించిన సెయింట్ వాలెంటైన్ యువతీ యువకులకు రహస్యంగా వివాహాలు జరిపించేవారు.. ఈ విషయం చక్రవర్తి దృష్టికి వెళ్లడంతో వాలెంటైన్ కు మరణ శిక్ష విధించారు.. వాలెంటైన్ బందీగా ఉన్న సమయంలో కారాగార అధిపతి యురోసియస్ కుమార్తె వీనస్ తో ప్రేమ వ్యవహారం నడిచిందని, ప్రేమ లేఖ రాశారని చెబుతారు.. క్రీ.శ.269 ఫిబ్రవరి 14న వాలెంటైన్ కు మరణ శిక్ష అమలు చేశారు..
వాలెంటైన్ డే..
సెయింట్ వాలెంటైన్ డే మరణించిన ఫిబ్రవరి 14న తేదీన ఏటా సంస్మరణ దినోత్సవం జరుపుకునేవారు.. మొదట్లో ఇది మత పరమైన వేడుకగానే జరిగేది.. కానీ రాను రానూ ఈ రోజు ప్రేమికుల దినోత్సవంగా ప్రసిద్దికెక్కింది.. క్రైస్తవ మత ప్రచార వ్యూహాల్లో భాగంగానే ఈ మార్పు చోటు చేసుకుందని చెబుతారు.. వాలెంటైన్ డే రోజున ప్రేమికులు చట్టపట్టాలు వేసుకొని తిరగడం, గ్రీటింగ్ కార్డులు, బహుమతులు ఇచ్చుకొని శుభాకాంక్షలు చెప్పుకోవడం ఆచారంగా మారింది.. ముఖ్యంగా పావురంతో పాటు విల్లు బాణం ధరించిన గ్రీకు దేవత క్యుపిడ్ (మన మన్మధునిలా) బొమ్మ వాలెంటైన్ కు గుర్తుగా మారింది..
రెండు శతాబ్దాల పూర్వం నుండి వాలెంటైన్ డే కు వ్యాపార రూపం వచ్చింది.. 1847లో అమెరికాలోని మసాచుసెట్స్ రాష్ట్రం వర్సెస్టర్ లో నివసించే ఈస్టర్ హౌలాండ్ అనే మహిళ ప్రారంభించిన వాలెంటైన్ డే గ్రీటింగ్స్ వ్యాపారం చాలా ప్రసిద్ధి పొందింది.. అమెరికా, బ్రిటన్ లలో మొదలైన ఈ వ్యాపార ధోరణి ప్రపంచ మంతటా విస్తరించింది.. ఆధునిక కాలంలో ప్రసార మాధ్యమాల పుణ్యమాఅంటూ ప్రేమికులంతా వాలెంటైన్ డే జరుపుకొని తీరాల్సిందే అన్నట్లు తయారైంది సమాజం..
ప్రేమకు ఎందుకీ దినం?..
ప్రేమ అనేది ఒక రోజులో పుట్టదు.. ఒక్క రోజులో మరణించదు.. నిత్య నూతనం, శాశ్వతం అయిన ప్రేమకు ఒక రోజు ఎందుకు? వాలెంటైన్ డే రోజుకు మాత్రమే ప్రేమను పరిమితం చేయాలా? మన దేశంలో ప్రేమికుల రోజులను జరుపుకోవడం మొదట్లో మెట్రోనగరాలకు పరిమితంగా ఉండేది.. మీడియా పుణ్యమా అని రెండు దశాబ్దాలుగా ఈ ధోరణి చిన్న పట్టణాలకు, గ్రామీణ ప్రాంతాలకూ వ్యాపించింది..
