Sunday, January 17, 2016

వీరిని ఏమందాం?

ఊస‌ర‌వెల్లి సైతం సిగ్గు ప‌డుతోంది రంగులు మార్చే ఈ నాయ‌కుల‌ను చూసి.. సిద్ధాంతాలు లేవు, విధేయ‌త‌లు లేవు.. నీతి, నిజాయితీల‌కు వీరి డిక్ష‌న‌రీలో అర్థం లేదు.. మంచి నీళ్లు తాగినంత ఈజీగా కండువాలు మార్చేస్తున్నారు.. వీరికి తెలిందల్లా అవ‌కాశ‌వాదం మాత్ర‌మే.. ప‌ద‌వుల కోసం ఎంత‌కైనా బ‌రి తెగిస్తారు..
ఒక పార్టీ అని కాదు.. అన్ని పార్టీల‌లో ఇదే తంతు.. అధికారంలో ఎవ‌రు ఉన్నాసిగ్గులేకుండా వారి చంక‌నాకుతారు.. ఎన్నిక‌ల ముందు పార్టీ మారి టికెట్ తెచ్చుకునే జంప్ జిలానీలు కొంద‌రు.. ఒక పార్టీ నుండి గెలిచాక విధేయ‌త‌కు నీళ్ల‌ర్పించి అధికార పార్టీలో ఫిరాయించే వారు మ‌రి కొంద‌రు.. న‌మ్మిన కార్య‌క‌ర్త‌ల‌కు, ఓట‌ర్ల‌కు నిర్ల‌జ్జ‌గా వెన్నుపోటు పొడుస్తారు..
ఈ ధోర‌ణి కొత్త‌గా వ‌చ్చిందేమీ కాదు.. గ‌తంలో జ‌రిగిందే, ఇప్పుడూ కొన‌సాగుతోంది.. బెల్లం చుట్టూ ఈగ‌లు మూగ‌డం స‌హ‌జం.. అభివృద్ది కోస‌మే అధికార పార్టీలో ఫిరాయించామ‌ని సిగ్గు లేకుండా ఇకిలిస్తారు.. వీరు కోరుకునేది ప్ర‌జ‌ల అభివృద్ధా? త‌మ ఖ‌జానా వృద్ధా?..
తాజా జీహెచ్ఎంసీ ఎన్నికల విషయానికి వద్దాం.. మా ప్రాంతంలో ఓ స్థానిక నాయ‌కుడు నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు చెబుతూ భారీగా పోస్ట‌ర్లు అతికించాడు.. సంక్రాంతి శుభాకాంక్ష‌లు కూడా చెబుతూ ఇదే ప‌ని చేశాడు.. తేడా ఏమిటంటే అత‌ని మెడ‌లో కండువా మారింది.. పోస్ట‌ర్ రంగు కూడా మారిపోయింది.. గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడిపోయిన ఈ వ్య‌క్తి, పార్టీ ఫిరాయించి త‌న భార్య‌కు టికెట్ తెచ్చుకున్నాడు.. నాకు తెలిసిన మ‌రో నాయ‌కుడు గ‌తంలో ఓ పార్టీ టికెట్‌పై కౌన్సిల‌ర్‌గా గెలిచాడు.. జీహెచ్ఎంసీ ఏర్ప‌డ్డాక మ‌రో పార్టీలో చేరి ఆ టికెట్‌పై కార్పోరేట‌ర్‌గా విజ‌యం సాధించాడు.. ఇప్పుడు ఆ పార్టీకి కూడా గుడ్‌బై చెప్పి ఇంకో పార్టీలోకి ఫిరాయించి టికెట్ తెచ్చుకున్నాడు..

ఈ నాయ‌కుల‌ను ఏమ‌నాలి?.. ఇలాంటి వారు ఇంకా ఎందరో ఉన్నారు.. ఊసరవెల్లి ప్రకృతి ధర్మంలో భాగంగా తన మనుడగ కోసం రంగులు మారుస్తుంది.. మరి వీరు.. క‌డుపు నింపుకోవ‌డం కోసం బజారున ప‌డే వారిపై జాలి ప‌డొచ్చు.. కానీ అన్నీ ఉండి బ‌రి తెగించేవారిని ఏమ‌నాలి?  ఇలాంటి వారికి ఓట‌ర్లే త‌గిన బుద్ది చెప్పాలి..

No comments:

Post a Comment