Monday, July 27, 2015

కలాంజీ మహాభినిష్క్రమణ..

భారత దేశం దిగువన ధనుష్కోటిలో పేద కుటుంబంలో పుట్టిన ఆ బాలుడు చిన్నప్పుడే భవిష్యత్తు గురుంచి కలలు కన్నాడు..  హిమాలయాలంత ఎత్తుకు ఎదిగాడు.. చివరి శ్వాస వరకూ దేశం కోసం జీవించాడు.. కోట్లాది భారతీయుల హృదయాల్లో నిలిపోయాడు. ఆయన రాజకీయ నాయకుడు కాదు.. కానీ రాజకీయులను మించిన ఖ్యాతిని సంపాదించాడు..
డాక్టర్ అవుల్ పకీర్ జైలులబ్దీన్ అబ్దుల్ కలాం.. భారత మాజీ రాష్ట్రపతి ఇక లేక లేరనే వార్త ఒక్కసారిగా తీరని ఆవేదనకు గురి చేసింది..
చిన్నప్పటి నుండే ప్రతిభావంతునిగా పేరు తెచ్చుకున్న అబ్దుల్ కలాం, మద్రాస్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఏరోనాటిక్ ఇంజనీరింగ్ పట్టా పొందారు. రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ, భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థల్లో శాస్త్రవేత్తగా పని చేశారు. మొదట ఉపగ్రహాల ప్రయోగ వాహనాల అభివృద్ది కోసం పని చేశారు. ఆ తర్వాత స్వదేశీ క్షిపణలు తయారీపై దృష్టి పెట్టారు అబ్దుల్ కలాం.. అగ్ని, పృథ్వి క్షిపణులను తయారు చేసి విజయవంతంగా ప్రయోగించడంతో ఆయనకు మిస్సైల్ మాన్ అనే పేరు వచ్చింది.
భారత ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక ప్రధాన సలహాదారు హోదాలో ఫోఖ్రాన్ 2 అణుపరీక్షలు విజయవంతంగా నిర్వహించి ఇండియాను అణ్వస్త్ర దేశాల సరసన చేర్చారు కలాం.. పద్మ విభూషన్, భారత రత్నతో పాటు ఎన్నో గౌరవ డాక్టరేట్లు ఆయన్ని వరించాయి.. వాజపేయి ప్రభుత్వ హయాంలో భారత రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు అబ్దుల్ కలాం..
కలాం వ్యక్తిగత జీవితంలో అత్యంత క్రమశిక్షణ పాటించారు. పూర్తి శాఖాహారి, మద్యపానానికి వ్యతిరేకి.. వ్యక్తిగత స్వార్ధం ఉండరాదనే భావనతో వివాహం చేసుకోకుండా బ్రహ్మచారిగానే ఉండిపోయారు. ఖురాన్ తో పాటు భగవద్గీతనూ పఠిస్తారాయన.. శాంతి కామకుడు, అన్నింటికీ మించి గొప్ప మానవతావాది..
భారత దేశాన్ని శాస్త్ర సాంకేతిక రంగాల్లో, ఆర్థికంగా అగ్రగామిగా నిలిపేందుకు తన వంతు కృషి చేశారు అబ్దుల్ కలాం.. విద్యార్ధులు, యువతకు మార్గదర్శనం చేయడాయనికి నిరంతర యాత్రను కొనసాగించారు. ఈ జీవనయానంలోనే ఆయన శ్వాస ఆగిపోయింది..
అక్టోబరు 15, 1931న జన్మించిన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జులై 27, 2015న జీవితాన్ని చాలించారు.. కలలు కనండి.. వాటిని సాధించే వరకూ విశ్రమించకండి.. కలాంజీ ఇచ్చిన పిలుపు ఇది..  ఆయన స్పూర్తి భారతీయుల్లో నిరంతరం కొనసాగాలని ఆశిస్తూ శ్రద్ధాంజలి ఘటిద్దాం.. 

No comments:

Post a Comment