వాలెంటైన్ డే పేరుతో గ్రీటింగు కార్డులు, గిఫ్టులు అమ్ముకునే వారితో పాటు మీడియాకు ఆదాయం వస్తోంది.. వాలెంటైన్ డే పేరుతో టీవీల్లో వచ్చే లైవ్ కార్యక్రమంలో మీరు ఎవరినైనా ప్రేమించారా? అని ప్రశ్నించే యాంకరమ్మ, ఏమిటీ ఎవరినీ ప్రేమించలేదా? (అయితే వేస్ట్ అన్నట్లుగా) ఆశ్చర్యపోతోంది.. వాలెంటైన్ డే రోజున గ్రీటింగ్స్, గిఫ్టులు ఇచ్చుకొని పార్కులు, హోటళ్లు, థియేటర్లు, పబ్బుల వెంట తిరిగితే ప్రేమ బలపడం మాట ఎలా ఉన్నా, వ్యాపారులకు మాత్రం మాంచి లాభాలే మిగుతులున్నాయి..
దినాలు జరుపుకోవడం మన సాంప్రదాయం కాదు.. అది ప్రేమికుల దినం అయినా, మదర్స్ డే, ఫాదర్స్ డే, ఫ్రెండ్ షిప్ డే, టీచర్స్ డే, ఎల్డర్స్ డే.. మరే దినమైనా సరే.. భారతీయ సాంప్రదాయం ప్రకారం మన తల్లిని, తండ్రిని, సోదర సోదరీమణులను, తాతయ్యలు, నానమ్మలు, అమ్మమ్మలు, భార్యా పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు, పెద్దలను ప్రతి నిత్యం గౌరవించాల్సిందే.. ప్రేమించాల్సిందే.. ఇందు కోసం ప్రత్యేకంగా ఒక రోజును కేటాయించాల్సిన అవసరం లేదు..
భారత దేశంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ సనాతన కాలం నుండి ఉంది.. పిల్లలు పెద్దవారయ్యాక తల్లిదండ్రులను తమతోనే ఉంచుకుంటారు.. పాశ్యాత్య దేశాల్లో వృద్ధాశ్రమాలు ఉంటాయి.. తల్లిదండ్రులను అక్కడే ఉంచుతారు.. వారి కోసం డే (దినం) పెట్టుకొని, ఆ రోజున అక్కడికి వెళ్లి పలకరించి రావడం ఆచారంగా మారింది.. దురదృష్టవశాత్తు ఈ దిక్కుమాలిన దినాలు, ఆశ్రమాలు మన దేశానికీ వచ్చేశాయి..
ఫిబ్రవరి 14 అంటే టెన్షనే..
ప్రేమించుకోవడం.. నచ్చినవారిని జీవిత భాగస్వామిగా ఎంచుకోవంలో ఎలాంటి తప్పు లేదు.. కానీ ఒక మతపరమైన వేడుకను ప్రేమికుల దినం అంటూ జరుపుకోవడమే మూర్ఖత్వం.. ఫిబ్రవరి 14వ తేదీ వస్తుందంటే అందరికీ టెన్షనే.. మన సంస్కృతి సాంప్రదాయాలకు విరుద్దమైన వాలంటైన్ డేను వ్యతిరేకించేవారు వైపు, పాశ్యాత్య సంస్కృతికి వంతపాడేవారు మరోవైపు మొహరిస్తారు.. వీరిద్దరి మధ్య పోలీసులు హైరానా పడిపోతుంటారు.. యువతీ యువకలు చట్టా పట్టాలేసుకొని పార్కులు, పబ్బులు, థియేటర్ల చుట్టూ తిరగడం.. ఏ భజరంగ్ దళ్ వాడు చూస్తాడో? ఎక్కడ పట్టుకొని పెళ్లి చేసేస్తాడో అని భయ పడటం అవసరమా? ఇందులో నిజమైన ప్రేమికులు ఎవరో, తాత్కాలిక అవసరాలు తీర్చుకునేవారు ఎవరో ఎవరికి తెలుసు? ఒక్క రోజుకే పరిమితం కాని ప్రేమ కోసం ఎందుకు ఇంత తపన?

