Tuesday, February 14, 2017

ప్రేమకు దినం పెడతారా?

 ఫిబ్రవరి 14 వచ్చింటే ఎక్కడ లేని సందడి.. కాలేజీలు, హోటళ్లు, షాపింగ్ సెంటర్లు, రోడ్లు, పార్కులు యువతీ యువకులతో బిజీగా కనిపిస్తాయి.. ఎందుకీ హడావుడి అని ప్రశ్నిస్తే మనల్ని అమాయకులుగా చూడటం ఖాయం.. ఈరోజు ప్రేమికుల దినమట (వాలెంటైన్ డే).. ప్రేమికులకు దినం పెట్టడం ఏమిటని ఆశ్చర్యపోకండి.. మన భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను హేళన చేసేందుకా అన్నట్లు వచ్చిన ఎన్నో అర్థం లేని దినాల్లో ఇదొకటి.. ప్రేమ అనేది ఒక రోజులో పుట్టి, ఒక రోజులో మరణిస్తుందా? మరి ప్రేమకో రోజును ఖాయం చేయడం మూర్ఖత్వం కాకపోతే మరేమిటి?
 
అసలు ప్రేమంటే ఏమిటి?..
వాలెంటైన్ డే గురుంచి చర్చించుకునే ముందు అసలు ప్రేమంటే ఏమిటి అనే విషయాన్ని పరిశీలిద్దాం.. ప్రేమ అనే పదంలో అనిర్వచనీయ అనుభూతి, అనుబంధం ఉన్నాయి.. ప్రేమ అనేది అనంతం, శాశ్వతం, నిత్యనూతనం.. ప్రేమ అంటే కేవలం ప్రేయసీ, ప్రియులకు సంబంధించిన వ్యవహారం మాత్రమే కాదు.. మనం భగవంతున్ని ప్రేమిస్తాం, తల్లిదండ్రులను, భార్యా పిల్లలను, తోబుట్టువులను, బంధు మిత్రులను, సమాజంలోని తోటి మనుషులను, చివరకు పశు పక్షాదులను కూడా ప్రేమతో చూస్తాం.. దురదృష్టవశాత్తు ప్రేమ అంటే ఆడ, మగ మధ్య నడిచే వ్యవహారం అనే అపోహ సమాజంలో ఏర్పడింది.. ఇందుకు కారణం సాహిత్యం, సినిమాల ప్రభావమే.. ఆకర్శణ, శృంగారాసక్తి కూడా ప్రేమేనంటారు కొందరు.. ఇది మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే మనుషులకు, పశుపక్షాదులకు తేడా ఏముంటుంది?..
ప్రేమను శాస్త్రీయ దృక్పథంలో నిర్వచించాలంటే ప్రకృతితో ఆకలి, దప్పుల మాదిరిగానే ప్రేమ కూడా సహజంగా కలిగే జీవ రసాయన ప్రక్రియ.. మనస్థత్వ శాస్త్రం ప్రకారం ప్రేమ అనేది శిశువు, కౌమారం, యవ్వన, వృద్ధాప్య దశలో వివిధ రూపాల్లో కొనసాగుతుంది.. ఇంకా లోతుగా పోతే ప్రేమ అనే పదానికి మనకు అర్థం కానీ నిర్వచనాలు కనిపిస్తాయి.. ప్రేమకు విస్తృతమైన అర్థం ఉంది..
ఎవరీ వాలెంటైన్?..
అసలు ప్రేమికుల దినానికి వాలెంటైన్ కు సంబంధం ఏమిటి అనేది అంతుపట్టని విషయం.. చరిత్రను గమనిస్తే వాలెంటైన్ అనే పేరుతో ఎంతో మంది క్రైస్తవ మృత వీరులు ఉన్నట్లు తెలుస్తోంది.. చాలా ప్రసిద్దికెక్కిన కథనం ప్రకారం ప్రాచీన రోమ్ నగరంలో క్రీ.శ.269 ఫిబ్రవరి 14న  క్రైస్తవ మత బోధకుడైన రోమ్ వాలెంటైన్ ను మతాచారాల కోసం బలి ఇచ్చారు.. అంతకు ముందుగా అంటే క్రీ.శ.197లో ఇంటెరమ్నా పట్టణంలో టెర్నీ వాలెంటైన్ అనే క్రైస్తవ మత బోధకుడు అరేలియన్ చక్రవర్తి ఉన్మాదానికి బలైనట్లు చెబుతారు.. అదే విధంగా ఆఫ్రికాలో మరో వాలెంటైన్ ను ఇలాగే బలి ఇచ్చారని చెబుతారు..
