Wednesday, December 26, 2012

ఎవరి కోసం ఈ మహాసభలు?

తెలుగు వారంతా ఒకే రాష్ట్రంలో ఉండాలనే భ్రమతో దేశంలో తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడి 57 ఏళ్లు (ఆరు దశాబ్దాలు) అయ్యింది.. ఆంధ్రప్రదేశ్ అనే పరిధి గీసుకొని ఆనందించాం.. కానీ సగం మందికి పైగా తెలుగువారు పొరుగు రాష్ట్రాల్లోనే  ఉండిపోయారు.. తెలుగు వారి పేరిట ప్రత్యేకంగా ఓ రాష్ట్రం ఏర్పడ్డా, ఈ నాటికీ తెలుగును అధికార భాషగా అమలు కావడం లేదు.. ఇందుకు తిలా పాపం తలా పడికెడు అన్నట్లు అందరిదీ తప్పే..
పొరుగున ఉన్న తమిళనాడు, కర్ణాటకలు తమ మాతృభాషల వికాసానికి చక్కని ప్రోత్సాహం ఇస్తున్నాయి.. వారితో పోలిస్తే మనం ఎంతో వెనుక బడి ఉన్నాం.. ఆంధ్ర ప్రదేశ్లో పరిపాలన అంతా ఇంగ్లీషులోనే జరుగుతుంది.. తెలుగు వాడకం అంటే మన అధికారులకు నామోషి.. గ్రామ సచివాలయం నుండి రాష్ట్ర సచివాలయం వరకూ ఇదే పరిస్థితి.. మన ప్రభుత్వం అధికార భాషా సంఘం అనే అధికారాలు లేని వ్యవస్థను ఏర్పాటు చేసింది.. ఇది వట్టిపోయిన ఆవు లాంటిదే.. నిధులు మేతలా వృధా అవడం తప్ప ఎలాంటి ప్రయోజనం లేదు.. ప్రభుత్వ పరంగా తెలుగు భాషకు జరుగుతున్న సాయం అతి తక్కువ.. తెలుగు భాష ఈ నాటికీ తన ఉనికిని కాపాడుకుంటోంది అంటే అది వ్యక్తలు, మీడియా చేస్తున్న కృషే తప్ప, ప్రభుత్వ ప్రమేయం ఎక్కడా లేదు.. ఇక తెలుగు విశ్వ విద్యాలయం గురుంచి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది..
తెలుగువారు ప్రస్తుతం ఓ సంధి యుగంలో ఉన్నారు.. భాష పేరిట ఏర్పడిన బంధనం (ఆంధ్రప్రదేశ్) గుది బండగా మారింది.. తెలుగు వారి కోసం ప్రత్యేకంగా ఒరిగంది ఏమీ లేక పోగా? పోరుగు రాష్ట్రాల్లోని సాటి తెలుగు వారు తమ భాషా సంస్కృతులకు దూరం కావాల్సిన దుస్థితి ఏర్పడింది.. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో నిజానికి తెలుగు మాతృభాషగా ఉన్న వారి జనాభా 50 శాతం పైనే అయినా ద్వితీయ శ్రేణి ప్రజల్లా జీవించాల్సి వస్తోంది.. కనీసం రెండో అధికార భాషగా అయినా తెలుగును గుర్తించమని వారు ప్రాధేయపడుతున్నా.. మీకు ఆంధ్ర ప్రదేశ్ ఉందిగా అక్కడికి పొండి అని తమిళ, కన్నడ నాయకులు అవహేళన చేస్తున్నారు.. ఇలా తెలుగు భాష, సంస్కృతి రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది..
ప్రపంచ తెలుగు మహా సభల పేరిట ఓ ప్రహసనం జరుగుతోంది.. ఇది ఎందు కోసమో? ఎవరి కోసమో తెలియని పరిస్థితి.. తెలుగువారి కోసం ఏర్పడిన ఆంధ్ర ప్రదేశ్ రాజధాని నగరం హైదరాబాద్లో కాకుండా తిరుపతిలో ఈ సభలు నిర్వహించడం లోని ఆంతర్యం ఏమిటో ఆ తిరుమలేషునికే తెలియాలి.. తెలంగాణ వాదులకు భయపడే రాజధాని వెలుపల ఈ సభలు జరుపుతున్నారనేది బహిరంగ రహస్యమే.. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో తెలుగు మహా సభలు జరిగాయని చంకలు గుద్దుకోవడం తప్ప ఈ సభల వల్ల కొత్తగా కలుగుతున్న ప్రయోజనాలేవీ లేనట్లే..
తెలుగు భాషా సంస్కృతులను కాపాడాలనే సంకల్పం చేతల్లో కనిపించాలి.. కానీ ఉత్సవాల్లో కాదు.. ఎలాంటి ప్రయత్నాలు చేయకుండా ఉత్సవాలు చేయడం అంటే, తల్లిని చంపుకొని తద్దినం పెట్టు కోవడం కాదా?

No comments:

Post a Comment