పాశ్యాత్య దేశాల్లో ప్రేమలు శాశ్వతం కాదు.. ప్యాంటూ, షర్ట్ మార్చేసినంత ఈజీగా జీవిత భాగస్వాములను మార్చేస్తారు.. ఇలాంటి టెంపరరీ ప్రేమికుల కోసమే అన్నట్లు కనిపిస్తోంది ఒక రోజు ప్రేమ దినం.. (వాటెంటైన్ డే).. మన సంస్కృతి, సంప్రదాయాలకు ఏమాత్రం సంబంధం లేని ఇలాంటి దిక్కుమాలిన దినం మనకు అవసరమా ఆలోచించండి?

Monday, February 13, 2017

తమిళ పీఠం ఎవరిది?

ఆలోచించండి.. వెరీ సింపుల్ లాజిక్..
జయలలిత అభిమానం చూరగొన్నందు వల్లే పన్నీర్ సెల్వం కష్ట కాలంలో ముఖ్యమంత్రి కాగలిగారు.. ఆమె నమ్మకాన్ని అయన వమ్ము చేయలేదు.. జయ జైలు నుండి తిరిగి వచ్చే వరకు పరిపాలనా విధులు జగ్రత్తగా చూసుకున్నారు.. ఆమెకు వ్యతిరేకంగా ఎలాంటి కార్యకలాపాలు చేపట్టలేదు..
శశికళను జయ కేవలం స్నేహితురాలిగానే చూశారు.. గతంలో ఒకసారి ద్రోహం చేయడానికి ప్రయత్నిస్తే గెంటేశారు.. తర్వాత క్షమించినా, సహాయకురాలిగానే చూశారు.. జయలలిత ఆదేశాల మేరకు శశికళ భర్త నటరాజన్ పోయస్ గార్డెన్ లోకి ప్రవేశం నిషేధం.. కానీ జయ మరణించిన వెంటనే అతగాడు తిరిగి రంగ ప్రవేశం చేయడంలోని ఆంతర్యం ఏమిటి?
జయ నిజంగానే శశిని రాజకీయ వారసురాలిగా భావించి ఉంటే ఓపీఎస్ బదులు ఆమెనే తాత్కాలిక సీఎంను చేసి ఉండేవారు కదా?..
సుప్రీంకోర్టు తీర్పు వెలువడే ముందు సెల్వంను దింపి సీఎం పదవి చేపట్టాలనే తొందర శశికి ఎందుకు?.. తీర్పు ఆమెకు వ్యతిరేకంగా వస్తే జైలుకు పోతాను కాబట్టి జీవితంలో ఒకసారైనా ముఖ్యమంత్రి కావాలనే కోరిక తీర్చుకోవలనే దురాశ కాదా?.. ఒకవేళ సీఎం పదవి చేపట్టినా జైలుకు పోవాల్సి వస్తే తిరిగి పన్నీరే దిక్కు కదా?
జయలలిత అభిమానం చూరగొన్న వ్యక్తి, ముఖ్యమంత్రిగా పని చేసిన అనుభవం ఉన్న వ్యక్తి ఎప్పటికీ దాసుడుగానే ఉండాలా?
ఇప్పుడు చెప్పండి.. తమిళనాడు సీఎం పదవికి నిజమైన వారసులు ఎవరు?

Thursday, February 9, 2017

కొత్త రాజకీయ వారసత్వం

మొత్తానికి వారసత్వ రాజకీయాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి..
గతంలో తెలుగుదేశాధీశున్ని అల్లుడు బాబు గద్దెదించాడు.. ఇటీవల నేతాజీ నుండి బేఠాజీ సైకిల్ లాగేసుకున్నాడు..
ఇవాళ అమ్మోరి చెలికత్తె కమ్ సేవిక చిన్నమ్మ పెత్తనానికి రెడీ కావడం కొత్త ట్రెండ్.. వారసులు లేకపోతే వారు నమ్మకంగా పని చేసిన సేవకులకు వీలునామాలో రాసేయడం గురుంచి వినే ఉంటారు.. కానీ హఠాత్తుగా పోయిన వారి వారసత్వాన్ని సేవకులు కాజేయడం రాజకీయాల్లో కొత్త ట్రెండ్ అని నిరూపితం అవుతోంది..

