Monday, August 14, 2017

జగద్గురు శ్రీకృష్ణుడు

యథాయథాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత.. అభ్యధ్దానమధర్మస్య తథాత్మానం సృజామ్యహం..
ధర్మానికి ఎప్పుడు హాని జరిగినా తాను అవతారం ఎత్తుతానని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పారు. రామావతారంలో సాక్షాత్తు భగవంతుడే మానవునిగా జన్మించి ధర్మాన్ని కాపాడితే, మానవ రూపంతో దైవత్వాన్ని చూపించింది కృష్ణావతారంలో..
శ్రావణమాసంలో అష్టమి నాడు జన్మించాడు కృష్ణుడు. పుట్టింది అంత:పురం పట్టు పరుపులపై కాదు. చెరసాల కటిక నేలమీద.. దేవకికి జన్మించి గోకులంలో యశోద ఒడి చేరాడు. బాల్యంలో గోపాలకునిగా చిలిపి పనులతో పాటు రాక్షస, దుష్ట సంహారం చేస్తూ శిష్ట జనులకు అండగా నిలిచాడు. ధర్మ రక్షణ కోసం పాండవులకు మద్దతిచ్చాడు.
మహాభారత యుద్ధంలో అర్జునుడి రథసారధిగా ఉండి కర్తవ్య బోధ చేశాడు కృష్ణుడు. ఈ సందర్భంగా వినిపించిందే భగవద్గీత.. ప్రపంచంలో తొలి వ్యక్తిత్వ వికాస గ్రంథమిది. వేదాలు, ఉపనిషత్తుల సారాంశం అంతా ఇందులో నిక్షిప్తమైంది.
శ్రీకృష్ణుడు గొప్ప వ్యక్తిత్వం ఉన్న దైవజ్ఞుడు, తత్వవేత్త, రాజనీతిజ్ఞుడు. అపార ప్రజ్ఞాపాఠవాలతో భగవంతునిగా గుర్తింపు పొందాడు. గీతాజ్ఞానం అందించి ఈ జగానికే తొలి గురువయ్యాడు. అందుకే మనం కృష్ణం వందే జగద్గురుమ్ అని కొలుస్తున్నాం.. శ్రీకృష్ణ జయంతి సందర్భంగా ఆ దేవదేవున్ని మనసారా భక్తితో కొలుద్దాం.. జై శ్రీకృష్ణ.. జైజై కృష్ణ.. 

No comments:

Post a Comment