Tuesday, January 5, 2016

దేశ భద్రతపై కాంగ్రెస్ విచిత్ర వైఖరి

ప్రపంచాన్ని కుదిపేస్తున్నసమస్య ఉగ్రవాదం.. భారత దేశానికి అతిపెద్ద ముప్పు ఇది.. ఉగ్రవాదుల దుశ్చర్యతో అమాయక పౌరుల ప్రాణాలు పోతున్నాయి.. మన దేశ అస్థిత్వాన్ని సవాలు చేస్తున్నఉగ్రవాదంపై పోరు విషయంలో అన్ని రాజకీయ పార్టీలు, పౌర సమాజం ఏకతాటిపై నిలవాల్సిన సమయం ఇది.. ఇలాంటి వేళ ప్రతి అంశాన్ని రాజకీయ కోణంలో చూసే కాంగ్రెస్ పార్టీ, మరోసారి తన నీఛ వైఖరిని చాటుకుంటోంది..
పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై పాకిస్తాన్ నుండి వచ్చిన ఉగ్రవాదుల దాడిని తిప్పి కొట్టడం కోసం జరిగిన పోరులో 7గురు జవానులు అమరులయ్యారు.. వారి త్యాగాలకు దేశ ప్రజలు జోహార్లరిపిస్తున్నారు.. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కామెంట్లు వారి మనస్థత్వానికి అద్దం పడుతున్నాయి.. 
కాంగ్రెస్ పార్టీకి ఎన్డీఏ ప్రభుత్వంపై కోపం ఉంటే ఉండొచ్చు కానీ దేశ నిఘా, రక్షణ విభాగాలను నైతిక సామర్ధ్యాన్ని అగౌరవ పరిచే హక్కు ఎవరు ఇచ్చారు? దేశాన్ని సుదీర్ఘకాలం పాలించిన కాంగ్రెస్ అసమర్ధత కారణంగానే ఈ రోజున ఉగ్రవాదం  వెర్రి తలలు వేస్తోంది.. మెజారిటీ ప్రజలను మనోభావాలతో ఆడుకున్న కారణంగానే కాంగ్రెస్ పార్టీ గతంలో ఎన్నడూ లేనంత పరాజయాన్ని మూట కట్టుకుంది.. ఈ విషయాన్ని ఆంటోనీ, దిగ్విజయ్, చిదంబరం లాంటి నాయకులే ఒప్పుకున్నారు. అయినా కాంగ్రెస్ పార్టీ తన విధానాన్ని మార్చుకోకుండా దేశ ప్రజలచే మరోసారి ఛీ కొట్టించుకుంటోంది..
గత ఏడాది అరేబియా సముద్ర తీరంలో పోరుబందర్ రేవు సమీపంలో పాకిస్తానీ బోటు పేల్చివేత విషయంలోనూ ఆ పార్టీ ఇలాగే నీచంగా మాట్లాడింది.. ఆ బోటుతో తమకు సంబంధం లేదని పాకిస్తాన్ వాదించగా, వారికి వంత పాడే విధంగా కాంగ్రెస్ నాయకులు ప్రకటనలు ఇచ్చారు..
ముంబై 26/11 మారణ కాండ సంఘటనలో పాకిస్తానీ పౌరుడు కసబ్ పట్టుబడిన తర్వాత, విచారణలో ఆ దేశ ప్రమేయం స్పష్టంగా బయటపడింది. ఆ ఘటన తర్వాత సోనియా, రాహుల్ సమక్షంలో నాటి హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే కాషాయ ఉగ్రవాదం అంటూ అవాకులు చెవాకులు పేలి నాలిక కరచుకున్న సంగతి తెలిసిందే.. కసబ్ తో పాటు, పార్లమెంట్ పై దాడి కేసు నేరగాడు అఫ్జల్ గురులకు ఉరిశిక్ష పడినా చాలా కాలం పాటు శిక్షను అమలు చేయకుండా ఇంటి అల్లుళ్లలా చూసుకున్న ఘనతను మూట గట్టుకుంది కాంగ్రెస్.. చివరకు విమర్షలకు జడిసి శిక్ష అమలు చేయక తప్పలేదు.. ఢిల్లీ బాట్లా హౌస్ దాడి ఘటనలో ఉగ్రవాదులు మరణిస్తే సోనియా గాంధీ కన్నీరు కార్చారని స్వయంగా ఆ పార్టీ నేత సాల్మాన్ ఖుర్షీదే వెల్లడించారు.
పాకిస్తాన్ ప్రేరిత ఉగ్రవాదాన్ని అణచివేసే విషయంలో మోదీ ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.. ఇందుకు అన్ని రకాల ఎత్తుగడలు అవలంభిస్తోంది.. ఇలాంటి సమయంలో ప్రభుత్వానికి అండగా నిలవకున్నా, వెన్నపోటు పొడిచే ప్రయత్నాలు చేయకుంటే చాలు.. కాంగ్రెస్ పార్టీ నుండి ఇంతకు మించి ఆశించలేం కదా..

No comments:

Post a Comment