Wednesday, February 26, 2014

అనకొండలున్నాయి జాగ్రత్త..

సీమాంధ్ర రాజధాని ప్రకాశం జిల్లాలోని దొనకొండే అని మీడియాలో తెగ ప్రచారం జరగిపోతోంది.. 13 జిల్లాలకు ఈ ప్రాంతం కేంద్ర స్థానంలో ఉండటంతో పాటు 56 వేల ఎకరాల స్థలం అందుబాటులో ఉండటాన్ని చూపిస్తున్నారు.. అలాగే బ్రిటిష్ కాలం కాటి ఎయిరోడ్రమ్ ఉండనే ఉంది..
దొనకొండ నిజంగా సీమాంధ్ర రాజధాని అవుతుందా? కాదా అనేది దేవుడెరుకు కానీ చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునేవారు ఎక్కువయ్యారు.. ఈ ప్రచారం పుణ్యమా అని అక్కడ భూముల ధరలకు రెక్కలు వచ్చాయట.. కొందరు రియల్ ఎస్టేట్ అనకొండలు వాలిపోయాయట.. వీరికి రాజకీయ నేతల అండదండలు ఉండటమే కాదు, వీరిలో కొందరు స్వయంగా రాజకీయ నాయకులేనట.. కారు చౌకగా భూములు కొట్టేసి, ధరను పెంచేసి అమ్మేయడం ఈ అనకొండల నైజం.. నిజంగా దొనకొండ రాజధాని కాకపోతే? ఇంకేముంది అమాయకుల నెత్తిన టోపీ..

నిజానికి రాజధాని అంటే సచివాలయం, శాసనసభ,  హైకోర్టు, ప్రభుత్వ కార్యాలయాలు, గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, ఉద్యోగుల నివాస సముదాయాలు ఉండే ప్రాంతం.. హైదరాబాద్ నగరంలో ఇవన్నీ కలిపి 100 ఎకరాల లోపే ఉన్నాయి.. ఇంకా లోతుగా చెప్పాలంటే 70 ఎకరాల లోపే.. సీమాంధ్రలో విశాలమైన భవన సముదాలతో రాజధాని ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉంటే 1,000 ఎకరాల భూమి చాలా ఎక్కువ.. కానీ రాజధాని నిర్మాణానికి వేలాది ఎకరాల భూమి కావాలనే ఆలోచన ఏమిటో అర్థం కావడం లేదు.. సీమాంధ్రలో అబివృద్ది చెందిన ఎన్నో నగరాలు ఉన్నాయి.. అధికార, పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా సచివాలయం, శాసనసభ, హైకోర్టులను వివిధ నగరాల్లో ఏర్పాటు చేసుకుంటే అన్ని నగరాలు, ప్రాంతాలకు సమన్యాయం జరుగుతుంది.. కానీ వేలాది ఎకరాలు భూమి ఒకే చోట కావాలనుకోవడం పరిపాలనకా? రియల్ ఎస్టేట్ వ్యాపారానికా నాకైతే అర్థం కావడం లేదు.. 

No comments:

Post a Comment