Friday, May 22, 2015

అనగారిన వర్గాల 'భాగ్య'విధాత

హైద‌రాబాద్ న‌గ‌రంలో చాద‌ర్‌ఘాట్ చౌర‌స్తా దాటి ఉమెన్స్ కాలేజీ వైపు వెళుతుంటే ఎడ‌మ వైపు గంభీర‌మైన భ‌వ‌నం క‌నిపిస్తుంది.. ఆ భవనంపైన ఆది హిందు భవన్అనే అక్షరాలు కనిపిస్తాయి.. అదే రోడ్డులో మరి కొంచెం ముందుకు వచ్చాక కుడివైపున చిన్న గణేష్ గుడి పక్కన మాదరి భాగ్యరెడ్డి రోడ్డుఅనే మున్సిపల్ బోర్డు కనిపిస్తుంది.  ఒక హైదరాబాదీగా నా చిన్నప్పటి నుండీ నాకివి సుపరిచిత దృశ్యాలు.. నాలాగే చాలా మంది చూసే ఉంటారు..  ఆది హిందూ భవన్ ఏమిటి? మాదరి భాగ్యరెడ్డి వర్మ రోడ్డేమిటి? ఎవరీ భాగ్యరెడ్డి వర్మ? అనే విషయాలు ఎప్పుడైనా ఆలోచించారా?


చరిత్రకు జరిగిన అన్యాయాల్లో ఇదీ ఒకటి.. బాబా సాహెబ్ అంబేద్కర్, బాబూ జగ్జీవన్ రామ్, మహాత్మా జోతిబా పులే విగ్రహాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వాడవాడలా కనిపిస్తాయి.. కానీ తెలుగు నాట దళితోద్యమానికి బాటలు వేసిన భాగ్యరెడ్డి వర్మ విగ్రహం ఎందుకు కనిపించడదు?. కనీసం హైదరాబాద్ నగరంలో కూడా ఆ మహనీయుని విగ్రహం ఒక్కటైనా కనిపించదేం?.. భాగ్యరెడ్డి వర్మ గురించి నేటి తరానికి ఎందుకు తెలియదు? తెలిసినా ఓట్ల రాజకీయాలతో సంబంధంలేని వ్యక్తితో మనకేం సంబంధం అని నేతాజీలు నటిస్తున్నారా?.. 
నిజాం పాలిత హైదరాబాద్ రాజ్యంలో అనగారిన వర్గాల గొంతుక భాగ్యరెడ్డి వర్మ.. 1888 సం. మే 22 నాడు మాదిరి వెంకయ్య, రంగమాంబ దంపతులకు జన్మించారాయన.. తొలిపేరు భాగయ్య.. అయితే వారి కుల గురువు భాగ్యరెడ్డి అనే పేరు పెట్టారు.. (రెడ్డి అంటే పాలకుడు అనే అర్థం కూడా ఉంది) చిన్నప్పటి నుండి సామాజిక స్పృహను అలవరచుకున్న భాగ్యరెడ్డిపై ఆర్యసమాజం, బ్రహ్మసమాజం, బౌద్ధం ప్రభావం కూడా ఉంది. అంటరానితనం, దేవదాసీ వ్యవస్థ, మద్యపానం తదితర రుగ్మతలపై పోరాటాలు చేయడమే కాదు, స్వయంగా దళితులకు విద్య, ఉపాధి, సామాజిక హోదాల కోసం తన వంతు కృషి చేశారు. ఆయన సామాజిక సేవా కార్యక్రమాను చూసి ఆర్యసమాజం వర్మ అనే బిరుదును ఇచ్చింది.. అలా భాగ్యరెడ్డి వర్మ పేరు వచ్చింది.
అంబేద్కర్ కన్నా ముందే దేశ వ్యాప్తంగా దళితులకు అనాదిగా జరుగుతున్న అన్యాయాలపై గొంతెత్తిన మహానాయకుడు భాగ్యరెడ్డి వర్మ.. తదనంతర కాలంలో బాబా సాహెబ్ తో  కలసి ఉద్యమాల్లో పాల్గొన్నారు  మేము పంచములం కాదు.. ఈ దేశ మూల వాసులం.. ఆది హిందువులం..అని సగర్వంగా చాటారు.. అనగారిన కులాలను ఆది హిందువులు అని పిలవాలని పిలుపునిచ్చారు. భాగ్యరెడ్డి వర్మ సూచన మేరకు హైదరాబాద్, మద్రాసు ప్రభుత్వాలు వారిని ఆది హిందువులుగా గుర్తించాయి. ప్రారంభంలో జగన్ మిత్ర మండలి, ఆ తర్వాత కాలంలోఆది హిందూ మహా సభ పేరిట తన సేవా కార్యక్రమాలు నిర్వహించారు.. 1910లో చాద‌ర్‌ఘాట్ దగ్గర ఆది హిందూ పాఠశాల ప్రారంభించారు. మహాత్మా గాంధీ ఈ పాఠశాలను సందర్శించారు. కాలక్రమంలో ఆది హిందూ  పాఠశాలలు 26కు విస్తరించాయి. 
భాగ్యరెడ్డి వర్మ సేవలు హైదరాబాద్ (తెలంగాణ) సంస్థానానికే పరిమితం కాలేదు.. 1917లో విజయవాడలో అంటరాని కులాల సదస్సును నిర్వహించారు. ఆంధ్ర జిల్లాల్లో కూడా పర్యటించి అనగారిన వర్గాల్లో చైతన్యం తీసుకు వచ్చారు.  లక్నో, అలహాబాద్, కలకత్తా తదితర ప్రాంతాల్లో జరిగిన దళిత చైతన్య మహాసభలకు ముఖ్య అతిధిగా హాజరయ్యారు.. భాగ్యరెడ్డి వర్మ 1939 ఫిబ్రవరి 18న క్షయ వ్యాధితో కన్నుమూశారు. 51 ఏళ్లకే ఆయన అకాల మరణంతో ఆది హిందూ ఉద్యమం, అనగారిన వర్గాల అభివృద్ధి, అభ్యున్నతికి విఘాతం కలిగించింది. భాగ్యరెడ్డి వర్మ 127వ జయంతి సందర్భంగా ఆ మహనీయుని సేవలను గుర్తు చేసుకుందాం.. మన తెలుగు వాడైన భాగ్యరెడ్డి వర్మను నేటి తరం గుర్తు చేసుకోవడానికి వీలుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఆయన విగ్రహాలు ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను

No comments:

Post a Comment