Tuesday, February 7, 2017

హైదరాబాద్ నగరానికి వచ్చిన శివాజీ మహారాజ్

ఫిబ్రవరి 7, 1677.. ఈ తేదీకో ప్రత్యేకత ఉంది.. 340 ఏళ్ల క్రితం ఛత్రపతి శివాజీ హైదరాబాద్ పాతబస్తీకి వచ్చిన రోజు.. హిందూ సామ్రాజ్య నిర్మాత శివాజీ మహారాజ్ పేరు విన్నా, ఆయన విరోచిత పోరాటాలు, విజయాలు గుర్తుకు వచ్చినా మన రోమాలు నిక్కపొడచుకుంటాయి.. అలాంటి గొప్ప యోధుడు మన భాగ్యనగరానికి వచ్చారనే ముచ్చట ఆసక్తిని కలిగిస్తోంది కదూ.. అయితే శివాజీ యాత్రా విశేషాలను సంక్షిప్తంగా తెలుసుకుందామా?
మొఘల్ సామ్రాట్ ఔరంగజేబ్ గోల్కొండ సామ్రాజ్యంపై కన్నేశాడు.. మరోవైపు ఛత్రపతి శివాజీ తన దండయాత్రలతో ఔరంగజేబ్ కంటిలో నలుసైపోయారు. శత్రువు శత్రుడు మిత్రుడవుతాడనేది యుద్ధనీతి సూత్రం.. అలా శివాజీకి, గోల్కోండ పాలకుడు అబుల్ హాసన్ తానీషాకు మైత్రి కుదిరింది.. ఇందులో మహామంత్రి మాదన్న, శివాజీ రాయబారి నీరజ్ పంత్ కీలకపాత్ర పోశించారు.. 1677 ఫిబ్రవరి మాసంలో 50 వేల మంది సైనిక బలగంతో గోల్కొండకు వచ్చిన ఛత్రపతి శివాజీకి తానీషా ఘన స్వాగతం పలికారు.. ఇరువురి మధ్య కీలక ఒప్పందాలు కుదిరాయి..
ఛత్రపతి శివాజీ నెల రోజుల పాటు భాగ్యనగరంలో విడిది చేశారు.. ఫిబ్రవరి 7, 1677 నాడు  ఆయన శ్రీశైల మల్లికార్జునుడిని దర్శించుకోవడానికి బయలు దేరారు.. శివాజీ తన అశేష సేనావాహినితో పురానాపూల్ వంతెన మీదుగా మూసీనదిని దాటారు.. ఆ తర్వాత చార్మినార్ ద్వారా మొఘల్ పురాలోని మహంకాళీ మందిరానికి వచ్చారు.. ఈ ఆలయంలో ఛత్రపతి శివాజీ చాలాసేపు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ సమయంలో జై భవానీ, వీర శివాజీ.. అనే నినాదాలు మార్మోగాయి..
శ్రీశైలం వెళ్లే మార్గంలో ఉన్న మహేశ్వరం శివగంగ ఆలయాన్ని కూడా శివాజీ దర్శించారని తెలుస్తోంది.. మల్లికార్జున స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన శివాజీ, భ్రమరాంబికా దేవీ గర్భాలయంలో ధ్యానమగ్నుడయ్యారు.. ఆ సమయంలో అమ్మవారు ప్రత్యక్షమై శివాజీకి వీర ఖడ్గాన్ని బహుకరించందని చెబుతారు.. శివాజీ మహరాజ్ శ్రీశైలం ఆలయానికి ఒక రాజగోపురం కూడా నిర్మించారు..

