Saturday, March 5, 2016

బాధ్యతలేని హైఫై పుత్రరత్నాలు

హైదరాబాద్ మహానగరంలో కొన్ని హైఫై ప్రాంతాలున్నాయి.. రాజకీయ, వ్యాపార, సినీ, బ్యూరోక్రాట్ వర్గాలు నివసిస్తాయక్కడ.. అందరిలాగే వాళ్లూ పిల్లల్ని కంటారు.. కానీ పెరిగే పద్దతి వేరు.. ఈ వృశ్చిక సంతానం మధ్యాహ్నం తర్వాత తీరిగ్గా నిద్రలేచి ఆవలిస్తుంది.. ఏదో కాస్త తిన్నామనిపించి కాస్త విశ్రాంతి తీసుకుంటారు.. సాయంత్రానికి అలా రోడ్డున పడతారు.. మిగతా అలగా దోస్తులు తోడవుతారు.. ఖరీదైన పబ్బులు, బార్లు, రిసార్ట్స్, హోటల్స్.. మందు, విందు, పొందు, వినోదాలతో అర్ధరాత్రి దాటే వరకూ ఎంజాయ్.. ఇంకా నిషా దిగకపోతే బైకుల, కార్లతో రోడ్లపై రేసింగ్స్.. తరచూ ఎవరో ఒకరిని గుద్ది ఉసురు తీస్తారు.. పోలీసులకు బుద్ది పుడితే అప్పుడప్పుడూ డ్రంక్ అండ్ డ్రైవ్ అనే పిటీ కేసులు పెడతారు వీరిపై.. కర్మకాలి ఈ పోరలకు రోడ్ల మీద ఆడవారు కనిపిస్తే అంతే సంగతులు..
ఈ హైఫై యువతకు సమాజం పట్ల ఏమాత్రం బాధ్యతలేదు.. వారి తల్లిదండ్రులు అలాగే పెంచుతారు వీరిని.. చదువు సంధ్యలు అంతంతే.. ర్యాంకుల గోల వీరికి అనవసరం.. కాస్త ఖరీదైన విద్యా సంస్థల్లో సీట్లు కొంటారు.. చివరకు ఈ అడ్డ గాడిదలు తమ తండ్రుల వారసత్వాలను అందిపుచ్చుకొని సమాజంపై పడతారు.. స్కాములు, కుంభకోణాలతో లోకాన్ని ఉద్దరిస్తారు..
ఈ సోదంతా ఎందుకు రాశానంటారా?.. తాజాగా ఓ మంత్రి పుత్రరత్నం చేసిన ఘన కార్యం చూసి ఒళ్లు మండిందంతే..

No comments:

Post a Comment