Wednesday, February 22, 2017

జమ్మూ కశ్మీర్ సంకల్ప దివస్

బ్రిటిష్ వారు స్వాతంత్ర్యం ఇస్తూనే భారత దేశాన్ని విడగొట్టారు.. కొత్తగా ఏర్పడిన పాకిస్తాన్ మొదటి నుండి జమ్మూ కశ్మీర్ రాష్ట్రం మీద కన్నేసింది.. మహారాజా హరిసింగ్ అక్టోబర్ 26, 1947 నాడు జమ్మూ కశ్మీర్ ను భారత దేశంలో సంపూర్ణంగా విలీనం చేశారు.. ఆ సమయంలో పాకిస్తాన్ సైన్యం కిరాయి మూకల ముసుగులో ఈ రాష్ట్రంలోని గిల్గిత్ బాల్టిస్తాన్ భూభాగాన్ని ఆక్రమించుకున్నాయి.. భారత సైన్యం ఈ ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకునే తరుణంలోనే ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఈ అంశాన్ని ఐక్య రాజ్య సమతి దృష్టికి తీసుకుపోయారు.. అప్పటి నుండి యధాతథ స్థితి పేరుతో ఆ భాగం పాకిస్తాన్ ఆక్రమణలోనే ఉండిపోయింది.. మరోవైపు అక్సాయ్ చిన్ ప్రాంతాన్ని పాకిస్తాన్, చైనాకు దారాదత్తం చేసింది..

జమ్మూ కశ్మీర్ విషయంలో పాకిస్తాన్ మన దేశంతో ఇప్పటికి మూడు యుద్దాలు చేసి చావు దెబ్బతిన్నది.. అయినా బుద్ది మారకుండా ఈ రాష్ట్రాన్ని భారత్ నుండి విడదీసేందుకు ప్రయత్నాలు సాగిస్తూనే ఉంది.. ఉగ్రవాదానికి, వేర్పాటు వాదానికి ఆజ్యం పోస్తూ కశ్మీర్ లో నిత్యం ఆరాచకాలను కొనసాగిస్తోంది.. జమ్మూ కశ్మీర్ ను వివాదాస్పద ప్రాంతంగా పేర్కొంటూ  పదే పదే అంతర్జాతీయం చేస్తోంది..
ఈ నేపథ్యంలో భారత పార్లమెంటు ఫిబ్రవరి 22, 1994 నాడు పార్లమెంటులో చేసిన తీర్మాణం చరిత్రలో నిలచిపోయింది.. ప్రధాని పీవీ నరసింహారావు నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ చేసిన ఈ తీర్మాణాన్ని ప్రతిపక్ష భాజపాతో సహా అన్ని పక్షాలు  సమర్ధించాయి.. జమ్మూ కశ్మీర్ విషయంలో మన దేశ దృఢ సంకల్పాన్ని, కృత నిశ్చయాన్నిఈ తీర్మాణం ప్రపంచానికి చాటి చెప్పింది..
ఈ తీర్మానంలో నాలుగు అంశాలున్నాయి.
1) జమ్మూ కశ్మీర్ భారత్ లో అంతర్భాగం. దీన్ని వేరుచేసే ఏ ప్రయత్నాన్నైనా అన్ని పద్ధతుల్లో అడ్డుకుంటాం. 
2) భారతదేశపు ఐక్యత, సార్వభౌమత్వం, భౌగోళిక ఏకాత్మతను అడ్డుకునే ఏ ప్రయత్నాన్నైనా ఎదుర్కొనే సంకల్పం, సామర్థ్యం భారత్ కు ఉంది. 
3) దురాక్రమణ ద్వారా ఆక్రమించిన జమ్మూ కశ్మీర్  ప్రాంతాలనుంచి పాకిస్తాన్ వైదొలగాలి.
4) భారత దేశ అంతర్గత వ్యవహారాల్లో ఎలాంటి జోక్యాన్నీ భారత్ సహించదు.
చాలా స్పష్టంగా ఉన్న ఈ తీర్మాణం దేశ ప్రజల ఆకాంక్షలను, మనోభావాలను ప్రతిబింబిస్తోంది..

ఈ తీర్మాణం చేసిన ఫిబ్రవరి 22వ తేదీని జమ్మూ కశ్మీర్ సంకల్ప దివస్ గా దేశ వ్యాప్తంగా జరుపుకుంటున్నాం.. 

No comments:

Post a Comment