14వ శతాబ్దానికి వచ్చేసరికి అన్నికథనాలు మరుగున పడ్డాయి. రోమ్ వాలెంటైన్ కు ప్రేమ కోణాన్ని జోడించి ప్రచారం మొదలు పెట్టారు.. వాస్తవానికి క్రైస్తవ మత ప్రచారం చేస్తున్న సెయింట్ వాలెంటైన్ రోమన్ చక్రవర్తి రెండో క్లాడియస్ ఆగ్రహానికి గురయ్యాడు.. అతన్ని బంధించి చక్రవర్తి దగ్గరకు విచారణ కోసం తెచ్చారు.. ఆనాటి ప్రాచీన రోమన్ దేవతలను ఆరాధించేందుకు వాలెంటైన్ అంగీకరించలేదు.. దీంతో అతనికి మరణ శిక్షను విధించారు.. అయితే క్రైస్తవులు దీనికి మరో కథనాన్ని వినిపిస్తారు. దీని ప్రకారం..
రోమన్ చక్రవర్తి రెండో క్లాడియస్ కాలంలో నిరంతర యుద్దాలు జరిగేవి.. పెళ్లి సాకుతో యువకులు సైన్యంలో చేరేవారు కాదు.. దీంతో క్లాడియస్ చక్రవర్తి వివాహాలను నిషేధించారు.. దీన్ని వ్యతిరేకించిన సెయింట్ వాలెంటైన్ యువతీ యువకులకు రహస్యంగా వివాహాలు జరిపించేవారు.. ఈ విషయం చక్రవర్తి దృష్టికి వెళ్లడంతో వాలెంటైన్ కు మరణ శిక్ష విధించారు.. వాలెంటైన్ బందీగా ఉన్న సమయంలో కారాగార అధిపతి యురోసియస్ కుమార్తె వీనస్ తో ప్రేమ వ్యవహారం నడిచిందని, ప్రేమ లేఖ రాశారని చెబుతారు.. క్రీ.శ.269 ఫిబ్రవరి 14న వాలెంటైన్ కు మరణ శిక్ష అమలు చేశారు..
వాలెంటైన్ డే..
సెయింట్ వాలెంటైన్ డే మరణించిన ఫిబ్రవరి 14న తేదీన ఏటా సంస్మరణ దినోత్సవం జరుపుకునేవారు.. మొదట్లో ఇది మత పరమైన వేడుకగానే జరిగేది.. కానీ రాను రానూ ఈ రోజు ప్రేమికుల దినోత్సవంగా ప్రసిద్దికెక్కింది.. క్రైస్తవ మత ప్రచార వ్యూహాల్లో భాగంగానే ఈ మార్పు చోటు చేసుకుందని చెబుతారు.. వాలెంటైన్ డే రోజున ప్రేమికులు చట్టపట్టాలు వేసుకొని తిరగడం, గ్రీటింగ్ కార్డులు, బహుమతులు ఇచ్చుకొని శుభాకాంక్షలు చెప్పుకోవడం ఆచారంగా మారింది.. ముఖ్యంగా పావురంతో పాటు విల్లు బాణం ధరించిన గ్రీకు దేవత క్యుపిడ్ (మన మన్మధునిలా) బొమ్మ వాలెంటైన్ కు గుర్తుగా మారింది..
రెండు శతాబ్దాల పూర్వం నుండి వాలెంటైన్ డే కు వ్యాపార రూపం వచ్చింది.. 1847లో అమెరికాలోని మసాచుసెట్స్ రాష్ట్రం వర్సెస్టర్ లో నివసించే ఈస్టర్ హౌలాండ్ అనే మహిళ ప్రారంభించిన వాలెంటైన్ డే గ్రీటింగ్స్ వ్యాపారం చాలా ప్రసిద్ధి పొందింది.. అమెరికా, బ్రిటన్ లలో మొదలైన ఈ వ్యాపార ధోరణి ప్రపంచ మంతటా విస్తరించింది.. ఆధునిక కాలంలో ప్రసార మాధ్యమాల పుణ్యమాఅంటూ ప్రేమికులంతా వాలెంటైన్ డే జరుపుకొని తీరాల్సిందే అన్నట్లు తయారైంది సమాజం..
ప్రేమకు ఎందుకీ దినం?..
ప్రేమ అనేది ఒక రోజులో పుట్టదు.. ఒక్క రోజులో మరణించదు.. నిత్య నూతనం, శాశ్వతం అయిన ప్రేమకు ఒక రోజు ఎందుకు? వాలెంటైన్ డే రోజుకు మాత్రమే ప్రేమను పరిమితం చేయాలా? మన దేశంలో ప్రేమికుల రోజులను జరుపుకోవడం మొదట్లో మెట్రోనగరాలకు పరిమితంగా ఉండేది.. మీడియా పుణ్యమా అని రెండు దశాబ్దాలుగా ఈ ధోరణి చిన్న పట్టణాలకు, గ్రామీణ ప్రాంతాలకూ వ్యాపించింది..
