Wednesday, May 6, 2015

మీడియా అతి తెచ్చిన చేటు..

అతి సర్వత్ర వర్జయేత్.. నేపాల్ ను భూకంపం శిథిలం చేయడం నిజం. పెద్ద ఎత్తున సాయానికి భారత్ రంగంలోకి దిగడమూ వాస్తవమే.. కానీ మీడియా వ్యవహరించిన తీరు మాత్రం దారుణం..
కష్టాల్లో ఉన్న పొరుగు దేశం నేపాల్ ను ఆదుకోవడం బాధ్యతగా భారత ప్రభుత్వం భావించింది. ఆపరేషన్ మైత్రి పేరిట పెద్ద ఎత్తున సైన్యాన్ని, సహాయ సిబ్బందిని, వైద్యం, ఆహారం తదితర సామాగ్రిని పంపించింది. మన వాళ్లు రాత్రింబవళ్లు కష్టపడి శిథిలాలు , తొలగించడం, గాయపడిన వారిని రక్షించి తక్షణ చికిత్స అందించడం, వారికి ఆహారం అందించడం లాంటి కార్యక్రమాలు చేపట్టారు. రాజధాని కాఠ్మాండూలో పాటు మారుమూల కొండ ప్రాంతాల్లో సైతం సేవలు అందించారు. కానీ మన మీడియా అతిగాళ్ల అతి వల్ల అవన్నీ బూడిదలో పోయిన పన్నీరైపోయాయి..
ఆకలి కన్నా, ఆత్మ గౌరవం ముఖ్యం అంటారు. నేపాలీలను బాధించింది అదే.. ఈ సునితత్వాన్ని భారత మీడియా గ్రహించలేపోయింది. మన మీడియాకు ఎక్కడలేని దేశభక్తి పొంగుకొచ్చింది. ఏకంగా ఇండియాను పెద్దన్నగా చిత్రీకరించారు. నేపాల్ సైన్యం, ఇతర దేశాల సహాయ సిబ్బందికన్నా భారతే అద్వితీయంగా సహాయ కార్యక్రమాల్లో దూసుకెళుతోందని ఊదరగొట్టారు. ఇది నిజమే అయినా చెప్పగంలో తేడా ఉంటుంది. భూకంపం రాగానే నేపాల్ ప్రధానికన్నా, భారత ప్రధానికే ముందుగా వార్త తెలిసిందని, మోదీ ట్వీట్ ద్వారా కోయిరాలా ఈ వార్త అందుకొని స్వదేశానికి వచ్చారనే వార్త అతికి పరాకాష్ట. శిథిలాల కింద ఉన్నవారిని రక్షించకుండా కెమెరాలు పెట్టి బైట్లు అడగడం పీటూసీలు ఇవ్వడం ఏ విలువలకు ప్రతీక.
దేశంలో ఉన్నప్పుడు మనం ఏదైనా చెప్పుకోవడచ్చు.. కార్గిల్ విజయం లాంటి యుద్ద వార్తలకు, యెమెన్ లో చేపట్టిన ఆపరేషన్ రాహత్ లాంటి విజయాలకు ప్రచారం ఇస్తే అర్థం చేసుకోవచ్చు.. కానీ కష్టాల్లో ఉన్న పొరుగువారిపై మనం ఆధిక్యతను ప్రదర్శించుకొని మురిసిపోవడం ఎంత వరకూ సమంజయం అందుకే నేపాలీలకు మండింది. అందుకే వారు గో హోమ్ ఇండియన్ మీడియా అంటూ ట్వీట్లు చేస్తున్నారు
భారత్ ఒక్కదాన్నే పొమ్మనడం బాగుండదని, అన్ని దేశాలూ తమ సహాయ కార్యక్రమాలు చాలించి వెళ్లిపోవాలని.. మిగతాది తాము చూసుకుంటామని మర్యాద పూర్వకంగా వెళ్లగొట్టింది నేపాల్ ప్రభుత్వం. భారత్ తక్షణం స్పందించి అందించిన సాయానికి నేపాల్ ధన్యవాదాలు చెప్పుకుంది

శత్రువుపై ఆధిక్యత ప్రదర్శించుకోవాలి.. కానీ నమ్మకమైన మిత్రునిపై కాదు.. ఈ వాస్తవాన్ని అర్థం చేసుకోవాలి.

No comments:

Post a Comment