Wednesday, August 12, 2015

వేప, ఉప్పు, బొగ్గే ముద్దు..

ఈ మధ్య ఎక్కడ చూసినా దంత వైద్యశాలలు కనిపిస్తున్నాయి.. కొన్ని వీధుల్లో అయితే ఈ డెంటల్ హస్పిటల్స్ కిరాణా షాపుల స్థాయిలో పోటీ పడుతున్నాయి..
ఎందుకిలా? దంత సమస్యలతో బాధ పడే రోగులు గణనీయంగా పెరిగిపోతున్నారు కాబట్టి, అదే స్థాయిలో ఆస్పత్రులూ పెరుగుతున్నాయి..
గిరాకీ లేనిదే వారెందుకు హాస్పిటల్ పెట్టుకుంటారు? అవును ఇదీ నిజమే..
మరి దంత సమస్యలు పెరగడానికిని కారణం ఏమిటి? ఎందుకేమిటి. మన ఆహారపు అలవాట్లే..
సరే ఏది తింటేనేం.. పళ్లు సరిగ్గా తోముకుంటే సమస్య ఉండదు కాదా? ఎంత చక్కగా దంత ప్రక్షాళన చేసుకున్నా ఎందుకో దంత సమస్యలు తప్పడం లేదు..
కారణం ఏమిటి? మన నోటి నుండా రసాయనాలు పులుముకుంటున్నాం.. అవే సగం జబ్బులకు కారణం అవుతున్నాయి..
కరెక్ట్.. మనం అసలు పాయింట్ కు వచ్చేశాం..
ఒకప్పుడు మన పెద్దలు వేప పుల్లతో పళ్లు తోముకునేవారు.. వారి దంతాలు కూడా గట్టిగా ఉండేవి.. కొన్నిబస్తీలు, గ్రామాల్లోకి బొగ్గు, బూడిదను పళ్లు తోముకోడానికి ఉపయోగించేవారు.. ఇంట్లో పిల్లలు పంటినొప్పి, గొంతు సమస్యతో బాధపడుతుంటే పెద్దవాళ్లు ఉప్పుతో పళ్లు తోముకొని వేడినీతో పుకిలించమని సూచించేవారు.. ఈ పద్దతులన్నీ ప్రస్తుత కాలం యువతకు అనాగరికంగా, మొరటుగా అనిపించడం సహజం..
మన దేశంలో టూత్ పేస్టులు రంగ ప్రవేశం చేసి వందేళ్లు దాటింది.. కానీ జనాలకు అవి అలవాటు కావడానికి మాత్రం దశాబ్దాలు పట్టింది.. బ్రష్, పేస్టులతో పళ్లు తోముకునే అలవాటు 20 ఏళ్ల క్రితం వరకూ పట్టణాల వరకే ఉండేది.. కానీ ఈ రోజున మారు మూల ప్రాంతాల్లో సైతం టూత్ పేస్ట్ అందుబాటులోకి వచ్చింది..
గతంలో కూడా దంత సమస్యలు ఉండేవి. కానీ జనాభా నిష్పత్తితో పోలిస్తే ఈ స్థాయిలో ఉండేవి కాదనేది సుస్పష్టం.. మనం పొద్దున్నే చక్కగా టూత్ పేస్టుతో పళ్లు తోముకుంటున్నా ఈ స్థాయిలో పళ్ల జబ్బులు ఎందుకు వస్తున్నాయి?..
కొంత కాలంగా పత్రికల్లో, టీవీల్లో ప్రకటనలు గమనించే ఉంటారు.. టూత్ పేస్టు కంపెనీలు మా పేస్టులో ఉప్పు ఉంది.. వేప గుణాలు ఉన్నాయి అని ఊదర గోట్టేస్తున్నాయి.. చివరకు బొగ్గుతో కూడా పేస్ట్ వచ్చేసింది.. ఇంత కాలం మనం అనాగరికం అనుకున్న వారినే ఈ టూత్ పేస్టు కంపెనీలు ఎందుకు ప్రచారం  చేస్తున్నాయి? ఆలోచించండి..

బ్యాక్ టూ రూట్స్.. నాగరికత ముసుగులో మనవైన కొన్ని అలవాట్లను కోల్పోతున్నాం.. కాలక్రమంలో వాటిలో విలువ, సుగుణాలు తెలిసి వస్తున్నాయి.. అందుకే మళ్లీ వెనక్కి తిరిగి మూలాల్లోకి వెళ్ల తప్పని పరిస్థితి ఏర్పడింది..

No comments:

Post a Comment