Saturday, December 20, 2014

గీతా ప్రెస్ భవిష్యత్ ఏమిటి?

తెలుగులో మంచి భగవద్గీత గ్రంధం కావాలని పొరుగు రాష్ట్రంలో ఉన్న ఓ మిత్రుడు కోరాడు.. అది కొందామని సుల్తాన్ బజార్(హైదరాబాద్)లోని గీతాప్రెస్ పుస్తకాలయానికి వెళ్లాను.. భగవద్గీత తెలుగులోనే రూ.2, 5 మొదలుకొని రకరకాల ధరలు, సైజులు, వ్యాఖ్యానాలతో దొరుకుతాయక్కడ.. ఆశ్చర్యంగా నేను కోరుకున్న ప్రతులు లేవక్కడ.. ఇదేమిటని అడిగితే స్టాక్ లేదు అన్నారు అక్కడి సిబ్బంది.. ఎప్పుడొస్తాయి అని అడిగితే చెప్పలేం అన్నారు కాస్త విచారంగా.. ఈ సమాధానానికి కాస్త ఆశ్చర్య పోయాను.. నగరంలో జరుగుతున్న బుక్ ఫెయిర్ వెళ్లితే అక్కడో మిత్రుడు చెప్పిన వార్త షాక్ కలిగించింది.. వర్కర్ల సమ్మె కారణంగా గీతా ప్రెస్ తాత్కాలికంగా మూసేశారట..
భారత దేశంలోని పురాతన ఆధ్యాత్మిక గ్రంథాల ప్రచురణ సంస్థ గీతా ప్రెస్.. 1923లో గోరఖ్ పూర్ కేంద్రంగా స్థాపించారీ సంస్థను.. లాభాపేక్ష లేకుండా చాలా చవక ధరకు, నాణ్యమైన ఆధ్యాత్మిక, నైతిక సాహిత్యాన్ని ప్రజలకు అందిస్తున్న సంస్థ ఇది.. హిందీ, సంస్కృతం, ఇంగ్లీషు, తెలుగు, కన్నడ, బెంగాలి, ఒరియా, తమిళ, గుజరాతీ, మరాఠీ భాషల్లో భగవద్గీత, సనాతన ధర్మం, పురాణాలు, ఉపనిషత్ లతో పాటు గృహస్త్య, నైతిక అంశాలకు సంబంధించిన పుస్తకాలను ప్రచురిస్తుంది గీతా ప్రెస్..

కార్మికులు తమ వేతనాలు, ఇతర డిమాండ్ల కోసం సమ్మె చేపట్టడంతో విధిలేని పరిస్థితుల్లో గీతా ప్రెస్ యాజమాన్యం లాకౌట్ ప్రకటించిందట.. లాభాపేక్ష లేకుండా సేవా భావంతో నడుస్తున్న సంస్థను కార్మిక సంఘాలు ఎలా వీధికీడ్చాయో చూడండి.. దీని వల్ల ఎవరికి లాభం? కార్మికులు పస్తులుండాల్సిందే కదా.. పైగా ఉత్తమ ఆధ్మాత్మిక, నైతిక సాహిత్యాన్ని ప్రజలకు దూరం చేసిన అపకీర్తి ఎవరికి?.. త్వరలో గీతాప్రెస్ తిరిగి ప్రారంభం కావాలని కోరుకుందాం..

No comments:

Post a Comment