వాలెంటైన్ డే పేరుతో గ్రీటింగు కార్డులు, గిఫ్టులు అమ్ముకునే వారితో పాటు మీడియాకు ఆదాయం వస్తోంది.. వాలెంటైన్ డే పేరుతో టీవీల్లో వచ్చే లైవ్ కార్యక్రమంలో మీరు ఎవరినైనా ప్రేమించారా? అని ప్రశ్నించే యాంకరమ్మ, ఏమిటీ ఎవరినీ ప్రేమించలేదా? (అయితే వేస్ట్ అన్నట్లుగా) ఆశ్చర్యపోతోంది.. వాలెంటైన్ డే రోజున గ్రీటింగ్స్, గిఫ్టులు ఇచ్చుకొని పార్కులు, హోటళ్లు, థియేటర్లు, పబ్బుల వెంట తిరిగితే ప్రేమ బలపడం మాట ఎలా ఉన్నా, వ్యాపారులకు మాత్రం మాంచి లాభాలే మిగుతులున్నాయి..
దినాలు జరుపుకోవడం మన సాంప్రదాయం కాదు.. అది ప్రేమికుల దినం అయినా, మదర్స్ డే, ఫాదర్స్ డే, ఫ్రెండ్ షిప్ డే, టీచర్స్ డే, ఎల్డర్స్ డే.. మరే దినమైనా సరే.. భారతీయ సాంప్రదాయం ప్రకారం మన తల్లిని, తండ్రిని, సోదర సోదరీమణులను, తాతయ్యలు, నానమ్మలు, అమ్మమ్మలు, భార్యా పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు, పెద్దలను ప్రతి నిత్యం గౌరవించాల్సిందే.. ప్రేమించాల్సిందే.. ఇందు కోసం ప్రత్యేకంగా ఒక రోజును కేటాయించాల్సిన అవసరం లేదు..
భారత దేశంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ సనాతన కాలం నుండి ఉంది.. పిల్లలు పెద్దవారయ్యాక తల్లిదండ్రులను తమతోనే ఉంచుకుంటారు.. పాశ్యాత్య దేశాల్లో వృద్ధాశ్రమాలు ఉంటాయి.. తల్లిదండ్రులను అక్కడే ఉంచుతారు.. వారి కోసం డే (దినం) పెట్టుకొని, ఆ రోజున అక్కడికి వెళ్లి పలకరించి రావడం ఆచారంగా మారింది.. దురదృష్టవశాత్తు ఈ దిక్కుమాలిన దినాలు, ఆశ్రమాలు మన దేశానికీ వచ్చేశాయి..
ఫిబ్రవరి 14 అంటే టెన్షనే..
ప్రేమించుకోవడం.. నచ్చినవారిని జీవిత భాగస్వామిగా ఎంచుకోవంలో ఎలాంటి తప్పు లేదు.. కానీ ఒక మతపరమైన వేడుకను ప్రేమికుల దినం అంటూ జరుపుకోవడమే మూర్ఖత్వం.. ఫిబ్రవరి 14వ తేదీ వస్తుందంటే అందరికీ టెన్షనే.. మన సంస్కృతి సాంప్రదాయాలకు విరుద్దమైన వాలంటైన్ డేను వ్యతిరేకించేవారు వైపు, పాశ్యాత్య సంస్కృతికి వంతపాడేవారు మరోవైపు మొహరిస్తారు.. వీరిద్దరి మధ్య పోలీసులు హైరానా పడిపోతుంటారు.. యువతీ యువకలు చట్టా పట్టాలేసుకొని పార్కులు, పబ్బులు, థియేటర్ల చుట్టూ తిరగడం.. ఏ భజరంగ్ దళ్ వాడు చూస్తాడో? ఎక్కడ పట్టుకొని పెళ్లి చేసేస్తాడో అని భయ పడటం అవసరమా? ఇందులో నిజమైన ప్రేమికులు ఎవరో, తాత్కాలిక అవసరాలు తీర్చుకునేవారు ఎవరో ఎవరికి తెలుసు? ఒక్క రోజుకే పరిమితం కాని ప్రేమ కోసం ఎందుకు ఇంత తపన?

పాశ్యాత్య దేశాల్లో ప్రేమలు శాశ్వతం కాదు.. ప్యాంటూ, షర్ట్ మార్చేసినంత ఈజీగా జీవిత భాగస్వాములను మార్చేస్తారు.. ఇలాంటి టెంపరరీ ప్రేమికుల కోసమే అన్నట్లు కనిపిస్తోంది ఒక రోజు ప్రేమ దినం.. (వాటెంటైన్ డే).. మన సంస్కృతి, సంప్రదాయాలకు ఏమాత్రం సంబంధం లేని ఇలాంటి దిక్కుమాలిన దినం మనకు అవసరమా ఆలోచించండి?

No comments:

Post a Comment