Sunday, December 23, 2012

వ్యవస్థపై శివమెత్తిన యువ జనం

ఇది స్వతంత్ర భారత చరిత్రలోనే చారిత్రిక ఘట్టం.. యువ జనం శివమెత్తారు.. చీమల దండులా తరలి వచ్చి దేశ అత్యున్నత పరిపాలనా సౌధాన్నే ముట్టడించారు.. బస్సులో యువతిపై అత్యాచారం చేసిన కీచకులను సత్వరం ఉరి తీయమంటున్నారు.. అత్యాచార నిరోధక చట్టాన్ని కఠిన తరం చేసి తమకు రక్ష కల్పించమంటున్నారు.. జల ఫిరంగులు, లాఠీలు, బాష్పవాయువులకు కూడా భయపడకుండా ప్రభుత్వాన్ని నిగ్గదీసి ప్రశ్నిస్తున్నారు..

రాష్ట్రపతి భవన్ లాంటి కీలక ప్రాంతాలను ముట్టడించిన వేలాది మంది యువజనానికి యూపీఏ సర్కారు సమాధానం చెప్పలేకపోతోంది.. ఇదంతా చూసి ప్రతిపక్షం చంకలు గుద్దుకొని ఆనందిస్తోందా?.. ఇది కేవలం ప్రభుత్వం పైన తిరుగుబాటని భావిస్తే మూర్ఖత్వమే అవుతుంది.. విద్యార్థులు, యువజనం రాజకీయ వ్యవస్థనే ప్రశ్నిస్తున్నారు.. వారు నాయకులను నమ్మడం లేదు.. ఇవాళ కాంగ్రెస్, యూపీఏలు ఎదుర్కొంటున్న పరిస్థితి రేపు బీజేపీ, ఎన్డీఏలకూ లేదా సోకాల్డ్ థర్డ్ ఫ్రంటుకూ తప్పకపోవచ్చు..

ఇంత కాలం ప్రశ్నించే వారు లేక పాలకులు, నాయకులు తామేది చేసినా చెల్లుబాటవుతుందని విర్రవీగారు.. ఎన్నికల్లో మందు, నోట్లు పడేస్తే జనం ఓటేయక చస్తారా? అనే భావన రాజకీయ నాయకులది.. కులం, మతం, వర్గం, రిజర్వేషన్, ఉచిత కరెంటు, రూపాయి బియ్యం, నగదు బదిలీ లాంటి తాయిలాలు ఆశ చూసి ఓట్లు రాబట్ట వచ్చనే రాజకీయ నాయకుల పన్నాగాలకు ఇక కాలం చెల్లింది.. తరం మారింది.. కొత్త యువతరం వచ్చింది.. ఇంకా పాత పద్దతుల్లోనే వ్యవహరిస్తామని పాలకులు చెబితే చెల్లదు.. నిల దీసే వారు వచ్చేశారు.. అవసరమైతే తిరగబడతారు.. నాయకుల కలరు పట్టుకొని చెంపలు వాయిస్తారు..


No comments:

Post a Comment