శివాజీ భాగ్యనగర రాకకు గుర్తుగా పూరానాపూల్ దర్వాజాకు ఆయన గుర్రపు నాడాలను బిగించారని స్థానికులు చెప్పుకుంటుంటారు.. శివాజీ సందర్శించిన మహంకాళీ మందిరాన్నిగోల్కొండ మంత్రులు అక్కన్న మాదన్నలు కట్టించారు.. తర్వాత కాలంలో ఈ ఆలయం అక్కన్న మాదన్నల పేరుతోనే ప్రసిద్ధి పొందింది.. హైదరాబాద్ నగరంలో పలు చోట్ల ఛత్రపతి శివాజీ విగ్రహాలు కనిపిస్తుంటాయి. అయితే నేటి తరానికి శివాజీ రాక గురుంచి పెద్దగా తెలియదు.. ఆ మహాయోధున్ని మరోసారి గుర్తు చేసుకోవడానికి ఈ రోజు మంచి సందర్భం..

Wednesday, February 1, 2017

ప్రెసిడెంట్ ట్రంపు.. కొందరికి ఇంపు.. అందరికీ కంపు..

అమెరికా అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టగానే తన ముద్రను చూపిస్తున్నారు డొనాల్డ్ ట్రంప్.. ముఖ్యంగా తీవ్రవాదాన్ని కట్టడి చేస్తానంటూ ఏడు ముస్లిం దేశాల శరణార్థులపై వేటు, హెచ్ 1బీ ఉద్యోగాలపై ఆంక్షలు.. ఈ రెండు చర్యలను ఏక కాలంలో సమర్ధించడం కష్టమే..
అదే సమయంలో ఉగ్రవాదుల స్వర్గధామమైన పాకిస్తాన్ పై ఎలాంటి ఆంక్షలు విధించడంలో జాప్యం..
అమెరికా జాతీయ భద్రత కోణంలో ట్రంప్ తీసుకుంటున్న చర్యలను గుడ్డిగా సమర్ధించాల్సిన అవసరం లేదు.. ముందస్తు వ్యూహం లేకుండా చేపట్టిన ఇలాంటి దుందుడుకు చర్యలు అమెరికా శత్రువులను ఏకం చేస్తాయి..
స్వయంగా ఒక వలస దేశమైన అమెరికా వలసలను అడ్డుకుంటామని ప్రకటించడం హాస్యాస్పదం.. అమెరికాలోని పౌరులు, వారి పూర్వీకులు బతుకుతెరువు కోసం వచ్చిన వారే.. నేటివ్స్ అని గొప్పగా చెప్పుకుంటున్నవారంతా ఒకసారి అద్దంతో చూసుకొని తమ మూలాలను వెతుక్కోవాలి.. ట్రంప్ తో సహా.. అమెరికా వాడు ప్రపంచనంపై పెత్తనం చేయాలి.. కానీ వేరే దేశం వాడు అమెరికా రాకూడదు అంటే ఎలా సమర్ధించగలం?..
అన్ని రంగాల్లో దూసుకుపోతున్న భారత జాతీయులు అమెరికాలో బలంగా ఉనికి చాటుకుంటున్న తరుణంలో ట్రంప్ చర్యలు మన ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా ఉన్నాయి..
ట్రంప్ ఇండియాకు మిత్రుడని చాలా మంది భ్రమల్లో ఉన్నారు.. కానీ భారతీయుల అవకాశాలను దెబ్బతీయడాన్ని ఎలా సహించగలం?.. 
ఏది ఏమైనా మెజారిటీ అమెరికన్లు ట్రంపును ఎన్నుకున్నారు.. వారితో పాటు ప్రపంచమూ ఇప్పుడు అనుభవిస్తోంది.. మీడియాతో సహా ప్రశ్నించే ప్రతి వారినీ బెదిరిస్తున్నాడు..

ట్రంపు మరీ కంపు అయితే ఎలా భరించగలం?